April 23, 2024

సహారా

రచన: ఓలేటి స్వరాజ్యలక్ష్మీ.

” కౌసల్యా సుప్రజా రామా పూర్వ సంధ్యా ప్రవర్తతే.ఉత్థిష్ఠ నర శార్దూల కర్తవ్యం దైవ మాహ్నికమ్”

స్నానం చేసి తడి తలను భజం మీది తువ్వాలతో తుడుచుకుంటూ వెంకటేశ్వర సుప్రభాతం పాడుతూ దేవుడి గదిలోకి వచ్చిన శంకరానికి పెద్ద పెద్ద ఇత్తడి కుందులలో దీపాలు వెలుగుతూ స్వాగతించాయి. దేవుడి ప టాలు నిండా పువ్వుల దండలు ఇత్తడి సింహాసనంలో దేవుడి విగ్రహాలనిండా ఎర్రని మందారాలు పసుపు తెలుపు నంది వర్ధనాలు పొగడ పూల దండలు మందిరం చుట్టూ అలంకరించి ఉండడం ఎంతో ఆనందాన్నిచ్చింది. ఓ చిన్న వెండి కప్పులో పాలు పక్కనే చిన్న స్టీలు ప్లేట్ లో రెండు అరటి పళ్ళు నైవేద్యం ఉన్నాయి. మంచి సంపెంగ అగరవత్తులు సాంబ్రాణి పొగ గదంతా ఆవరించి మంచి సువాసన వస్తోంది. ” ఓహో అమ్మ అప్పుడే లేచేసి స్నానం పూజా అయిపోయిందన్న మాట. ” అనుకొని భక్తిగా కళ్ళు మూసుకొని నమస్కారం చేసుకున్నాడు. ఒక ఊదత్తు వెలిగించి స్టాండ్ లో పెట్టి ఓ రెండు అక్షింతలు కొంచెం కుంకం ప్లేట్ లో తనకోసం పెట్టిన ఓ రెండు నందివర్ధనం పూలు అమ్మవారి ఫోటో దగ్గర వేసి మళ్ళీ భక్తిగా ఓసారి దండం పెట్టి గదిలోంచి బయటకు వెళ్లబోతూ ” రోజు అమ్మ ఈ పాటికి పూజ చేసేసి కోడలు ఇచ్చిన కాఫీ తాగేసి కుర్చీలో కూర్చుని ఏ శివ పురాణమో భగవద్గీత పుస్తకమో చదువుతూ ఉండేది. ఇవాళ అమ్మ లేదేంటి. కాఫీ గ్లాస్ ఖాళీ ది టేబులుపై ఉంది. అంటే కాఫీ సేవనం అయిపోయిందన్న మాట. పుస్తకాలు టేబుల్ మీద లేవు.
కానీ ఇదేదో అమ్మ రాసిన ఉత్తరం ఇక్కడ ఉందే. ఎక్కడికి వెళ్ళింది అమ్మ. వీధిలో ఇంకా పువ్వులేవో కొస్తోందేమో. తెగ పువ్వులంటే వాటిని ఓపికగా తులసి ఆకులు చుట్టి దండగా గుచ్చి హాల్లో కృష్ణుడి విగ్రహానికి హనుమంతుడి మెడలోని వినాయకుడు బొమ్మకి ఇలా ఇల్లంతా దండలతో అలంకరించడం సరదా అమ్మకి. బహుశా పువ్వులు కోయడానికి వెళ్లి ఉంటుంది” అని, ” ఉమా ఉమా. ఈదేదో ఉత్తరం అమ్మ టేబుల్ పై ఉంది. చదువుతూ ఉండు. నేను బట్టలు వేసుకొని వస్తాను. టిఫిన్ ఎం చేసావు. ఇడ్లి ఏనా. పల్లి చట్నీ యా ” అని ప్రశ్నలు వేస్తూ ఆ ఉత్తరం అక్కడ బల్ల మీద పెట్టి గదిలోకి వెళ్ళాడు శంకరం ఆఫీస్ కి టైం అయిపోతోంది అని.
వేడి వేడి నాలుగు ఇడ్లీలు పల్లి చట్నీ ఓ ప్లేట్ లోవేసి టేబుల్ మీద పెట్టి పక్కనే మంచినీళ్లు గ్లాస్ పెట్టి బల్ల మీద వున్న కాగితం చేతిలోకి తీసుకుంది ఉమ. అక్షరాల వెంట ఆమె కన్నులు గబగబా పరుగు తీశాయి.
చి.శంకరం చి.సౌ. కోడలు ఉమకు మనః పూర్వక ఆశీస్సులు. ఉత్తరం చూసి మీరేమి కంగారు పడకండి.
” దుర్గాంబ” గారు నీకు తెలుసు కదా శంకరం. మీకు లెక్కలు సైన్స్ చెప్పేవారు మన స్కూల్ లో. నా కొలీగ్. నిన్న ఫోన్ చేసి అర్జెంట్ గా విజయవాడ రమ్మంది. రిటైర్ అయిపోయిన ప్రైవేట్ టీచర్లకి పెన్షన్స్ ఎక్కువ ఉండవుగా. దాని వల్ల వాళ్ళని పిల్లలు సరిగా చూడకపోవడం కుటుంబంలో భర్త తోను అత్తవారితోను ఎన్నో బాధలు హేరాసిమెంట్స్ పడుతూ ఆత్మహత్యలు హత్యలకు గురి అవుతున్న అభాగ్యులకు ఏదైనా ఆసరా చూపించాలని ఆవిడకి అనిపించిందట. దానికి కారణం కూడా ఆవిడ చెప్పింది.
ఓ 15 రోజుల క్రిందట ఎఫ్.బి.లో శ్రీకాంత్ కమ్ముల అనే ఒక ఎన్ ఆర్ ఐ ఒక పోస్ట్ పెట్టాడు. ఈ మధ్య ఆయన ఇండియా వచ్చి ఓ సండే ఫ్యామిలీతో సరదాగా ఓ గుడికి వెళ్లాడట. దర్శనం చేసుకొని బయటకు వచ్చి చెప్పులు వేసుకుంటూ పక్కనే గోని ముక్కలు పరిచి ఆడుకుంటున్న యాచకులను చూసాడట. జేబులోంచి కొన్ని పది రూపాయలు నోట్లు చిల్లర కొంత తీసి అందరికీ వేస్తున్నాడు. చివరగా ఒక స్త్రీ కూర్చుని ఉంది. ఆవిడ ఏమి అడగటం లేదు ఎవరిని. డబ్బులు వేస్తే తీసుకుంటోంది. ఆమె మొఖం చూస్తే ఎక్కడో చూసినట్టు అనిపించింది అతనికి. బాగా బ్రతికి చితికిపోయిన మనిషిలా ఉంది. పరిశీలనగా చూసిన శ్రీకాంత్ కి ఆమె చిన్నప్పుడు తన స్కూల్లో తెలుగు చెప్పే టీచర్ గా గుర్తించాడు. “మీరు మీరు శారదా టీచరేనా మీరేంటి. ఇక్కడ ఇలా” ప్రశ్నలు వేస్తున్న మనిషి ఎవరో తెలీక మొహం పక్కకు తిప్పుకుంది ఆమె. ” ఏమిటి మీరు ఇలా ఇక్కడ వున్నారు. ఏమైంది” అతడు అడుగుతూ వుంటే ఆమె మొహం కొంగుతో కప్పుకొని వెక్కి వెక్కి ఏడుస్తోంది. అర్ధమైంది శ్రీకాంత్ కి.
” అమ్మా లెండి. నాతో రండి. ” అని భార్యకు, పిల్లలకు కారులో కూర్చోమని ఆవిడని కూడా కారెక్కించి ఇంటికి తీసుకు వెళ్లాడట. భార్యతో వివరంగా అన్ని చెప్పి ఆమెకి స్నానం చెయ్యమని చెప్పి భార్య కొత్తచీర ఒకటి కట్టుకోడానికి ఇచ్చి, కడుపునిండా భోజనం పెట్టి, అప్పుడు జరిగింది ఏమిటో చెప్పమన్నాడట ఆవిడని. ఆమె చెప్పింది విని భార్యాభర్తలు ఇద్దరు ఆశ్చర్యపోయారట. రిటైర్ అయ్యాక ఆమెకి అందిన మూడు లక్షలు ఆమె భర్త లాక్కొని ఆమెని హింసించి వేరొక స్త్రీతో కాపురం పెట్టి ఈమెని బయటకు పొమ్మన్నాడట. అత్తవారు ఎవరు సహకరించలేదట. పుట్టింటి వారు అయినవాళ్ళు ఏమి సాయం చెయ్యలేదుట. దాంతో వీధిన బడి ఇలా అడుక్కుంటూ కాలం వెళ్ల బొస్తోందిట. ఆదివారాలు అయితే గుళ్ళో ప్రత్యేక ప్రసాదాలు పెడతారుట. అందుకని ఈ రోజు అడుక్కొనే వాళ్ళు ఎక్కువగా వుంటారు.” అంటూ తన దీనగాధను వినిపించి ఏడిచిందట పాపం ఆవిడ. శ్రీకాంత్ భార్య ఆమెని ఊరుకోబెట్టి ఆ రోజుకి వాళ్ళ ఇంట్లో ఉంచుకొని మర్నాడు తనకు తెలిసిన ఒక వృద్ధాశ్రమానికి ఆవిడిని తీసికెళ్లి అడ్మిట్ చేసి, ప్రతి నెల తాను ఆ ఆశ్రమానికి బోల్డు డోనేషన్ ఇస్తానని ఆమెని వాళ్ళు బాగ చూసుకుంటారని తను మళ్ళీ యూ.ఎస్ వెళ్లి పోవాలి కాబట్టి అక్కడ జాయిన్ చేశానని ఏమి అనుకోవద్దని చెప్పి కాళ్లకు దండం పెట్టి వెళ్లి పోయాడట. దుర్గాంబగారి మేనల్లుడట అతడు.
ఆ శ్రీకాంత్ “అయ్యో అజ్ఞానాన్ని పోగొట్టి విద్యా దానం చేసి ఎందరో వ్యక్తుల జీవితములు సరిదిద్దే ఒక ప్రైవేట్ ఉపాధ్యాయురాలు బ్రతుకు ఇలా వీధి పాలై అడుక్కొనే దీన స్థితికి వచ్చిందే మన భారత దేశంలో” అని బాధ పడుతూ ఎఫ్.బి.లో పోస్ట్ పెట్టాడు. వాట్స్ అప్ లో తెగ చక్కర్లు కొట్టింది ఈ పోస్ట్. అందరూ శ్రీకాంత్ ని మెచ్చుకున్నారు. వందలో ఇలాంటి వాళ్ళు ఒక్కరున్నా ఇలాంటి వారికి సహాయం అందుతుంది.
అతడు అమెరికా వెళ్ళేక దుర్గాంబ గారికి ఫోన్ చేసి ఇలాంటి వారు ఇంకా ఉన్నరేమో వాకబు చేసి వాళ్లకు ఆశ్రయం కల్పించవలసిందని పుష్కలంగా తను డోనేషన్స్ పంపుతానని దాన్ని నడపవలసిందిగా కోరాడట. ఎవరైనా ఆమెకు సహకరించడానికి ముందుకువస్తే ముఖ్యంగా రిటైర్ అయినవాళ్ళు ఉత్సాహం చూపిస్తే వాళ్ళను పిలవమని చెప్పాడట.
అదీ సంగతి. 4 ఏళ్లయి నేను రిటైర్ అయినప్పటినుంచి మీరు నన్ను బాగా చూసుకుంటున్నారు. నాకు ఏ లోటు రానివ్వలేదు. కాలు కిందపెట్టనివ్వకుండా నువ్వు కోడలు పెద్దవాడు అక్క అందరూ నన్ను ప్రేమగా చూసుకుంటున్నారు. మనవలతో చక్కని కాలక్షేపం. మీరు మంచి పొజిషన్స్ లో ఉండి పిల్లలకు మంచి మార్గంలో అన్ని నేర్పిస్తూ వున్నారు. కానీ ఎందరికో విద్యాదానం చేస్తూ వారి జీవితమంతా విద్యార్థులని మంచి మార్గంలో నడిపించే టీచర్స్ బతుకులు చివరి రోజులలో ఇలా ఎవరు దిక్కులేక అనామకులై చితికిపోడం చాలా బాధాకరంగా ఉంది. అందుకే దుర్గాంబ గారితో నేను మరికొందరు టీచర్లు కొందరు మా దగ్గర చదివిన విద్యార్థులు ఇలాంటి వారికి ఆసరాగా ఉండాలని శేష జీవితాన్ని సమాజ సేవకు వినియోగించాలని నిర్ణయించుకున్నాము. అందరూ ఇవాళ బయలుదేరి విజయవాడ వెళుతున్నాము పొద్దున్న బండి ఒంటి గంటకు చేరుతుంది. అక్కడికి. దుర్గాంబ గారి మనుషులు స్టేషన్ కి వచ్చి అందరినీ తీసుకు వెళతారు . రేపే ఆరంభ కార్యక్రమం. అందుకే మనవలకి రాత్రే బోల్డు కథలూ కబుర్లు మనసు తీరా చెప్పేసాను. ముద్దులాడేను. ఇక్కడ కన్నా నాకు ఆశ్రమంలో సేవ చేసే పని చాలా ముఖ్యం. నేను ఒక ఉపాధ్యాయురాలుగా ఎందరో పిల్లలను తీర్చిదిద్దాను. అందులో నా పిల్లలు మీరు కూడా ఉన్నారు. నన్ను సహృదయంతో అర్ధం చేరుకుంటారని భావిస్తు మనః పూర్తిగా ఆశీస్సులు ఇస్తూ………. ఆ. చెప్పడం మరిచా. నాకు ఏ అవసరం వచ్చినా నా పిల్లలు నన్ను అడుకుంటారనే నమ్మకం నాకుంది. ఆ సంస్కారం నేను గురువుగా వాళ్లకు ఇచ్చానని నా నమ్మకం. ….ఉంటాను….అమ్మ.
టిఫిన్ తింటూ శంకరం కళ్ళంతా నీళ్లతో నిండిపోయాయి. ఉత్తరం ఆసాంతం చదివిన ఉమ కూడా కొంగుతో కన్నీళ్లు ఒత్తుకుంటోంది. ” సరే అమ్మ ఒక మంచి నిర్ణయం తీసుకొని ముందుకు నడిచింది. చిన్నప్పటినించి అమ్మ వేసిన అడుగులోనే మేము వెళ్ళాము. అమ్మ నడచిన బాటే మాకు అభివృద్ధి మార్గం . రైలు ఈ పాటికి స్టేషన్ దాటిపోయి ఉంటుంది. అమ్మతో రేపు ఫోన్ లో మాట్లాడదాములే. నేను ఆఫీసుకి వెళ్తున్నా” అని రుమాలుతో కళ్ళు తుడుచు కుంటూ బాగ్ భుజాన వేసుకొని కారువైపు నడుస్తున్న శంకరంకి కళ్ళల్లో నీరు చిప్పిలి మసగగా కనబడుతుంటే చెయ్యి ఊపింది ఉమ. ఒక మదర్ తెరిస్సా ఒక దుర్గా బాయి ఇలా ఎందరో స్త్రీ మూర్తులు ఆమె కళ్ళముందు మెది లారు అత్తగారిలో ఆమెకు.
నిశ్శబ్దం గా లోనికి నడిచింది ఉమ.
దేశంలో ఎందరో ప్రైవేట్ టీచర్లు ఆర్ధికంగా వెనక బడిన వారికి ఈ కథ అంకితం.

1 thought on “సహారా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *