April 24, 2024

ఇప్పటిలో దేవుడు ఎలా గుర్తుకొస్తాడు?

రచన: చందలూరి నారాయణరావు

ఇప్పటిలో దేవుడు ఎలా గుర్తుకొస్తాడు?
నిజమే….
ఎవరికీ గుర్తుకు రాలేడు.
మరిచాను అన్నది మనసులో ఉన్నా
బుద్ధికి మాత్రము దరిదాపులలో లేదు.
ఎదురుపడ్డా పలకరించే తీరికలేని బతుకుల్లో
ఇప్పటిలో దేవుడు ఎలా గుర్తుకొస్తాడు?

మనిషి ఆకాశమంత ఎత్తులో
ప్రపంచాన్ని అరచేతిలో పెట్టుకొని
కనిపించని యుద్ధంలో అలసి సొలసి పోతుంటే…
ఇప్పటిలో దేవుడు ఎలా గుర్తుకొస్తాడు?

రాత్రి నిదుర పోకుండా
పగటిని కదలకుండా
నిశబ్దం కాపలా కాసే విపత్తు వేళలో
అనునిత్యం నిఘాతో
నియమ బద్ధతల నడుమ మనిషికి
ఇప్పటిలో దేవుడు ఎలా గుర్తుకొస్తాడు?

కాలం పెట్టిన కరోనా పరీక్షలో
అగ్రరాజ్యాల సైతం అధోగతికి చేరుకొని
పేదదేశాలు ఉనికికి భంగం వాటిల్లే ప్రమాదంలో ప్రపంచ ప్రాణాలకు ముప్పుకు గురౌతుంటే
ఇప్పటిలో దేవుడు ఎలా గుర్తుకొస్తాడు?

భూమితో క్షణం తీరిక లేని సంభాషణలో
బంధాన్ని బాధ్యతగా
ప్రపంచాన్ని కుటుంబంగా
కోల్పోయిన జీవితాలు తోడుగా నిలిచే విపత్కర స్థితిలో
ఇప్పటిలో దేవుడు ఎలా గుర్తుకొస్తాడు?

మనిషిని నిరాయుధులుగా మార్చి
సృష్టిపై విరుచుకుపడ్డ విష క్రిమి ఉత్పాతం
మేధస్సుకు అవమానమైతే
ప్రభుత్వాలకు విషకాలం.
కునుకు లేని పరిశోధన
అతలాకుతలం అవుతుంటే
ఇప్పటిలో దేవుడు ఎలా గుర్తుకొస్తాడు?

కలియుగపు హెచ్చరికో…
మనిషికి విధి రాతో…
తరుముతున్న ముప్పుని ఢీ కొట్టైనా
జాతి మనుగడకు
ప్రాణాలను ఎదురోడ్డే వేళలో
ఇప్పటిలో దేవుడు ఎలా గుర్తుకొస్తాడు?

సృష్టి లో “మనిషిని కోల్పోయిన” నష్టం హద్దులు దాటి
దేశాలు కొట్టుమిట్టాడుతున్న తరుణంలో
మనిషి కోసం విలపిస్తున్న విషాద వేళలో
ఇప్పటిలో దేవుడు ఎలా గుర్తుకొస్తాడు?

కంటపడిన ప్రతివారిని దాడి చేసి
వెతికి వెతికి ప్రాణాలను హరిస్తున్న
మహమ్మారివ మృత్యుదాహానికి
చరమ గీతం పడటానికి
చస్తూ బతుకుతుంటే
ఇప్పటిలో దేవుడు ఎలా గుర్తుకొస్తాడు?

ఏ దుష్ట శక్తిని క్షమించదు
మానవ మేధస్సు.
భోగోళాన్ని ప్రేమించిన మనిషిగా
భూలోకాన్ని కాపాడేందుకు
శాస్త్రవేత్తలుగా..వైద్యులుగా…
రక్షకభటులుగా…పారిశుద్ధ్య కార్మికులుగా
జీవితాన్ని అహర్నిశలు త్యాగం చేసి
సామాజిక దేవుళ్లుగా కనిపిస్తుంటే
ఇప్పటిలో దేవుడు ఎలా గుర్తుకొస్తాడు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *