February 21, 2024

లోతైన ఆలోచనల కథలు … అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు.


సమీక్ష: లక్ష్మీ రాధిక

“ఔను..వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు”.. చాలా చక్కని ముఖచిత్రంతో, చూడగానే చదవేందుకు ఉవ్విళ్ళూరించేట్టు చేసిందీ కథల పుస్తకం. వృత్తిరీత్యా శాస్త్రవేత్త అయ్యుండి కూడా చక్కని పుస్తకాలు పఠనం చేస్తూ, దానికి తగిన విశ్లేషణలు జోడించడమే కాక మంచి కథలు, కవిత్వాన్ని రాయడం ఇష్టపడతారు.. సత్య గౌతమిగారు. నిజ జీవితాన్ని ఎంతో దగ్గరగా చూసి రాసినట్టు ఒక్క కథ చదవగానే స్పష్టమైపోతుంది. ప్రతి కథా ఒకటికొకటి చాలా విభిన్నంగా ఉంటూ ఏకబిగిన చదివించేట్టు చేస్తాయి. అమెరికాలో ఉంటూ కూడా చక్కని భాషా శైలీ, దానికి తోడు సహజంగా కవయిత్రి కావడం మూలాన కవిత్వమూ..కలగలిసి మొత్తం పూర్తయ్యేసరికి మన అభిరుచుకి తగిన కథలు..వాటిలోని పాత్రలూ వెన్నంటే ఉన్నట్లు అనిపిస్తాయి. ప్రతీ కథలోనూ కొంచం జీవితానికి సంబంధించిన రసాలు కలిసి నవరసాలు చిందినట్టే అనిపించడంలో అతిశయోక్తి లేదు, ముఖ్యంగా అన్నీ ప్రముఖ పత్రికల్లో ప్రచురించబడ్డ కథలు అవడం చేత, ఎంతో శ్రద్ధగా కూర్చినట్టు తెలిసిపోతాయి. సామాజిక ప్రయోజనం ఆశించి కొందరైనా జీవితాన్ని చక్కదిద్దుకుంటే బాగుండనే ఆశావాదంతోనే కథలు ఎంచుకుని రాస్తానంటారు గౌతమిగారు.
లోతైన ఆలోచనలతో పురుడు పోసుకున్న ఈ కథలు కదిలించే దృశ్యాలై కలవరపెడతాయి. వాస్తవ దర్పణంలా ఎక్కడో ఓ కథలో మనల్ని మనం చూసుకోడమే కాక కొంత ఆలోచన చేసి, స్ఫూర్తినీ పొందుతాము. ఇక కథను అనుసరించి తగిన శీర్షిక పెట్టడం కూడా ఒక ఎత్తు. అటు వినోదమూ, ఇటు మానసిక విశ్లేషణ, కొంత సామాజిక దృక్పథము, కొన్ని వికృత పోకడలూ, అన్నిటికన్నా ఎక్కువ ప్రేమాభినివేశమూ అనుభూతి చెందుతాము. మానసిక శాస్త్రం తెలిసినంత గొప్పగా కొందరి ప్రవర్తనలను విశ్లేషిస్తూ ప్రస్తుత సమాజంలో జరుగుతున్న విభిన్న పోకడలు విప్పిచెప్పారు గౌతమిగారు. ఎన్ని మలుపులు తిరిగినా కొసమెరుపులేని కథలు చివరకు కంటతడి పెట్టిస్తాయి. మనసుని మెలిపెట్టే కొన్ని జీవితాలు, వేరే ముగింపు ఇంకలేదని తేల్చిచెప్పేస్తాయి. వెరసి ఎంతో వ్యథను తీసుకోకుంటే తప్ప ఇలాంటి కథలు స్పృశించడమూ కష్టమే అనిపిస్తుంది.
కథల్లోకి తొంగి చూస్తే మొత్తం పదహారు కథలు, దేనికదే విభిన్నంగా ఉన్నాయి. మొదటి కథే తరువు నుంచీ స్ఫూర్తిపొందిన స్త్రీ మూర్తి కథ. ‘ఆమెలా ఎందరో’ అంటూ జీవితాన్ని కష్టాల్లో కుంగిపోకుండా ఎలా దారికి తెచ్చుకోవాలో చెప్పారు.
అరమరికలులేని స్నేహానికి పునాది ఎంత గొప్పగా ఉండాలో చెడు స్నేహాల్నీ అంతే దూరం పెట్టాలని ‘పునాదిరాళ్ళు’ అనే కథలో చాలా క్లుప్తంగా చెప్పారు.
మూడవ కథ ‘కిక్కో కిక్కు’ కథలో అపాత్రదానం ఎంత అనర్ధమో కుండ బద్దలుకొట్టినట్టు చెప్తారు.దూరదేశంలో మనవారు అనుకుంటూ మంచితనానికి పోయి ఇతరులకు లోకువ కాకుండా ఎలా స్వయం ప్రకాశించవచ్చో చెప్పారు.
నాలుగవకథ ‘ప్రేమ లోకోభిన్న రుచి’ అనే కథ కొంచం పేరుకు తగ్గట్టే గమ్మత్తుగా ఉంటుంది. ఆశించి ప్రేమించిన వారి తీరుని కళ్ళకుకట్టి మనల్ని మాత్రమలా గంతలు కట్టుకోవద్దని అన్యాపదేశంగా చెప్పారు.
అయిదవకథలో నేడు అంతర్జాల మాధ్యమాల్లో జరుగుతున్న పిచ్చి పోకడలు అతి సహజంగా చిత్రించి చూపారు. ‘వలలో చేపలు’ అనే శీషికకు అత్యంత న్యాయం చేసి కథను ఆసక్తిగా, కొంచం సరదాగా రక్తికట్టించారు.
ఆరవ కథ ‘చైతన్యసీత’లో యువతులకు కావలసిన ధైర్యాన్ని, తెగువనీ చూపించారు. ఏడవ కథ ‘అలా మొదలైంది’ అంటూ విధి ఆడిన నాటకానికి చిక్కిన రెండు కుటుంబాలను కలిపి సంతోషకరమైన ముగింపునిచ్చారు. ఎనిమిదవకథ ‘మనసులో చోటు’..భర్త చాటు స్త్రీ ఇంటిల్లిపాదికీ సేవ చేసి చివరికి తనేం కోల్పోయిందో తెలుసుకొని, భర్తని మార్చుకున్న కథ. తొమ్మిదవ కథగా ‘ఔను..వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు’ అనే కథ స్వార్ధపూరితమైన ఇంట్లో ఆదరణ లభించక జీవితం ముగిసిన జంట కథ. పదవ కథ ‘ముసుగు’, చాలా మంది ఇంట్లో నిత్యకృత్యంగా జరిగే సంఘటనల సమాహారం. కొన్ని జీవితాలు చేజేతులారా ఎలా జారిపోతాయో అద్భుతంగా రాసారు.
పదకొండవ కథ ‘మనం శిక్షార్హులం’ అంటూ ఒక తల్లి కొడుకు ప్రేమను ఎలా తుంచివేసిందో విషాదంగా చెప్పారు. పన్నెండవ కథ ‘బ్లూ చుడిదార్’లో నమ్మకం యొక్క విలువను ఒక ప్రేమకథలో ఇమిడించి హృద్యంగా రాసారు. పదమూడవ కథ ‘హృదయబంధం’లో మానసికంగా ఒకటైన జంట ప్రేమను చెప్పుకోకుండానే అసువులు బాసిన కథ, ప్రేమ విలువను చెప్పి కంటనీరు తెప్పిస్తుంది. పదునాలుగవ కథ ‘మార్పు’. ఇందులో ప్రస్తుత సమాజంలో భద్రత కరువైన స్త్రీ పురుషులవల్ల గాయపడి, మరో స్త్రీనే సహవాసిగా ఎన్నుకొనే విభిన్న కథ. పదిహేనవ కథ ‘దేవుడే గెలిచాడు’లో ప్రేమను స్వార్ధం కోసం ఉపయోగించినందుకు మూల్యం చెల్లించే యువకుని కథ. ఎన్నో మలుపులతో ఆసక్తికరంగా సాగిపోతుంది. చివరిగా ‘ఉగాది’ కథలో కుంగిపోతున్న పసి మనసులో ఋతువుల రాగాన్ని చొప్పించి జీవితపు మాధుర్యాన్ని చూడటమెలాగో చెప్పారు.
ఎంతో సరళంగా, విలక్షణమైన కథలు చదివిన తృప్తి కలుగుతుంది మొత్తం పూర్తయ్యేసరికి. గౌతమిగారు ఇలానే మంచి కథలు రాసి తన ఆశయం నెరవేర్చుకొనే దిశగా ముందడుగు వేయాలని ఆశిస్తూ

1 thought on “లోతైన ఆలోచనల కథలు … అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు.

  1. నా కథలసంపుటిపై చాలా చక్కటి సమీక్ష అందించినందుకు ధన్యవాదాలు లక్ష్మీరాధిక గారూ. నా కథలను మీరింత బాగా లైక్ చేసినందుకు చాలా సంతోషంగావుంది కూడా….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *