February 21, 2024

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 52

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య

ఈ కీర్తనలో భయంకరమైన కలియుగము నందు మనకు సరియైన మార్గమును ఘనులు, గొప్పదైవము అయిన శ్రీ రామానుజాచార్యులవారు చూపించారు. ఆ త్రోవలో నడచి ముక్తిని పొందండి అంటున్నాడు అన్నమయ్య.
కీర్తన:
పల్లవి: గతులన్ని ఖిలమైన కలియుగమందును
గతి యీతఁడే చూపె ఘనగురుదైవము ॥పల్లవి॥
చ.1. యీతనికరుణనేకా యిల వైష్ణవులమైతి-
మీతనివల్లనే కంటి మీతిరుమణి
యీతఁడేకా వుపదేశ మిచ్చె నష్టాక్షరిమంత్ర-
మీతఁడే రామానుజులు యిహపరదైవము ॥గతు॥
చ.2. వెలయించె నీతఁడేకా వేదపు రహస్యములు
చలిమి నీతఁడే చూపె శరణాగతి
నిలిపినాఁ డీతఁడేకా నిజముద్రధారణము
మలసి రామానుజులే మాటలాడే దైవము ॥గతు॥
చ.3. నియమము లీతఁడేకా నిలిపెఁ బ్రపన్నులకు
దయతో మోక్షము చూపెఁ దగ నీతఁడే
నయమై శ్రీవేంకటేశు నగ మెక్కేవాకిటను
దయఁజూచీ మమ్ము నిట్టే తల్లితండ్రి దైవము ॥గతు॥
(రాగం దేసాళం; సం: 2-372 – రాగిరేకు – 175-4)

విశ్లేషణ:
పల్లవి: గతులన్ని ఖిలమైన కలియుగమందును
గతి యీతఁడే చూపె ఘనగురుదైవము
మన దారులన్నియూ, త్రోవలన్నీ చెడిపోయి, మూసుకుని పోయినప్పటికి గూడా యీ భయంకరమైన కలియుగము నందు మనకు సరియైన మార్గమును ఘనులు, గొప్పదైవము అయిన శ్రీ రామానుజాచార్యులవారే చూపించినారు. ఆ దారిలో అడుగేద్దాం.

చ.1 యీతనికరుణనేకా యిల వైష్ణవులమైతి-
మీతనివల్లనే కంటి మీతిరుమణి
యీతఁడేకా వుపదేశ మిచ్చె నష్టాక్షరిమంత్ర-
మీతఁడే రామానుజులు యిహపరదైవము
యీతని కరుణ చేతనే కాదా యీ ఇలలో మనము వైష్ణవులమైనాము అంటున్నాడు అన్నమయ్య. యీతనివల్లనే ఈ తిరుమణి (వైష్ణవులు నొసట నిడుకొనే తెల్లని ధవళ మృత్తిక) ని చూడగలిగాము. ఇంకా యీతడే కదా మనకు అష్టాక్షరీ మంత్రము (ఓం నమో నారాయణాయ) ను ఉపదేశించినది. యీయనయే శ్రీరామానుజాచార్యులు మనకు ఇహపరముల రెంటికీ దైవము.

చ.2. వెలయించె నీతఁడేకా వేదపు రహస్యములు
చలిమి నీతఁడే చూపె శరణాగతి
నిలిపినాఁ డీతఁడేకా నిజముద్రధారణము
మలసి రామానుజులే మాటలాడే దైవము
వేదపు రహస్యాలనన్నీ ప్రసిద్ధికెక్కునట్లుగా చేసినదీతడే కదా. చలిమిని అంటే చెలిమినిగా (స్నేహముగా) ఊహింపదగును. (ఎందుకంటే అన్నమయ్య “చలిమి దూతికలతో జాణతనాలాడేవు, నిలువుఁగప్పు దొరవు నీకేమయ్యా.” [తాళ్ల-17(23)-419] అన్న కీర్తన లోను అలాగే “అడుగులేచి గురుగోళ్లందునే చేఁగాయ, పడఁతి చలిమికి పైపైనే కలిగే.” [తాళ్ల-17(23)-544] అన్న కీర్తనలోను కూడా ఇదే అర్ధం వచ్చేట్టుగా ఉపయోగించాడు. దాన్నే ఆచార్య రవ్వా శ్రీహరిగారు కూడా తన నిఘంటువులో ధృవపరచారు. ) యీతడే శరణాగతిని చూపించెను. ఇతడే కదా మనకు నిజముద్రా ధారణమును (చేతులకిరుప్రక్కలా భుజముల క్రిందుగా కాల్చిపెట్టిన వైష్ణవముద్రను ధరిండం) నియమముగా నిలిపినాడు. అందువల్ల శ్రీ రామానుజులే మనతో మా టలాడే దైవము.

చ.3. నియమము లీతఁడేకా నిలిపెఁ బ్రపన్నులకు
దయతో మోక్షము చూపెఁ దగ నీతఁడే
నయమై శ్రీవేంకటేశు నగ మెక్కేవాకిటను
దయఁజూచీ మమ్ము నిట్టే తల్లితండ్రి దైవము
మనలనందరిని భక్తిపరులుగా చేస్తూ, శరణాగతి కోరేవారికి నియమముల నేర్పాటు గావించిన దీతడే కదా! తగినట్లు దయతో మోక్షమునకు త్రోవ చూపించినది కూడా యీతడే! అందమైన శ్రీవేంకటేశుని కొండ యెక్కిన మాకు వాకిటిలోనే ఇట్టే దయచూచే తల్లి, తండ్రి, దైవము శ్రీ రామానుజులవారే అంటూ కీర్తిస్తున్నాడు వైష్ణవాగ్రగణ్యుడు అన్నమయ్య.

ముఖ్యమైన అర్ధాలు:
గతులు = దారులు, మార్గాలు, దిక్కులు; ఖిలమైన = దున్నని నేల, చెడినది, పాడైనది; గతి = పోక, త్రోవ,ఉపాయము, దారి, విధము; ఘన = గొప్ప; తిరుమణి వైష్ణవులు నొసట నిడుకొనే తెల్లని ధవళ మృత్తిక; అష్టాక్షరీ మంత్రము = ఓం నమో నారాయణాయ (8 అక్షరాల మంత్రము); ఇహ = ఈ లోకము, పై లోకము; వెలయించె = అందరికి ఎరుకపరచడం; చలిమి = స్నేహము (చెలిమి – రూపాంతరము); నిజముద్రధారణము = చేతులకిరుప్రక్కలా భుజముల క్రిందుగా కాల్చిపెట్టిన వైష్ణవముద్రలు (శంఖు, చక్రాలు); నియమము = పాటించవలసిన విధి;నగ మెక్కే = కొండను ఎక్కినటువంటి.

విశేషాంశము: శ్రీ వైష్ణవులకు చేసే ఐదు సంస్కారాలను పంచసంస్కారాలుగా పిలుస్తారు. అవి – తాపము: తాప సంస్కారమంటే శ్రీమహావిష్ణువు చిహ్నాలైన శంఖ చక్రాలను అగ్నిలో ఉంచి చెరొక భుజంపై వేస్తారు. దీనివల్ల వ్యక్తి వైష్ణవుడైనట్టు భావిస్తారు. పుండ్రము: ఊర్థ్య త్రిపుండ్రాలు అన్న పేరుతో సుప్రసిద్ధి పొందిన చిహ్నాన్ని నుదుటిపై ధరిస్తారు. త్రిపుండ్రాలను విష్ణుమూర్తి పాదాలకు చిహ్నంగా భావించి, పుండ్రధారణను సంపూర్ణ శరణాగతికి చిహ్నంగా చెప్తారు. యజనం: దేవపూజ చేయాల్సి ఉంటుంది. నామము: జన్మనామమును మార్చి వైష్ణవాంకితమైన పేరును పెట్టాలి. మంత్రము: మంత్రోపదేశాన్ని స్వీకరించి మంత్రాన్నిచ్చిన గురువుకు శిష్యునిగా మెలగాలి.
0o0-

1 thought on “అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 52

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *