June 25, 2024

కనిపించని వేరు

రచన: శ్రీనూ వాసా

రమేష్ హైదరాబాద్ వచ్చి ఉద్యోగంలో చేరాడో లేదో.. పెళ్ళి పెళ్ళి అంటూ వెంటపడ్డారు వాళ్ళ నాన్నగారు. ఇంకా ఇరవై ఆరే.. హనీమూన్ కి వెళ్లడానికి కూడా డబ్బులు వెనకేసుకోలేదు అంటే.. “ఆ.. నేనే పంపిస్తాలే, ఏ తిరుపతో అన్నవరమో… ఒక ఫొటో పోస్ట్ చేసాను చూడు. వచ్చేవారం అమ్మాయి తండ్రి వాళ్ళ బావమరిదిని తీసుకుని వస్తున్నాడు నిన్ను చూడటానికి” అని ఫోను పెట్టేసారు రామారావు గారు. మొబైల్ ఫోన్లు ఈమైల్స్ లేని రోజులవి.
ఫోటో మర్నాడే అందింది. కుందనపు బొమ్మలాంటి పిల్ల. ఫోటో చూడగానే ఎక్కడో చూసినట్టుందే అని అలోచనలో పడ్డాడు. త్వరగానే వెలిగింది లైటు.. మొహంలో చిరునవ్వు విరిసింది. అప్పటిదాకా పెళ్ళి వద్దన్నవాడు కాస్తా.. వచ్చేవాళ్ళని ఎలా ఇంప్రెస్ చెయ్యాలో అని తెగ ఆలోచించడం మొదలెట్టాడు.
ఆరోజు రానే వచ్చింది. ఉదయం తొమ్మిదిగంటలకి ఆఫీసులో అడుగుపెట్టేటప్పటికే “మీకు ఫోన్ వచ్చింది సార్.. సార్ ఇంకా రాలేదు అరగంట తరవాత చెయ్యమన్నాను” అనిచెప్పాడు ఆఫీస్ బాయ్. అంటుండగానే ఫోన్ మోగింది. ఆఫీస్ బాయ్ మీకే అన్నట్టు సైగ చేస్తే తనే తీసాడు. సాయంత్రం నాలుగు గంటలకి ముహూర్తమట. అఫీస్ కి ఎలారావాలో కనుక్కున్నారు. మాట తూగో జిల్లాయాస. పొలం పనులు చేసుకునే వాళ్ళ మాటలాగ ఉంది.
బుగ్గ మీసాలు, ఖద్దరు పంచె కట్టుకుని పెద్ద మోతుబరిలాగ దిగారు నాలుగుగంటలకి పదినిమిషాల ముందే. పక్కన బావమరిది రావుగోపాలరావు పక్కన అల్లూ రామలింగయ్య లాగ చంకలో బ్యాగ్ పెట్టుకుని ఉన్నాడు. తను ఆఫీస్ గ్లాస్ వాల్ లోంచి చూస్తున్నాడు, ఇద్దరూ కారు దిగేసరికి. చూడగానే అర్థం అయిపోయింది రమేష్ కి. ఊరినుంచి సరాసరి అంబాసిడర్ కారు వేసుకుని వచ్చేసినట్టున్నారు అనుకొని, లోపలికి వచ్చాక తనని పిలిపించేవరకూ ఏమీ ఎరగనట్టు తనసీట్లో కూర్చుంటే మంచిది అనిపించి వెళ్ళి కూర్చున్నాడు. తను అనుకున్నట్టే పదినిమిషాల తరవాత “సార్ మీకోసం ఎవరో వచ్చారు” అని పిలుపందింది.
రమేష్ లాంజ్ లోకి వచ్చి నమస్తే పెట్టి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంటుండగా ప్రతినమస్కారం పెడుతూనే “అబ్బాయి కాతంత పీల” అన్నాడు బుగ్గ మీసాలాయన. “పెళ్ళైతే ఒళ్ళు చేస్తాడులే బావా” అన్నాడు అల్లు రామలింగయ్య. ఆ సంభాషణ విన్న లాంజ్ లోని మిగిలిన సహోద్యోగుల ముసిముసి నవ్వులు చూసి, ఇక్కడ లాభంలేదు అనుకొని వెంటనే, “అంకుల్, బయట కాఫీ షాపుకెళ్ళి మాట్లాడుకుందాం. మీరు కింద వెయిట్ చెయ్యండి నేను పర్మిషన్ తీసుకుని వస్తాను అనిచెప్పి వాళ్ళ రెస్పాన్స్ గురించి ఎదురుచూడకుండానే వెళ్ళిపోయాడు.
పావుగంట తరవాత కెఫె కాఫీ డే లో ” అంకుల్, ఏం తీసుకుంటారు.. క్యాపుచినో, లాటే..” అన్నాడు రమేష్. మొహమొహాలు చూసుకుని “ఉప్పుడయ్యేమొద్దు బాబు.. వన్ బై టూ కాఫీ చెప్పు చాలు” అన్నాడు బుగ్గ మీసాలతను. “వామ్మో చాలా జాగ్రత్తగా హ్యండిల్ చెయ్యాలి” మనసులో అనుకొని, మూడు క్యాపుచినో ఆర్డర్ చేసి, చెప్పండి అన్నట్టు చూసాడు వాళ్ళవంక. కాఫీ వచ్చేవరకు పరిచయాలయ్యి, తరవాత ఇంటర్వ్యూ మొదలయ్యింది.
“అబ్బాయ్ నువ్వేంచూస్తుంటావ్?” మొదటి ప్రశ్న. “సాఫ్ట్ వేర్ ఇంజినీరునండి, ప్రోగ్రామింగ్ చేస్తుంటాను” అన్నాడు.
“అలాగా.. ఏం పోగ్రాములిత్తావేటి?” అనేసరికి కంగారుపడి.. “అయ్యో ప్రోగ్రాములివ్వడం కాదండి. సాఫ్ట్ వేరు కోడింగ్ రాస్తుంటాను” ఇద్దరికీ ఒక్క ముక్కర్థంకాలేదని అర్థమయ్యింది రమేష్ కి. “అంటే ఇప్పుడు కంప్యూటర్లో అకౌంటింగ్ అవీ చేస్తారు కదండీ.. అవి పనిచెయ్యాలంటే సాఫ్ట్ వేర్ తయారు చెయ్యాలి” అన్నాడు మరికాస్త వివరిస్తూ.
“సాటు వేరు అంటే? మీ కంపినీ ఉత్పత్తులా?, ఆయ్యెలాగుంటాయ్?” అన్నాడు. “అది కంటికి కనిపించదండి. కంప్యూటర్లో నిక్షింప్తమై ఉంటుంది” అన్నాడు. అంతకంటే రమేష్ కి పదాలు దోరకట్లేదు వివరించడానికి. ఇంతలో అల్లు రామలింగయ్య కల్పించుకుని, “సాట్ వేరంటే మన పెసింటు గార బ్బాయ్ అమిర్కా ఎల్లేడు కదా.. ఆ పనే బావా. అదంతా కంపీటర్ మీద వర్కు అంతే” అనేసరికి, హమ్మయ్య బ్రతికించాడురా దేవుడా అని నిట్టూర్చాడు రమేష్.
“బాబూ మీకు టాన్స్పర్లుంటాయా” రెండవప్రశ్న.
“ఉంటాయండి. అప్పుడప్పుడు ఇంగ్లాండ్, అమెరికా దేశాల్లో డ్యూటీ పడితే వెళ్ళాల్సొస్తుందండి.”
“జీతమెంత?”
“పదిహేను వేలండి.”
ఇంకేం మాట్లాడ లేదు. సరే బాబు, ఇంకెల్లు. నీకు లేటైపోతంది” అని ముగించేసాడు.
రమేష్ కి వెళ్ళాలని లేదు. ఇంకాసేపు ఉండాలనిపించింది. వాళ్ళకి తన కంపనీ గురించి, తన ఫ్యూచర్ గురించి అన్నీ చెప్పాలనిపించింది. మూడు ప్రశ్నలకే వాళ్ళలో ఉత్సాహం తగ్గిపోయిందనిపించింది. తను నచ్చలేదా? పీలగా ఉన్నాననా? చేసేదిలేక వాళ్ళదగ్గర సెలవు తీసుకుని బయలుదేరాడు ఆఫీసుకి, కానీ అక్కణ్ణుంచి వెళ్ళాలనిపించలేదు. బయటికొచ్చి అక్కడే నిలబడ్డాడు, బయట కిటికీ పక్కన, అప్రయత్నంగా, వాళ్ళమాటలు తనకి వినబడుతున్నాయ్.
“ఏంటిబావా.. ఆ కుర్రోణ్ణి అలా పంపించేహేవ్? నచ్చలేదా?” అన్నాడు బావమరిది.
“లేదురా, కుర్రోడికేం.. సాకులాగున్నాడు. ఆళ్ళు సేసీ పని, ఆళ్ళ జీవితాలు వేరురా.. మనకి సరిపడవు. నిన్నగాక మొన్న జాయినయ్యేడు, జీతం పదిహేనేలంట. మన దగ్గర గుమత్తాలు ఇరవయ్యేళ్ళనుంచి సేత్తన్నారు.. మనం నాలుగేలిత్తన్నాం. అంతడబ్బులొచ్చీవోళ్ళ జీవితాలు ఏరుగా ఉంటాయ్ రా .. మనలాక్కాదు. అదేదో వేరు అంటాడు, కంటికి కనిపించదంటాడు.. అదెలాగుంటదంటే సెప్పలా పోతన్నాడు. ఆళ్ళు సేసీ పని మనకర్దం కాదు, మమమేమీ అడగలేం, సెయ్యలేం. అదీగాక ఇదేశాలెల్లీదోటి. బుజ్జమ్మని అంతంత దూరాలంపగలమా? నేనుండగలనా దాన్ని సూడకండా.. మనూరి వైపే సూసుకుందాం మంచి సంబందం. ఏదో రామారావు గారి మాట తీసైలేక ఇంతదాకా వచ్చేం. పద, బయ్ దెల్లదాం” అన్నాడు పెద్దాయన. రమేష్ కి ఒక్కసారే చాలా నిరుత్సాహం అనిపించింది.
బుజ్జమ్మ అసలు పేరు శ్రావణి. శ్రావణపూర్ణిమనాడు పుట్టిన శ్రావణి, శ్రావణపౌర్ణమి నాటి చంద్రుడంత అందంగా ఉంటుంది అని అమ్మ చెప్పింది. తను ఒక పెళ్ళిలో చూసాడు. తనకళ్ళతో ఆ అమ్మయినే ఫాలో అవుతూ వాళ్ళ నాన్నగారికి దొరికి పోయాడుకూడా. తన మనసులో ని భావం అర్థం చేసుకున్న నాన్నగారే ఈ సంబంధం తీసుకొచ్చారని ఫోటో చూసినప్పుడే అర్థమైంది. ఇప్పుడు చేతివరకూ వచ్చిన బంగారంలాంటి అవకాశాన్ని కోల్పోతున్నట్టనిపించింది. “నో.. అలా జరగడానికి వీల్లేదు.. ఏదొకటి చెయ్యాలి, అర్జెంటుగా..” మనసు హెచ్చరించడమే ఆలస్యం, గబగబా మళ్ళీ వాళ్ళ దగ్గరకెళ్ళి ఎదురుగా కూర్చున్నాడు. ఆ హాఠాత్ పరిణామానికి నిర్ఘాంతపోయారిద్దరూ. వాళ్ళు తేరుకోకముందే చెప్పటం మొదలెట్టాడు రమేష్.
“అంకుల్, మీరు నాన్నగారిని కలిస్తే చెప్పండి అంకుల్.. మీ అబ్బాయి క్షేమంగానే ఉన్నాడు అని. నేను జాబ్ లో జాయినయినప్పట్నుంచీ ఒకటే దిగులు ఆయనకి. పెద్ద జీతం అని సంతోష పడాల్సిందిపోయి, అంతడబ్బు చేతికొస్తే జీవితాలు మారిపోతాయని, నేనెక్కడ వాళ్ళ చెయ్యి జారిపోతానో అని బెంగపడతారు. మన ఊరికి, హైదరాబాదుకి తేడా ఉందికదా అంకుల్.. ఇక్కడ నాలుగు వేలు పెడితేనే గాని ఇల్లు అద్దెకి దొరకదు. ఖర్చులు ఎక్కువ.. దానికి తగినట్టుగానే జీతాలు కదా అంకుల్.. సాఫ్ట్ వేర్ అంటే అదేదో కొత్త వ్యవహారం, మనకి తెలియదు, కాబట్టి నేను కూడా దానికి దూరంగా ఉంటే మంచిది అంటారు. ఏలాగంకుల్? మీరే చెప్పండి… మీ చిన్నప్పుడు కరెంటు లేదు. తరవాత వచ్చింది. ఇప్పుడు కరెంటు లేకుండా ఉంటే మీ ఇంట్లో ఫేన్ తిరుగుతుందా? లైట్లు వెలుగుతాయా? మీ పొలంలో బోరు నడుస్తుందా? కరెంటు కంటికి కనిపించదు కదా అంకుల్.. అది ఎవరో ఎక్కడో తయారు చేస్తేనే కదా మనదాకా వస్తుంది. సాఫ్ట్ వేర్ కూడా అంతేనని చెప్పండి. రాబోయే రోజుల్లో అదిలేకుండా మానవ జీవితాలు ఊహించలేము. నేను విదేశాలు వెళ్ళిపోతానేమో, మళ్ళి రానేమో అని ఇంకో భయం. మన ఊరిని, మనవాళ్ళని నేనెలా మర్చిపోతాను చెప్పండి? అనవసరమైన అలోచనలతో మనసు పాడుచేసుకోవద్దు అని చెప్పండి అంకుల్. వస్తానంకుల్.. నమస్తే!” అని చెప్పేసి గబగబా అక్కణ్ణుంచి వెళ్ళిపోయాడు.
ఇద్దరూ మొహమొహాలు చూసుకున్నారు. “మనం మాట్లాడింది ఇన్నాడంటావా బావా” అన్నాడు బామ్మర్ది. “ఏమోరా నాకూ అలాగే అనిపిత్తంది. కానీ కుర్రోడు మంచి సురుకురా. బుజ్జమ్మకి సెప్పి సూద్దాం ఏమంటాదో” అన్నాడు పెద్దాయన.
ఇంటికెళ్ళాకా బుజ్జమ్మ “కనిపించని వేరుకి” ఓకే అనడం, పెళ్ళి చూపులు, ముహూర్తాలు, పెళ్ళి.. వరసగా జరిగిపోయాయి.
పెళ్ళై ఇరవయ్యేళ్ళైనా, అమెరికాలో సెటిలై పదేళ్ళయినా, రోజూ అమ్మానాన్నతో వీడియో కాల్ లో మాట్లాడాల్సిందే బుజ్జమ్మకి. ఎంతైనా గారాలపట్టికదా!

1 thought on “కనిపించని వేరు

  1. బాగుందండీ.. అబ్బాయి పెద్దవాళ్ళకి పల్లేకి – పట్న జీవితానికీ, తేడా వివరించిన తీరు బాగుంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *