April 20, 2024

టాన్యా! ఐ లవ్ యు

డా. తంగిరాల మీరాసుబ్రహ్మణ్యం

కారు మెల్బొర్న్ పట్టణం దాటి జీలాంగ్ అనే ఊరి మీద రయ్యిమని దూసుకు పోతోంది.
అల్లుడు కారు నడుపుతుంటే పక్కన కూర్చుని బాక్ సీట్ డ్రైవింగ్ చేస్తోంది నా కూతురు. ‘ కాస్త స్పీడ్ తగ్గించు, జాగ్రత్త రెడ్ లైట్ వస్తోంది, పదినిముషాల్లో లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి ‘అంటూ.
ఆస్ట్రేలియా అనగానే ముందుగా స్ఫురించేది సిడ్నీ, మెల్బొర్న్ పట్టణాల పేర్లే. మెల్బొర్న్ డౌన్ టౌన్ కి వెడితే తప్ప హడావిడీ, జనం కనబడరు.
అమెరికాలో ఉన్నట్టు కాకుండా ఇక్కడ ఇళ్ళు కాస్త దగ్గర దగ్గరగా వున్నాయి. ఆడంబరంగా కనిపించక పోయినా ఇంటి ముందు పచ్చని పచ్చిక లాన్స్, విచ్చిన పూలతో కనువిందు చేసే పూల మొక్కలు, నున్నని రహదారుల పొడవునా అటు ఇటు సతత హరితాలలా మనం నీలగిరి చెట్లుగా పిలుచుకునే చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది.
వూరు దాటాక ఎకరాల కొద్దీ పరచుకున్న ‘ డారావారా’ లాటి వైనరీ ఎస్టేట్స్ ఇక్కడి ప్రత్యేకత.
మెల్బోర్న్ చుట్టు బోలెడు బీచ్ లు వున్నాయి. ప్రస్థుతం మేము వెడుతున్నదీ దగ్గరలో వున్న సముద్ర తీరానికే.
జీలాంగ్ ప్రశాంతమైన చిన్న వూరులా వుంది . కిటికీ కొంచెం తెరిచి కుతూహలంగా బయటకు చూస్తున్నా.
అమెరికా చాలా సార్లు వెళ్ళాను గానీ ఆస్ట్రేలియా రావడం ఇదే మొదటిసారి.
బయటకు చూస్తుంటే అక్కడక్కడ అలంకార వస్తువులు అమ్మే అంగళ్ళు, చర్చ్, నిరాడంబరంగా వున్న ఇళ్ళు దాటి పోతుండగానే సముద్రపు గాలి ఆత్మీయంగా ముఖాన్ని తడిమింది.
కొద్ది దూరం పోగానే మేము వెళ్ళాలని అనుకున్న సముద్ర తీరానికి చేరాము.
పేరు తమాషాగా వుంది ‘ఫిషర్ మాన్స్ బీచ్ ‘ట. కారు పార్కింగ్ లో పెట్టి , రోడ్డు మీదినుండి ఏటవాలుగా దిగి ఇసుకలో నడవడం మొదలు పెట్టాము. .
ఎగసి పడే అలలతో అలజడి చేయకుండా కాస్త ఒద్దికగా కనబడింది సముద్రం .
ఒకవైపు ఓ పదిమంది హుషారుగా బంతి ఆట ఆడుతున్నారు. రెండు, మూడు కుటుంబాలు కలిసి వచ్చినట్టున్నారు.
సందర్శకులు కూర్చోవడం కోసం అక్కడక్కడా సిమెంట్ బెంచీలు వున్నాయి. ఒకవైపు ఎత్తుమీద టాయిలెట్స్ కనబడ్డాయి.
“అయ్యో మళ్ళి ఇంత పైకి ఎక్కి రావాలా” అని దిగులు పడితే నవ్వింది తులసి. “సీనియర్ సిటిజెన్స్ కోసం దగ్గరలోనే మొబైల్ టాయిలెట్స్ వుంటాయిలేమ్మా. ” అని.
కొంచెం నీడగా వుండే చోటు చూసుకుని మా సంచీలు, సరంజామా అన్నీ పెట్టుకుని కూర్చున్నాము.
పాప నీళ్ళ దగ్గరికి పరిగెత్తు తుంటే ‘జాగ్రత్త ‘ అంటొంది మా పెద్దమ్మాయి.
ఇంతలో అక్కడికి వచ్చిన వారికి సౌకర్యాలు ఎలా వున్నాయని సర్వే చేయడానికి వచ్చింది ఒక ఆస్ట్రేలియన్ స్త్రీ. ఆస్త్రేలియా వారి ఇంగ్లిష్ ప్రొనన్సియేషన్ బ్రిటిష్ వారి మాట తీరుకు దగ్గరగా వుంటుంది. మనకు బాగానే అర్థమవుతుంది.
అంటే పరిసరాల శుభ్రత, సాటి సందర్శకుల ప్రవర్తన వంటి విషయాల గురించి అడిగి, రాసుకుంది.
“అదిగో అక్కడ మన వాళ్ళు కన బడుతున్నారు” సంబరంగా అన్నాను అక్కడో చీర కట్టుకున్న ఆమెను చూసి.
అంటే ఆస్ట్రేలియాకు వచ్చిన అమ్మానాన్నలను సముద్ర తీరానికి వెంటబెట్టుకు వచ్చిన మనవాళ్ళన్నమాట.
నీళ్ళలో అటు ఇటు పరిగెత్తి బట్టలు తడుపుకుని వెనక్కి వచ్చింది పాప. దానికి ఈత బాగా వచ్చు గానీ అమ్మ సముద్రంలోకి దిగనివ్వదని తెలుసు.
“అమ్మమ్మా! మొన్న మనం ఎక్కడికి వెళ్ళాము చెప్పు? అంటూ నా మీద ప్రశ్న సంధించింది.
“అదేమిటే అప్పుడే మరచి పోయావా? ఫ్లిండర్స్ స్ట్రీట్ కి రైల్లో వెళ్ళాము కదా! సౌత్ బాంక్ స్టేషన్ లో మీ అమ్మ “మై కీ” రిచార్జ్ చేసింది కదా మనందరికి మెట్రో టికెట్స్ కోసం. వెళ్ళేటప్పుడు, మళ్ళీ వచ్చేటప్పుడు స్వైప్ చేసాము గుర్తుందిలే “ అన్నాను.
“కరెక్ట్ అక్కడ మనం చూసి అ రివర్ పేరేమిటి?” ఇంకో ప్రశ్న.
నాకు అర్థమయ్యింది. చిన్నది నాకు పరీక్ష పెడుతోందన్నమాట. ఇంట్లో కళ్ళద్దాలు, ఫోను ఎక్కడో పెట్టేసి వెతుకుతూ వుంటాను కదా అందుకు నా జ్ఞాపకశక్తిని పరీక్షిస్తోంది.
ఓడిపోకూడదు. ” గుర్తుందిలే. యారా రివర్, ఇంకా మనం ఫెడెరేషన్ స్వ్కేర్ , అక్కడ కేతెడ్రెల్ ముందు బోలెడు దీపాలతో అలంకరించిన క్రిస్మస్ ట్రీ కూడా చూసాము. ఈ దేశం ప్రత్యేకత ఎండాకాలంలో క్రిస్మస్ పండుగ రావడం అంది కదా మీ అమ్మ. అక్కడ రెండు గుర్రాలు లాగే బగ్గీ రైడ్ కు కూడా వెళ్ళాముకదా! “ విజయోత్సాహంతో చూసాను మనవరాలి వైపు.
చిలిపిగా నవ్వుతోంది.
కాసేపు అలా తిరిగి, సముద్ర స్నానం చేయకపోయినా శాస్త్రానికి కాసిని నీళ్ళు నెత్తిన జల్లుకుందామని తులసి చేయి గట్టిగా పట్టుకుని నీళ్ళ్లలోకి దిగి, కాళ్ళకింది ఇసుక కొట్టుకుపోతే కెవ్వుమంటూ వెనక్కి రావడం పాప నవ్వడం.
కడుపులో కరకర లాడుతుంటే పులిహోర, పెరుగన్నం డబ్బాలు బయటకు తీసాము. తెలుగు వాళ్ళు అమెరికా వెళ్ళినా, ఆస్త్రేలియా వెళ్ళినా ఆప్యాయంగా తినేది మాత్రం పులిహోర, పెరుగన్నమే కదా.
ఒక్క మెతుకు కింద పడకండా తినేసాక, కాగితాలు, కవర్లు తీసుకెళ్ళి దూరంగా వున్న చెత్త డబ్బాలో వేసి వచ్చారు పిల్లలు.
అందరూ అటువంటి క్రమశిక్షణ పాటించబట్టే సముద్ర తీరం శుభ్రంగా వుంది.
కడుపు నిండిందేమో , బద్దకంగా వెనక్కి జారగిలబడి చుట్టూ చూస్తుంటే కనబడిందామె.
మరగ కాచిన పాలవంటి తెలుపు దేహచ్చాయ, ముఖాన ముదిమి వయసు గీచిన గీతలు, చిన్న గులాబి రంగు పూలు వున్న గౌను. ఒంటరిగా కూర్చుని వుంది. గొంతు క్రింద, జబ్బల దగ్గర వదులుగా వ్రేలాడుతున్న చర్మం చూస్తే ఎనభై ఏళ్ళ పైనే వున్నట్టు వుంది . చెంపల మీద, చేతుల మీద వయసు మీరిన వారి చర్మం మీద ఏర్పడే మచ్చలు స్ఫుటంగా గోచరిస్తున్నాయి.
అమెరికాలో లాగే, ఇక్కడా ఎనభై ఏళ్ళ వాళ్ళు కూడా ఒక్కరూ కారునడుపుకుని వెళ్ళి తమ పనులు చక్కబెట్టుకోవడం మామూలే.
కానీ చుట్టుపక్కల జరుగుతున్న దేనితోనూ సంబంధం లేనట్టుగ నిరాసక్తంగా వున్నాయి ఆమె చూపులు .
భయమో, దిగ్భ్రాంతియో, తత్తరపాటో, చుట్టూ జరుగుతున్నదేమిటో అర్థం కానప్పుడు కలిగే, గందరగోళమో, అన్నీ కలిసిన ఒకానొక మానసిక స్థితిలో వున్నట్టు వుంది ఆమె.
లోకం తెలియని పసిపాప అమ్మ నుండి తప్పిపోయి, అపరిచిత వ్యక్తుల, పరిసరాల నడుమ చిక్కుకు పోతే బిత్తరపోయి, బిక్కు బిక్కుమంటున్నట్టుగా వుందామె.
ఆమె భుజానికి వున్న హేండ్ బాగ్ తప్ప తినడానికేమీ తెచ్చుకున్న జాడ కనబడలేదు.
నా ఆలోచన గ్రహించినట్టుగా మా అల్లుడు “ఆ బిస్కెట్స్, పళ్ళు ఇచ్చి పలుకరించి రాకూడదూ? అన్నాడు తులసితో.
కుతూహలంకొద్దీ తులసితోబాటు నేనూ వెళ్ళాను.
“హాయ్. ఐ యాం తులసి ఫ్రం ఇండియా ” అంటూ షేక్ హాండ్ కోసం చేయి జాపింది తులసి స్నేహంగా నవ్వుతూ.
ఆవిడ ఆ మాటలు వినిపించుకోనట్టే ఎక్కడో చూస్తూ వుండిపోయింది.
“మీరు లంచ్ తెచ్చుకున్నట్టు లేదు. ఈ పళ్ళు, బిస్కెట్స్ తీసుకోండి ” అని అందివ్వబోయింది.
వుహు. ఆమె దృష్టి మరల్చలేదు. పలుక లేదు.
తులసి నావైపు ఏం చేద్దాం అన్నట్టు చూసింది.
“మే ఐ సిట్ హియర్? “ అని అడిగి చొరవగా పక్కన కూర్చున్నాను.
ఆమె కళ్ళు తిప్పలేదు. నాకేసి చూడలేదు. ‘వినబడలేదా? అనాసక్తతా?’ అర్థం కాలేదు.
దూరం నుండి మా వారు, తులసి భర్త ఇటే చూస్తున్నారు.
చేసేదేమీ లేక నేను లేచినిలబడ్డాను, ‘ పద వెడదాము ‘ అంటూ.
అంతలో అటువైపు నుండి ” మీరు తెలుగువారా?” అన్న కమ్మని పలుకు వినవచ్చింది.
వాళ్ళే ! ఇందాక చీరలో కనబడిన మనవాళ్ళు. అయితే మాట్లాడింది కొడుకు.
” ఏదో సమస్య వుంది మేడం. చాలాసేపటినుండి అలా ఒంటరిగా వులుకు పలుకు లేకుండా కూర్చుంది ఆవిడ. మేము కూడా పలుకరించాలని ప్రయత్నించాము. తన లోకంలో తాను వుంది ఆమె. అందుకే పోలిస్ కి ఫోన్ చేసాము. ఇంకాసేపట్లో వస్తారేమో. మేము త్వరగా వెళ్ళాలి. కాస్త మీరు చూస్తుంటారా?” మర్యాదగా అన్నాడు అతను.
“అలాగే. మీరు వెళ్ళండి. మేము ఇంకో గంట ఉంటాము. అప్పటికీ పోలిస్ రాకపోతే ఇంకెవరికైనా చెప్పి వెళ్తాము. ” అంది తులసి.
వాళ్ళు వెళ్ళిపోయారు. మేము ఆమెకు దగ్గరగా నిలబడిన విషయం కూడా గమనించనట్టు అర్థం లేని చూపులతో అలా కూర్చుంది ఆ ముసలావిడ.
నాకేమిటో గాభరాగా వుంది. “ ఈవిడకి ఎవ్వరూ లేరా? నడచి రాగలిగిన దూరం కాదు కనుక కారులోనే వచ్చి వుండాలి. ఎవరో తెచ్చి వదిలేసి పోయారా? ఎవరో ఏమిటో పాపం “ తులసితో గుస గుసగా అన్నాను.
మనిషికి ముసలితనం మీద పడే సమయానికి ఎందుకో. కళ్ళు, చెవులు, కాళ్ళు, బుర్ర ఏవీ సహకరించ కుండా పోతాయి.
బహుశ శరీరం మీద వ్యామోహం తగ్గి మరణాన్ని అంగీకరించేట్టు సిద్ధం చేయడమా? అందుకేనేమో నిత్యమూ దేవుడిని ప్రార్థిస్తాము ” వినా దైన్యేన జీవితం సునాయాసేన మరణం ఇవ్వు స్వామీ అని.
ఇందుకోసమేనా మన వేదాలు అంత మంచి దీవెన ఇచ్చాయి ” నందామ శరదశ్శతం, మోదామ శరదశ్శతం, శృణుయామ శరదశ్శతం, భవామ శరదశ్శతం , జీవేన శరదశ్శతం ” అంటూ అనందంగా, సంతోషంగా, వినికిడి మొదలైన సర్వేంద్రియాలు స్వాధీనంలో వుండి చక్కగా పనిచేస్తూ, నూరు శరత్తులు జీవించుదాము అని.
నా అలోచనలను చెదర గొడుతూ పైన ఆకాశంలో హెలికాప్టర్ శబ్ధం వినబడింది
తక్కువ ఎత్తులో ఎగురుతూ గింగిరాలు కొడుతోంది. అలా చూస్తుండగానే ఆకాశంలో అక్షరాలు కనిపించాయి.
” టాన్యా ఐ లవ్ యు విల్ యు మారీ మి? ” అని. ఎవరో ప్రేమికుడు తన ప్రేయసికి కొత్త రకంగా ప్రపోస్ చేస్తున్నట్టు వున్నాడు.
ఆశ్చర్య మేమంటే అంతవరకు బాహ్య ప్రపంచంతో సంబంధం లేనట్టు కూర్చున్న ఆ ముసలావిడ తలెత్తి చూసి, పెదిమలు కదుపుతూ ఆ వాక్యం చదివి, వెంటనే లేచి నిలబడింది.
” జోసెఫ్! జోసెఫ్ ” అని పిలుస్తూంది.
తులసికి మెరుపులాటి వూహ కలిగి ” ఆర్ యు టాన్యా? ఈస్ జోసెఫ్ యువర్ హస్బండ్?” అనడిగింది.
“యెస్. హి హాస్ గాన్ టు సీ ద డాక్టర్ ఐ మస్ట్ గో”. అని అడుగు ముందుకు వేసింది ఆమె.

ఇంతలో శబ్ధం చేసుకుంటూ ‘పోలిస్ ‘ అని రాసివున్న తెల్లని కార్లు రెండు అక్కడికి వచ్చాయి.
ఒకదానిలోనుండి బ్లూ డ్రెస్ లో , తల మీద బ్లూ కాప్ తో వున్న లేడీ ఆఫీసర్, మరొక కారునుండి మేల్ ఆఫీసర్ దిగి దగ్గరగా వచ్చారు.
” మీరేనా ఫోన్ చెసింది?” రాగానే ముసలామె దగ్గరగా నిలబడిన మమ్మల్ని అడిగింది ఆ లేడీ ఆఫీసర్.
కాదనీ, ఫోన్ చేసిన వాళ్ళు అర్జెంటుగా వెళ్ళిపోతూ మాకు చెప్పారని జవాబు చెప్పింది తులసి.
“మేడం కెన్ ఈ హెల్ప్ యు? “ మృదువుగా అడుగుతూ ఆ పెద్దామె భుజాన వున్న హాండ్ బాగ్ తీసుకుని తెరిచి చూసింది లేడి పోలిస్ ఆఫీసర్.
అందులోనుండి ఆమె డ్రైవింగ్ లైసెన్స్ తోబాటు ఆమె భర్త కార్డ్ కూడా పైకి తీసింది.
” సో యు ఆర్ టాన్యా! రైట్?” అడిగింది ఆఫీసర్.
” యెస్ ” అందామె సందిగ్ధంలో వున్నట్టు చూస్తూ.
“ యువర్ హస్బండ్స్ నేం ఈస్ జోసెఫ్. రైట్? “
ఆఫీసర్ ప్రశ్నకు ఈసారి కూడా ” యెస్ హి హాస్ గాన్ టు సీ ద డాక్టర్. ఐ మస్ట్ గో ” అంటూ ఇందాకటి మాటే తిరిగి చెప్పిందామె.
“ నా వూహ నిజమే అయింది చూసావా!“ అన్నట్టు నా వైపు చూసింది తులసి.
“ఒకె మేడం! వుయ్ విల్ గో ఇన్ మై కార్ అండ్ దట్ ఆఫీసర్ విల్ కం విత్ అస్ ఇన్ యువర్ కార్. ” అంటూ ఆమెను ముందుకు నడిపించింది.
ఒక్క మాట కూడా పలుకకుండా పోలిస్ వెంట నడిచింది ఆమె .
జరుగుతున్న దేమిటో ఆమెకు అర్థం కాలేదని బ్లాంక్ గా వున్న ఆమె కళ్ళు చెబుతున్నాయి .
అంతలో గుర్తుకు వచ్చినట్టు ఆ లేడీ ఆఫీసర్ వెనక్కి తిరిగి ‘థాంక్యు గైస్ ‘ అని మాకు చెప్పి వెళ్ళిపోయింది.
అంతవరకు వూపిరి తీసుకోవడం కూడా మరిచిపోయినట్టు ఆ సంఘటనలో లీనమై పోయి, నిలబడి నిశ్శబ్ధంగా చూస్తున్న మా వారు, మా అల్లుడు , మేము దీర్ఘంగా శ్వాస తీసుకున్నాము.
“ఆమె అల్జిమర్స్ పేషెంట్ అయివుంటుంది అమ్మా.
భర్త ఎందుకో డాక్టర్ దగ్గరకు వెడితే ఈవిడ కారు తీసుకుని పరాకుగా ఇక్కడికి వచ్చేసిందిలా వుంది. ” అంది తులసి.
“ఇంత దూరం అంత జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుని ఎలా?” నమ్మలేనట్టు చూసా.
“అలవాటైన దారి అయివుంటుంది అమ్మా. తీరా వచ్చాక ఎందుకు వచ్చిందో మరచి పోయింది. పాపం. ” జాలిగా అంది.
” కానీ వాళ్ళిద్దరి మధ్యన ప్రేమ ఎంత గొప్పదో! అనుకోకుండా ఆ హెలికాప్టర్ ” టాన్యా ఐ లవ్ యు ” అని ఎవరో ప్రేమికుడి ప్రపోసల్ ని అక్షరాలలో ఆకాశంలో చిత్రించితే, అంత మరుపులోనూ ఆమెకు తన భర్త గుర్తొచ్చాడు నిజంగా గొప్ప విషయం . ” అంటుంటే నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
నా ముఖం లోకి చూస్తున్న పాప గాబరాగా నా చేయి పట్టుకుంది.
” డోంట్ వర్రీ. అమ్మమ్మా ఈస్ ఫీలింగ్ హాపీ దట్ ఓల్డ్ లేడీ లవ్స్ హర్ హస్బండ్ సో మచ్”. పాప భుజం తట్టుతూ అంది తులసి.
ఇటువంటి జీవిత రహస్యాలను ఎన్నిటినో తనలో దాచుకున్న సాగరం గంభీరంగా ప్రవహిస్తూనేవుంది.

—————- —————. —————-

1 thought on “టాన్యా! ఐ లవ్ యు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *