May 25, 2024

కంభంపాటి కథలు – పర్ఫెక్ట్

రచన: రవీంద్ర కంభంపాటి

‘ఈ ఆదివారం మా వకుళ వాళ్ళ గృహప్రవేశం.. ముందే చెబుతున్నాను మనిద్దరం వెళదాం ‘ అని మావారితో అంటే, ‘నాకూ రావాలనే ఉంది.. అసలే ఆమె నీకున్న ఒకే ఒక ఫ్రెండు కదా.. కానీ.. ఈ వీకెండ్ ఆఫీస్ వర్కు.. ఇంట్లోంచి పని చెయ్యక తప్పదు ‘అన్నారాయన
‘ఏదైనా ఫంక్షన్ కి నేనొక్కదాన్నే వెళ్ళడం నాకు ఇష్టం లేదు ‘ ముభావంగా అన్నాను
‘నిన్నొక్కదాన్నీ పంపడం నాకూ ఇష్టం లేదు.. పోనీ.. ఏ జ్వరమో వచ్చిందని చెప్పేసి ఆ రోజు ఆఫీస్ వర్కు మానెయ్యనా ?’ ఆలోచనగా అడిగేరు
‘వద్దులెండి.. లేని జబ్బులు తెచ్చుకుని మరీ వెళ్ళక్కరలేదు.. నేను ఒక్కదాన్నీ వెళ్ళొచ్చేస్తాను.. వకుళ నాకున్న ఒకే ఒక ఫ్రెండు మాత్రమే కాదు.. అంత పర్ఫెక్ట్ మనిషిని నేనెప్పుడూ చూళ్ళేదు ‘ అన్నాను
‘మనిషి కీ దేవుడికీ అదే తేడా.. అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ గా ఉండడం మనిషికి సాధ్యం కాదు.. ఆవిడకి కూడా ఏవో లోటుపాట్లు ఉండేవుంటాయి ‘ ఆయన లాజిక్కు!
‘ఏమో.. పోనీ.. ఉన్నాయే అనుకుందాం.. కానీ అవేవీ ఎవరినీ ఇబ్బంది పెట్టేవి కావు ‘
‘మరదే.. “ఎవరినీ” అని అందరి తరఫున వకాల్తా పుచ్చుకుంటావేం.. నిన్ను ఇబ్బంది పెట్టేవి కావు అని చెప్పు చాలు ‘
‘నన్నే కాదు.. తన మూలంగా మా ఆఫీసులో ఎవరికీ ఇబ్బంది ఉండదు.. తన పని పర్ఫెక్ట్ గా చేస్తుంది.. ఎవరితోనూ గాసిప్ చెయ్యదు.. సోది మాటలు ఉండవు.. అనవసర విషయాల్లో తలదూర్చదు.. ఇంకేం కావాలి.. వకుళ పర్ఫెక్ట్ అని చెప్పడానికి ?’
‘నువ్వు చెప్పిన విషయాల్లో పర్ఫెక్ట్ కావచ్చు.. కానీ అదే లాజిక్కుని ఆవిడ అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ అని అన్వయించలేవు కదా ‘
‘ఓహ్.. అలా వచ్చేరా.. సరే.. తనూ, తన హస్బెండ్ చక్కగా ఉంటారు.. ప్రతి విషయంలో ఒకళ్ళనొకళ్ళు సంప్రదించుకోవడం చాలాసార్లు చూసేను.. ఆవిడ పిల్లలు ఇద్దరూ కూడా చాలా చక్కగా ఉంటారు.. మంచి మ్యానర్స్.. చక్కగా చదువుకుంటారు.. అంటే.. సంసారం కూడా చక్కగా ఉందనే కదా.. చాలా.. ఇంకేవైనా ప్రశ్నలున్నాయా ?’ అని గట్టిగా చెప్పేను. హమ్మయ్య.. ఇంక ఈయన మాట్లాడరు అనే ధీమా వచ్చింది !
‘సరే.. నువ్వనుకున్నదేదో తప్పు అని నిరూపించాలని కాదు కానీ.. నీ దృష్టిలో అంత గొప్ప మనిషైన వకుళ గారిని నన్నూ
ఓసారి దర్శనం చేసుకోనీ ‘
‘మరి ఇందాక.. వీకెండ్ ఆఫీస్ వర్కు ఉందన్నారు ?’
‘ఉంది.. కానీ ఆదివారం కూచుని పన్జేసే బదులు శనివారం రాత్రి కూచుని కంప్లీట్ చేసేస్తా.. అంత పర్ఫెక్ట్ మనిషిని చూడ్డానికి ఆ మాత్రం కష్టపడడం లో తప్పులేదు ‘ అనేసరికి, నేనింకేమీ మాట్లాడలేదు.
ఆదివారం వచ్చింది.. ఆ ముందు రోజు సాయంత్రమే గిఫ్ట్ ఒకటి కొని, నీట్ గా ప్యాక్ చేయించి ఉంచేను. ఉదయం పదవుతూండగా, ఇద్దరం వకుళ వాళ్ళింటికి బయలుదేరేం.
‘వాళ్ళ ఇల్లు ఊరికి కొంచెం దూరం కదా.. బైక్ మీద వెళ్ళడం కష్టం, క్యాబ్ లో వెళదామా ? ‘ అని తను అడిగితే సరేనన్నాను.
ఊళ్లోని ట్రాఫిక్ దాటి, వాళ్ళ కాలనీ వేపు వెళ్ళేసరికి పదకొండున్నర అవుతూంది.. ఆ గృహ ప్రవేశం కార్డు మీద ఇచ్చిన అడ్రస్ దొరకడం లేదు. ‘ఓ పని చేద్దాం.. ఎలాగూ కాలనీ లోనికి వచ్చేసేం కాబట్టి.. ఇక్కడ దిగి నడుద్దాం.. దార్లో ఎవరో ఒకరు కనబడకపోరు.. మనకి కూడా సరదాగా ఈ ఏరియా చూసినట్టుంటుంది ‘ అని ఆయన అంటే, ఇదేదో బాగానే ఉందని, క్యాబ్ దిగి, అతనికి డబ్బులిచ్చి పంపేసి నడవడం మొదలెట్టేం.
నూటపాతిక నుంచి నూట యాభై గజాల స్థలం లో కట్టున్నాయి.. చిన్న చిన్న ఇళ్ళు. వకుళ ఇచ్చిన అడ్రెస్ లో సెవెంత్ స్ట్రీట్ అని ఉంది.. ఆ వీధిలో చూస్తే, ఎక్కడా వాళ్ళ ఇల్లు కనబడ్డం లేదు.. ‘పోనీ ఫోన్ చేద్దామా ?’ అని నేను అడిగితే, ‘వద్దులే.. వాళ్ళు గృహప్రవేశం హడావుడిలో ఉంటారు.. మళ్ళీ మనం ఇలా ఫోన్ చేసి అడిగితే బావుండదు.. మనమే వెతుక్కుందాం ‘ అని ఆయన అనేసరికి, నేను ఇంకేం మాట్లాడలేదు.
కొంచెం దూరం నడిచేసరికి మా ముందు పంక్చరయ్యిన సైకిల్ ని నడిపించుకుంటూ వెళ్తున్న ఓ ముసలాయన కనిపిస్తే, ఆయన దగ్గర ఆగి అడ్రస్ చూపించి, ఎక్కడ అని అడిగితే ఆయన చెప్పేరు ‘ఈ ఇల్లు ఉన్నది సెవెంత్ స్ట్రీట్ కాదమ్మా.. సెవెంత్ క్రాస్ స్ట్రీట్.. ఈ మున్సిపాలిటీ వాళ్ళు ఏవేవో పేర్లు పెట్టి జనాలని కన్ఫ్యూజ్ చేసేస్తారు.. నాతో రండి.. నేను కూడా అటే వెళ్తున్నాను ‘ అన్నారాయన.
ఆయనతో మాటల మధ్యలో అర్ధమైంది ఏమిటంటే.. ఆ ముసలాయనది వకుళ వాళ్ళ పక్కిల్లే.. చుట్టుపక్కల పనులకి ఆయన సైకిల్ మీద వెళ్ళొస్తారట.. కానీ అనుకోకుండా ఇవాళ పంక్చర్ అయిందట.. ‘ఇంట్లో కారుంది.. కానీ దగ్గిర పనులకి.. కారుని నమ్ముకోవడం కన్నా.. కాళ్ళని నమ్ముకుంటే కాస్త పొల్యూషన్ తగ్గించిన వాళ్లమవుతాం కదా’ అన్నారాయన నవ్వుతూ
‘చాలా అందంగా ఉందండీ మీ కాలనీ.. అన్ని చక్కని డాబా ఇళ్ళు ‘ అని నేనంటే.. ‘పదండి.. పదండి.. ఈ మలుపు తిరుగుతూనే మీరు వెళ్ళాల్సిన వీధి’ నవ్వుతూ ఆయన అంటూండగానే, వీధి మలుపు తిరగడం.. దూరంగా పూల అలంకరణలతో కొత్త ఇల్లు అని తెలుస్తూన్న వకుళ వాళ్ళ ఇల్లు కనబడ్డం.. ఆ ఇల్లు చూసి నేను నోరువెళ్ళబెట్టడం.. మా ఆయన చిన్నగా నవ్వుకోవడం ఒకేసారి జరిగేయి !
‘ఆ ఇల్లా??’అన్నాను ఆశ్చర్యంగా.. ‘అవునమ్మా.. ఆ ఇల్లే ‘ అన్నారా పెద్దాయన
‘మరి.. వాళ్ళు అలా కట్టేసుకుంటే.. మీకు ఇబ్బంది కాదా అండీ ?’ అని మా ఆయన అడిగితే ‘నిజం చెప్పాలంటే.. ఇబ్బందే.. మా ఇంటి పైన ఎండ పడదు.. ఉదయాన్నే సూర్యుడికి నమస్కారం పెట్టుకుందామంటే కుదరదు.. ఎప్పుడూ ఎవరోఇంట్లోకి తొంగిచూస్తున్నట్టు ఉంటుంది.. కానీ ఏం చేస్తాం.. డబ్బున్న వాడిదే లోకం.. మున్సిపాలిటీలు పట్టించుకోనప్పుడు.. నోర్మూసుకుని మనబతుకు మనం బతకడమే ‘ అని ఆయన చెప్పుకుంటూ నడుస్తున్నారు.. నేనలా నోరు తెరుచుకుని ఉండిపోయేను.. ఆ నూటేభై గజాల్లో కట్టేసిన ఐదంతస్తుల బిల్డింగ్ వేపు చూస్తూ.
‘సర్లే.. ఏదో అద్దెల కోసం కట్టేసుంటారు.. మీ పర్ఫెక్ట్ వకుళ గారు ‘ అని మా ఆయననేసరికి, ‘ఇంకాసేపు అలా కాలనీ లో నడిచి, ఇంటికి వెళ్ళిపోదాం ‘ అంటూ వెనక్కి నడవడం మొదలెట్టేను !

*****

2 thoughts on “కంభంపాటి కథలు – పర్ఫెక్ట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *