June 19, 2024

సహవాసిని

రచన: కావ్య రాము

నీలవేణి. . . . నీలవేణి. . . . కాస్త టీ పెట్టు మా మిత్రులు వస్తున్నారు. . . . అలా సరదాగా మిర్చి చేసి పెట్టు. వాళ్ళకి నువ్వు చేసినవి అంటే మహా ఇష్టం. . . అని అంటున్న భర్తతో అవునండి నేను చేసినవన్ని అందరికి నచ్చుతాయి. . . కానీ మీకు మాత్రం నేనంటే పట్టే ఉండదు. . . . నెల రోజుల నుండి ఓ పక్క మన అబ్బాయి వంశీ ఆన్లైన్ క్లాసులంటూ, ఇంటర్వ్యూలంటూ ఆ గదిలో కూర్చొని బయటికి రాకపోతే సమయానికి అన్ని అక్కడికే అందివ్వడం, ఇటు పక్క వీణ బెడ్ రెస్ట్ కి అని పుట్టింటికి వచ్చి కాలు కదపక పడుకొని ఉంది దానికి నేనే చేయాలి. . . ఆ పని భారం నా మీదే పడి వారం రోజుల నుండి ఒక పక్కన కాలు చేతి లాగేస్తుంది అన్నా కూడా సాయం చేసిన వాళ్ళు కాదు మీదికి అది చేయు ఇది చేయు అంటూ అన్ని కూర్చున్న చోటు నుండి ఆజ్ఞలు జారీ చేస్తారు. నేను మనిషినే కదా యంత్రాన్ని కాదు కదా. . . . అంటూ ఎదురుప్రశ్నలు సందిస్తున్న నీలవేణిపై కమల్ నిప్పులు చెరగడం మొదలెట్టాడు. .
అంతలోపే కమల్ స్నేహితులు రావడంతో ఆ గొడవ ఆ క్షణం పాటు వాయిదా పడింది. . . అయినా నీలవేణి తరవాత వచ్చే ఉప్పెనకి భయపడిపోతూనే వచ్చిన వాళ్లకు టీ, మిర్చి చేసి పెట్టింది. . వచ్చిన వాళ్లంతా లొట్టలేసుకుంటూ తిని నీలవేణి ని తెగమెచ్చుకొని కబుర్లు అయిపోయాక వెళ్లిపోయారు. . . . అప్పుడే అసలు కథ మొదలైంది. . .
ఇదంతా బెడ్ పై విశ్రాంతి తీసుకుంటున్న వీణ గమనిస్తూనే ఉంది. . . తను భయపడుతుంది తండ్రి చేసే రచ్చకు ఎవరు భారీ మూల్యం చెల్లించుకోవాలో అని. .
కమల్ తన స్నేహితులు అందరూ వెళ్ళిపోయాక ఒక రకమైన మొహం పెట్టి కుర్చీలో కూర్చొని. . . తన జులుం విదిల్చాడు. . .
ఒసేయ్ నీలవేణి. . . . ఒసేయ్ ఇటు రావే అంటూ కోపంతో ఊగిపోతూ ఊగే ఉయ్యాలపై కూర్చొని పిలుస్తున్న కమల్ దగ్గరికి రానే వచ్చింది నీలవేణి. . . .
పిలిచారు. . అని అంటున్న నీలతో. . . .
పిలవలేదు అరిచాను ఆ మట్టిబుర్రకి అర్థమే కాదు అనుకున్నాను. . వినిపించను కూడా లేదా. . . ?? నీకు నా పనులు చేయడం బరువైపోయిందా ఈ వేళా. . . కొడుకు కొడుకు అని వానికి సేవ చేయొచ్చు, బిడ్డ అని దానికి సేవ చేయొచ్చు. . మొగుణ్ణి నేను ఒక్క పని చెప్తే నీకు చేదా. . . . . ??
అన్నాను కానీ చేసిపెట్టాను కదా మళ్ళీ గొడవ దేనికి. . . . ?? మళ్ళీ గొడవ అంటావెంటే. . . . . ?? అసలు నువ్వు ఏమనుకుంటున్నావ్. . . నాకు మాత్రమే చేయాలి, నేను చెప్పినట్టే వినాలి. . . నీ మాట నేనెందుకు వినాలి. . . నీతో నాకు అయింది ఏంటి, నన్నే అన్ని మాటలు అంటావా నేను అంటా. . కచ్చితంగా అంటా పడు. . . నా కిందనే మీరంతా. . . అంటూ తండ్రి గొడవచేస్తుండగా. . వంశీ జరుగుతున్న క్లాసెస్ ని ఆపేసి బయటకు వచ్చి గొడవను ఆపే ప్రయత్నం చేసినా ఆగలేదు. . . సరికదా మీది మీదికి వస్తూ నీలవేణి ని కొట్టబోయాడు. . . .
అంతలో వీణ వచ్చి అడ్డుకుంటుండగా ఆ దెబ్బ వీణకి తాకి పడబోతుంటే వంశీ చెల్లెల్ని పట్టుకున్నాడు. . . .
నీలవేణికి కోపం ఆగలేదు. . . .
ఏంటయ్యా నువ్వు చేసింది మీదికి వస్తున్నావ్ ఎన్నడూ చెయ్యి ఎత్తనోనివి కొత్తగా ఏం పోయేకాలం వచ్చింది నీకు ఆడబిడ్డలపై చేయిచేసుకునే బుద్ది ఎక్కడిది. . . ఆ పనికిమాలినోళ్ళను నలుగురిని వెంటేసుకు తిరుగుతూ లోపల ఉన్న మనిషి గుణాన్ని పూర్తిగా మర్చిపోయినట్టున్నావ్. . . . అయినా పెళ్ళాం పనికి తప్ప దేనికి పనికి రాదా. . ?? దానికి రోగం రంది ఉండదా. . . . ?? నాకు నీలా రెండు చేతులేనయ్యా ఉన్నది. . . ఎన్నెన్ని చేయను. . అక్కడ ఉన్న గ్లాస్ ఇక్కడ కూడా పెట్టరు. . . కనీసం చాతకాక పడుకుంటే అయ్యో నీలా అని అనని పాపపు జన్మ మీది. . . . అదే మీకు కాస్త నలతగా ఉంటే ప్రాణాలే పోయినంత పని చేసి మరీ మీ చుట్టూ చేయించుకుంటారు ఏం మనిషివి నువ్వు. . . . కాస్త సాయపడు అన్న పాపానికి అంతెత్తున లేస్తున్నావ్ . . . అని లోపల ఉన్న బాధనంతా బయటకు కక్కి బిడ్డను చూసుకోవడంలో మునిగింది నీలవేణి. . . .
బిడ్డకు ఎంత తాకిందో అన్న బాధలేదు. . . . కానీ నీలవేణి అలా మాట్లాడటం నచ్చని కమల్ కోపంతో అక్కడున్న వస్తువులు అన్ని పగులగొట్టి. . కోపంతో ముందు గదికి నడిచాడు. . . .
అంతలో వీణ భర్త వేణు నుండి వచ్చిన కాల్ ని లిఫ్ట్ చేసిన కమల్. . అల్లుని మాటలకు కంగారుపడిపోయాడు. . . . అల్లునికి నచ్చచెప్పబోయాడు వినలేదు. . . పరుగుపరుగున వీణ దగ్గరికి వచ్చి అసలు విషయం చెప్పాడు. . .
వీణ ఒక్క మాట కూడా మాట్లాడకపోయేసరికి కమల్ తన అల్లున్ని బతిమాలి ఏదో మాట చెప్పి కాల్ చేసాడు. . .
ఏంటి వీణ ఏమైంది అల్లునితో ఎందుకు అలా మాట్లాడావ్. . . అసలు ఏమైంది. . . అంటూ అడుగుతున్న కమల్ ని చూస్తే నీలవేణి కి కూడా కూతురు విషయంలో కంగారు పెరిగిపోయింది. .
గొడవ తాలూకు బాధ మనసులో ఉన్నా తండ్రితో మాట్లాడక తప్పలేదు వీణకి. . . .
అల్లునితో నేనే గోడవపెట్టుకున్నా. . కాస్త బెడ్ రెస్ట్ అయిపోయేదాక ఇక్కడే ఉంటా అన్నాను. . ఇప్పటికే అక్కడ చాకిరి చేసి చేసి నేను అనేదానికి ఏ మాత్రం విలువ ఇవ్వని ఆ ఇంట్లో బతుకున్నా. . . తిన్నావా అని అడిగే నాథుడు లేడు. మీ అల్లుడు ఎప్పుడో రాత్రికి వచ్చి అలసిపోయి ఉంటారు. . ఆయనకు తీరిక ఎక్కడిది నన్ను అడగడానికి. . ఆయనకు ఇవేం పట్టి. . . ఇప్పటికే ఒకసారి అబార్షన్ అయ్యింది. . కనీసం ఈ బిడ్డనైనా కాపాడుకుంటా అంటూ ఏడ్చింది. . . బిడ్డ ఏడవగానే తండ్రి కోపంతో వాళ్ళని అనడం మొదలెట్టాడు. . . తప్పులేంచేవారు తమ తప్పులెరుగరు అన్నట్టు. . .
రోజంతా అంటూనే ఉన్నాడు కానీ సమస్యను ఎలా ఒక దరికి చేర్చాలో అని అర్థం కాలేదు. . . ఆ మాటలు భరించలేక నీలవేణి చేతిలో ఉన్న బాసనలు ఒక్కసారిగా ఎత్తేసింది. . . ఏంటీ ఈ పని అంటున్న కమల్ తో అల్లున్ని సముదాయించడం రాదు. . . . ఎంతైనా నీ మేనల్లుడు కదా నీ బుద్ధులు రాక మంది గుణం వస్తదా నేనే పిచ్చిమాలోకాన్ని మీ గుణాలు తెల్వక నమ్ముతూ ఉంటా. . . . నీలాంటోనికి నేను కాకుండా ఇంకొకతి వస్తే తెలిసేది. . . . అయినా నిన్ను భరించేకంటే చావే శరణ్యం అనుకుంటది. . . . నేను ఈ చాకిరీతో, నీ సాధింపులతో రేపో మాపో హరీమంటాను అప్పుడుగానీ తెలీదు నా విలువ నీకు. . .
పో పోవే ఎవడ్ని బెదిరిస్తున్నావ్. . . లోకంలో నువ్వు ఒక్కదానివే ఉన్నవా ఎంతమంది పెళ్ళాలు చేస్తలేరు చాకిరీ మొగుళ్లకు. . . . అయినా నిన్ను కట్టుకున్నాకే నా బతుకు ఇలా తగలడింది అని వాదులాడుకున్నారు. .
అవును మరి నేనొచ్చాకే కదా ఈ ఇల్లు ఇలా నిలబడింది. . !!?? అలాంటప్పుడు నన్నెందుకు ప్రతివిషయంలో అడుగుతూ ఉంటావు. . . అలా గొడవపడి రోజంతా నీలవేణి , కమల్ లు ఎడమోహం, పెడమోహం గానే ఉన్నారు. . . రాత్రి బోజనాలయ్యాక అందరూ నిద్రలోకి జారుకున్నారు. . . . .

******

కమల్ , నీలవేణి లు నిద్ర నటిస్తూ ఎవరిఆలోచనల్లో వాళ్ళు ఉన్నారు. . . .
కొన్ని గంటల తర్వాత అటువైపు తిరిగి పడుకున్న నీలవేణి ని మాట్లాడించే ప్రయత్నం చేసాడు కమల్. . .
నీలవేణి. . ! నీలవేణి. . . . !! అని భుజం తట్టి ఎన్నిసార్లు లేపినా లేవకపోవడంతో కంగారుఎక్కువైంది కమల్ కి. . .
అప్పటికే ఆమె ప్రాణం ఆనంతవాయువుల్లో కలిసిపోయింది. . . కమల్ కి చల్లటి చెమటలు పట్టాయి. ఒక్కసారిగా ఏం జరిగిందో అర్థం కాలేదు. . గుండెని ఎవరో గట్టిగా పట్టుకొని ఉన్నంత నొప్పి. . . కళ్ళ నుండి నీళ్లు అప్రయత్నంగా వస్తూనే ఉన్నాయి. . . .
నీలా లే. . !!?? అంటూ తడబడుతున్న గొంతుతో గట్టిగా అరిచేసరికి పక్కగదిలోనే పడుకొని ఉన్న వీణ వచ్చి పరిస్థితి అర్థమై తల్లిని పట్టుకొని ఏడ్చింది. . . కొడుకు వంశీకి మరుసటిరోజున జాబ్ ఇంటర్వ్యూ ఉండడం మూలానా వేరేఊరికి వెళ్లడంతో కమల్ కి చేతులు కాళ్లు ఆడడం లేదు. . .
చూడు నాన్న. . . ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా. . ?? అమ్మని నాకు ఊహ తెలిసినప్పటినుండి వేయించుకు తిన్నావ్. . . . ఇప్పుడు సంతోషమా. . . . ?? నీ కాళ్ళకింది చెప్పులా చూశావ్. . . . !! ఇప్పుడు ఏమిలేని అభాగ్యులం అయ్యాం నాన్న. . . !! అయినా మీ మగవాళ్లకు ఇది ఏం అహం నాన్న నేను మగాన్ని నా కిందే భార్య అని. . . .
తను మీతో సమానంగా నడిచే సహధర్మచారిణిగానే ఈ ఇంట్లో అడుగుపెట్టింది కదా. . . ?? మగవాళ్ళు అయితే ఏమన్నా కిరిటాలు పెట్టాలా. . . ?? పుట్టిన దగ్గరనుండి అమ్మానాన్నల తోనే ఉండి వాళ్ళ ప్రేమను జీవితాంతం అనుభవిస్తూ ఉండే మీకంటే. . .
అందరిని , అన్ని ఆశలని వదులుకొని తనకు ఏమాత్రం సంబంధం లేని ఇంటికి మూడుముళ్లబందం అన్న బంధానికి కట్టుబడి అత్తారింట అడుగుపెడుతుంది. . . అయినా ఆ రోజు నుండి ఎవరు ఎగతాలిచేస్తారో తెల్వదు, ఎవరు అక్కున చేర్చుకుంటారో తెలీదు. . ఎవరు మాటలతో చిత్రవధ చేస్తారో తెలీదు. . . ఏ కన్ను వంకరగా చూస్తుందో తెలీదు అయినా ఒక తోలుబొమ్మలా ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. . . .
పుట్టింట్లో మహారాణిలా అమ్మ ఆలనలో తన దగ్గరకే అన్ని రప్పించుకునే ఆమె భార్యలా ఇంటిల్లిపాదికి కాళ్ళకాడికి తీసుకెళ్లాలి. . . కార్యేషుదాసి అంటే దాసీలా పడిఉండడమా మీ భర్తల మనసుల్లో. . . .
వేదమంత్రాలన్నింటిని వల్లిస్తూ మాట్లాడే మీరు కరణేషు మంత్రిలా ఆమె చెప్పేమాటలు మాత్రం పనికిరావు. . . ఎందుకంటే భార్య అంటే బానిస అని మీ మెదళ్లలో రాసిపెట్టుకున్నారు కనుక. . . . అనాదిగా రాసిన శాసనాలన్ని మగాళ్ల చేతిలో లికించబడ్డాయి కాబట్టి ఆడదాన్ని జీవితాన్ని అస్తవ్యస్తంగా చేసి అనగదొక్కి ధర్మం, త్యాగం, సహనం అనే అస్త్రాలను వదిలారు. . . .
ఒక విషయం చెప్పనా నాన్న. . . . ఆడవాళ్లకు మేధస్సు లేదు అని మీరు అనుకోవచ్చు కానీ మీ అహం మమ్మల్ని ఆహుతి చేసింది. . . .
అమ్మ కడుపులో నుండి మొదలవుతుంది ఆడబిడ్డ చదువు. ఆడపిల్ల అనునిత్యం అన్ని నేర్చుకుంటూనే ఉంటుంది. . . నిజం చెప్పాలంటే మగవాళ్ళమన్న ఆలోచనతో చాలా పనులను తప్పించుకుతిరిగే వాళ్ళ కంటే ఆడవాళ్లుగా మేము ఎంతో మెరుగు. . .
దురదృష్టవశాత్తు స్వయంగా మేమే మిమ్మల్ని ఇలా తయారుచేస్తున్నాం. . . ఒరేయ్ నువ్వు మగాడివి ఆ పనులు చేస్తావా అనో. . !! ఒరేయ్ అది నీకు బానిస నీకంటే అది ఎప్పుడు ఎక్కువ కాదు అనో. . . . !! కానీ ఒక్కటి మర్చిపోతున్నాం జీవితకాలమంతా మమ్మల్ని ఆధారం చేసుకొనే మీ మనుగడ కొనసాగుతుంది అని. . . . భార్యాభర్తల మధ్య బంధం బతికున్నంత వరకు ఒకరినొకరు కష్టమైనా ఇష్టంతో భరించుకుంటూ ఇద్దరికిద్దరు భరోసా ఇచ్చుకోవడమే నువ్వు ఏ రోజు ఇచ్చావ్ నాన్న అమ్మకి. . . . కానీ అనుక్షణం అమ్మ నీకు భరోసా ఇస్తూనే ఉంది ఆ విషయం కూడా నీకు లోకువే. . . . అందుకే అమ్మని అలుసుగా చూస్తావ్. . .
ఇప్పుడు ఏం సాదించావ్ నాన్న. . . . ఇంటికి ఆధారమైన అమ్మ ఇలా నిర్జీవంగా పడి ఉంది. . ఉన్నన్నాళ్లు ఆమెని ఒక మనిషిలా కూడా చూడలేదు. . ఎన్నో రోజులనుండి వస్తున్న నొప్పిగురించి చెబుతున్నా నిర్లక్ష్యం చేశావ్. . . . ఎలా నాన్న అమ్మ లేకుండా. . . . నాకు అమ్మ కావాలి అంటూ బోరున ఏడుస్తున్న వీణని, అలానే పడుకొని ఉన్న నీలవేణి ని చూసి కమల్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. . .
నీలా. . . . !! నీలా. . . !! నీలా నువ్వు. . . . నువ్వు. . . . నిజంగా నన్నొదిలిపోయావా. . . ?? నన్ను ఈ చీకట్లో తోసి నువ్వు మాత్రం ఆ వెలుగును చేరుకొని అక్కడినుండి చూస్తూ నవ్వుతున్నావా. . . ?? ఇక రోజు నా బద్దకాన్ని నిద్రలేపే నీ బుద్ధిమాటలు ఉండవు. . . అడగకుండానే నాలోని అంతర్యాన్ని ఎరిగి అన్ని అందించే ఆ చేతులు ఇప్పుడు దూరంగా నేను ఒంటరిగా అయ్యేలా చేసింది. . . మనకెప్పుడు ఉండే గొడవలే కదా. . . ఈ మాత్రానికి నాపై అలిగి వెళ్ళిపోతే నీమీదే బతికే ఈ ప్రాణానికి దిక్కెవరు. . . ?? పైసా పైసా కూడబెట్టి నీ చేతికిస్తే నువ్వు నీకు చాతనైనంతలో అల్లికలు చేసి సంపాదించిన వాటితోనే కదా ఈ ఇల్లు కట్టింది. . నువ్వులేకుండా నేనెక్కడ నీలవేణి. . . . . నాతో పాటుగా ప్రేమ అడుగులు వేసిన నిన్ను సంసారం అనే బంధానికి తీసుకొచ్చి నిన్ను పట్టించుకోకుండా నడిసంద్రంలో ముంచాను. . అదే నా విజయం అనుకోని గొప్పలకు పోయాను. . . ప్రేమించినప్పుడు నీగురించి పడ్డ తపన పెళ్లయ్యాక వదిలేసాను. . . నువ్వు ఎన్నిసార్లు నాతో మొరపెట్టుకున్నా పెళ్ళాం అనే పదానికి అర్థం పనిమనిషే. పనులకు, పడకగదికి తప్ప దేనికి పనికిరాదని నూరిపోసిన సిద్ధాంతాలను నింపుకున్న నరరూపరాక్షసునిలా మారిపోయాను. . .
నీ విలువ తెలుసుకోలేని వెర్రిబాబులోడిని. . . . నీతోనే నా జీవితం, నాబ్రతుకు కి అర్థం అనే విషయం మరిచిన అవివేకిని. . . రోజంతా ఎన్ని ఉన్నా నాకళ్లముందు మెదిలే నిన్ను చూస్తే నా గుండె కి ధైర్యం. . . గొడవ అయినా, గారాలు పోయినా నువ్వు నా దానివే కదా అన్న ధీమా ఎందుకో ఇప్పుడు మాయమైపోయింది నీలా. . . . ఇక నువ్వు రావని ఈ చివరి క్షణంలో నా గుండెకి తెల్సిందేమో. . . . ??
బయట పరిచయాలు ఎక్కువై వేరేవాళ్ళ భార్యలు చేసే చేష్టలు విని నువ్వు కూడా అంతే అన్న అర్థంలేని అనుమానాలతో నిన్ను హింసిస్తూ వచ్చాను కానీ అది నాకు నేనే వేసుకున్న శిక్ష అని గ్రహించేసరికి నా ఇంటి గృహిణి నా చేదాటిపోయింది. . . . . నువ్వులేని మేము అమ్మ లేని అనాథలుగా ఐపోతాం. . .
నీ గొప్పతనం తెలుసుకోలేని గర్విష్టిగా మారి గత కాలపు గుర్తులన్ని మరిచి నీ మనసును గాయం చేసాను. . . . నన్ను మన్నించకు నీలా నువ్వు లేచి వచ్చి నీ పగను తీర్చుకో. . . అంతేకాని ఇలా ఒక్కసారిగా నన్ను సుడిగుండంలో ముంచేయకు. . . .
నీలా. . . !!నీకు తెలుసా మొన్న కరీం కనిపించి తన భార్య సుల్తానా కు కూడా నీలానే ఒక పక్క నొప్పి అంటే దవాఖాన కి తీసుకెళ్తే గుండె నొప్పి అన్నారట వెంటనే ఆపరేషన్ చేపించారట. . . ఎన్నేళ్ళ స్నేహం మాది. . . ఏం మాయరోగం వచ్చిందో చిన్న మాటకు అదే అహం అడ్డొచ్చి దూరం చేసుకున్నా వాణ్ణి. . . సుల్తానా గురించి చెప్పినప్పుడు కూడా నేను పట్టించుకోలేదు. . . ఆ పరిస్థితే నీకు వచ్చిందేమో. . . . ??? నేను నిన్ను పట్టించుకోవడమే మానేసాను. . . ఒకవేళ చెల్లెలు ఎలా ఉందిరా అని అడిగితే ఏం చెప్పను నా భార్యను నేనే పొట్టన పెట్టుకున్నా అనా. . . నా ఇంట్లో దీపాన్ని నేనే ఆర్పి చీకటి చేసుకున్నా అనా. . . . !! నీలా. . . వాడికి నా మొహం ఎలా చూపించను. . . వాడే కదా మన ప్రేమని పెద్దవాళ్ళ దాకా తీసుకొచ్చి పెళ్లి జరిపించింది. . . అన్నయ్య అన్నయ్య అంటూ ఎంతో ప్రేమ చూపించే చెల్లె లేదంటే. . . . !!?నేను చేసిన తప్పుని నన్ను జీవితంలో క్షమించడు. . .
లే నీలా నేను ఎప్పుడు నిన్ను ఏమి అనను నా ప్రాణాన్ని నేనే తీసుకున్నట్టుగా ఉంది. . ఇన్నాళ్లుగా అంతెత్తున కూర్చొని శాసించిన నేను నిర్జీవంగా పడి ఉన్న నిన్ను చూడగానే అథఃపాతాళంలోకి వెళ్లినట్టుగా ఉంది. . . అంటూ నీలవేణి ని తన గుండెలకు అదిమిపట్టుకొని గట్టిగా ఏడుస్తున్నాడు నీలా నీలా అంటూ. . . .

********

నాన్న. . . !! నాన్న. . . !! అంటూ గట్టిగా పట్టుకొని లేపుతున్న వీణ మాటలు వినబడి ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు కమల్. . . .
ఒక్కసారి ఇల్లంతా కలియచూసాడు. . . . నీలవేణి ఎక్కడా కనబడలేదు. . . .
అయ్యో అయ్యో నీలా నే లేకుండానే నిన్ను పంపేసారా అంటూ బోరున ఏడుస్తున్న కమల్ తో. . . .
నాన్న. . . . ఏంటి ఏమైంది అలా ఏడుస్తున్నారు. . . అని అడుగుతుండగా. . . . వీణ మన అమ్మ ఇక మనకు లేదు అంటుండగా. . .
అవేం పిచ్చిమాటలు నాన్న. . ఏమన్నా కలగన్నారా. . . . ??? ముందు ఈ నీళ్లు తాగి తెరుకోండి అనగానే కళ్ళు తెరచి పరీక్షగా చూసాడు. . . .
ఇల్లంతా శోభాయమానంగా వెలుగుతూ దూపదీపాలతో కళకళలాడుతూ ఉంది. . . . ఒక్కసారి గట్టిగా ఊపిరిపీల్చుకున్నాడు కమల్. . .
పసుపురంగు చీరలో నుదుటిన రూపాయంత ఎర్రటి సిందూరంతో ముక్కెరతో అమ్మవారిలా కన్పించింది నీలవేణి. . . . ఆ చంద్రబింబం వంటి మోము చూడగానే మనసు స్థిమితపడింది. . వెంటనే నీలవేణి దగ్గరికి పరుగున వెళ్లి గట్టిగా కౌగిలించుకుని ఏడవడం మొదలుపెట్టాడు. . . .
నీలవేణి నోటమాట రాక అలానే నిల్చుండిపోయింది. . . .
కొన్ని క్షణాలు అలానే ఉండిపోయాక వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. . . నీలా నన్ను మన్నించు నిన్ను చాలా కష్టపెట్టాను. . నువ్వు నాతో లేవన్న కలనే నేను భరించలేకపోయాను. . . నా పిచ్చితనంతోటి నిన్న మూర్ఖంగా ప్రవర్తించాను. . . .
ఈ క్షణమే నిన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను. . . నీకు ఏమన్నా అయితే మేము ఊహించుకోలేం, నిన్ను నిర్లక్ష్యం చేసినందుకు నాపై నాకే కోపం వస్తుంది. . . .
అదేంటి అండి నాకేమైంది బానే ఉన్నా కదా. . . !! వేడినీళ్ల కాపడం పెడితే సరిపోద్ది మీరేం కంగారు పడకండి అని సమాధానపరుస్తుండగా అయినా నీలా మనం వెంటనే వెళ్ళాలి పద అంటూ చేయి పట్టుకొని బయటకు తీసుకెళ్తుండగా గుమ్మం పరదా వెనక ఎవరో కన్పించినట్టు అన్పించి చూస్తే అల్లుడు వేణు. . . . వీణ కోసం వచ్చాడు. . . తన తప్పు తెలుసుకొని వీణని క్షమాపణ అడగడానికి. . .
ఉదయం గుడికి వెళ్లిన నీలవేణి అల్లున్ని రమ్మని సర్దిచెప్పి తీసుకొచ్చింది అని అర్థమై భార్య గొప్పతనానికి, ఆలోచనను మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. . . . అలా వీణ, వేణులు ఒకరినొకరు క్షమాపణలు చెప్పుకొని కలిసిపోవడం చూసి సంతోషపడ్డారు నీలా దంపతులు. . . . అప్పుడే కొడుకు వంశీ నుండి ఉద్యోగంలో సెలెక్ట్ అయ్యాను అన్న శుభవార్త విని కమల్, నీలవేణిలు ఇంకా ఆనందంతో మురిసిపోయారు. . . ఇదంతా నా భార్య నీల పెంపకం వల్లనే సాధ్యం అయ్యింది అని, కాదు కాదు మీ క్రమశిక్షణ వల్లనే అని నీల కమల్ ను పొగడడం మొదలుపెట్టడం చూసి లేదు నీలా నీవల్లే ఈ ఇల్లు పొదరిల్లుగా ఒద్దికగా ఉంది. . నాలాంటి వాణ్ణి మార్చుకుంది కూడా నీకున్న సహనగుణమే. . . . నువ్వు నాలో సగానివి, నా సహవాసినివి అని అంటున్న కమల్ ని చూస్తూ ఇది కలనా, నిజమా అనుకుంటూ అమాయకంతో కూడిన ఆశ్చర్యంతో ఆనందపడింది నీలవేణి ఈ కొన్ని క్షణాలు అయినా తన భర్త తన కోసం ఆరాటపడుతున్నాడు అని(ఏమో మరుక్షణమే మళ్ళీ మొదటిలా మారచ్చు కదా మగబుద్ది మనం చెప్పలేం మరీ. . . .

4 thoughts on “సహవాసిని

  1. (ఏమో మరుక్షణమే మళ్ళీ మొదటిలా మారచ్చు కదా మగబుద్ది మనం చెప్పలేం మరీ. . . .) Lol … కొసమెరుపు నచ్చింది. ఎన్నో అవమానాలు పడ్డాక ఒక శ్మశానవైరాగ్యంతో మొగుడు మారినా నమ్మడము ప్రమాదమే. బావుంది, మంచి ట్విస్టులు కూడా పెట్టారు, కావ్యగారూ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *