June 25, 2024

అంతా మన మంచికే – ప్రమదాక్షరి గొలుసు నవల వీడియో సమీక్ష

సమీక్ష- శ్రీసత్య గౌతమి

ముప్ఫైనాలుగు మంది రచయిత్రులు కలిసి వ్రాసిన పెద్ద గొలుసు నవల “అంతా మన మంచికే”. ఈ నవల నేటి సామాజిక పోకడలకు అద్ధం పడుతోంది.ఈ కథ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది భౌతికంగానో లేదా మానసికంగానో అమెరికా గాన్ కన్ ఫ్యూజుడు దేశీ (ఎజిసిడి) ల (America Gone Confused Desi, AGCD) గోల. చిన్న చిన్న ఆర్ధిక సమస్యలతో పాటూ, ఇటు పూర్తిగా భారత వివాహపద్ధతులకూ తలవంచకా, అటూ పూర్తిగా అమెరికా వివాహపద్ధతులకు సరిపడకా త్రిశంకు భావాలతో నిత్యం సంఘర్షణలకు గురయ్యే యువప్రేమికుల కథలు ఈ నవలలోవున్నాయి. ఈ వర్గంలోని కొన్ని కుటుంబాలలో జరుగుతున్న పరిణామాలను రికార్డు చేసిన నవలగా నాకు కనబడింది. నిజజీవితాల్లోని సంఘటనలవ్వడం వల్ల నవలా నేపథ్యం మొత్తం ఒకే స్థాయిలో నాకు కనబడలేదు. ఒకే స్థాయిలో లేదూ అంటే స్థాయి తక్కువ అని కాదు సుమీ, తప్పుగా అనుకొనేరు. కనీసం ప్రతి 7 నుండి 10 ఎపిసోడ్లకు ఒక క్రొత్త విషయం పాఠకుల ముందుకొస్తుంది. ఇలాక్కూడావుంటున్నారా? ఇదంతా ఎజిసిడి మహాత్యంవల్ల కాబోలు, ఒక క్రొత్త సృష్టి జరుగుతోంది అని అనిపించింది నాకు. అలా అనిపించింది తడవా, అందులోకి నా బుర్ర మరీ దూర్చి చదవనారంభించాను.

క్లుప్తంగా కథ చెప్పుకోవాలంటే… శ్యామలగారికి వూరిలో చాలా ఆస్తిపాస్తులుంటాయి. మథర్ థెరిస్సా అనే హోంను నడుపుతూ అనాథలకు, ముసలివారికి ఆశ్రయమిస్తున్నారు. వీరి ఆర్గనైజేషన్లో ఎంతోమంది పనిచేస్తుంటారు. కానీవిషయం నవల చివర ఎపిసోడ్లలో తెలుస్తుంది. ముందరంతా తాను ఏ దర్పమూ చూపించుకోకుండా, అందరినీ ఆదరించే పాత్రగా మనకు పరిచయమవుతుంది. ఇది ఆ పాత్ర యొక్క నిరాడంబరతను చూపిస్తుంది.. శ్యామల కు ఒక కొడుకు, పేరు అరవింద్ … కూతురు సింధు. వాళ్ళిద్దరూ కూడా తల్లిలాగే నిరాడంబరులు. కూతురికి పెళ్ళయ్యి అమెరికాలోవుంటుంది, కొడుకు ఇండియాలోనే ఉద్యోగం చేస్తుంటాడు. ప్రాజెక్ట్ల పనిమీద ఇతర ప్రదేశాలకు వెళ్ళొస్తుంటాడు. తల్లి ఒక్కతే వుంటుంది. వాళ్ళబ్బాయి అరవింద్ తల్లికి ఫోన్ చేసి, తన స్నేహితురాలు శ్రావ్య కొద్ది రోజులు తమ ఇంట్లో వుంటుందనీ, ఆమెకు ఆశ్రయం ఇమ్మనీ చెబుతాడు. తన ఇద్దరి పిల్లలయొక్క ఫ్రెండ్సు అలా ఇంటికొచ్చి పోవడం తనకు అలవాటే కాబట్టి, తల్లి కొడుకు చెప్పిన వెంటనే శ్రావ్యకు ఆశ్రయమివ్వడానికి ఒప్పుకుంటుంది. శ్రావ్య అలా నెలల తరబడి ఆ ఇంట్లో ఉండిపోతుంది, చుట్టు పక్కల నలుగురూ ఆరాలు తియ్యడం మొదలెట్టారు. అయినా శ్రావ్య కదలదు, వీళ్ళకీ అడగటానికయినా, వెళ్ళిపొమ్మని చెప్పడానికయినా మొగమాటం. అలా మొదలైంది ఈ కథ. అలా ఈ నవల దగ్గిరదగ్గిర 10 ఎపిసోడ్లవరకు ఉత్కంఠంగా సాగి, ఢమాలున ఒక నిజం బయట పడుతుంది, ‘అసలు శ్రావ్య’ రంగంలోకి దిగేసరికి. ఈ మార్పిడికి కారణం తెలిసాక నాకు ఆశ్చర్యం వేసింది. శ్రావ్య అనే పేరు పెట్టుకొని ఇంట్లో చేరిన అమ్మాయి ఒక గూఢచారి, తనకు పేమెంటు కూడా వుంది. ఆవిడ్ని ఎవరు, ఎందుకు నియమించుకున్నారన్న విషయం, నవల చదవండి నాలాగే ఆశ్చర్యపొండి. డబ్బులు సంపాదించుకునే సత్తావుండాలేగానీ, ఇలాక్కూడా సంపాదించొచ్చా అనిపించింది. హ్ము…అంతా ఇంగ్లీషు సినిమాలు, టెక్నాలజీ మహాత్యం.
ఈ అసలు శ్రావ్యా, నకిలీ శ్రావ్యల మాట అటుంచితే అరవింద్ జీవితంలోకి నీలిమ వస్తుంది. పెద్దలు చూస్తున్న సంబంధం. అమెరికాలో చదువుకుని, పెళ్ళికొడుకుని వెతుక్కోవడంకోసం స్వదేశమొచ్చింది. నిజానికి పెళ్ళి తనకంత ఇంట్రస్ట్ లేదు, కాని పెద్దల ప్రోత్సాహంతో అరవింద్ ని చూడడానికి వస్తుంది. ఆమెను చూడగానే మనసు పారేసుకుంటాడు అరవింద్. ఆమె తన స్వంతం అని భావించుకొని, తనలోని భావోద్వేగాలన్నీ ఆమెతో పంచుకుంటాడు. అలా తాను ఇంతకు మునుపు ప్రేమించిన అమ్మాయి గాయత్రి గురించి కూడా చెప్తాడు, ఆమెకు పెళ్ళయిపోయి వెళ్ళిపోయిందనుకోండి. ఆ కథ అలావుంచితే, నీలిమ కూడా అమెరికాలో వున్నప్పుడు విక్రం అంటే ఇష్టపడింది కాని ప్రేమించలేదు. . ఇద్దరూ కాలేజిలో క్లాస్ మేట్సే. అమెరికా వెళ్ళాక విక్రం మారిపోయాడు. అమెరికాలో ఎన్నో మంచి విషయాలున్నా, మన దేశ కట్టుబాట్లకు సరిపడని విషయాలను ప్రాక్టీసు చెయ్యడం మొదలెట్టాడు, దానితో ఆగ్రహించి నీలిమ అతనిని వదిలేస్తుంది. ఇండియా వచ్చాక అరవింద్ సంబంధాన్ని ఒప్పుకుంటుంది. అరవింద్ ని ఎయిర్ పోర్ట్ లో కలిసి అతని ప్రేమను అంగీకరిస్తున్నానని చెప్తుంది.
వారివురి కథ సుఖాంతం అనుకొనేసరికి విక్రం మళ్ళీ నీలిమ జీవితంలోకి వస్తాడు. దీనితో పాఠకులకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ప్రేమకు ఎవరో ఒక విలన్ తగలక తప్పదు కదా..లేపోతే కిక్కేముంటుంది? ఒక యాంటీ హీరోలా ఆమె లైఫ్ లోకి రెండవసారి అడుగుపెడతాడు విక్రం. నీలిమను చేసుకుంటానని గొడవ గొడవ చేస్తుంటాడు, అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తుంటాడు. అలా కొన్ని ఎపిసోడ్లు ఇంట్రస్టింగా సాగింది. మొత్తానికి నీలిమ, అరవింద్ సహకారంతో విక్రం యొక్క మనసు మారుస్తుంది. ఈ రెండిటికీ మధ్య శంకరం అనే అపురూపమయిన పాత్రను సృష్టించారు రచయిత్రులు. ఆ కుర్రవాడొక అనాథ, శ్యామలమ్మ ఇంట్లో పనివాడిగా చేరినా, చాలా తక్కువ కాలంలోనే తన అమాయకత్వంతో, ప్రేమతో, చురుకుదనంతో ఇంటిల్లపాదినీ ఆకట్టుకుంటాడు. చివరకు శంకరాన్ని తన రెండవకొడుకుగా దత్తతతీసుకోవడానికి కూడా శ్యామలమ్మ ముందంజ వేస్తారు. శంకరం సేవాగుణానికి మెచ్చి, వారు నడుపుతున్న మధర్ థెరిస్సా హోం కు ముందు ముందు మ్యానేజర్ ని చేయ్యాలనికూడా ఉద్దేశ్యపడతారు. ఇవన్నీ చేస్తే ఆస్తుల్లో చీలికొచ్చి, కొంతభాగం ఒక పరాయి పిల్లాడికి వెళ్తుందన్న ఊహ ఏమాత్రం శ్యామలమ్మ పిల్లల్ని బాధించదు, సరికదా తల్లి నిర్ణయాన్ని వాళ్ళు గౌరవిస్తారు ఆ ఇంటికోడలు నీలిమతో సహా. Similar feathers flock together అంటే ఇదేనేమో. వీళ్ళ నిర్ణయాలకు షాక్ అయ్యి, చుట్టాలు నెత్తీ, నోరూ బాదుకుంటుంటారు.

ఇదిలా వుంటుండగా వాళ్ళ ఆస్తులను ఏనాటినుండో చూసుకుంటున్న మ్యానేజర్ కు హార్ట్ అటాక్ రావడం, ఆ కుటుంబానికి, ఆయనకు వీళ్ళు అందించిన సహాయాలు, అలాగే శ్యామలమ్మ ఆ వూరిలోని దిక్కులేని ముసలివారినందరినీ ఎవరూ రోడ్లమీద పడకుండా తాను దత్తత తీసుకోవడంలాంటివి చాలా అభినందనీయంగా వుంది. ఇది కొసమెరుపు. కథను ప్రేమ కథలనుండి మళ్ళించి ఒక క్రొత్త దారిలోకి తీసుకువెళ్ళారు. అంతేకాకుండా ఏ పాత్రనూ అలా ఊరికే వదిలేయకుండా మొదట్లో వచ్చిన అసలు, నకిలీ శ్రావ్యలను కూడా తీసుకొచ్చి ఒక ప్రత్యేకతరహాలో మళ్ళీ ప్రవేశపెట్టారు ఒక మెలికల ముగ్గులా. ఈ కథని చదువుతున్నప్పుడూ ఈ కథాతీరును బట్టి ఒక్కొక్క స్థాయిలో నా ఊహలు, ఆలోచనలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయాయి. కానీ మన రచయిత్రులు మంత్రవాదులు. మళ్ళీ నన్ను వెనక్కిలాక్కొచ్చి మెలికల ముగ్గులా నన్నక్కడే నిలబెట్టారు. అలా నేను నిలబడినచోట, పాత్రలన్నిటినీ కలిసేసరికి, గంపగుత్తలా అందరినీ ఒక దగ్గిరే చేర్చారేమిటీ… అని అనుకున్నాను. కానీ ఆ పాత్రలన్నిటికీ న్యాయం చెయ్యాలని చూశారు మన రచయిత్రులు.
శ్యామలమ్మగారు, నకిలీ శ్రావ్యకు తాము నడుపుతున్న ఆర్గనైజేషన్లోనే ఉద్యోగమిచ్చి, ఉత్తమ జీవితాన్ని ఇచ్చారు, అసలు శ్రావ్యను, విక్రంకు ఇచ్చి పెళ్ళి చేసారు. మధ్యలో రామాయణంలో పిడకలవేటలా అమెరికాలో విక్రం ఒక పని చేసుకొచ్చాడు. నీలిమ విడిపోయిన తర్వాత, విక్రం ఒక అమెరికా అమ్మాయితో తిరుగుతాడు. వారిద్దరిమధ్య సహొద్యయత కుదరక విడిపోతారు. వాళ్ళ ప్రేమకు ఫలితంగా ఆమె గర్భవతవుతుంది కూడా. ఆమె పిల్లాడ్నికంటుంది, కానీ విక్రం కి తెలియజెయ్యదు. ఆమె తన తల్లిదండ్రుల దగ్గిర పెట్టి ఆ పిల్లాడ్ని కొన్నాళ్ళు పెంచుతుంది. తర్వాత ఆ అమెరికా అమ్మాయికి, ఒక అమెరికా అబ్బాయి దొరికినప్పుడు విక్రంని వెతుక్కుంటూ వచ్చి విక్రం కొడుకుని విక్రంకిచ్చి వెళ్ళిపోతుంది. అమెరికాలో ఒక పిల్లాడ్ని, పెంచి పెద్దజేసి చదివించి వాడికో జీవితాన్నివ్వడం చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. తను ఎంచుకున్న క్రొత్తజీవితం అందుకు సహకరించకపోయి వుండవచ్చు. అలాగే విక్రం వైపునుండి ఆలోచించినా అతడు ఆ అమెరికా అమ్మాయికి ఇహ కలిసిరాని బంధం, ఇండియాలో క్రొత్త బంధాన్ని కూడా ఏర్పరచుకుంటున్నాడు. అందుకనేనేమో విక్రంకి ఆ పిల్లాడ్నిచ్చేసి వెళ్ళిపోతుంది, ఆ అమెరికా అమ్మాయి. ఆ పిల్లాడిని శ్రావ్య అంగీకరించి తమ క్రొత్త జీవితంలోకి ఆహ్వానిస్తుంది. జీవితం అన్నాక మలుపులు తిరగడం దాని సహజలక్షణం. ఏది జరిగినా అంతా మన మంచికే!

ఈ నవలా ప్రయోజనమేమంటే ఇండియా అమెరికా నేపథ్యం ఎక్కువయి మధ్యతరగతి కుటుంబాల ఆలోచనల్లో వచ్చిన మార్పుని తెలుసుకోవడానికి ఉపయోగపడే నవల ఇది. ఇందులో మంచి మార్పులు కూడా ఉన్నాయి. మనుష్యుల మధ్య వున్న సామాజిక గోడలు మెల్ల మెల్లగా తొలగుతున్నట్లు చూపించిందీ నవల దానికి ఉదాహరణ, ఒక పనివాడినీ, అనాథపల్లాడ్ని శ్యామల దత్తత చేసుకొని వాడికి కొడుకు స్థానాన్నివ్వాలనుకోవడం. ఆమె పిల్లలు ఇలా ఆలోచించగలరేమో నేటితరంకాబట్టి, కాని ముందు తరానికి సంబంధించిన శ్యామల నేటితరపు ఆలోచనను కలిగివుండడం అభినందనీయం. పిల్లల ఫ్రెండ్స్ ని ఆదరించి తన పిల్లలతో పాటూ తానుకూడా ఆ ఫ్రెండ్షిప్ లో పాలు పంచుకొంటుండడం వల్ల అందరినీ విశ్వసించడం, లోటుపాట్లు ఏమన్నావున్నా వాటినీ స్వాగతిస్తూ, పిల్లలతో పాటూ సవరించడానికి సంస్కరించడానికీ ప్రయత్నించడమనేది ఈ నవలకు ఒక క్రొత్తదనాన్నిచ్చింది. అమెరికాలో ఒంటరులు అయినా ఈజీగా ఫ్రెండ్షిప్ చేసి కలిసి ఒకే అపార్ట్మెంటుల్లోవుండడం, కలిసి వెకేషన్లకు వెళ్ళి ప్రణాళికాబద్ధంగా ఖర్చులు పంచుకోవడం, తమలాంటి ఇతర ఫ్రెండ్సుకి కావలసిన సహాయాలందించడం లాంటివి చాలా పరిపాటి. ఆ కల్చర్ ని ప్రస్పుటంగా ఈ నవలలోని కుటుంబాలలో కనిపిస్తోంది. ఇలా అమెరికాలోనే కాకుండా ఇండియాలోవున్న కుటుంబాలు కూడా ఈ స్నేహభావం, మానవతావాదపు కల్చర్ కి మెల్ల మెల్లగా మారగలిగితే ముందు ముందుకి అంతా మనమంచికే. పనికిరాని అడ్డుగోడలెందుకు?

ఇండియా అమెరికా నేపథ్యంలో నవలలు ఇంకా ఎక్కువ రావాలి. ఇండోఅమెరికా సాహిత్యం వల్ల మారుతున్న ఆలోచనాసరళి అందరికీ తెలుస్తుంది. మంచి మార్పులు ఎల్లప్పుడూ సమాజాన్ని ప్రభావితం చేస్తాయి.

(సమాప్తం)

3 thoughts on “అంతా మన మంచికే – ప్రమదాక్షరి గొలుసు నవల వీడియో సమీక్ష

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *