April 19, 2024

గిలకమ్మ కతలు – పుచ్చు రేగ్గొట్టిన …పిచ్చిగ్గొట్తం..!

రచన: కన్నెగంటి అనసూయ

అయ్యేల కిష్ణాస్టమి.
సరోజ్ని ఆల్లింటికి కూతంత అయిదారిళ్లవతల…దేవుణ్ణెట్టేరేవో..సందలడేకొద్దీ.. ఏ పిల్లోడి మొఖం చూస్నా.. ..ఉట్టికొడతం ఇంకెప్పుడానే ఉబలాటవే కనిపిత్తుంటే..ఈధరుగు మీద కూకుని..ఆల్లనే గమనిత్తా మాట్తాడుకుంట్నారు..సరోజ్నీ, సేసారత్నం, సత్తెమ్మా, మూలింటి ముప్పరాజోళ్ల కోడలూ.. సందులో ఎంకాయమ్మా..అందరూను.
అయ్యాల మొదలెట్టి..ఇగ ఏడ్రోజుల పాటు సందడే సందడి..
..మూడేళ్ల కిందట…తొమ్మిది, పదో తరగతి సదివే పిల్లలంతా యధాలాపంగా .సేద్దారనుకున్న కిష్ణాస్టమి కాత్తా..పెద్దోళ్ళు కూడా కలిసొచ్చి తోసినోళ్లకి తోసినంతా సందాలేసేరేవో..మూడేళ్ళు తిరిగే తలికి అదో పెద్ద పండగలాగయిపోయింది…
తొలేడాది..కొబ్బరాకుల్తో సిన్న పందిరేసి..దేవుణ్ణెట్టి..ఆ సందేల ఉట్టి కట్టి అడావిడి సేసినోళ్ళు…రెండ్రోజులు పోయాకా..లెక్కలేత్తే..ఆల్లూ.. ఈల్లూ ఇఛ్చిన డబ్బులేగాకుండాను..దేవుడ్డిబ్బీలో దేవుడికి పళ్ళిత్తాకొచ్చినోళ్ళు ఏసిన డబ్బుల్తో కలిపి…” వచ్చే ఏటికి సరిపోతాయని ఆమట్నే అందరూ కల్సెల్లి ఆ ఊరి మున్సబు గారికప్పజెప్పి..వచ్చే ఏడు తీస్కుంటామని సెప్పొచ్చేరు.
అలాగలాగ..మొదట్లో ఒకనాడే సేసిన పండక్కాత్తా..మూడేళ్ళయ్యేతలికి మూడ్రోజులల్లా ఐదయ్యి..ఇయ్యేడాది ఏడ్రోజులకి పాకింది. మొదట్రోజెలాగ ఉట్టి కొడతంతోనే సరిపోద్దమో..మిగతా మూడ్రోజులూ ..ఓనాడరికతెడితే , మర్నాడు..ఊళ్ళోవాళ్తో భజన్జేయించటం, మూడోనాడు..సురభోల్లని పిల్సి నాటకం పెట్టిచ్చేదాకా వచ్చేసింది పండగ. ఇక ఐదోనాడు దేవుణ్ణెత్తేసి..సాగనంపి…ఎవరిళ్లకాళ్ళు పోయివోరు. మర్నాడు తీరిగ్గా వచ్చి పందిళ్ళిప్పేసి..ఎవరి కర్రలాళ్ళు..ఎవరి గిన్నెలాళ్ళు..ఎవరి కుర్సీలాళ్ళు , ఎవరిచ్చిన తాటకులాళ్ళు ఎడ్లబళ్ల మీదేసుకుని పట్టూపోయీవోరు. అయిదార్రోజులయ్యి..నీర్సాలు తగ్గేకా తీరిగ్గా లెక్కల్సూసి మిగిలిందంతా మున్సబు సేతుల్లో పోత్తం అనువాయితయ్యింది.
అలాటిది..ఇయ్యేడు ఏడ్రోజులంట కిష్ణాస్టమి. మామూలుగా ఎప్పుడూ పెట్టే పోగ్రావుల్కి బుర్రకత, ఓ పాత సినివా వచ్చి సేరింది.
అయితే ..కిష్ణాస్టమి సేత్తన్నన్ని రోజులూ.. మైకు…
“ య్యే..య్యే..య్యే..కిష్టా..ముకుందా..మురారీ..రీ రీ రీ “ అంటా మొదలెట్టి కొంతసేపు మోమాటం కొద్దీ దేవుడి పాటలేసి..ఆ తరవాత తైతక్కల పాటలేత్తారేవో..పిల్లలంతా పందిట్టో సేరి ఒకటే ఆటలు.
పరిగెత్తీ ఆట్లు కొందరైతే..పట్టుకునే ఆట్లు కొందరు. అయుటయ్యినోడికి ఆకు పేర్జెప్పి తెమ్మని దాక్కునేవోళ్ళు కొందరైతే.. తొక్కుడు బిళ్ళలాట కొందరు..ఉప్పులగుప్ప వయ్యారిభావా అంటా..సేతుల్లో సేత్లేసి గట్టిగా పట్టుకుని ఎనక్కి ఇరుసుకుంటా రౌండ్రౌండుగా తిరిగి ఆడుకునేవాళ్లు కొంతమంది. ఎవరి జతకత్తులు ఆళ్లకే. ఆడనివ్వనోళ్ళు ..దేవురు ముఖాలేసుకుని గుంజలకి ఏళ్లాడతా..ఆడతన్నవాళ్లని సూత్తా ఉంటారు..
ఏమాటకామాటే సెప్పుకోవాలన్నట్టు కిష్టాట్తం పండగొచ్చిందంటే ఆ ఈధి ఈధంతా అదో తీర్తంలాగుంటాది..
అరుగులరగాలిగానీ ఆడోళ్లు మాత్రం లోనకెల్లరన్నట్టుంటాది..ఏలాకోలాలూ..ఎక్కిరింతలూ..గుసగుసలూ..గోక్కోవటాల్తోను..
అయ్యాల అప్పటికే అక్కడికి సేరుకున్నోల్లోపక్క కవుర్లల్లో మునిగి తేల్తంటే..
“ఇయ్యాలుట్టి కొడతం ఒక్కటేనేటే సరోజ్నే? లేపోతే ఇంకోటేదైనా పెట్టేరా ఈళ్ళు సూత్తాకి..?” అంటా వచ్చింది మనవణ్ణి సంకలో ఏసుకుని నలమాటోరి నర్సమ్మ..
“ఏటా అంతేగదా మరి. అయినా ఏటాలస్సెం. ఈపాటికే వత్తావనుకున్నాను..వణ్నంగూడా తినేసొచ్చేసావా ఏటి? ” అంది నర్సమ్మెనక్కి, సంకలో మనవడెనక్కీ మార్సి మార్సి సూత్తా..సందులో ఎంకాయమ్మ..
“ ..తెవిలి సత్తేనా? ఎప్పుడనగా మొదలెట్టేనో..పెందలాడే వచ్చేద్దారని. పిల్లోడు ఊరెల్తన్నాడు..ఆడి బామ్మర్ధి పొలం కొనుక్కున్నాడంట ఆళ్ళూర్లో. సేలో సేను కలుత్తుందని ..కొంట్నానత్తా అన్నాడు. రెండు మూడు నోట్లు రాసి మరీ కొంట్నాడు. ..
ఆ పిల్లోడికి…అమ్మొత్తందని తెలిత్తే సాలు..తల్తాకట్తేట్టయినా కొనేత్తాడు..ఏదీ వదల్డు. ఏమాటకామాటే… మావోడూ సర్ధేడనుకో ఏమాత్రవో తక్కువైతేనీ..! లేపోతే ఇదూరుకుంటదా..” అని గొణుక్కుంటన్నట్టుగా అని మల్లీ తనే…
“…రేపు రాతకోతలంట. సాచ్చి సంతకవెట్టాలనడిగితే ఎల్తన్నాడు..కోడలు ఆడికి వణ్నవెడతంటే..ఈణ్ణేసుకుని ఇటొచ్చేను. ఆల్లమ్మ సంక దిగనంటా ఒకటే ఏడుపు..” అంది సంకలోంచి జారిపోతన్న పిల్లోణ్ని భుజమ్మీదకి ఎగేత్తా..
“ఎవరాళ్ళు..? కొన్నోళ్ళు..” అనడిగింది..రెడ్డొచ్చేడు మొదలెట్తన్నట్టు..నర్సమ్మ సెప్పినంతసేపూ ఇనకుండా అటూ ఇటూ సూత్తా సేత్తా కూచ్చుందేవో..మజ్జలో కలగజేసుకుని మూలింటి ముప్పరాజోళ్ళ కోడలు..తీరుబడిగా కాల్లు సాపుకుని నర్సమ్మొంక సూత్తా..
“మా కోడల్సంగతి…ఆల్లన్నయ్య పొలం కొంటుంటేనీ…”
“..అదే సెబ్దారని మర్సేపోయాను..మొన్నా మజ్జన మందు బత్తాల కోసవని ఎల్తే అక్కడ కాసేపుందాల్సొచ్చిందట.మీ అబ్బాయి…. పక్కనే ఉన్నాయన్తో ఏదో మాటా ఊసూ వచ్చి..మీ కోడలు అన్నగారు తెల్సని సెప్పేరంట ఈయన. ఆ మాట మీద….” సేనా బాగా సేత్తాడు ఎగసాయం “ అన్జెప్పేడంట. ఎంత మురుసుకున్నారో వచ్చేకా సెప్తాను..సెబ్దారని మర్సేపోయేను ఈ పందగ్గోల్లోపడి..” అనేసి..పందిరి కేసి సూత్తా కూకుందేవో..
“అదే.. నేన్జెప్పలేదా..సేలా బాగా సేత్తాడు..పొలాన్నట్టుకుని వదల్డంటే వదుల్డు..గేదెనట్టుకున్న జలగల్లేని. ఆ మజ్జినెప్పుడో టీవీలో కూడా సూపిచ్చేరు..అస్సర్లేగానీ..మియ్యందరియ్యీ అయిపొయ్యినియ్యా..వంటా అదీని..” అనడిగింది నర్సమ్మ..
“ ఆ..ఇంకేం వంటా..?ఈధిలో ఇంత సందడిగా ఉంటే వంటేంజేత్తావని నేను పొద్దున్నే సాయంత్రానిక్కూడా సరిపోయేతట్టు..పప్పుసారెట్టేసి… అయిదారొంకాయులుంటే నాలుగుల్లిపాయలేసి..పాలోసిన కూరొండేసేను. మా గిలక్కి పప్పుసార్లో..గుమ్మడొడియాలుంటే సాలు. ఎంతన్నవన్నా తినేద్ది..” అంది సరోజ్ని..
సరోజ్ని ఇలాగంటన్నంతలోనే..పిల్లలంతా కెవ్వుమనరిసేరేవో..అందరూ అయ్యేపు తిరిగేరు అదేటో సూద్దారని..
సరిగ్గా అప్పుడే పసుపూ, కుంకం రాసి మావిడాకులయ్యీ కట్టి కర్ర మజ్జలో గిలక్కట్టి దానికి కుండనేలాడదీసి పకి నిలబెట్టేరేవో….దాన్ని సూత్తానే…ఒకటే..గంతులు గంతులు పిల్లలు. గడిసినేడు మజ్జానవే కట్తేసేరేవో..ఆకతాయోళ్లెవరో..రాళ్లతో కొట్టి పగలగొట్తేరని..ఇయ్యేడాది..ఇంతాలెస్సంగా కడతన్నావని..సందాకొచ్చినప్పుడే సెప్పేరు.. పాడైపోతాయని పాచ్చొక్కా తొడుక్కునొచ్చినోల్లు కొందరైతే..ఒంటిమీచ్చొక్కా లేకుండా ఒక్క లాగూతోనే బకెట్ట్నిండా నీళ్ళోసుకుని అందులో సెంబుతో వచ్చేసినోల్లు కొందరు.
అప్పటికి గిలకమ్మా, శీనూ అక్కడికెల్లిపోయి సేలా సేపయ్యింది.
ఆ మజ్జానం పిల్లలిలాగ ఎల్తారనే..దగ్గిరుండి సూస్కోవచ్చని వెంకటేస్స్వర్రావు గూడా ఇంటోనే ఉన్నాడేవో..కాసిన్ని ఉల్లిపాయలూ, పచ్చి మిర్గాయలూ కోసి అందులో అల్లం నూరి కలిపేసి పకోడీలేసిందేవో..కడుపునిండా పెట్టి పంపింది..పిల్లలిద్దర్నీని ఆలీసం అయినా ఇబ్బందుండదని.
మాట్తాడతందన్నమాటేగానీ కనుసీకటడతందేవో.. పిల్లలెక్కడన్నా ఆపిత్తారేవోనని కళ్లతోనే ఎతికేత్తా ఉంది..సరోజ్ని..
ఎక్కడా అజాఅయిపూ లేరు..కాసేపలాగే సూత్తా కూకుని ..ఇంక ఇసుగొచ్చి..
“ఊ..ఆళ్లే ఉంటార్లే ..ఇక్కడే ఎక్కడో..! ఇక్కడో పక్క ఉట్టి కొడుతుంటే ఆల్లేక్కడికి పోతారు..” అని తనకి తనే సరిపుచ్చుకుని..ఉట్టికొట్తే వైపే సూత్తా కూకుంది సరోజ్ని.
పిల్లల అల్లరితో పాటు ఒకటే మైకు గరగర మంటుంటే ఒకరి మాటొకరికి ఇనిపిత్తా లేదు.
ఉట్టికొడతం మొదలైనట్టు తెలుత్తానే ఉంది ఉండుండి అరుత్తున్న పిల్లల్ని సూత్తంటే..
కర్రక్కట్టిన గిలక మీద నించి ఏగోరబ్బులు తాళ్లాగుతుంటే..కుండ పైకెల్తంది. తాడొదుల్తుంటే కుండ కిందకొత్తంది..అలా వచ్చినప్పుడల్లాను..పిల్లలు దాన్నెలాగైనా పగలగొట్తాలని ..ముందు మెల్లగా పరిగెత్తి..ఒక్కసారిగా ఏగం పెంచి కుండ దగ్గరకెల్లేతలికి ఒక్కెగురురెగిరి సేత్తోనో, సేతిలో కర్రతోనో.. కొడతాకి సూత్తన్నారు. ఆల్లలా పరిగెత్తుతున్నప్పుడు ఆ పక్కా ఈ పక్కా నిలబడ్దా పిల్ల పితకా, ఒకల్లిద్దరు పెద్దోల్లూ..ఆళ్ల మీద సెంబుతో ఇస్సురుగా నీల్లు కొడతా ఆల్లకి ఉసారు తెప్పిత్తన్నారు.
పిడత కొట్టుడు మాంచి ఉసారుగా సాగుతుందేవో..ఊళ్ళో జనవంతా సుట్టూ సేరి ఆ పక్కా, ఈపక్కా గుంపుగా నిలబడి సూత్తా నవ్వుకుంటా.. “తగిలిందిరా నాస్సావిరంగా దెబ్బ…” అనే వాల్లొకళ్లైతే..
పిల్లలు ఉరుకులెత్తినప్పుడల్లా.”పగిలిందిరా కుండ..” అనీవోల్లు కొందరు..
జనాలు పెరిగే కొద్దీ అక్కడంతా మూసుపోయిందేవో..ఏవీ కనిపిచ్చాపోతంతో..అరుగుమీంచి లేసి నాలుగడుగులు అటేసి..కనిపిచ్చేతట్టు ..ఉమ్డిల్లోరరుగెక్కి నిలబడ్దారు..ఆడోళ్లందరూను..
కను సీకటి పడతందేవో..పిడత కొడతం సూత్తానే ఇంకో పక్క ఎవరి పిల్లలకోసవాళ్లు నించున్న సోటే నిలబడి ఎతుకుతువే సరిపోయింది..
ఒల్లనిండా నీళ్లతో ఏమాపిత్తారు.? ఆపిత్తే మాత్తారం ..ఈ సీకట్లో తెలుత్తారా..ఎవరెవరెవళ్ళొ..
ఎవళ్లాలోసనల్లో ఆళ్ళుండగా…
“ పోయినేడు..ఎవురు పగలగొట్టెరే అమ్మాయ్ పిడత..గేపకం లేదు..” అంది సందులో ఎంకాయమ్మ సరోజ్నొంక సూత్తా..గోల్లో ఇనపడదేవోనననుకుంటా గట్టిగా అరిసింది..
“ అదే..సూరబ్బులు కొడుకు. పెద్దోడు. పొడుగ్గా ఉంటాడేవో..ఇట్తే పగలగొట్టేడని సెప్పుకున్నారుగదా అందరూను..”
“ అవున్నాగ్గేపకం ఉంది..కుండలో వంద రూపాయల సిల్లరేత్తే ..అది పగిలిపోయి సిల్లరంతా సెల్లా సెదురుగా పడి ఆల్లూ ఈల్లూ ఏరేసుకున్నాక్కా..పాతిక రూపాలో ఎంతో దొరికినియ్యంట. మావోడు సెప్పేడు. ..”
“ అవున్నిజవే..ఈయనా అన్నారిదేమాట..అలా ఏరేసుకుమ్తే ఏరేసుకున్నారుగానీ..పిడత కొట్టినోడికి మాత్తారం..వందా ఇచ్చేద్దారి వచ్చే యేట్నించీ అనుకున్నారంట. మరియ్యేడు ఎంతేసేరో ఏవో..ఇత్తారో సత్తారో…ఇచ్చినప్పుడు..సూద్దారి..” అందింకోకావె..
ఈల్లిలా మాటాడుకుంటుంటే సీకట్లో ఎవరో ఏడుత్తా ఇటే వత్తన్నట్టనిపించటు సూసేరేవో..గట్టిగా ఏడుత్తా..మజ్జ మజ్జలో..ఎనకెనక్కి తిరిగి ఎనకే వత్తన్న ఆల్లక్కెనక్కి సూత్తా..” అమ్మతో సెప్పి నిన్ను కొట్టిచ్చాపోతే సూడు నాపేరు శీనే కాదు..” అంటా వత్తన్న కొడుకునీ కూతుర్నీ సూసి సరోజ్ని..తెల్లబోయినట్తయిపోయిందో నిమిషం..
ఆడెనకే గిలక..సేతిలో పిచ్చిగ్గొట్టంతో..
దాన్నలా తయారు సేత్తాకి..రెండు మూడ్రోజులు దాంతోనే ఉంటం గుర్తొచ్చింది సరోజ్నికి.
అంతకు ముందు వారం పది రోజుల్నుండీ గెడ కర్ర ముక్కలు ఒకట్రెండు కొట్టుకు రమ్మని గునుపుండేతట్టు సూసి కొట్టిచ్చమని సెవులో జోరీగల్లే ఊదరగొట్తేసి మరీ సెప్తుం,సేలో కూల్లోల్లు కలుపు తీత్తంటే ఆ అడావిళ్ళొ ఆల్ల నాన్న మర్సిపోయి వచ్చేత్తం..గిలకమ్మ సణుగుళ్ళూ అయిదార్రోజులు నడిసాకా..ఒకనాడు తేనే తెచ్చాడు ..వెంకటేస్వర్రావు.
ఇంత మొకవయ్యింది గిలక్కి ఆట్ని సూసి.
“ అక్కా ఇయ్యంతుకే “ అనడిగిన శీనుకి..
“ నీకేరా..! పిచ్చిగ్గొట్తవంటారు దీన్ని. పిడత కొడతాకి ఎగురుతారుగదా..అప్పుడుదీన్నిండా నీళ్ళు పట్తేసి..వాళ్లకేసి ఇస్సురుగా కొట్తాలన్నమాట..సూపిత్తాన్లె సేసేకా..అయినా అప్పుడు సూసేవుగదా..తెలవనట్తడుగుతున్నావేటి” అంది గిలక.
“నాకేనా? ..” అన్నాడు ఆల్లక్క దగ్గరకంటా కూకుని.
ఆల్ల నాన్ననడిగి..తొళికి తీసుకుని గునుపు దగ్గర సిన్న సిల్లెట్టింది. అదయ్యాకా సన్నటి గెడకర్ర పుల్ల ముక్క తీసుకుని దాని సివర సుట్టూ ఊడకుండా మెత్తటి గుడ్డ సుట్తేసి దాన్ని గునుపు దగ్గర సిల్లెట్టిన వైపు కాకుండా రెమ్డో వపు నించి లోనకి నెట్టి అటూ ఇటూ ఆడించి సూసింది. ..అది బిగుతుగా ఉందనిపిచ్చేకా..అక్కడే బక్కెట్లో..ఉన్న నీళ్లల్లో దాన్ని ముంచి గుడ్ద సుట్టిన కర్రని ఎనక్కి లాగేతలికి గెడకర్ర నిందా నీళ్ళు సేరేయేమో..అప్పటికప్పుడు శీను పొట్తకేసి గురిపెట్టి ఇస్సురుగా సేతిలో పుల్లని లోనకి నెట్టింది..గునుపు దగ్గర సిల్లుల్లోంచి నీల్లొచ్చి శీనుని తడిపేసేయేమో..వాణ్ణి..వాడి ఆనాందాన్ని పట్తతరంకాపోయింది..
ఇదంతా సేత్తన్నంతసేపూ..సరోజ్నీ,, ఆల్లాయన ఎంకటేస్వర్రావు..ఓ కంట గమనిత్తానే ఉన్నారేవో..
“ఆ పనేదో మీరే సెయ్యచ్చు గదా..దాని సెయ్యి తెగితే మనవే బాధపడాల “ అంది సరోజ్ని మొగుడితో..
“ఏవవదులే. సెయ్ నియ్..ఆల్లకీ రావాలి గదా..అదో సరదా..” అన్నాడు ఎంకటేస్వర్రావు..పురిపెంగా పిల్లలిద్దర్నీసూసుకుమ్టా..
అయిదారుసార్లు అలా నీల్లు కొట్టి సరదా తీరిందనుకున్నాకా తమ్ముడికిచ్చేసి ఎలా కొట్తాలో సూపెట్టింది గిలక.
అయిదారు సార్లు..రాపోయినా ఆరోసారి ఆడికెప్పుడైతే పిచ్చిగ్గొట్తంతో పిచికారీ సేత్తం వచ్చేసిందో ఇంకాడ్ని..ఇంట్లో ఆపలేపోయేరు..ఎప్పుడెప్పుడెల్లి తన సేయితుల్కి సూపిచ్చేద్దారా అని ఆడి కంగారు..
“ఒరేయ్ తింగరోడా…అలా సూపిచ్చగూడదు. అయ్యేల ఒకేసారి సూపిత్తే బాగుంటాదని “ గిలకనేతలికి.. సర్లెమ్మన్నాడు గానీ అయ్యల్టి రోజొచ్చేదాకా దాన్నలాగ వళ్లో పెట్టుకునే పడుకునీవోడు..ఆడికినిదరట్తేకా నిద్దట్లో పక్కకి వత్తిగిల్తే అదెక్కడ గుచ్చుకుంటాదోనని తీసి పక్కనెట్టీవోడు నవ్వుకుంటాను ఎంకటేశ్వర్రావు.
నిద్దర్లెసేకా కూడా ఇంకత్తమానూను దాంతోనే. తీత్తం..ఇల్లంతా నీల్లు కొట్టేత్తం.. అక్కడ పెట్టేత్తం..ఎవరెక్కడ జారి పడతారోనని అదో భయ్యం సరోజ్నీకి.
కిష్ణాస్టమెప్పుడొత్తాదాని అంతిదిగా సూసినోడు అసల టైవొచ్చేతలికి ఆడుకోకుండా ఈ ఏడుత్తాలేటో..?
పాపం..పిచ్చిగుంట…వారానికి వారం కట్తపడతvE గాదు..ఆల్ల నాన్న సాయం సేత్తానన్నా వద్దని మరీ సేసింది…దీపాలమాస నాడు సిసింద్రీలు సేసినట్టు. అంత వరకైతే అనుకుంతాకేవుంది? తమ్ముడాడుకుంతాడలాగని..ఊళ్ళో వాల్లందరికంటే ముందు బక్కెట్టెడు నీళ్లు మొయ్యలేక మొయ్యలేక మోసుకెల్లి….అక్కడెట్టి..అందరూ తన తమ్ముడి సేతిలోని పిచ్చిగ్గొట్తాన్ని అసూయగా సూత్తుంటే మురిసిపోతా కూకుంది..
ఉట్టి కొదతం మొదలెట్టి..అరగంటైనా అవ్వనే లేదు. అప్పుదే ఏం గొడవొచ్చిందో..
అనుకుంటన్నంతలో..దూసుకుంటా రానే వచ్చేసింది గిలకమ్మ..కాళ్లని నేలకి దబ్బా..దబ్బా..బదుకుంటాను.
“ఏవయ్యిందే? ఎంతుకేడుత్తున్నాడాడు..” అని ఓ పక్కన అడుగుతున్నా..సమాధానం సెప్పకుండా తిన్నగా ఇంటికేసి నడుత్తుంటే ..దానెనకాలే ఏడుత్తానే ఓ సేత్తో కళ్ళు నులుంకుంటా..ఇంకో సేత్తో సూపుడేలు గిలకెనక్కి గురెట్టి..” అమ్మతో సెప్తానుండు నీ సంగతి..సెప్పి కొట్టిచ్చాపోతే నా పేరు శీనుగాడుకాదు..” అని బెదిరిత్తా ..శీను.
“గబుక్కునెల్లి ఊరుకోబెట్టి ఉట్టికాడికంపాలి..లేదంటే ఈ ఏడుపుల్లో అది కాత్తా అయిపోద్ది. మళ్ళీ ఏడాదిగ్గాని రాదు..” అని మనసులో గొణుక్కుంటానే సేసేది లేక ఆ ఎనకే పరిగెత్తినట్టెల్లింది..సరోజ్నీ..
లోనకెల్తానే ఇంత దూరం ఇస్సిరి కొట్టింది పిచ్చిగ్గొట్టాన్ని గిలకమ్మ..
“ఎంతుకేడుత్తున్నాడే…కొట్టేవా? “ అంది పిల్లోడ్ని దగ్గిరికి తీసుకుంటాను సరోజ్ని..అదేం పట్టిచ్చుకోకుండాను..
దాంతో ఇంతెత్తునెగిరింది గిలక “నాకింకేం పన్లేదు మరి. ఆణ్ని కొడతం తప్ప..” అని ఎక్కెక్కిపడతా.. ఒక రాగం తీసి..”నువ్వూ నన్నే అను. నేనొకద్దాన్ని దొరికేను తేరగాను మీ అందరికీని…” అని ఉడుకుమోయింది..గిలక..
“పండగపూట కళ్లనీళ్ళెట్తకే బాబా..! ఎల్లేతప్పుడు బాగానే ఎల్లేరుగదాని నేననేది. ఇంతలో ఏమ్ముంచుకొచ్చిందని అడగరా పెద్దోళ్ళు..ఏడవకు. ఏడవకమ్మా…నా బంగారం కదా..ఏడవకు..” అంది సరోజ్ని పిల్లాణ్ణలా ఓ చేత్తో పట్టుకునే గిలక దగ్గరకంటా వచ్చి కన్నీళ్లు తుడుత్తా..
ఆ మాత్రందానికే..బీరువైపోయిన గిలక..
“ఆడు సూడమ్మా…కట్తపడి పిచ్చిగ్గొట్తం సేసేనా..అలాటిదక్కడెవ్వరికీ లేదు. ఉన్నా పన్జేత్తాల్లేదు. ఈడి పిచ్చిగ్గొట్తం నుంచెల్తన్నట్టు నీళ్ళు ఎవ్వరి పిచ్చిగ్గొట్తం నించీ ఎల్తం లేదు. అందరూ ఆల్లు తెచ్చుకున్నయ్యన్నీ పక్కనడేసి…సెంబుల్తో పోత్తం మొదలెట్టేరు. ఈడికి తెలవాలా?” అంది శీనెనక్కి సూత్తా..
“…ఇంతకీ ఏవయ్యిందో సెప్పు..అక్కడ పిడత కొట్తేత్తారు ఎవరో ఒకళ్ళు మీరెల్లేతలికి..” అని కంగారు పెట్తేసింది.. సరోజ్ని..
“కొడితే కొట్నియ్ ..ఇలాంటోళ్లుంటే అంతే..” అని శీనుగాడొంకో సూపిసిరి..
“..మా బడికాడ..ప్రసాదం మేస్టారుంటారు సూడు..ఆల్లింటికెవరో సుట్తాలొచ్చేరు ఏదో ఊర్నించి. ఆ సుట్తాల పిల్లోడు..ప్లాస్టిక్కుత్తెచ్చుకున్నాడు…పిచ్చిగ్గొట్తం. దాన్ని సూసేకా ఇదీడికి నచ్చలేదంటే అమ్మా..అది కావాలంటాడు..ఏడుత్తున్నాడలాగని అక్కడికీ ఆడితో మాట్టాడి..దీంతో ఓసారి కొట్తే…మా తమ్ముడు నీ దాంటో ఓసారి కొడతాడనడిగి ఇప్పిచ్చేనుగూడాను. పోన్లేమని ఇచ్చేడనుకో…ఇంక ఇవ్వడంట ఆ పిల్లోడి ప్లాస్టిక్ పిచ్చిగ్గొట్తం..అవతలాపిల్లోడేవో..పాపం బిక్కమొకవేసుకుని..సూత్తన్నాడు. ఇవ్వాపోతే ఆడేడిసేసేతట్టున్నాడు. ఏదో అడగ్గానే బాగానే ఇచ్చేడనుకో…ఆడిదాడికివ్వద్దా? ఇచ్చెయ్యాలిగదా? అయినా మంది మనకుండగా ఆడిది మనకెంతుకు సెప్పు…ఎంతకీ ఇత్తాలేదని లాక్కుని ఆడికిచ్చేనని ఆల్లందరెదురుగ్గాను..కిందబడి దొర్లేసి దొర్లెసి ఏడిసేత్తన్నాడు. మొన్నటికి మొన్న ఆల్లెవర్దో బేగ్గు సూసి కూడా ఈడిలాగే గొడవెట్తేడు…గేపకవుందో లేదో నీకు …అది గుర్తొచ్చి ఇలాగైతే ఎలాగని ఈడ్సిపెట్టి గూబ గుయ్యుమనేట్టు ఒక్కటిచ్చేను ఆమట్ని..అంతుకు ఏడుపు..”
నిజవేనేంట్రా అన్నట్టు కొడుక్కేసి సూసింది సరోజ్ని…
ఇంతలో..గిలకమ్మ ఏడుపు లంకిచ్చుకుని..
“..ఎంత కట్తపడి సేసేనో..ఈ ఎదవకోసవని. దానిక్కన్నవెడతంటే సెయ్యి కూడా తెగి రత్తవొచ్చింది..నానా..నువ్వూ సూత్తే తిడతారని..సేతులు దాసుకోలేక సచ్చేననుకో..ఈడిలా సేత్తాడని నాకేం తెల్సు..”
పిల్లోణ్నొదిలేసి..గిలకమ్మ దగ్గరకంటా ఎల్లి..భుజం సుట్టూ సెయ్యేసి దగ్గైరికి లాక్కుంటా..
“ఏడవకమ్మా..ఏడవకు..ఆడింకా సిన్నోడు కదా..పెద్దైతే ఆడికే తెలుత్తాది. నాకుదెలవదా..గెడకర్రట్టుకొచ్చేదాకా ఎంద తవుసట్తేవో…పిచ్చిగ్గొట్తం సేత్తవంటా మాటలా ఏటి..? ఆ కట్తవేంటో..నాకు తెల్సు..” అంద్ఓ లేదో..
“నాకూదెల్సు…” అంటా గబుక్కున పిచ్చిగ్గొట్తం కాడికి ఒక్క దూకు దూకి దాన్నట్టుకుని ఈధిలోకి పరిగెత్తేడు శీను.
కళ్లు తుడ్సుకుంటా పెళ్లున్నవ్వి…
“ఉట్టి కొడతాకి..పెద్ద పెద్దోల్లు కూడా వచ్చేరమ్మా… ఆ అడావిళ్ళో ఈణ్ని తొక్కినా తొక్కేత్తారు..” అంటా ..కళ్లు తుడ్సుకుంటా ఆడెనకాలే ఈధిలోకి పరిగెత్తింది గిలక..
“ఆసి పిల్లల్లారా..మజ్జలో నేనేంటల్లా..” అనుకుంటా..అటే సూత్తా నిలబడిపోయింది..సరోజ్ని.
——-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *