April 24, 2024

రాజకీయ చదరంగం

రచన: గరిమెళ్ళ వెంకట లక్ష్మీ నరసింహం

బ్రజరాజపురం ఒక మున్సిపాలిటీ. ఆ ఊళ్ళో ఒక జూనియర్ కాలేజీ, రెండు సెకండరీ స్కూళ్ళు, ఒకటి ప్రభుత్వంది, మరొకటి ప్రైవేటుది ఉన్నాయి. ప్రభుత్వంది ఒక ఆసుపత్రి ఉంది. అందులో డాక్టరు ఉంటే మందులుండవు, మందులుంటే డాక్టరుండడు. ఊరు శివార్లలో ఒకే ప్రాంగణంలో శివాలయం, ఆంజనేయ ఆలయం ఉన్నాయి. రెండింటికి పూజారి ఒక్కడే. శేషాచారి.
బ్రజరాజపురంలో అందరికి తెలిసిన వ్యక్తి సత్యానందం. ఊరంతా అతనిని సత్తిబాబు గారు అంటారు. సత్తిబాబు మునిసిపాలిటీ చెయిర్మన్. పెద్ద భూకామందు. నూట ఇరవయి ఎకరాల సాగు భూమి, రెండు పిండి మిల్లులకు యజమాని. అతని నివాసం పదహారు పడక గదులున్న ఓ చిన్న సైజు కోట. తమ్ముడుజగదీష్, కుటుంబంతో సహా అందులోనే ఉంటాడు. చెప్పుకోడానికి అయిదవ వార్డులో ఒక ఇల్లు అద్దెకు తీసుకొన్నాడు. ఊరుకి వచ్చిన ప్రతి రాజకీయ నాయకుడికి సత్తిబాబు కోటే విడిది.
బ్రజరాజపురం మునిసిపాలిటీ సత్తిబాబు గారి సొంత కంపెనీ. తాను చైర్మన్, తమ్ముడు జగదీష్, చెల్లెలు విశాలాక్షి కౌన్సిలర్లు . పెద్ద బావమరిది సుధాకర్ మునిసిపల్ కాంట్రాక్టరు.
చైర్మన్ గారి ధర్మమా అని బ్రజరాజపురం మునిసిపల్ ఆఫీసు అవినీతికి అక్రమాలకి మొదటి చిరునామాగా పేరు పొందింది. వీధి దీపాల ట్యూబు లైట్లు మాడిపోయి మార్చమని ఏడాది నుండి ఏడుస్తున్నాయి. మునిసిపల్ కుళాయిలో నీళ్లు ఎప్పుడు వస్తాయో ఎంతసేపు వస్తాయో ఆ పరమాత్ముడికే ఎరిక. ఇహ రోడ్లంటరా, ఆరు నెలల క్రిందట వేసిన కొత్త రోడ్లు ఒక్క వానతో పత్తా లేకుండా పోయేయి. రెండు నెలల క్రితం నలభయి ఏళ్ల కాలేజీ లెక్చరరు స్కూటరు మీద వెళుతూ గతుకులో పడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. స్టూడెంట్స్ రోడ్లు ఎక్కేరు. పోస్టుమార్టం జరిగింది. హఠాత్తుగా గుండె పోటు రావడం మూలాన్న చనిపోయేడని డాక్టరు గారు రిపోర్ట్ ఇచ్చేరు. మూడు నెలల తరువాత డాక్టరుగారు కోరుకొన్నఊరికి బదిలీ అయి వెళిపోయేరు.
బ్రజరాజపురంలో నీతికి నియమానికి , మాటకి మర్యాదకి, పేరున్న మనిషి సీతారామ చౌదరి. రిటైర్డు ఎక్జిక్యూటివ్ ఇంజినీరు. నిజాయితీ గల ఆఫీసరు అని మంచి పేరు తెచ్చుకొన్నాడు. తింటూ తినిపించే తోటి ఆఫీసర్ల మధ్య, మినిస్టర్లు వరకు వాటాలుండే డిపార్టుమెంటులో ఇమడలేక, ఇక్కట్లలో పడ్డ చేదు అనుభవాలు చాలా చవి చూసేడు. అక్రమ ఆర్జనలకు అంతు లేని అవకాశాలున్నా జీతం రాళ్లతోనే సంతృప్తి చెందేడు. ఊళ్ళో తన పూర్వీకుల ఇల్లు, మరమ్మత్తులు, మార్పులు చేసుకొని అందులో భార్య హేమలతతో బాటు స్థిరపడ్డాడు.
మునిసిపల్ ఆఫీసులో రోజు రోజుకు పెరిగి పోతున్న అవినీతి, అక్రమాలు, రోడ్లు, వీధి దీపాల దుస్థితి ప్రజల్లో
తీవ్రమైన చర్చనీయాంశం అయ్యేయి. గత రెండు వారాల్లో రోడ్ల మీద జరిగిన ఏక్సిడెంట్సులో ఒకరికి కాలు,
మరొకరికి చెయ్యి విరగడంతో ప్రజల్లో సహనం పోయింది. దాని ప్రభావం ఒక రోజు కౌన్సిల్ మీటింగులో వెల్లడయింది. అపోజిషను మెంబర్లు చైర్మన్ గారిని నిలదీసేరు. మసి బూసి మారేడుకాయ చేస్తున్న రోడ్ల రిపేర్లు తక్షణం ఆపి పూర్తిగా కొత్త రోడ్లు వేయించాలని, కాంట్రాక్టర్ని మార్చాలని పట్టు బట్టేరు. స్వయానా చైర్మన్ గారి తమ్ముడు జగదీష్, వాళ్లందరితో స్వరం కల్పడమే గాక జరిగిన అవకతవకలు, వివరంగా ఫోటోలతో సహా ప్రచురించిన పత్రికలను పోడియం మీదకు విసిరేడు. అన్నదమ్ముల మధ్య వేడి వేడిగా చర్చలు జరిగేయి.
అపోజిషను మెంబర్లు జగదీష్ దగ్గరగా పోయి శభాష్ అన్నారు. లంకలో విభీషణుడవని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేసారు. అపోజిషను మెంబెర్స్ తో బాటు తన అనుచరులు ముగ్గురితో జగదీష్ వాకౌట్ చేసేడు. చైర్మన్ సత్తిబాబు దిక్కు తోచక బిక్కచచ్చి పోయేడు.
ఆ రోజు సాయంత్రం దేవాలయ ప్రాంగణంలో జగదీష్ తన అనుచరులతో సమావేశమయ్యేడు. ఆహ్వానం అందుకొని కొందరు కాలేజీ విద్యార్థులు కూడా హాజరయ్యేరు. చర్చలో, పెరిగిపోతున్న అవినీతికి, అక్రమాలకు అడ్డుకట్ట వెయ్యాలని నిశ్చయానికి వచ్చేరు. త్వరలో రాబోయే మునిసిపలు ఎన్నికలలో నీతి నిజాయతి ఉన్నవాళ్లనే కౌన్సిలర్లుగా నిలబెట్టాలని నిర్ణయించేరు. సంగ్రామానికి సారధిగా సీతారామ చౌదరి గారిని బరిలోకి దింపాలని అందరు ఏకగ్రీవంగా తీర్మానించేరు. సభాస్థలం నుండి అందరు నేరుగా చౌదిరి గారింటికి వెళ్లి తమందరి కోరికను తెలియజేసారు. అయన ముందుగా అంగీకరించ లేదు. సభ్యులందరు, పుట్టి పెరిగిన ఊరుని బాగు చెయ్యడం అతని కర్తవ్యమని, త్వమేవ శరణం అని నచ్చచెప్పేరు. బ్రతిమలాడి ఒప్పించేరు.
ఆ మరునాడు జగదీష్ అయిదవ వార్డులో తనకున్న అద్దె ఇంట్లోకి భార్య బిడ్డలతో మారిపోయేడు. తరచూ కాలేజీ స్టూడెంట్స్ తో సమావేశమవుతూ రాబోయే ఎన్నికలకు వ్యూహరచన మొదలుపెట్టేడు. బరిలోకి దింపవలసిన అభ్యర్థుల పేర్లు ఖరారయ్యేయి. ఎన్నికల తేదీ ప్రకటితమయింది. ప్రచారం జోరందుకొంది.
నామినేషన్లు పడ్డాయి. ఎనిమిదవ వార్డు నుండి చౌదరి గారికి ఎదురుగా ఎవ్వరు నిలబడ లేదు. అయిదవ వార్డు నుండి జగదీష్ పోటీ చేస్తున్నాడు. సత్తిబాబుకి ఆటకట్టని తెలిసిందేమో పోటీలో లేడు. పౌరులందరికీ చౌదరి గారి మీదే ఆశ. అయన చైర్మన్ అయితే ఊరికి మంచి రోజులొస్తాయని అందరి నమ్మకం.
ఎన్నికలు ముగిసేయి. ఫలితాలు ప్రకటితమయ్యేయి. చౌదిరి గారి టీములో ఒక్కరు తప్ప అందరు ఎన్నికయ్యేరు.
చౌదరి గారు చైర్మన్ పదవిని అలంకరించడం కోసం అంతా ఎదురు చూస్తున్నారు. ముందుగానే అభినందనల వర్షం ప్రారంభమయింది. నగర భవిష్యత్తుకయి అన్నతో తెగతెంపులు చేసుకున్నాడని జగదీష్ అందరి ప్రశంసలు అందుకొన్నాడు.
తుది ఘట్టానికి తెర లేచింది. చైర్మన్ ఎన్నిక. సమావేశం ప్రారంభమయింది. చైర్మన్ పదవికి చౌదరి గారి పేరు
ప్రొపోజ్ అయింది. ఇంతలో ఒక సభ్యుడు లేచి మన ఊరి అభివృద్ధికి రాష్ట్ర ప్రభత్వ సహకారం, ఆర్థికసహాయం ఎంతయినా అవసరం. అది దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర రాజధానిలో రాజకీయ నాయకులతో సత్సంబంధాలున్న వ్యక్తిని చైర్మన్ గా ఎన్నుకోవడం సబబేమో అని తన అభిప్రాయం వ్యక్త పరచేడు. జగదీష్, చౌదరి గారి అభిప్రాయమేమిటని అడగగా అలోచించి ఆ అభిప్రాయంతోఆయన ఏకీభవించేరు. అందరిలోనూ జగదీష్ కే రాష్ట్ర రాజధానిలోని రాజకీయ నాయకులతో సత్సంబంధాలున్నాయని నిర్ణయానికొచ్చి సభ్యులందరు అతనిని చైర్మన్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నిక చేసేరు. చౌదరి గారితో సహా అందరూ జగదీష్ ని అభినందించేరు.
సభ ముగిసింది. హాలు బయట ప్రెస్ రిపోర్టర్లు , స్టూడెంట్స్ తో సహా జనం చౌదరి గారిని అభినందించ డానికి పూల మాలలతో ఎదురు చూస్తున్నారు. తలుపులు తెరవ బడ్డాయి. సభ్యులు బయటికి వచ్చేరు. చివరగా చౌదరి గారు, మెడలో పెద్ద పూల దండలతో జగదీష్ బయటికి వచ్చేరు. మోసంఅని గొంతు చించుకొని గోల పెట్టేరు జనం. పరిస్థితి చెయ్యి దాటిపోకుండా చౌదరిగారు వినయంగా అందరికి నమస్కరిస్తూ ఊరి శ్రేయస్సు కోరి నిర్ణయం తీసుకొన్న వివరాలు విన్నవించేరు. నిరాశ, నిస్పృహలతో జనం ఇళ్ల దారి బట్టేరు.
ఆ రోజు సాయంత్రం సతీసమేతంగా చౌదరి గారు ఆంజనేయాలయానికి వెళ్ళేరు. అక్కడ ఓ పదిమంది స్టూడెంట్స్ కూర్చొని ఎన్నికల విషయాలు చర్విత చర్వణం చేసు కొంటున్నారు. చౌదిరి గారి రాక గమనించి అందరు నిలబడి మర్యాద పూర్వకంగా నమస్కరించి సార్, మీరు తప్పక చైర్మన్ అవుతారని, ఊరికి మంచి రోజులు వస్తాయని ఊరందరు గంపెడాశలు పెట్టుకొన్నారు. నిరాశ మిగిలింది. అని ఇంకా ఎదో చెప్పబోతుండగా ఆ సంభాషణ విన్న శేషాచారి గారు గర్భగుడిలోనుండి బయటకు వచ్చి అయ్యా, ఈ ఎన్నికలు ఒక నాటకం. సత్తిబాబుకి, అతని తమ్ముడు జగదీష్ కి మధ్య ఎటువంటి అభిప్రాయ బేధాలు, తగాదాలు లేవు. ఎన్నికలలో తప్పక ఓడిపోతారన్న భయంతో నాటకమాడేరు. ప్రజల్ని నమ్మించి, ఓట్లు సంపాదించడానికి తమరిని వాడుకొన్నారు. గెలిచిన వారంతా ఆ ముఠాలోని వాళ్లే. అమాయకపు స్టూడెంట్స్ ఆ వలలో పడ్డారు. ఈ విషయమంతా గంట క్రితం సత్తిబాబు డ్రైవరు ఎవరితోనో చెప్తుండగా గర్భగుడి లో నుండి విన్నాను.
నిజం తెలియగానే అక్కడున్న స్టూడెంట్స్ ఒక్క మారు ఖస్సుమంటూ సారుని, మమ్మల్ని మోసం చేస్తారా. చూపిస్తాం మా తడాఖా అంటూ ఎదో ఇంకా అనబోతూ ఉంటే చౌదరి గారు జరిగిందేదో జరిగిపోయింది, మరచిపోండి బాబూ అని వాళ్ళని శాంతపరచడానికి ప్రయత్నించేరు. ప్రక్కనే ఉన్న అయన సతీమణి వాళ్లతో తగవు పెట్టుకోకండి. దేనికయినా తెగిస్తారు వాళ్ళు అని హితబోధ చెయ్య ప్రయత్నించేరు.
చర్చ అక్కడితో ఆగింది. అందరు ఇళ్ల దారి బట్టేరు.
మరునాడు తెల్లవారింది. ఊరిలో ప్రతి ఇంటి గోడ పైన సత్తిబాబు, జగదీష్ లను నిందిస్తూ హెచ్చరికలతో పోస్టర్లు వెలిసేయి. నినాదాలతో స్టూడెంట్స్ రోడ్లెక్కేరు. ఒకటి రెండు రోజుల తరువాత అదే అణిగిబోతుందని అన్నదమ్ములు నిబ్బరంగా ఉన్నారు. కాని అది పెను తుఫానుగా మారే సూచనలు కనిపించేయి.
విద్యాలయాలు, దుకాణాలు మూతబడ్డాయి. సత్తిబాబు కోటని జనం చుట్టుముట్టేరు. పోలీసు రంగంలోకి దిగింది. స్టూడెంట్ లీడర్సుని అదుపులోకి తీసుకొన్నారు. పరిణామం. చుట్టుప్రక్కల ఊళ్లలో విద్యాలయాలు మూతబడ్డాయి. దావానలం వలె ఉద్యమం జిల్లా అంతా వ్యాపించింది. రాజధానిలో నాయకులు కళ్ళు తెరిచేరు. ఇంటలిజెన్స్ రిపోర్టులు చేరేయి. సత్వరం తగు చర్యలు చేబట్టక పొతే లంకా దహనాన్ని ఆపడం కష్టమని తేల్చి చెప్పేయి. పార్టీ నాయకులు ముఖ్య మంత్రితో చర్చించేరు. ఇప్పటికే లంచాలికి పుట్టినిల్లుగా అపఖ్యాతి గడించిన తమ పార్టీ ఇంకా పతనం గాకుండా కాపాడుకోవాలంటే తక్షణం ఆ కౌన్సిలర్లందరిచేత రాజీనామా చేయించి మళ్ళీ ఎన్నికలు జరిపించాలని నిశ్చయించేరు. బ్రజరాజపురం కోటకి సందేశం చేరింది.
తమంత తాము రాజీనామా చేస్తున్నామని కౌన్సిలర్లందరూ లిఖితపూర్వంగా అధికారులకు తెలియజేసేరు. ఎన్నికల భాగవతానికి తెర లేచింది. ప్రజల చేత ఎంపికయిన వాళ్లే రంగం లోకి దిగేరు. అన్నదమ్ముల ముఠాలో నుండి కూడా ఆరేడుగురు నామినేషన్లు వేసేరు. ప్రచారం శాంతియుతంగా ముగిసింది. ఓట్లు పడ్డాయి. లెక్కలు తేలేయి. చౌదరిగారి టీమంతా దిగ్విజయంగా గెలిచేరు. కోట ముఠా డిపాజిట్లు పోగొట్టుకున్నారు.
చైర్మన్ ఎన్నిక జరిగింది. చౌదరిగారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేరు. సాయంకాలం సన్మాన సభలో చైర్మన్ చౌదరిగారు పూలమాలలలో మునిగి పోయేరు. బ్రజరాజపురం రోజులు మారేయి.

————————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *