May 19, 2024

మూడు సాకులు

రచన: ప్రభావతి పూసపాటి

“అయ్యా!ఈ ఆశీర్వచనంతో మీ అన్నగారి కార్యక్రమాలన్నీ సక్రమంగా పూర్తి అయినట్లే ” అని పార్వతీశం ముగ్గురు కొడుకుల తలల మీద అక్షింతలు వేసి, శేషగిరి గారు ఇచ్చిన సంభవనాతీసుకొని శాస్త్రిగారు వెళ్లిపోయారు. గేట్ వరకు సాగనంపడానికి వచ్చిన శేషగిరి వీధి అరుగు మీద చతికిలపడిపోయారు . అన్న గారితో గడిచిన కాలంఅంతా సినిమా రీలులా మదిలోమెదిలింది . పార్వతీశం, శేషగిరి పేరుకి అన్నదమ్ములే ఐన ఒకే ప్రాణం గాపెరిగారు. ఇద్దరికీ ఆరు నెలల తేడా తో పెళ్లిళ్లు జరిగాయి. కాంతం, సుభద్ర ఇంచుమించు ఒకే సమయంలో కాపురానికి వచ్చారు. కాంతం కొంచెం కలిగినవారి ఏకైక సంతానం. విపరీతమైన గారం వలన, మొండితనం, సోమరితనంతో పాటు పెద్దగా చదువు కూడా అబ్బలేదు. సుభద్ర నలుగురు ఆడ సంతానం లో ఆఖరుది. మంచితనం, కలివిడితనం వలన అత్తగారికి చేదోడు వాదోడుగా వుంటూ తనఇద్దరు కొడుకులు , కూతురితో పాటు కాంతంగారి ముగ్గురు కొడుకులని కూడా ఆప్యాయంగా పెంచి పెద్ద చేసింది. ఇదే అదనుగా కాంతం ఏఏ విషయాలు తనకు పట్టనట్టు, తనకి సంబంధం లేదు అన్నట్టు వుంటూ ఎవరైనా ఏమైనా అడిగితె “నాకు తెలియదు, నాకు చేతకాదు, నేను చెయ్యలేను “ఈ మూడు సాకులు చెపుతూ తన సంసారం మొత్తం అత్తగారు, తోటికోడలి సహాయం తో గడిపేసింది. పార్వతీశం గారు ఎన్నోసార్లు కాంతం మనం విత్తనాల్ని నాటినంతా మాత్రాన సరిపోదు , వాటిని దగ్గరుండి సంరక్షిస్తానే , ఎదగడానికి సహకరిస్తేనే అవి వృక్షాలుగా ఎదిగి మనకి ఫలాలు ఇస్తాయి అంటే మొక్కలగురించి నాకేమి తెలియదు, నేను నీరు పోయలేను, సంరిక్షించటం నాకు చేతకాదు అని నీ తీరు నువ్వు మార్చుకోక పొతే మనకి చెట్లు చేతికి అందిరావు అని అంటూ ఉండేవారు. పార్వతీశంగారు ఎంత మార్చాలని ప్రయత్నించినా ఘర్షణ తప్పించి ప్రయోజనం సూన్యం. తల్లి ప్రమేయం లేకపోయినా పిల్లలు ముగ్గురు బామ్మా, పిన్ని సంరక్షణలో చక్కగా ఎదిగి, మంచి చదువులు చదివి , చక్కని పిల్లలతో పెళ్లిళ్లు కుదిరి జీవితంలో బాగా స్థిరపడ్డారు. కోడళ్ళు కూడా మామగారిమీదున్న గౌరవంతో వస్తుపోతూనే వున్నారు, ఇప్పుడు వొదిన పరిస్థితి ఎలా ఉంటుందో . . .
“ఇక్కడే కూర్చుండిపోయావేమి నాన్న ” కూతురి పలకరింపు తో ఆలోచనలనుంచి తేరుకొని “ఏమి లేదమ్మా !పెద్దమ్మ ఏమి చేస్తోంది అంటూ ఇంట్లోకి వచ్చారు.
పిల్లలందరూ సుభద్ర చుట్టూచేరి కబుర్లు చెప్పుకొంటున్నారు, బామ్మా బామ్మా అంటూ కొంగు పట్టుకొని ఆడుతున్న మనవలకి అన్నం పెడుతోంది , కాంతం వాళ్ళెవ్వరితోటి తనకి సంబంధం లేదు అన్నట్టు గోడకి చేరగిలబడి కన్నులు మూసుకుని కూర్చుంది.
కన్నులు మూసుకోందే కానీ మనసు లో పరిపరి విధాలుగా ఆలోచిస్తోంది, ఇప్పుడు పిల్లలు మాతో రమ్మంటే, కాదు మాతోనే రావాలని పట్టుపడతారు తాను కొంచెం బెట్టుచూపించి , ముగ్గురిలో ఎవరి దగ్గర సౌఖ్యం గా ఉంటుందో బేరీజు వేసుకొని , వాళ్లతో బ్రతిమాలించుకొని అప్పుడు నిర్ణయం చెపుతాను, ఎక్కడికి వెళ్లినా నా మూడు సాకులు ఎలాగూ వున్నాయి కదా వాటితో శేష జీవితం గడిపేయవచ్చు అనుకొంది.
“అమ్మని మాతో తీసుకువెళ్లాలని అనుకోవటం లేదు బాబాయ్ “పెద్దకొడుకు శ్రీధర్ గొంతు విని ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది కాంతం .
అలాగా !చాలా ప్రశాంతంగా ఇలాంటి జవాబే వస్తుంది అన్నంత ధీమా తో నెమ్మదిగా బదులిచ్చారు శేషగిరి.
పిన్ని కొంగుతో చెయ్యి తుడుచుకొంటూ వస్తూ “భవాని తో నన్ను ఒకసారి మాట్లాడమంటావా”అంది.
వద్దు పిన్ని !ఈ ఆలోచన నాది , భవానిది కాదు. భవానిగురించి నీకు తెలుసు కదా పిన్ని అన్ని విషయాలలోనూ సర్దుకొంటుంది, పక్కవారి మనసెరిగి ప్రవర్తిస్తూ ఉంటుంది, తనవల్లనేమో ఇన్నాళ్లు కనీసం ఇక్కడికి రాగలిగాము. అమ్మని తీసుకొని వస్తానంటే వద్దు అని అనడు కానీ తన మంచితనం ఆసరాగా తీసుకొని తనని ఇంకా కష్ట పెట్టడం నాకు ఇష్టం లేదు.
నీకు గుర్తు ఉందా పిన్ని!భవాని కి నెలలు నిండి , కానుపు కష్టం అవుతుందేమో , తోడుగా ఒకరువుండి కంప్లీట్ బెడ్ రెస్ట్ ఉండాలి అని డాక్టర్ చెప్పాడు అని అమ్మ దగ్గరికి వచ్చి ఎప్పుడు ఏది అడగలేదు నిన్ను కనీసం రెండు నెలలు భవాని కి సహాయంగా రమ్మని పిలిస్తే “కనే ముందే ఇలాంటి బ్బందులు వస్తే ఎలా సమర్ధించుకోవాలో తెలిసుంటేనే పిల్లలిని కనాలి కానీ ఇలా సహాయం కోసం రమ్మనకోడదు రా అబ్బాయ్ ఐనా ఆ చాకిరీ నేను చెయ్యలేను, ఆ పురుడు పత్యాలు నాకు తెలియవు, చంటిపిల్లలిని సాకడం నాకు చేతకాదు. అని కనికరం లేకుండా చెప్పేసింది . ఆ సమయంలో మేమెంత కష్ట పడ్డామో , భవానికి చావు తప్పి బ్రతికినంత పనైంది, ఐనా భవాని పరుషంగా ఒక్క మాట కూడా అనలేదు. అటువంటి ఉత్తమ ఇల్లాలికి నేను చేయగలిగిన సహాయం తనకి ఈ వయసులో శారీరిక , మానసిక విశ్రాంతిని ఇవ్వటం . అందరు నన్ను “కొంగు చాటు మొగుడని, దద్దమ్మ అనుకొన్న నాకు పర్వాలేదు , కానీ తీయలేని, మోయలేని బరువు లాంటి బాధ్యతని తన మీద మోపటం నాకు ఇష్టం లేదు అమ్మ తన అభిప్రాయాలూ, బాధ్యతలని ఎలా సాకులు చూపించి తన పని సాగించుకొందో నాకు తెలుసు, కొడుకుని కాబట్టి ఇన్నాళ్లు నేను భరించాను, భవాని కి ఆ అవసరం లేదని నా అభిప్రాయం” గుక్క తిప్పుకోకుండా చెప్పేసి కనీసం తల్లి వైపు ఐనా చూడకుండా గది లోకి వెళ్ళిపోయాడు.
కొడుకు మాటలు విని మ్రాన్పడిపోయింది కాంతం. ఎంతసేపు తాను ఎంత తెలివిగా మాటలాడి అందరిని తన గుప్పెట్లో పెట్టుకొని పబ్బం గడుపోకొంటున్నానే అని అనుకొంది కానీ కొడుకు కి తన మీద కనీసం ఇసుమంత ఐనా జాలి , ప్రేమ కలిగేలా తాను ప్రవర్తించలేక పోయిందన్న భావం మొదటిసారి కలిగింది.
“మా మాట కూడా అదే చినమావయ్యగారు ” బావగారు గది లోకి వెళ్ళటం చూచి బయటికి వచ్చి చెప్పింది రెండవ కొడుకు సుధాకర్ భార్య ప్రణతి.
సుధాకర్ ప్రణతిలది ప్రేమ వివాహం, పార్వతీశం పెద్దమనసుతో ఆదరించగలిగారు కానీ , కాంతానికి ఆ పెళ్లి సుతరామూ నచ్చలేదు, సందర్భ వచ్చినప్పుడల్లా మనసులోని విషయాన్నీ (విషాన్ని)కోడలికి తెలుపుతూనే వుంది.
మీకు కొత్తగా గుర్తు చేయాల్సిన విషయము కాదు కానీ సందర్భం వచ్చింది కదా అని చెప్పాల్సి వస్తోంది “మా బాబు నీరవ్ పుట్టిన కొత్తలో సుధాకర్ ఉద్యోగరీత్యా ఆస్ట్రేలియాకి రెండు నెలల కోసం వెళ్లాల్సివస్తే నాకు తోడుగా ఉండమని వచ్చి మరి అడిగాము, తమ సహాయం అడిగినప్పుడే తమ విలువ ఏంటో తెలపాలని అత్తయ్యగారు తెలివిగా “పక్క ఇంటి శేషుని చూడు మొగుడు 6 నెలల కోసం అమెరికా కి వెళితే పిల్లల్ని క్రష్ లో వేసి ఒక్కత్తే సమర్ధించుకొంటోంది. ఆలా ఎవరి ఇబ్బందులు వాళ్ళే పరిష్కరించుకోవాలి కానీ ఎదుటివాళ్ళ సహాయం కోసం వెంపర్లాడకూడదు . నాకు మీ పట్నం జీవితం తెలియదు, ఆ గ్యాస్ పొయ్యిలమీద వంటలు చెయ్యలేను, చంటి పిల్లలిని సాకటం నాకు చేతకాదు ఏమి అనుకోకురా అబ్బాయ్ మీ ఏర్పాట్లు ఏవో మీరే చూసుకోండి” అని నిర్మొహమాటం గా చెప్పారు. అప్పుడు మా తంటాలేవో మేము పడ్డాము, ఇప్పుడు ఆవిడ వంతు వచ్చిందిఇప్పుడు ఆవిడ ఇబ్బందులు ఏమిటో ఆవిడని పడమనండి “ఎదురింటి సావిత్రిగారిని చూడండీ , పిల్లలు విదేశాల్లో వున్నా ఒక్కత్తి ఎంత నిబ్బరంగా ఉంటోందో , అత్తయ్యగారు ఆవిడని చూసి నేర్చుకొంటారు లెండి “అనేసి ఇంక ఎవరి జవాబులు వినాల్సిన పని లేదు అన్నట్టు లోనికి వెళ్ళిపోయింది,
ప్రణతి మాటలాడిన తీరుకి ఒక్కసారి రక్తం అంత మొహం లోకి చిందినట్టు ఎర్రబడిపోయింది. అప్పుడు వెళ్లకుండా తెలివిగా మాట్లాడి పని తప్పించుకొన్నానే అని మురిసిపోయింది కానీ ఆ పసిమనసుల్లో విష బీజం తానె నాటిందన్న విషయము ఇప్పుడే బోధ పడింది.
“అత్తయ్యగారికి ఈ ఊళ్ళోనే ఏదైనా మంచి ఆశ్రమం ఉంటే చూడండి మావయ్యగారు , ఆవిడకి ఎటువంటి బాదరబందీ లేకుండా ఉంటుంది “. చేతికి కాఫీ అందిస్తూ తనమాట కూడా చెప్పేసింది మూడో కొడుకు సుభాకర్ భార్య సౌమ్య.
సౌమ్య కొంచెం కలిగినవారి అమ్మాయి, అత్తయ్యగారి స్వభావం గురించి విని వుంది కాబట్టి సహాయార్థం ఎప్పుడు ఏమి ఆవిడ నుంచి ఆశించలేదు, పట్నంలో తమ ఇంటి గృహప్రవేశానికి పిలవడానికి వచ్చి దగ్గరుండి తీసుకొని వెళదామని వస్తే , ఎక్కడ పని చేయవలసి వస్తుందో , ఏఏ భాద్యత మీద వేస్తారో మనకెందుకు అనుకోని కొడుకుని పిలిచి “అబ్బాయ్ నాకు ఆ సంప్రదాయాలు, పూజల గురించి ఏమి తెలియదు , వచ్చిన వాళ్ళకి మర్యాదలంటివి ఏమి చెయ్యలేను, వంగి వడ్డించటం చేతకాదు మీ వీలును మీరు కార్యక్రం చేసేసుకోండి”. అని తెగేసి చెప్పేసింది. పని కోసం కాదు పేద్దవాళ్ల ఆశీర్వాదం కోసం మాత్రమే అని వొప్పించి తీసుకొనివెళితే అక్కడ ముక్తసరిగా ఒక్క రోజు ఉండి వచ్చేసింది. ఆ రోజు ప్రవర్తించిన తీరుతో ముగ్గురు కోడళ్ళకి ఆవిడ మీద వున్నా ఆకాస్త గౌరవం కూడా పోయింది. మామగారిమీద వున్నఅభిమానం కొద్దీ, శేషగిరి, సుభద్రాలమీద వున్న ప్రేమ కొద్దీ ఇన్నాళ్లు వచ్చివెళుతున్నారు, మామగారు పోయాక ఇంక దాచవలసిన అవసరం లేదని పిల్లలు తమ మనసులోని మాటలని నిఖచ్చిగా చెప్పేసారు.
ఇలాంటి మాటలు వినాల్సి వస్తుందని అనుకోని కాంతం ఈ హఠాత్ పరిణామం తట్టుకోలేకపోయింది. సుభద్రమ్మ ముందుతేరుకోని కాంతంగారిని తనగదిలోకి తీసుకొని వెళ్లి మంచం మీద పడుకోపెట్టిందీ. స్వాంతనగా “కాసేపు పడుకో అక్కా”అని తలుపు చేరవేసి వెళ్ళింది. మొదటిసారి కాంతానికి తానూ ఒక్కసారిగా వంటరి అయిపోయాను అన్నభావం కలిగింది. తనను ఎవరో బలవంతంగా అగాధం లోకి తోసేశారు అన్నట్టు అనిపిస్తోంది. తాను సుభద్ర ఒకేసారి కాపురానికి వచ్చాము, సుభద్ర మాటతీరు , కలుపుగోలుతనం , అన్ని పనులు మీద వేసుకొని పనిచేసే తత్త్వం , అందరు తనవాళ్ళేఅనిపించేలా మాట్లాడటం చూసి తాను ఎన్నోసార్లు వారించింది . . . ఇలా ఉంటే లోకువ కట్టేస్తారు , అనవసరపు ఖర్చులు పెరుగుతాయి అని తనలా ఉంటే అందరు భయభక్తులతో వుంటారు అని వాదించేది . . కానీ సుభద్ర మాతం “అక్కా మనం ప్రేమని ఆచరణలో చేసి చూపిస్తేనే కదా పిల్లలు అలవరచుకొంటారు, మనమే మనకెందుకు అనేలా ఉంటే రేపు వాళ్ళు అలాగే తయారవవుతారు” అని ఎన్ని సార్లు చెప్పినాతాను పెడచెవిన పెట్టింది . ఎంత ఆపుకుందామనుకొన్న కన్నీళ్లు ఆగటం లేదు .
“వెళ్లివస్తాము బాబాయ్ “పిల్లల గొంతు విని బావురమని ఏడుస్తూ బయటికి వచ్చింది .
ఊరుకో వొదిన !పిల్లలిని వేళ్ళని , మనస్ఫూర్తిగా వాళ్ళు నిన్ను రమ్మని పిలవనప్పుడు నువ్వు అక్కడికి వెళ్లినా సంతోషం గా ఉండలేవు , వాళ్ళకి భారం అవుతావు కానీ బంధం గా కలిసిమెలిసి ఉండలేవు, కన్న కొడుకులే కదా ధర్మం ఎందుకు చేయరు అని అనుకున్నావు, నీ ధర్మం నువ్వు చేయలేదుకదా అని వాళ్ళు గుర్తుచేశారు. రక్తసంబంధం ఉంది కాబట్టి కొడుకులతో అనుబంధం సహజం గానే ఉంటుంది కానీ కోడళ్ళు, మనమలతో ప్రయత్నపూర్వకంగా ఐనా అనుబంధం పెరిగేలా మసలుకోవాలి. అది నువ్వు నిర్వర్తించలేదు. నీ ప్రవర్తనే బాగుండి ఉండి ఉంటే పిల్లలు ఈ రోజు ఇలా మాట్లాడివుండేవారు కాదు, అప్పట్లో నీ తప్పుల్ని సరిదిద్ద లేకపోయాము, ఈ రోజు పిల్లలు చేస్తున్నది తప్పు అనే అధికారం , అర్హత పోగొట్టుకొన్నాము.
“అదేమిటండి మీరు కూడా పిల్లల్ని సమర్థిస్తున్నారు పిన్ని బాబాయ్ మాట లకి అడ్డు పడింది.
లేదు సుభద్ర! వాస్తవం ఈ రోజైన వొదినకి తెలియాలి, వయసులో మనం పెద్దవాళ్ళం గా చేస్తున్న తప్పులని ఎవరు అంతగా విమర్శించము , మొదటినుంచి వాళ్ళతీరే అంత అన్నట్టు, అది సహజమే అన్నట్టు మాట్లాడతాము , అదే ధోరణి పిల్లలో కనిపిస్తే భూతద్దం లో చూసి దోషులుగా ముద్రలు వేస్తాము, దీనికి వత్తాసు పలుకు తున్నట్టు నేటి టీవీ సీరియల్స్, సినిమాలు కూడా కుటుంబలో కలతలు , కలహాలకు కేవలం పిల్లలే మూలకారణం అన్నట్టు చిత్రీకరిస్తున్నారు, కానీ వాళ్ళు ఆలా మారడానికి, మాట్లాడటానికి మనలాంటి పెద్దలే భాద్యులు.
అవమానభారంతో ఇంక నిలబడలేనట్టు నేల మీద కూలబడిపోయింది కాంతం. శేషగిరి దగ్గరగా వచ్చి భుజం మీద చేయి వేసి “కంగారు పడకు వొదిన , నీకు అండగా నేను సుభద్ర ఎప్పుడు ఉంటాము . అని , దీనంగా నిలబడిపోయిన పిల్లలిని చూసి “సమయం అవుతోంది బయలుదేరండి , అమ్మ భాద్యత ఇకనుంచి మాది, కొన్నాళ్ళు అమ్మని వంటరిగా ఉంచుదాము, వంటరితనం మనిషిని ఆలోచింప చేస్తుందని నా నమ్మకం . ఏఏ సాకులు చెపుతూ ఈ పరిస్థితిని తెచ్చుకొందో వాటిని సరిద్దుకొనే అవకాశం ఇద్దాము. అప్పుడైనా “కొడుకూకోడల్లే సరవశ్వం అని తెలిసుకొన్నాను, వాళ్ళ కష్టసుఖాల్లో పాలు పంచుకోగలను, మనమలతో ఆడుతూపాడుతూ జీవితం గడపగలను” అనిపించేలా కాలం మార్పు తీసుకు వస్తుందేమో, వేచి చూద్దాము అంటూకొడుకుల భుజాల చుట్టూ చేయివేసి భారంగా బయటికి సాగనంపారు . కన్నీటి తెరలమధ్య దూరమవుతున్న బంధాలని చూస్తూ నేలమీద ఒరిగిపోయింది కాంతమ్మ.

2 thoughts on “మూడు సాకులు

  1. Nice narration… Lokamlo nakemi chesavani neeku cheyyali ane kodukuluntaru tasmath jagratta ani cheppinatluga chala bagundi…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *