April 25, 2024

మబ్బు తెరలు

రచన: ప్రభావతి పూసపాటి

“శ్యామల వాళ్ళ అబ్బాయ్ కి ఈ సంబంధం కూడా కుదరలేదుట” సీట్లో కూర్చుంటూ చెప్పింది కస్తూరి. శ్యామల, కస్తూరి నేను ఇదే ఆఫీస్ లో పదియేళ్ళుగా కలిసి పని చేస్తున్నాము. కోలీగ్స్ కన్నా మంచి స్నేహితుల్లా కలిసి ఉంటాము.
‘శ్యామల పిచ్చిగానీ ఈ రోజుల్లో అబ్బాయ్ నచ్చడమే పెద్ద విషయం అనుకొంటుంటే, రాబోయే అమ్మాయి ఆడపడుచుతో కూడా సఖ్యంగా ఉంటేనే సంబంధం కుదుర్చుకుంటాం అని శ్యామల అనడం నాకే విడ్డురంగా అనిపిస్తోంది “అని మేనేజర్ ని కలవాలని వెళ్ళింది కస్తూరి. .
నిజమే కస్తూరి అన్నది సబబే. ఈ కాలం ఆడపిల్లలకి చదువు వల్ల వచ్చిన ఆర్ధిక స్వతంత్రం వలన తమ అభిప్రాయాలని నిక్కచ్చిగా చెప్పగలుగుతున్నారు, తమ భవిష్యత్తు పట్ల ఖచ్చితమైన అవగహన కలిగి వుంటున్నారు.
పెళ్లి అవుతూనే కొడుకు ని కోడలిని వేరుగా కాపురం పెట్టించిన కస్తూరి కి ఆలా అనిపించడం లో తప్పులేదుకని, అనుబంధాలకు, ఆప్యాయతలకు ప్రాధాన్యం ఇచ్చే శ్యామల ఇలాంటి షరతు విధించటం తప్పుకాదేమో… ఆలోచనలో ఉండగానే” నన్ను మేనేజర్ పిలవలేదు కదా ” అని అంటూ ఆయాసపడుతూ వచ్చింది శ్యామల సీట్ దగ్గరికి.
“కంగారుపడకు పిలిచింది కస్తూరిని, నిన్ను కాదులే ” అని ఏమైంది సుధీర్ పెళ్లిచూపులు విషయం ఏమి తెలియనట్టు అడిగా”, ఏముంది షరా మాములే, ఈ సంబంధం కూడా కుదరలేదు, ” నిరాశగా బదులిచ్చింది.
ఇంకా వివరంగా అడుగుదామని అనుకునే లోపల మిగతా ఆఫీస్ వాళ్ళుఅంతా రావటంతో పనిలో నిమగ్నమయ్యాము.
అందరు పనిలో పడ్డారుగాని నాకెందుకో పని మీద మనసు లగ్నం కావటం లేదు….. శ్యామల తన కొడుకు పెళ్ళివిషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి పరోక్షంగా నేనే కారణమేమో అన్న భావం నన్ను పదేపదే కలవరపెడుతోంది
శ్యామలకి సుధీర్ సుశాంతి కవలపిల్లలు మాకులాగే. నేను అన్నయ్య కూడా కవల పిల్లలం. మాది కొంచెం బాగా వున్న కుటుంబమే, అమ్మానాన్న అన్నింటా నన్ను అన్నయ్యని సమానంగా పెంచారు, పెద్దగా కలతలు లేని అన్యోన్య కుటుంబం అనే చెప్పాలి, నా పెళ్లి అయ్యాక అన్నయ్య తన ఆఫిస్ లో పని చేస్తున్న మానస తనని ఇష్ట పడుతోందని అమ్మ నాన్నకి ఇష్టం ఐతె తన అంగీకారం తెలుపుతానని అన్నాడు, అన్నయ్యని ఇష్టపడి చేసుకొంటున్న అమ్మాయి కదా పెళ్లి అయ్యాక తమతో కలిసి మెలిసి పోతుంది కదా అని అమ్మానాన్నగారు వేరే విషయాలకి ప్రాముఖ్యత ని ఇవ్వకుండా మానస తో అన్నయ్య పెళ్ళిజరిపించారు.
పెళ్లి తర్వాత ఏఏ విషయంలో అన్నయ్యని చూసి ఇష్ట పడిందో, అలంటిగుణాలు వున్నా నన్ను చూసి ఈర్ష్య పడేది, తనకన్నా నేను కొంచెం రంగు, పొడుగు, మంచి తలకట్టు నాది, ఇలా ప్రతి దానిలో నాతో పోల్చి చూసుకొని, మెల్ల మెల్లగా ఆ భావం ముదిరి తన ఆధిక్యత చూపిస్తూ నన్ను దూరంగా ఉంచడం మొదలు పెట్టింది.
అన్నయ్య మంచితనాన్ని ఆసరాగా చేసుకొని అమ్మానాన్నలని లెక్క చేసేది కాదు, అన్నయ్యని చూసి అమ్మానాన్నలు అన్ని సందర్భాలలోనూ సర్దుకొనేవారు….. కానీ ఒక్క అన్నయ్య ని తప్ప తను ఎవ్వరిని సొంతం చేసుకోలేక పోయింది. ఫలితం అమ్మానాన్న తమబ్రతుకు తాము బతుకుతున్నారు. పెళ్ళికి ముందు నేను అన్నయ్య ప్రాణంగా వుండే వాళ్ళం. ఇప్పుడు పరాయి వాళ్ళల్లా ముక్తసరిగా పలకరించుకొంటున్నాము. పది ఏళ్లుగా నేను పడుతున్న మానసిక క్షోభ అంతా శ్యామలకి తెలుసు. తన కూతురు కూడా అన్న పెళ్లిఅయ్యాక పుట్టింటికి దూరం అయిపోతుందన్న భావం శ్యామలని అటువంటి నిర్ణయం తీసుకొనేలా చేసిందా,,,
” లంచ్ టైం అయ్యింది… లే లే కాంటీన్ కి వెల్దాము అన్న శ్యామల మాటలు నా ఆలోచన స్రవంతికి కళ్లెం వేసాయి. ముగ్గురం కాంటీన్ చేరాక “పెళ్ళిచూపుల్లో ఏమైంది ? సుధీర్ ఏమన్నాడు?అమ్మాయి ఏమి అడిగింది?సస్పెన్సు లో ఉంచక చెప్పు “తొందర పెట్టింది కస్తూరి.
“సుదీర్ తన మాటలు మొదలు పెట్టక ముందే మీ ఇంట్లో ఎన్ని (BAGGAGES)బగ్గాజ్ వున్నాయి. ఎన్ని (DUSTBINS)డస్టుబిన్స్ వున్నాయి అని అడిగిందిట. సుధీర్ కి మొదట దేని గురించి అడుగుతోందో అర్థం కాలేదు, అవి ఏంటి అని అంటే బగ్గాజ్ అంటే భాద్యతలు అని, డస్టుబిన్స్ అంటే తల్లి తండ్రి తనతో కలిసి ఉండటం అని ట. అలాంటి కమిట్మెంట్స్ ఉంటే తనకి ఈ సంబంధం మీద ఇంట్రెస్ట్ లేదు అని తెగేసి చెప్పిందిట” గుక్కతిప్పుకోకుండా చెప్పింది శ్యామల.
“ఆడపిల్లలు చక్కగా చదువుకొంటున్నారు, అన్ని రంగాలలోను తమ ఉనికిని చాటుకొంటున్నారు, ఆర్థికంగా తమ కాళ్ళమీద నిలబడుతున్నారు, అని సంతోషిస్తున్న సమయం లో దీని ప్రభావం వివాహసంబంధాలలోను, కుటుంబ సంబంధ భాంధావ్యాలలో ను మరో విధంగా పరిగణిస్తున్నాయి, ” కొంచెం వాతావరణం తేలిక పరచటానికి మాట కలిపాను నేను.
ఒక విధంగా చుస్తే ఇలాంటి భావాలూ మనతరం లో కూడా ఉన్నాయేమో కదా “నా వైపు ఓరగా చూస్తూ అంది కస్తూరి.. ” అది నిజం కాదని అనలేముకాని దాని శాతం చాల తక్కువ”. సర్దిచెప్పపోయింది శ్యామల.
” మా వొదిన లాంటి వాళ్ళు మన ముందు తరంలోను వున్నారు కస్తూరి.. కానీ కొంత తమ స్వార్థం చూసుకొన్న… కుటుంబవిలువలకి ప్రాధాన్యత ఇచ్చేవారు. అందువల్ల మానవీయసంబంధాలు చాలావరకు నిలబడ్డాయి. మన తరం వచ్చేసమయానికి స్త్రీలకి కొంత ఆర్థిక స్వేచ వచ్చింది, దాని వలన కొంతమంది కేవలం తమ స్వార్ధమే చూసుకొన్నారు. నేటి తరం ఆడ పిల్లలికి వున్నఆధునిక భావాలు మనకి కూడా వున్నా , పెళ్ళికి ముందే చెప్పేటంత ధైర్యం లేదు,. అందువల్ల చాలావరకు సర్దుకొని హాయిగా కాపురం చేసిన వాళ్ళు లేకపోలేదు కానీ ఇప్పుడు తరం మారింది. ప్రతి వస్తవు కొనే ముందు వారంటీ, సర్వీసింగ్ ఎలా చూసుకొంటామో, పెళ్ళికి ముందే తర్వాత వచ్చే ఇబ్బందుల గురించి ముందే అరా తీస్తున్నారు. కొత్తగా వింటున్నాము కాబట్టి వింతగా అనిపిస్తుంది, కొన్నీ రోజుల తర్వాత ఇదే మాములు విషయంగా ఐపోతుంది. ” చాలాసేపటి నుంచి ఆలోచిస్తున్నానో ఏమో వాక్ప్రవాహం ల నా మనసులోని భావాలూ బయటికి వచ్చేసాయి.
“నువ్వు చెప్పింది కూడా నిజమే…. మారిన జీవనవిధానాలవల్ల నేటి యువత ఆలోచన ధోరణి కూడా మారింది, పెళ్లి అయ్యాక తనకి నచ్చని దానితో సర్దుకుంటూ రాజి పడటం కన్నా. పెళ్ళికి ముందే తనకి నచ్చిన జీవినావిధానం కోరుకోవటం లో తప్పు లేదేమో అనిపిస్తోంది…. అడిగిన విధానం బాగాలేదు కానీ, అడిగిన దాని వెనుక భావం బాగుంది…. నేను కూడా కొంత నా ఆలోచనని మార్చుకోవాలేమో… అప్పుడే అమ్మాయిలో మంచి వ్యక్తిత్వం కనిపిస్తుందేమో…. ఇంటికి వెళ్ళాక మా అబ్బాయ్ తో మళ్ళీ మాట్లాడతాను…. ఈ సారి కొత్తకోణం లో చూస్తే ఆ అమ్మాయే మా వాడికి తగిన అమ్మాయి అనిపిస్తుందేమో” అంది శ్యామల తేలిక పడిన మనసుతో.
” ఆ అమ్మాయి ఆలా మాట్లాడటానికి ఇల్లాంటి ఎన్ని అనుభవాల గురించి విన్నదో. లేత మనసులో పడిన ముద్రలు ఇలా మాట్లాడేలా చేసేయేమో. అందరు ఒకేలా వుండరు కదా.. కనీసం. మనలాంటి చదువుకొన్నవాళ్ళు ఈ తరం యువతకి కొంత చేయూత నిస్తే వాళ్ళ ఆలోచనాధోరణి లో మార్పు వస్తుందేమో”.. ఆశాభావంగా అన్నాను నేను.
ఐతే ఇంకా ఆలస్యం ఎందుకు, సుధీర్ ని ఆ అమ్మాయితో మళ్ళీ మాట్లాడమను, నువ్వు మీ అయన డస్టుబిన్స్ కాదు దోస్తులమని, తోబుట్టువులు (BAGGAGE)బాగాజీ కాదు తీయని బంధనాలని చెప్పమను, ఆ అమ్మాయి మనసులోని మబ్బుతెరలు విడిపోయి పెళ్ళికి ఎస్ చెప్పేస్తుంది. రెట్టింపు ఉత్సాహం తో అంది కస్తూరి.
మాటల్లో పడి లంచ్ బ్రేక్ అయిపోయిందన్న సంగతే మర్చిపోయాము… సీట్లోకి రాగానే కొడుక్కి ఫోన్ చేసి రేపు ఆ అమ్మాయిని కలవడానికి వస్తున్నట్టు చెప్పమని చెప్పి పనిలో పడింది శ్యామల.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *