March 29, 2024

మీలాంటివాడే చెపితే వినడు, కొడితే ఏడుస్తాడట

రచన: గిరిజరాణి కలవల

“మండోదరరావు మూర్ఖత్వం “

“మీలాంటివాడే చెపితే వినడు, కొడితే ఏడుస్తాడట.. చస్తున్నా మీతో.. “ పెనం మీద అట్టు తిరగేస్తూ అంది రావణి.
“ఏంటోయ్! ఇప్పుడు నేనేం చేసానూ? నామీద ఎగురుతున్నావు”అన్నాడు మండోదరరావు.
“ఏం చేయలేదు అని అనండి… ఏం చేసినా, ఏం చెప్పినా రెట్టమతమే మీరు. ఫలానాది తీసుకురండి అని ప్రత్యేకంగా చెపితే, అది తప్ప మిగతావన్నీ తెస్తారు. తేవద్దు అని ఏదైనా చెపితే అదే విపరీతంగా తెచ్చి పడేస్తారు. అయోమయం అనుకోవాలా? అధ్వాన్నం అనుకోవాలో, మూర్ఖత్వం అనుకోవాలో అర్థం కావడం లేదు మీరు. “
“ఇదిగో, ఈ డొంకతిరుగుడు కాదు కానీ, అసలేంటో చెప్పి చావు. “అన్నాడు.
“ఏంటి చెప్పేదీ? అసలు మన పేర్లు మార్చుకోవాలి ముందు. మన పెద్దవాళ్లకి బుద్ధి లేదు. మీకు పెట్టాల్సిన పేరు నాకు, నాకు పెట్టాల్సిన పేరు మీకు పెట్టారు. చెప్పినమాట వినని మూర్ఖశిఖామణి ఆ రావణాసురిడి పేరు మీకు తగిలించాల్సింది. సరిగ్గా సరిపోయేది “అంది.
“ఇప్పుడు నేను ఏ పరాయి ఆడదాన్నైనా ఎత్తుకొచ్చి పెట్టానంటావా? నీ అనుమానం అదేనా? నేను అలాంటి వాడిని కాదనీ, అటువంటి పోకడలే నాకు లేవనీ నీకు తెలీనది కాదు కదే రావణీ! ఇప్పుడు నీకెందుకు వచ్చిందే అంతటి అనుమానం? “అన్నాడు మండోదరరావు.
“ఇప్పుడు అదొక్కటే తక్కువయింది.. అందరిలోనూ మీ మూర్ఖత్వపు పనులతో నాకు తల కొట్టేసినట్టుంది. మీకు తోచిందే చేస్తారు. కానీ అయ్యో ఎదుటివారు చెప్పారే.. ఓసారి వింటే ఏంటీ అని అనుకోరుకదా! చిన్న చిన్న విషయాలలో కూడా, మీరు పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అని వాదిస్తారు. బజారులో పరువు పోతోంది. కారు కొని పదేళ్ళయింది. డ్రెవింగా సరిగ్గా వచ్చేడవదు. డ్రైవరినా పెట్టుకోరు. ఖాళీగా ఉన్నప్పుడు వాడు కారులో ఏసీ వేసుకుని పడుకుంటాడని అడ్డంగా వాదిస్తారు. మీకేమో రివర్స్ చేస్తే ముందుకి రాదు. ముందుకొస్తే టర్నింగ్ తిప్పలేరు. గేరేజిలోనుంచి తీసేటపుడు, లోపలకి పెట్టేటప్పుడు విజిల్ ఊదుతూ లెఫ్ట్, రైట్ , ముందుకి, వెనక్కి, పక్క కి చెప్పడమే సరిపోతోంది నాకు. వీధిలో అందరూ నాకు ట్రాఫిక్ కానిస్టేబుల్ అని పేరు పెట్టారు. మొన్నటికి మొన్న.. మీరు మెయిన్ రోడ్డు మీదకి వెళ్ళడానికి రైట్ టర్న్ తిప్పితే పాపం ఎదురింటాయన వచ్చి, అటువేపు రోడ్డు రిపేర్ లో ఉందని చెపితే… ‘ రాత్రేగా నేను వచ్చిందీ, బానే ఉందని’ మీ మూర్ఖత్వం తో అడ్డంగా వాదించి, ‘ సీతయ్య.. వీడు ఎవడి మాటా వినడు’ లాగా, ఆయన చెప్పింది వినకుండా వెళ్ళారు.. అక్కడ రోడ్డు రిపేరులో ఉండేసరికి కారుని రివర్స్ చేసుకోవడం చేతకాక, అక్కడే వదిలేసి, వెర్రిమొహం వేసుకుని, నడుచుకుంటూ వెనక్కి వచ్చారు. వీధిలో అందరూ నవ్వడమే. “
“ఎవరేమనుకున్నా డోంట్ కేర్.. నా ధోరణి నాదేనోయ్.. నేనింతే.. నన్ను ఎవరూ మార్చలేరు. నాకెలా తోస్తే, నాకెలా అనిపిస్తే అలాగే చేస్తాను. “
“ఔను, పూర్తిగా తెలిసున్నవాడికైనా చెప్పగలం, పూర్తిగా తెలీనివాడికైనా చెప్పగలం… మీవంటి మూర్ఖశిఖామణుల కి చెప్పడం ఆ బ్రహ్మ తరం కూడా కాదు. నా ఖర్మ ఇంతే.. “

*. *. *

“అన్నయ్యా! హలో, అన్నయ్యా! “
“హలో, ఏమ్మా ! రావణీ ! ఎలా ఉన్నారమ్మా నువ్వూ, బావ మండోదరరావూ, కులాసాయేనా? “అన్నాడు శూర్పణేకశ్వరరావు.
“బాగానే ఉన్నాం అన్నయ్యా ! ఈయనని గవర్నమెంట్ క్వారైంటైన్ లో పెట్టారు అన్నయ్యా! “
“అరే, ఏమైందమ్మా? కొంపతీసి బావగారికి పాజిటివ్ వచ్చిందా? అక్కడ నా పలుకుబడి తో వాళ్ళ ముక్కూచెవులు పట్టుకుని ఆడించి, బావగారిని ఇంటికి తీసుకురమ్మంటావా?”అన్నాడు.
“వద్దన్నయ్యోయ్! ఆ పని మాత్రం చెయ్యకు.. అయినా మీ బావ ఎప్పుడూ నెగటివే కదన్నయ్యా! ఆయనకి పాజిటివ్ మాటలే రావు… ఇక కరోనా పాజిటివ్ ఆయన గుమ్మం కూడా ఎక్కదు. మొన్న ముంబయి వెళ్లి వచ్చారు కదా! ఎయిర్ పోర్ట్ లో హోమ్ క్వారైంటైన్ అని చేతి మీద ముద్ర వేశారు. అది పాటించకుండా బజారులో తిరుగుతూండేసరికి ఎవరో కంప్లయింట్ ఇచ్చారు.. వచ్చి లాక్కెళ్ళారు. అప్పటికీ చెపుతూనే ఉన్నాను.. మాస్క్ పెట్టుకోండీ, పద్నాలుగు రోజులు ఇంటి పట్టునే ఉండండీ అని… మనదంతా ఎడ్డెమంటే తెడ్డెం కదా! వినిపించుకోకుండా నాతో ‘ఏం కాదులే’ అంటూ అడ్డంగా వాదించారు. దెబ్బకి వెళ్లి అక్కడ కూర్చున్నారు. ఏం ఫర్వాలేదు లే… పద్నాలుగేళ్ళ నుండీ ఈ మూర్ఖపు మొగుడితో సతమతమవుతున్నాను. ఒక్క పద్నాలుగు రోజులైనా ప్రశాంతంగా ఉంటాను. ఆ తర్వాత మళ్లీ ఎలాగూ తప్పదు నాకు. “.
“అయ్యో, ఔనా! ఈ కరోనా, ఈ క్వారెంటైన్ బావలో మార్పు తెస్తుందేమో చూద్దామమ్మా! కాస్త మాట విని మనుషుల్లో పడతాడేమో.. మొండితనం తగ్గుతుంది. ఇదీ ఒకందుకు మంచిదేమో. సరే మరి ఉంటాను. జాగ్రత్తగా ఉండమ్మా! “

సమాప్తం.

3 thoughts on “మీలాంటివాడే చెపితే వినడు, కొడితే ఏడుస్తాడట

  1. బాగుంది. కానీ చివర్లో తేలిపోయింది. ఆలా అని ఎండింగ్ బాలేదు అని కాదు. స్టార్టింగ్ ఉన్న టెంపో మధ్యలో పోయింది. ఇంకా ఏదో ఉంటే బాగుండు అనిపించింది.

Leave a Reply to Gauthami Cancel reply

Your email address will not be published. Required fields are marked *