March 29, 2024

కంభంపాటి కథలు – కాశీ అత్తయ్య

రచన: రవీంద్ర కంభంపాటి

చిన్నప్పటి నుంచీ మా కాశీ అత్తయ్యకి నవలల పిచ్చి. ఈ నవల ఆ నవల అని కాదు.. తెలుగు నవల కనిపిస్తే చాలు.. చదవకుండా వదిలిపెట్టేది కాదు!
కాశీ అత్తయ్య అంటే ఆవిడేదో కాశీలో ఉంటుందని కాదు.. ఆవిడ పేరు కాశీ అన్నపూర్ణ.. మా తాతగారు ఆవిణ్ణి కాశీ అని పిలిచేవాడట.. దాంతో అదే పేరు ఆవిడ తరం వాళ్ళకీ, మా తరం వాళ్ళకీ ఖాయమైపోయింది.
ఆవిడకి పుస్తకాల మీదున్న ఇంట్రెస్టు చూసి, మా తాతయ్య ‘నువ్వు కూడా రాయడం మొదలెట్టేవంటే పెద్దయ్యేక కోడూరి కౌసల్యాదేవి, యద్దనపూడిసులోచనా రాణీ అంత పేరు తెచ్చేసుకుంటావు ‘అని ప్రోత్సాహంగా అంటే, ‘అవున్నాన్నా.. నీ వంతుగా నువ్వు కాశీ అన్నపూర్ణ అని నాకు పెద్ద పేరు పెట్టేసేవు.. ఇంక మిగిలున్నదల్లా నేను ఓ డజను పుస్తకాలు రాసి పేరు తెచ్చేసుకోడమే ‘ అందట కాశీ అత్తయ్య అమాయకంగా!
విషయం అర్ధమైన మా తాతయ్య ఈవీడేదో గొప్ప రచయిత్రి అవుతుందన్న ఆశని పక్కకి పిలిచి దాని మీద చేతిలో ఉన్న గ్లాసుడు నీళ్ళూ వదిలేసేడు.
కానీ మా కాశీ అత్తయ్య మటుకు తన ప్రయత్నాలు మానుకోలేదు.. కష్టపడి ఠావుల కొద్దీ కాయితాలు కొనిపించుకుని, నెల రోజుల పాటు గదిలోంచి కదలకుండా, అదే పనిగా తెగ రాసేసి, ఆ రాసిన కాయితాల బొత్తికి గుళ్లో పూజ చేయిస్తూంటే, పూజారి కృష్ణశాస్త్రి గారడిగేరు ‘ఏమిటమ్మా ఈ కాయితాలన్నీ ?’ అని ‘మొదటిసారి నేను రాసిన నవల పంతులు గారూ.. పేరు “ప్రేమ పురం “‘ అని ఉత్సాహంగా చెప్పింది కాశీ అత్తయ్య!
తను పోస్టు చేసిన నెలరోజులకి అనుకుంటాను ‘అమ్మాయ్.. నువ్వు రాసిన నవల పది పేజీలు చదవగానే అర్ధమైంది.. నువ్వు సామాన్యురాలివి కాదని! ఎందరో రచయిత్రులని చూసేను.. కానీ నీలాంటి వారు చాలా అరుదు..నీ రచన కోడూరి కౌసల్యాదేవి గారికి కూడా చూపించేను.. ఆవిడ కూడా ఒక్కో పేజీ చదువుతూ తెగ నవ్వుకున్నారు.. ప్రేమ నగర్ నవల టైటిలు పేరు, పాత్రల పేర్లు మార్చేసి, “ప్రేమ పురం ” అని తిరగ రాసేవు చూడు.. నీ సృజనాత్మతకి జోహార్లు.. ఇంకెప్పుడూ నీ పెన్నుకి ఇంతటి కష్టం కలిగించకు ‘ అంటూ ఆ వారపత్రిక ఎడిటర్ నుంచి బదులొచ్చేసరికి, ‘నాలాంటి రచయిత్రిని ఎక్కడా చూడలేదని తెగ మెచ్చేసుకున్నారు.. నా నవలలోని హాస్యం కోడూరి కౌసల్యా దేవి గారికి తెగ నచ్చేసి, పడీ పడీ నవ్వుకున్నారట ‘ అంటూ అందరికీ ఉత్సాహంగా కాశీ అత్తయ్య చెప్పేసుకున్నప్పటికీ, విషయం అర్ధమైన తాతయ్య మటుకూ ఆవిడ అమాయకత్వానికి నవ్వుకున్నాడు.
ఆ తర్వాత రోజుల్లో, తనకి పెళ్ళైనా కూడా మా కాశీ అత్తయ్య తన రచనా వ్యాసంగాన్ని మటుకు వదిలిపెట్టలేదు. మా మావయ్య చాలా పెద్ద ఆఫీసరు, ఆయన బిజీలో ఆయన ఉంటూ, ఈవిడ తనని విసిగించనంతకాలం ఏం రాసుకుంటే ఏమిటి అనుకుని పట్టించుకోలేదు.
తద్వారా.. తరువాతి రోజుల్లో బతుకు కెరటాలు (జీవన తరంగాలు ), మారేడు ఆకు (తులసి దళం ), చేతగానివాడి జీవితం (అసమర్థుని జీవయాత్ర ), చావుబాజా (మరణమృదంగం ), మేడలో పావురం (మహల్లో కోకిల) లాంటి చాలా నవలలు రాసింది కానీ.. చదివిన ఎడిటర్లందరూ, చదివింది చదివినట్టు యాజ్ ఇట్ ఈజ్ గా భలే రాసేసేవమ్మా అని రిప్లై కొట్టి.. తిప్పి పంపేసేవారు. అలాగ తన పుస్తకం ఏ పత్రికైనా పబ్లిష్ చేస్తే బావుణ్ణు అనే కోరిక మా కాశీ అత్తయ్యకి మిగిలుండిపోయింది.
‘వాళ్లెవరో నీ పుస్తకం పబ్లిష్ చెయ్యడమేంటి? మన స్టేటస్ కి తగ్గట్టుగా మన పుస్తకం మనమే పబ్లిష్ చేసుకోలేమా ఏమిటీ ?’ అని మా మావయ్య ప్రోత్సహించేసరికి, ఆవిడ రాసిన నవలలన్నీ ఆవిడే అచ్చేయించేసుకునేది. మరి ఆ పుస్తకాలు ఎవరు కొంటారని మీకు డవుటు రావడంలో తప్పులేదు.. నిజమే ఎవరూ కొనరు.. అందుకే ఏ పెళ్ళికి వెళ్ళినా, తనిచ్చే గిఫ్టుతో పాటు, తను రాసిన పుస్తకాల కాపీలు కూడా ఓ నాలుగైదు పెట్టేసేది!
ఇవన్నీ ఇలా ఉంటే, మా కాశీ అత్తయ్య కొడుకు గణేషు గాడు మటుకు, వాళ్ళ అమ్మ అంటే ఎంత ఇష్టమైనా, తల్లికి చాలాసార్లు చెప్పి చూసేడు, ‘అమ్మా..రాయడం అంటే ఇలాక్కాదేమోనే ‘ అని. ఆవిడ తేలిగ్గా కొట్టిపారేసేది.
అయితే ఒకటి.. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానని మీరనుకోవచ్చు.. మీరూహించింది నిజమే.. గణేష్ గాడి పెళ్లి కి కూడా ఓ పుస్తకం గిఫ్టుగా ఇచ్చింది.
ఆ పుస్తకం ఆసక్తిగా తీసి చదివేసిన కొత్త కోడలు కావ్య ఒకటే ఏడుపు. ‘మా అమ్మ పాపం చాలా మంచిది.. కానీ.. ఈ రాయడం ఒక్కటే తనకి రాదు.. తను రాసిన పుస్తకాలు చదవకుండా, తన రాతల్ని పట్టించుకోకుండా ఉంటే చాలు.. మిగతా అన్ని విషయాల్లోనూ తను సూపరని నువ్వే ఒప్పుకుంటావు ‘ అని గణేషు గాడు కావ్యని ఊరుకోబెట్టబోతే,
‘చాల్లే.. ఊరుకోండి.. మీకే బుద్ది లేదు.. అత్తయ్యగారు మీరు పుట్టిన దగ్గర్నుంచీ, మిమ్మల్ని పెంచడం వరకూ ఎంత బాగా రాసేరో.. చూసింది చూసినట్టే రాసేసేరు… ఏ కల్పితమూ లేదు…అత్తయ్యగారు నిజంగా దేవత..నాకే ఇలాంటి తల్లి ఉంటేనా..ఎంత గొప్పగా చెప్పుకునేదాన్ని’ అంటూ “ఓ అమ్మ కధ ” అని పేరున్న ఆ పుస్తకాన్ని గణేషుకి చూపించింది కావ్య!

2 thoughts on “కంభంపాటి కథలు – కాశీ అత్తయ్య

  1. కాపీ కొట్టే ఆడ వారికి కొత్త పేరు ఏమైనా పెట్టండి

Leave a Reply to Raghu Ayinapurapu Cancel reply

Your email address will not be published. Required fields are marked *