April 18, 2024

జరత్కారుడు

రచన: అంబడిపూడి శ్యామసుందర రావు

జరత్కారుడు హిందూ పురాణాలలో ప్రస్తావించబడ్డ ప్రకారము ఒక గొప్ప ముని. ఈయన ప్రస్తావన మహాభారతము, దేవి భాగవత పురాణము, బ్రహ్మ వైవర్త పురాణాలలో ఆస్తికుని ప్రస్తావన వచ్చినప్పుడు వస్తుంది. ఎందుకంటే నాగజాతిని జనమేయజేయ యజ్ఞము నుండి కాపాడినది ఆస్తికుడే ఆ ఆస్తికుని తండ్రియే జరత్కాకారుడు ఆస్తికుని కధ మహా భారతము లోని ఆదిపర్వంలో వివరించబడింది.
జరత్కారుడు నాగ దేవత అయిన మానస(వాసుకి చెల్లెలు అయిన జరత్కారి) భర్త. జరత్కారుడు యాయవారపు(ఇంటింటికి తిరిగి బిచ్చమెత్తుకొని జీవించే బ్రాహ్మణులు) బ్రాహ్మణుల వంశములో పుట్టిన ఏకైక వారసుడు జరత్కారుని పేరుకు అర్ధము “జర'” అంటే వినియోగము అంటే ఖర్చు అయి పోయేది “కారు” అంటే భారీ కాయము ఈ ముని తన భారీ కాయాన్ని కఠిన మైన తపస్సులతో శుష్కింప చేసుకున్నాడు కాబట్టి ఈయనకు జరత్కారుడు అన్నపేరు వచ్చింది ఈయన మంచి తపోనిది. కఠోరమైన తపస్సు చేస్తూ సంసార బంధాలు ఏమి లేకుండా బ్రహ్మచారిగా ఉండిపోదలచుకున్నాడు వివాహము, సంసారము, సంతానము ఇవన్నీ జీవుడిని సుడిగుండాలలో పడవేసేవే తప్ప కైవల్యానికి అక్కరకు రాలేవు అని జరత్కారుని గట్టి నమ్మకము అందుచేతనే బ్రహ్మచర్యాన్ని ఎన్నుకున్నాడు ఆ విధముగా తపస్సు వేదాధ్యాయనము తప్ప వేరే దృష్టి లేకుండా జీవించేవాడు.
ఒకనాడు జరత్కారుడు అరణ్యములో సంచరిస్తూ ఉండగా అతనికి కొన్ని గొంతుకలు వినిపించాయి. గొంతులు ఎవరివా అని చుస్తే దగ్గరలో నున్న చిన్న సరస్సు మొదట్లో ఏపుగా పెరిగిన గడ్డిమొక్కను పట్టుకొని కొందరు మునీశ్వరులు తలక్రిందులుగా వ్రేలాడుతున్నారు. ఇది చుసిన జరత్కారునికి ఈ మునీశ్వరులు కొత్త రకమైన తపో ప్రక్రియలో ఉన్నారనుకొని వారిని సమీపించి, ” ఈ తపోప్రక్రియ బాగుంది ఈ తపోప్రక్రియ విధానాన్ని నాకు వివరిస్తే నేను కూడా ఆచరిస్తాను”అని వారికి విన్నవించుకున్నాడు అదే సమయములో ఒక ఎలుక ఆ గడ్డిమొక్క వేళ్ళను ఒక్కొక్కటిగా కోరుకుంటున్నది ఒకే ఒక వేరు మిగిలింది దానిని కూడా ఎలుక కొరికేస్తే వ్రేలాడుతున్న మునీశ్వరులందరు సరస్సులో పడి అధోలోకాలకు వెళ్ళ వలసి ఉంటుంది.
కానీ జరత్కారుడు అది ఒక రకమైన తపోవిధానమని భావించాడు అప్పుడు చిక్కిశల్యమైన మునీశ్వరులు ఓపిక తెచ్చుకొని, “నాయనా మేము యాయవారా బ్రాహ్మణులము, సంచారులము. మా వంశములో ఇక వంశాభివృద్ధి లేకపోవుటచే మాకు ఉత్తమ లోకాలు ప్రాప్టించవని సూచిస్తూ యమధర్మరాజు ఎలుక రూపములో మేము ఇంతకూ మునుపు సంపాదించుకున్న పుణ్యాలను కొరికేస్తున్నాడు. దీని అంతటికి కారణాలు మా కుటుంబములో జన్మించిన జరత్కారుడనే దౌర్భాగ్యుడు వాడు వంశ హితము పూర్వీకులకు ఉత్తమలోకాల ప్రాప్తి వంటి విషయాలపై శ్రద్ధపెట్టకుండా ఎంతసేపు తపస్సు, బ్రహ్మచర్యము వేద అధ్యయనము అంటూ మాకు ఈ పరిస్థితి తెచ్చిపెట్టాడు నాయనా. నీకు ఎక్కడైనా ఆ దౌర్భాగ్యుడు కనిపిస్తే మా దుస్థితి వాడికి వివరించి ఇకనైనా వివాహము చేసుకొనిమమ్మల్ని ఉద్దరించమని చెప్పు. సంసారము తరించడానికి ఒక దివ్య మార్గము వేదాలు చదువుకున్న ఆ మూర్ఖుడికి ఈ విషయము తెలియకపోవటం మా దౌర్భాగ్యము అటువంటి వారి వల్ల వంశనాశనము ధర్మనాశనము జరుగుతుంది” అని వారి భాధను చెప్పుకున్నారు.
వారి బాధలకు తానే కారణము అని తెలుసుకున్న జరత్కారుడు తానే జరత్కారుడిని అని పరిచయము చేసుకొని తన తప్పులను ఒప్పుకొని అతి త్వరలో వివాహము చేసుకొని సంతతిని కనీ వారికి ఉత్తమ లోకాలు ప్రాప్తి అయేటట్లు చూస్తానని త్రికరణశుద్ధిగా చెపుతాడు కానీ తన వివాహము చేసుకోబోయే కన్య పేరు కూడా జరత్కారి అని ఉండాలనేది షరతు చెపుతాడు. ఈ షరతు విన్న పితృ పితామహులు మా అదృష్టము ఎలా ఉన్నదో అని నిట్టూర్పు విడిచి మంచి జరగాలని కోరుకుంటారు.
జరత్కారుడు అక్కడనుంచి బయలుదేరి, “నాకెవరైనా నా పేరున్న పిల్లను ఇచ్చి వివాహము చేస్తారా ? నా వివాహము నా పితృ పితామహులను తరింప చేయటానికే సుఖఃసంసారానికి కాదు” అని అరుచుకుంటూ నడుస్తుంటాడు. ఈ విషయాన్నీ విన్ననాగకుమారులు ఈ వార్త ను వాసుకి కి చేరవేస్తారు. పరమానంద భరితుడైన వాసుకి సత్వరమే జరత్కారుని చేరుతాడు వాసుకి తనసోదరి పేరు జరత్కారి అని జరత్కారునికి తెలియజేసి ఆమెను స్వీకరించమని ప్రార్ధించాడు. ఇద్దరి పేర్లు ఒకటే అని తెలుసుకున్నాక జరత్కారుతుడు వివాహానికి అంగీకరించాడు. కానీ ఒక షరతు పెట్టాడు అది ఏమిటి అంటే తనకు అయిష్టమైన పని గనుక తన భార్య చేస్తే మరుక్షణమే భార్యను వదలి వేస్తాను అని చెప్పి వాసుకి సోదరి జరత్కారిని భార్యగాస్వీకరిస్తాడు.
భర్త షరతు బాధాకరమైన తన బ్రతుకు భర్త అధీనము భగవంతుని అధీనము చేసుకొని జరత్కారి భర్తకు పరిచర్యలు చేస్తూ కాలము గడుపుతూ ఉంటుంది. ఒకనాడు జరత్కారుడు భార్య ఒడిలో తలపెట్టుకొని మధ్యహన్నా భోజనానంతరం నిద్రిస్తూ ఉండగా సాయం సంధ్య విధులను నిర్వర్తించే సమయము ఆసన్నమయింది. నిద్రిస్తున్నభర్తను లేపాల వద్దా? అన్న మీమాంసలో చాలాసేపు అలోచించి వేళ మించిపోతుంది కాబట్టి భర్తను లేపి, “స్వామి సాయంసంధ్యకు వేళ అవుతుంది”అని లేపింది. నిద్ర లేచిన జరత్కారుడు ఉగ్రుడై , “చనువు ఇచ్చాను కదా అని నెత్తికెక్కుతున్నావు ఆడదాని చేత ధర్మ పన్నాలు చెప్పించుకొనే స్థితిలో ఈ జరత్కారుడు లేడు. నా మాట తప్పినందులకు గాను అన్నమాట ప్రకారము ఈ క్షణమే నిన్ను వదలి వేస్తున్నాను ఇంకా నీవు నీ సోదరుని దగ్గరకు పో”అని లేచాడు. జరత్కారి భర్తను కాళ్లావేళ్లా బ్రతిమాలింది అయినా ఫలితము లేకపోయింది.
జరత్కారుడు భార్యతో, “ఇదంతా దైవేచ్ఛ ధర్మమూ కోసము బ్రహ్మచర్యాన్నివిడిచిపెట్టానే తప్ప శారీరక సుఖము కోసము కాదు నేను ఒక మాట అంటే ఆచరించటమే నా లక్ష్యము. నీ అదృష్టము ఏమిటి అంటే సాక్షాత్తు సూర్యుని వలే వెలుగొందే కుమారుడు ఉభయ వంశాలను ఉద్దరించేవాడు నీ కడుపులో పెరుగుతున్నాడు కనుక నీవు పుట్టింటికి వెళ్ళు” అని చెప్పగా జరత్కారి అన్న వాసుకి దగ్గరకు వచ్చి జరిగినది అంతా చెప్పింది.
వాసుకి నాగ వంశోద్ధారణ జరగబోతున్నందుకు సంతోషించి చెల్లెలిని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. నెలలు నిండగానే జరత్కారికి పుత్రోదయము అయింది ఆ పుత్రునికి ఆస్తికుడు అని నామకరణము చేశారు. ఎందుకంటే భర్త వెళ్లిపోయే సమయములో జరత్కారి “నా గర్భములో” అనగానే జరత్కారుడు “ఆస్తి” అన్నాడు ఆ మాట నిజము చేస్తూ జన్మించిన వాడు కాబట్టి “ఆస్తికుడు” అని నామకరణము చేశారు. ఈ ఆస్తికుడే జనమేజయుడు చేసే సర్పయాగాన్ని ఆపి నాగజాతి కాపాడిన ఘనుడు. జరత్కారి మానస పేరుతొ సర్పాలకు ఆరాధ్య దేవతగా ప్రసిద్ధి చెందింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *