April 19, 2024

హాస్యపు విరిజల్లు నవ్వుల నజరానా

సమీక్ష: సి. ఉమాదేవి

మనిషి జీవితంలో హాస్యం ఒక ఉద్దీపనగా భావించవచ్చు. హాస్యంలేని మనుగడ ఉప్పులేని కూరలా రుచించదు. ఇరవై ఆరుమంది రచయితలు, రచయిత్రులు హాస్యాన్ని తమదైన శైలిలో తమ రచనలలో పొందుపరచి మనకు ఆనందాలహరివిల్లునందించారు.

ఇక కథలలోకి అడుగిడితే కథలన్నీ విభిన్న హాస్యసంఘటనలతో మిళితమై మనలో చిరునవ్వులు పూయిస్తాయి. వంగూరి చిట్టెన్ రాజు కథ మనల్ని అలరించడమే కాదు మనకు అమెరికా వాహనయోగం కథలో కారు కష్టాలను కళ్లకు కట్టినట్లు హాస్యస్ఫోరకంగా వివరించడం ఆకట్టుకుంటుంది. మణివడ్లమాని రచన అ-అప్పలకొండ, ఆ-ఆనందరావు మరో చక్కని కథ. పక్కింటి ముసలమ్మ మరణిస్తే అన్నీ దగ్గరుండి జరిపించినందుకు ఆవిడ ఆత్మతనచుట్టు తిరుగుతున్న వైనం. ఆ ఆత్మ ఇల్లు వదలి వెళ్లాలంటే తనే చనిపోయినట్లు నటించడం ఆనందరావులోని మూర్ఖత్వానికి పరాకాష్ఠగా చక్కగా వివరించారు. ఉమాదేవి కల్వకోట రచన బామ్మగారి బోస్టన్ ప్రయాణం. బామ్మగారి బోస్టన్ ప్రయాణం ఊరువాడ ఏకమై ప్రచారం చేస్తుంటే ఆమె కొడుకు హనుమంతరావు ఆశ్చర్యానికి గురవుతాడు. చివరకు మనవరాలి ప్రసవానికి తనే వెళ్లాలన్న పట్టుదలతో బోస్టన్ కు ప్రయాణమవడం విమానయానంలో ఆమె ప్రవర్తనాసరళి మనల్ని నవ్వులలో ముంచెత్తుతాయి.

వెంకట్ అద్దంకి రచన అతిసంశయ మనల్ని జాగ్రతగా ఉండమని హెచ్చరిక కూడా చేస్తుంది. ఫోను చేసి మరీ మీకు లక్కీడిప్ గెలుచుకున్నారు అని చెప్పడం మనల్ని కాసేపు మైమరిపించినా వాటి వెనుకనున్న ప్రణాళికలు అర్థమైనపుడు మనం జాగ్రత్త పడాలనే సందేశాన్నీ హాస్యం జోడించి మరీ వర్ణించడం బాగుంది. సయ్యద్ నజ్మా షమ్మీ ఉత్తమ మొగుడు కథ హాస్యాన్ని రంగరిస్తూనే భర్తల పడు పాట్లను కళ్లకు కట్టింది. భార్య షాపింగ్ ను తప్పించుకోవడానికి చీరకట్టుకుని భర్త షాపునుంచి వెళ్లిపోవడాన్ని కొడుకు గమనించి చెప్పడం హాస్యం పండించడమే. మాలాకుమార్ రచన దొంగగారూ స్వాగతం కథ నిద్రలోనే దొంగవచ్చాడని కలవరపడటం భర్త వంతయితే నిజంగా దొంగ వచ్చాడని భార్య భయపడటం నవ్వులు పూయిస్తాయి. చివరకు గులాబి ఫోటోలున్న సెల్ ఫోనును దొంగ ఎత్తుకెళ్లిపోవడం చివరి మలుపు. గిరిజారాణి కలవల కథ జలజాక్షి జలజాపతి నేటి ఫేస్ బుక్ తీరుతెన్నులను రసాత్మకంగా వర్ణించడం అలరిస్తుంది.

జి. యస్. లక్ష్మి కథ తాజాతాజా పెళ్లిబాజాలు మనసులు కలిసిన ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడం మంచిదేకాని పదేపదే విభిన్న రీతులలో పెళ్లి చేసుకోవడం హాస్యాన్ని పంచుతుంది. డా. పి. విజయలక్ష్మి పండిట్ కథ దోమలవేట దోమల స్వగతాన్ని కూడా వినిపించింది. రైలులో సైతం దోమల బ్యాటుకు పనిపట్టే ఆలోచన త్రివిక్రమరావుది. దోమల బ్యాటు విన్యాసాలు అందరిని కలవరపరుస్తాయి. చివరకు కుట్టిన దోమల తాకిడికి త్రివిక్రమరావు కలవరపడతాడు. దోమలు నవ్వుకోవడం చూసి మనము నవ్వుకుంటాం. ఆయాసానికి గుండె ఆపరేషను పి. యస్. యమ్. లక్ష్మి మనకందించిన మరో చక్కటి కథ. ఎప్పుడు అదేపనిగా తినే ధనలక్ష్మి ఆయాసంతో డాక్టరును కలవాలనుకోవడమే కాదు అందరికీ తనకు పెద్దవ్యాధి వచ్చిందని చెప్పాలనుకోవడం కొసమెరుపై ఆకట్టుకుంటుంది. శ్రీ సత్య గౌతమి జె. వలలో చేపలు కథ నేటి సమాజ దృక్పథాన్ని హాస్యం మిళితం చేసి మనకందించారు.

మంథా భానుమతి కథ, అడ్డం తిరిగిన కథ. రచయిత విజయ సారథి కథాన్వేషణలో విషయ సేకరణకు ఎలా ప్రయత్నిస్తాడో వివరిస్తూ రచయితనే తిరిగి తన ప్రశ్నలతో తిరకాసులో పడేసిన ఆటో డ్రైవరు రాము మనలో హాస్యపు జల్లు కురిపిస్తారు. ఇంకా ఎందరో నిష్ణాతులైన రచయితలు, రచయిత్రులు హాస్య కథలతో మనల్ని ఆనందింప చేస్తారు. అందరికీ శుభాభినందనలు.

1 thought on “హాస్యపు విరిజల్లు నవ్వుల నజరానా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *