June 24, 2024

పొద్దు పొడుపు

రచన: రత్నశ్రీ వఠెం

“కౌసల్యా సుప్రజా రామా” ఫోన్ లో అలారం రింగ్ టోన్ మోగేసరికి గాఢనిద్రలో ఉన్న నేను ఉలిక్కిపడి లేచాను.
“మరో పొద్దు మొదలయింది దేవుడా!, నా జీవితానికి మలిపొద్దు ఎప్పుడవుతుందో??” అనుకుంటూ మంచం దిగాను. మంచం మీద నా మొగుడు గురక పెడ్తూ పడుకుని ఉన్నాడు…. అర్ధరాత్రి దాకా బార్ల వెంట దార్ల వెంట తిరిగి బారెడు పొద్దెక్కేదాకా నిద్రపోతాడు… దేనికైనా పెట్టి పుట్టాలి మరి.
నాకు మాత్రం తెల్లవారి నాలుగు గంటలకల్లా లేవకపోతే కుదరదు. రాత్రే పనులన్నీ దాదాపుగా చేసేసి, వంటకు అంతా తయారుగా ఉంచుకుంటా. కేవలం రెండు గంటల్లో పనులన్నీ ఎక్స్ ప్రెస్ లాగా చేసేసి తయారై నా బండి మీద హాస్పిటల్ కి చేరుకుంటాను. ఇంక మిగిలిన పనులన్నీ, డిగ్రీ చదివే నా కూతురు పూర్తి చేసి కాలేజీకి వెళ్తుంది.
ఇంతకీ నా పనేమిటో చెప్పనే లేదుగా నగరం లోని ఒక ప్రముఖ ఆయుర్వేద ఆస్పత్రిలో నేను తైల మర్దన చేస్తాను. ఇప్పుడు దీర్ఘకాలిక వ్యాధులతో విసిగిపోయిన కొందరు ఎల్లోపతి మానేసి ప్రత్యామ్నాయ వైద్యాలకు చూస్తున్నారు… అందువలన ఆయుర్వేదానికి కూడా మంచి రోజులొచ్చాయి.
తెల్లవారుతూనే 6.30 గం: నుంచీ మా పని మొదలవుతుంది.. రకరకాల రోగాలు, రకరకాల మనుషులు. మధ్యాహ్నం నలభై నిమిషాలు విరామ సమయం.. తరువాత మళ్ళీ పని మొదలు.. ఇంటికి చేరేసరికి రాత్రి 8.00గం: అవుతుంది. రోజంతా‌ ఈ తైల మర్దనాలు చేసీ చేసీ, మాకూ ఒళ్లు, కాళ్లు నొప్పులుగానే ఉంటాయి.
నేను తమిళ అమ్మాయిని, మా ఆయన ఇక్కడివాడే‌.. మావాళ్లు చాలామంది ఎప్పుడో ఇక్కడకు వలస వచ్చి స్థిరపడిన వాళ్లే.. కాని మలయాళీలకూ, తమిళ మూలాలున్న మాకూ కూడా ఈ హాస్పిటల్స్ లో డిమాండ్ ఎక్కువ కనుక ఈ ఉద్యోగం దొరికింది.. పైగా ఈ పనికి విద్యార్హతలు కూడా పెద్దగా అక్కర్లేదు. కొద్ది రోజులు శిక్షణ ఇస్తారంతే. నా చదువుకు మిగిలిన ఉద్యోగాల కన్నా ఇందులో జీతం ఎక్కువ కావటంతో ఈ పని ఎంచుకున్నాను.. కొందరు రోగులు మంచి టిప్స్ అదే బహుమానాలు కూడా ఇస్తారు
*****
ఈ రోజు హాస్పిటల్లో పని ముగించుకుని ఇల్లు చేరేసరికి రాత్రి 8.30 దాటింది. బాబు ఇంకా ట్యూషన్ నుంచీ రానట్టుంది, పిల్ల మాత్రం కూర్చుని చదువుకుంటోంది. గబగబా వంట పూర్తి చేసేసరికి బాబు కూడా వచ్చాడు. వాడు ఎమ్ సెట్ కోచింగ్ తీసుకుంటున్నాడు. చదువులో చాలా తెలివైన వాడు.
ఆయన కోసం అన్నీ చిన్న గిన్నెల్లో సర్ది మేం భోజనం చేశాము. రేపటికి సర్దుకుని పడుకుందామనుకుంటుంటే నా మొగుడు మహారాజు తూలుకుంటూ వచ్చాడు.
“రోజూ ఇలా అర్ధరాత్రి వరకూ బలాదూర్ తిరిగి రాకపోతే పెందలాడే కొంపకు,,,” నా మాట పూర్తవకముందే నా చెంప ఛెళ్ళుమనిపించాడు.
“ఎన్నిసార్లు చెప్పానే నాకు నీతులు చెప్పొద్దని, నా ఇష్టం వచ్చినట్లుంటా. పో,,ఫోయి అన్నం పెట్టు” అంటూ అరిచాడు.
అలవాటైపోయిందేమో! పెద్దగా నొప్పెట్టలేదు. అన్నం వడ్డించి ఇచ్చాను. తినగానే బట్టలైనా మార్చుకోకుండా మంచానికి అడ్డం పడి గుర్రు పెట్టాడు.
ఆ పశువు పక్కన పడుకోలేక, ముందు గదిలో మా అమ్మాయితో పాటు చాప మీద పడుకున్నాను.
కళ్ళు మూసుకున్నా కానీ నిద్ర రావట్లేదు. మనసు పదే పదే ఈ స్థితికి కారణం నువ్వే అని గుర్తు చేసి బాధ పెడ్తోంది.
చెప్పానుగా మా వాళ్ళంతా చాలా కాలం క్రితమే తమిళనాడు నుంచీ వచ్చి ఇక్కడ కూలీ పనులు చేసుకునే వారు. మా నాన్న వాళ్ళ తరంలో పిల్లలు బడిలో చేరి చదువుకోవటం వలన, మా నాన్న ఒక పెద్ద ట్రాన్స్ పోర్ట్ కంపెనీలో గుమాస్తాగా చేరగలిగాడు. మాలాగే చాలా కుటుంబాల్లో పిల్లలు కూలీలుగా కాకుండా వారి చదువుకు తగిన ఉద్యోగాల్లో చేరారు. ఒక పెద్ద ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేసే ఆమెతో మా నాన్నకు పెళ్ళయింది. అలా ఉద్యోగస్తులైన అమ్మా నాన్నలుండటం వలన నేనూ,మా చెల్లీ,తమ్ముడూ కూడా మంచి స్కూళ్ళల్లో చదువుకునే వాళ్ళం.
నేను ముందునుంచీ చదువులో యావరేజ్ అయినప్పటికీ, ఆటల్లో మాత్రం ఫస్ట్.. ఎన్ సి సి లో కూడా చురుగ్గా పాల్గొనేదాన్ని. టెంత్ కొచ్చేసరికి 5.5 పొడుగుతో, చెయ్యి పట్టనంత ఒత్తైన జడతో, చూడగానే ఆకట్టుకునే శరీర సౌష్టవంతో అందంగా ఉండేదాన్ని. మరీ డిగ్రీ పిల్లలా కనిపిస్తున్నానని అమ్మ బాస్కెట్ బాల్ ఆట మాన్పించేసింది. ఎన్ సి సి కూడా వద్దన్నప్పటికీ, ఏడ్చి గొడవ చేస్తే సరేనంది.. ఆ రోజు అమ్మ గట్టిగా వద్దని చెప్తే నా తలరాత మరో విధంగా ఉండేది.
ఆలోచిస్తుంటే, నా కళ్ళు మెల్లిగా మూత పడుతున్నాయి.. ఇంతలో కాలితో తంతూ లేపాడు నా మొగుడు.. వద్దంటే పిల్లల ముందు పోయేది నా పరువే.. మౌనంగా లేచి అతనితో పాటే గదిలోకి నడిచాను.. నిద్ర పడుతుండగా లేచానేమో, తల నొప్పి మొదలయింది… దానికి ఒళ్ళు నెప్పులు తోడయ్యాయి.
*********
రోజులు యధా ప్రకారం నడుస్తున్నాయి.. నాలుగు రోజులుగా ఒకామె రోజూ మొదటి సెషన్ కి చికిత్స కోసం వస్తోంది.. ఆమెకు వేరే వారికి మసాజ్ చేసాక తుడిచినా సరే, ఆ నూనె బల్ల మీద పడుకోవటం నచ్చదు… అందుకని పొద్దున్నే హాస్పిటల్ తెరిచే సమయానికి వస్తుంది. నేను ఒకసారి వేడి నీటిలో ముంచిన గుడ్డతో ఆమె కళ్ళ ముందే అన్నీ శుభ్రం చేస్తాను. అలా, ఆమెకు నాతో దోస్తీ కుదిరింది… మర్దనా చేస్తున్నంత సేపూ నాతో కబుర్లు చెప్పేది.. ఆమె పేరు లావణ్యట.. పేరుకు తగినట్లే పువ్వులా సుకుమారంగా ఉండేది.. పసిమి ఛాయతో గట్టిగా నొక్కితే కందిపోయేంత నాజూకు చర్మం. వయసు కూడా తక్కువే, ఏదో ఆటో ఇమ్యూన్ వ్యాధి బారిన పడి, ఎవరో సలహా ఇస్తే ఆయుర్వేద వైద్యానికి వచ్చింది.
“మీ పిల్లలు ఏం చదువుతున్నారు?” అడిగిందొక రోజు.
“అమ్మాయి బి కామ్ సెకండ్ ఇయర్.. బాబు ఇంటర్ సెకండ్ ఇయర్, ఎమ్సెట్ కోచింగ్ తీసుకుంటున్నాడు మేడమ్!” కాస్త గర్వంగా చెప్పాను.
“నువ్వు ఇంత చిన్నగా ఉన్నావు.. అంత పెద్ద పిల్లలున్నారా?” ఆశ్చర్యంగా చూసిందామె.
“అవును మేడమ్! నాకు పదిహేనేళ్లకే పెళ్లయింది.. ఏడాది తిరిగేసరికి పాప పుట్టింది” కాస్త సిగ్గుగా చెప్పాను.
“మీ ఆయన ఏం చేస్తాడు?”
ఒక నిమిషం సందేహించాను, కానీ ఎందుకో మనసు విప్పి మాట్లాడాలనిపించింది… “ఆయన ఒక బిల్డర్ దగ్గర సూపర్వైజర్ గా పని చేస్తాడు.. జీతంలో మూడొంతులు తాగుడూ, తిరుగుడూ… మూడ్ బావుంటే నా చేతికి పదో పరకో ఇస్తాడు, లేకపోతే లేదు” నా కళ్లలో నీళ్లు, గొంతులో విరక్తి.
“అయ్యో! సారీ.. నీ మనసు బాధ పెట్టినట్లున్నాను” బాధగా అందామె.
“అదేం లేదమ్మా! ఇది నా స్వయంకృతాపరాధం”..
“టెంత్ చదువుతుండగా ఒకసారి ఎన్ సి సి కేంప్ కి వెళ్లాను, అమ్మ వద్దన్నా వినకుండా.
అక్కడ మాకు భోజనం సప్లై చేయటానికి వచ్చేవాడు ఇతను.. ఆ నాలుగు రోజుల్లోనే
ఏం మత్తు జల్లాడో తెలియదు కానీ.. అతని ప్రేమలో చిక్కుకు పోయాను నేను.. మంచీచెడూ ఆలోచించేటంత వయసు కాదు.. చిన్నపాటి శ్రద్థను కూడా ప్రేమ అనుకునే అమాయకపు వయసది.. అప్పటికే స్నేహితులు అందగత్తెనని తరచూ అంటుంటే కలిగే అతిశయం కళ్లను కప్పేసింది. కేంప్ నుంచీ వచ్చాక కొన్నాళ్లు ఉత్తరాలు రాసేవాడు… ఉన్నట్టుండి ఒక రోజు స్కూల్ వదిలే సమయానికి స్కూల్ బయట ప్రత్యక్షం… చాలా భయపడినా కానీ, ఏమిటో థ్రిల్లింగ్ గా అనిపించింది. అమ్మానాన్న ఉద్యోగస్తులు కావటం, సహజంగా తల్లితండ్రులకు పిల్లల పైన ఉండే నమ్మకం వలన నా ప్రేమ వ్యవహారం వాళ్లకు తెలియలేదు.. తమ్ముడిని భయపెట్టి నోరు మూయించేదాన్ని, చెల్లాయి చాలా చిన్నది కావటంతో తనకి అర్థమయ్యేది కాదు.
పబ్లిక్ పరీక్షల ముందు ఒకసారి అతనితో పార్కులో కూర్చుని ఉండగా, మా నాన్న కంట పడ్డాను.. మొదటిసారి నాన్న కోపం తెలిసింది.. నా ప్రేమలేఖలన్నీ బయట పడ్డాయి.. ఆ రోజు నాన్న కొట్టిన దెబ్బలకు చచ్చిపోయేదాన్నే, అమ్మ అడ్డు రాక పోతే.
మొత్తానికి అమ్మ సెలవు పెట్టి, నన్ను నెల్లాళ్లు కనిపెట్టుకుని ఉండి, నేను పబ్లిక్ పరీక్షలు రాసేలా చూసింది.
అతను నా స్నేహితురాలు దుర్గ ద్వారా సందేశాలు పంపుతుండే వాడు.. ఒకరోజు ఎవరికీ తెలియకుండా పథకం ప్రకారం ఇంటినుంచీ బయటపడి, అతనితో కలిసి భద్రాచలానికి పారిపోయి, అక్కడ రాముల వారి గుడిలో పెళ్లి చేసేసుకున్నాం. నేను పెద్దగా కనిపిస్తాను కనుక ఎవరికీ నాది మైనర్ పెళ్ళి అనే అనుమానం రాలేదు. కొన్నాళ్లు అక్కడే ఏదో హోటల్ లో వంటవాడిగా కుదిరాడు.. నన్ను కూడా ప్రేమగా చూసుకోవటంతో, డబ్బు ఇబ్బందులు కూడా పట్టించుకోలేదు నేను.
పాప పుట్టిన తరువాత మేమే స్వంతంగా ఒక టిఫిన్ సెంటర్ పెట్టుకున్నాం.. కానీ మేము ఊరికి కొత్తవాళ్ళమని తెలిసి, అన్నలుగా పిలవబడే కొందరు మా వెంట పడ్డారు.. వాళ్లకు అడిగినప్పుడల్లా వంట చేసి పంపాలి.. ఇంకా అవసరమైన సహాయం చెయ్యాలి… మాకు చాలా భయమేసింది…. దానికి తోడు కొందరు, పోలీసులకు అనుమానం వస్తే, ఎలా హింస పెడతారో వర్ణించి చెప్పేవారు. దానితో ఒకరోజు ఎవరికీ తెలియకుండా తట్టాబుట్టా సర్దుకుని ఇక్కడికి ‌వచ్చేసాం… అతనికి ముందూ వెనకా ఎవరూ లేరని చెప్పటంతో, ఈ పాటికి మా అమ్మానాన్నల కోపం తగ్గి ఉంటుందనే ఆశతో, మా ఇంటికి వెళ్ళి చూస్తే, ఆ ఇంట్లో వేరే ఎవరో ఉన్నారు… పక్కింటామె ద్వారా, అమ్మావాళ్లు తమిళనాడు వెళ్ళిపోయారని తెలిసింది. నేను ఇంటినుంచీ పారిపోయిన రోజే ఆ షాక్ తో అమ్మకు పక్షవాతం కమ్మిందిట.. ఇక్కడ మావాళ్ళందరికీ విషయం తెలిసి, పరువు పోతుందనే భయంతో, అమ్మ కాస్త కోలుకోగానే కేరళ వైద్యం వంకతో, ఊరు వదిలి వెళ్లిపోయారుట. నా విషయం కూడా ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డారని, ఆవిడకు మాత్రమే తెలుసనీ చెప్పిందామె.
ఆ తరువాత మరో పదేళ్లపాటు ఇబ్బందులు పడ్డా, బానే ఉన్నాము.. నేను తెలిసిన వారి ద్వారా ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా చేరాను. పిల్లలను పక్కింట్లో ముసలమ్మ కనిపెట్టుకుని ఉండేది.. ఈ లోగా మా ఆయనకు ఈ బిల్డర్ పరిచయమయి, తన దగ్గర సూపర్వైజర్ గా పెట్టుకున్నాడు.. మా ఆయనకు రాన్రానూ స్నేహాలు పెరిగి పార్టీలంటూ తిరగటం మొదలైంది.. ఇల్లూవాకిలి పట్టించుకోకుండా తాగటం, తిరగటం… ఇంటికి వచ్చేది కేవలం తిండికీ, నిద్రకే.. ఏ బాధ్యతా లేదు.
బిల్డర్ కి కుడిభుజం కావటంతో అతను మా ఆయన్ని విడిచిపెట్టడు.. చేసేది లేక బిల్డర్ భార్యను కలిసి, నా గోడు చెప్పుకుని ఏడ్చేసరికి, ఆవిడ‌ భర్తకు నచ్చచెప్పి, నా మొగుడికి తెలియకుండా, అతని జీతంలో కొంత డబ్బు నెలనెలా నా అకౌంట్లో వేయించటం మొదలు పెట్టింది.
ఎలానో జీవితం లాక్కొస్తున్నాను మేడమ్.. మరి కొన్నాళ్లు కష్టపడితే నా పిల్లలు చేతికి అందివస్తారు.. ఈ కష్టాలు తీరిపోతాయనే ఆశలో ఉన్నాను.
నేను నా కథ చెప్తూనే అలవాటుగా మసాజ్, ఆవిరి పట్టడం అన్నీ ముగించాను.. నా కథ విన్న ఆమె కళ్లల్లో నీళ్ళు.
“అయ్యో! ఏమైంది మేడమ్? కొన్ని జీవితాలంతే! మీరేం బాధ పడకండి… కష్టాలు కలకాలం ఉండవుగా! అయినా చాలామంది మగాళ్ల కన్నా మా ఆయన నయమే.. తన తిరుగుళ్లు తప్ప ఇంటి వ్యవహారాల్లో కల్పించుకోడు.. పిల్లలని ప్రేమగానే పలకరిస్తాడు” ఆమెకు నేనే ధైర్యం చెప్పాల్సొచ్చింది.
ఆమె అలా ఎనిమిది వారాల పాటు చికిత్స చేయించుకుని, వెళ్లేటప్పుడు నాకు భారీగా టిప్ ఇచ్చింది.. ఇంకా మధ్యమధ్యలో బోలెడన్ని బట్టలు నాకూ, పాపకీ తెచ్చి ఇచ్చేది మూడో కంటికి తెలియకుండా.
ఎమ్సెట్ రిజల్ట్ రాగానే ఫోన్ చేయమని నంబరు కూడా ఇచ్చింది. తరచూ తనే ఫోన్ చేసి పలకరిస్తూ ఉండేది.
******
మా అబ్బాయికి ఇంజనీరింగ్ లో రేంక్ మంచిదే వచ్చింది కానీ యూనివర్సిటీలో సీట్ రాదు. ప్రైవేట్ కాలేజీల ఫీజు నా శక్తికి మించింది.. ఇప్పుడెలా? లోన్ తీసుకున్నా, మిగతా ఖర్చులు భరించలేను.. మాకు ఏ రిజర్వేషన్లూ వర్తించవు కూడా… అప్పుడు గుర్తొచ్చిందావిడ.
ఫోన్ చేయగానే ఒక ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాల పేరు చెప్పి, వెళ్ళి కలవమంది.. మా అబ్బాయికి అక్కడ నామినల్ ఫీజుతో, సీటు ఇప్పించింది. నా ఆనందానికి అవధులు లేవు.
ఒకరోజు ఆమె ఉదయాన్నే ఫోన్ చేసి ఒక అడ్రెస్ చెప్పి, నన్ను అక్కడికి రమ్మంది.. మనసులో ఎన్నో సందేహాలు… నాకు చేసిన సహాయానికి బదులుగా ఏం కోరుతుందో? అనే అనుమానంతో అక్కడికి చేరాను.
అది పెద్ద ఫార్మ్ హౌస్.. నేను వెళ్ళేసరికి బయట కుర్చీలో కూర్చున్న అమ్మను చూడగానే, ఆశ్చర్యం, బాధ ఒకేసారి కలిగాయి… గుండె లోతుల్నించీ వచ్చిన కన్నీరు వరదలౌతుంటే అమ్మ ఒళ్లో తలపెట్టుకుని తనివి తీరా ఏడ్చాను.
ఇంతలో “అక్కా!” అన్న పిలుపుతో తేరుకుని ఆమె వైపు చూసాను..
“నువ్వు!??? మా చెల్లాయి పేరు కామాక్షి కదా! అడిగాను అయోమయంగా..
“అవును, నా పేరు కామాక్షే, కానీ మొరటుగా ఉందని మా ఆయన మార్చేసారు… నువ్వు నన్ను గుర్తు పట్టలేదు కానీ, నేను నిన్ను కలిసాక అనుమానం వచ్చి, మన చిన్నప్పటి ఫొటోలు చూసాను.. నువ్వు మా అక్కవే అని తెలిసింది, కానీ నేను ఫలానా అని నీకు చెప్పలేని పరిస్థితి నాది.
నాదీ ప్రేమ వివాహమే.. ఆయన నాకోసం తల్లితండ్రులతో పెద్ద యుద్ధమే చేసారు.. తరువాత అంతా బానే జరిగిపోయినా వాళ్ళ స్టేటస్ కు తగ్గట్లుండాలి అని కట్టడి చేసారు.. నాన్నా, అన్నయ్యా నా పెళ్లికి ముందే ఒకసారి ఏదో ఊరెళ్లి వస్తూ ఏక్సిడెంట్ లో చనిపోయారు.. అందువలన అమ్మ నాతోనే ఉంటోంది”.
నాన్నా, తమ్ముడూ కళ్ళముందు మెదిలి మనసు భారమైంది.
“మీ అబ్బాయి చదివే కాలేజ్ మాదే.. నువ్వెవరో చెప్పకుండా, కేవలం జాలితో సహాయం చేస్తున్నట్లుగా, సీటు ఇప్పించగలిగాను.. నీకు ఆర్ధికంగా కొంతవరకూ సహాయపడగలను కానీ నాకూ కొన్ని పరిమితులున్నాయి, అందువలన నిన్ను పూర్తిగా మాతో కలుపుకోలేను, నన్ను క్షమించక్కా!” అని నా చెల్లెలు కళ్ళనీళ్లు పెట్టుకుంది.
“పరవాలేదమ్మా! నువ్వు చేసిన సహాయం తక్కువేమీ కాదు, నా కొడుకు చదువుకుని పైకి వస్తే చాలు.. పిల్ల పెళ్లి ఏదో రకంగా చేయగలననే నమ్మకం ఉంది. నా భర్తకు కూడా మీ గురించి తెలియకపోవటమే మంచిది” అన్నాను.
కాసేపు మాట్లాడుకున్నాక భోజనం పెట్టి, కొంత డబ్బు చేతికివ్వబోయింది.. నేను దాన్ని వారిస్తూ.. “వద్దు చెల్లాయ్! ఇన్నాళ్లూ, నా కష్టంతో బతికాను.. ఇకపైన కూడా బతకగలను.. జీవితంలో నావాళ్లెవరినీ కలుస్తాననుకోలేదు… కానీ దేవుడు నాకా‌ అదృష్టమిచ్చాడు, ఆ తృప్తి చాలు” అన్నాను.
అప్పటిదాకా మబ్బు చాటున దోబూచులాడుతున్న సూరీడు, ఏదో కలత తీరినట్లు నిదానంగా బయటికి వచ్చాడు. నాకు దొరికిన కొత్త ఆసరా, నావాళ్లు… నా జీవితంలోనూ ఒక కొత్త పొద్దు మొదలైంది.

🌷🌷🌷🌷సమాప్తం🌷🌷🌷

1 thought on “పొద్దు పొడుపు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *