May 19, 2024

చంద్రోదయం – 8

రచన: మన్నెం శారద

గంగాధరంగారు తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఆయన ముఖంలో కండరాలు బిగుసుకున్న తీరులోనే ఆయనెంత కోపంలో వున్నది అర్ధమవుతుంది.
ఆయన పక్కన ఆయన సతీమణి శాంతమ్మగారు ఆందోళనగా నిలబడి చూస్తున్నారు.
శేఖర్ తల వంచుక్కూర్చున్నాడు.
సారధి గుమ్మానికి జేరబడి నిలబడ్డాడు. అతనికి జంకుగా వుంది. ఒక విధంగా యిలాంటి వాతావరణం కల్పించింది తనే.
“అంటే నీ నిర్ణయం మారదంటావు?” గంగాధరంగారు మరోసారి అడిగేరు.
“ఇందులో మార్చుకొవాల్సింది ఏముంది డాడీ?” శేఖర్ నెమ్మదిగా అన్నా, స్థిరంగా వున్నాయా మాటలు.
“ఏమీ లేదా? మన స్థితిగతులు మరచిపోయి దారినపోయే దరిద్రం నెత్తికెత్తుకుంటావా? ఎంత బుధ్ది లేకుండా పొయిందిరా నీకు?” ఆయన ఉగ్రరూపం చూసి సారధి వులిక్కిపడ్డాడు. శాంతమ్మగారు భయపడుతూ తండ్రీకొడుకుల వంక చూస్తోంది.
“మన యింటికి ఆమె దరిద్రురాలెలా అవుతుంది. అయినా దరిద్రం అంటే మీకంత చిన్న చూపెందుకు? డబ్బు ఈ రోజు వుంటుంది, రేపు పోతుంది. డబ్బు లేకపోతే మనల్ని కూడా మిగిలిన వాళ్లు చీదరించుకుంటారుగా!”
గంగాధరంగారు క్షణం మాట్లాడలేనట్టు చూసేరు. తన చేతుల మీదుగా అల్లారుముద్దుగా పెరిగిన కొడుకు తనకే నీతికథలు చెబుతోంటే సహించలేకపోయేరు.
ఆయన కోపంతో వూగిపోయెరు.
“అవున్రా! ఇప్పుడిలాగే వుంటుంది. క్రొత్త మోజు కదూ. రేపు నా ఆస్థిలో చిల్లిగవ్వ కూడా రాని నాడు ఈ ప్రేమలూ, ఈ ఆదర్శాలూ ఏమవుతాయో చూస్తాను. కడుపుతీపని ఆస్తి నీ చేతికే అందిస్తాననుకుంటున్నా వేమో, పట్టుదలలో నీ తండ్రి నీకు తీసిపోడు. అంతా అనాధాశ్రమానికి రాసేస్తాను”
శేఖర్ ఆశ్చర్యంగా తండ్రివంక చూసి “ఎంత మంచి మాట అన్నారు నాన్నా మీరు. నాచేత ఆ పని చేయించకుండా మీరయినా అంత పుణ్యకార్యం చేస్తానంటే కాదంటానా నేను” అన్నాడు.
ఆ మాటతో గంగాధరంగారు రెచ్చిపోయినట్టు భార్య వేపు చూసి “పదవే పద. ఇంకా దేనికి నిలబడ్డావు. నీ దేభ్యం మొహం చూసి నీ కొడుక్కి జాలి కలుగుతుందనా? వాడిప్పుడు మన కొడుకు కాదే. మన పాలిట యముడు.” అన్నారు.
శాంతమ్మ కన్నీళ్లతో కొడుకు వంక చూసింది.
“అమ్మా!” అన్నాడు శేఖర్ ఆర్తిగా.
ఆ తల్లి హృదయం బాధతో మెలికలు తిరిగిపోయింది. ఆమె వస్తూన్న దుఃఖాన్ని ఆపుకొంటూ నోటికి గుడ్డ అడ్డం పెట్టుకొంది.
“నాయనా! నువ్వా అమ్మాయిని ప్రేమించలేదంటున్నావు. కేవలం జాలి కోసమైతే నువ్వే కట్టుకోవటం దేనికి? ఆ అమ్మాయికి కట్నం యిచ్చి మనమే వేరే సంబంధం చేద్దాం” అంది.
“నేను మాస్టారికి మాట యిచ్చేసేనమ్మా”
శాంతమ్మ హతాశురాలయింది.
“అయ్యిందా? ఆ మాట అనిపించుకోటానికే యింకా నిలబడ్డావు. బుద్ధివుంటే వెంటనే బయల్దేరు” విసురుగా వెళ్తూన్న గంగాధరంగారిని ఏడుస్తూ అనుసరించింది శాంతమ్మ.
కారు కన్పించినంత వరకూ చూస్తూ నిలబడ్డాడు శేఖర్.
సారధి అనునయంగా శేఖర్ భుజమ్మీద చేయి వేసేడు. అతను వెనక్కి తిరిగి చూసేడు. ఆ కళ్లలో లీలగా నీటి పొర.
“తల్లిదండ్రులకి మనస్తాపం కల్గించే ఈ పెళ్ళి చేసుకోకపోతేనేం? పోనీ వాళ్లు చెప్పినట్టు కట్నమిచ్చి పెళ్లి జరిపించు” సారధి మాటలకు తీవ్రంగా చూసేడు శేఖర్.
“నిముషానికో మాట మాటాడ్డం నాకు అలవాటు లేదు సారధి. ఏం? ఆ అమ్మాయిని చేసుకోవడం వల్ల వీళ్లకి వచ్చే నష్షమేమిటి. కేవలం డబ్బు లేకపోవటం అనేది ఆమె లోపం అంటే ఒప్పుకోను. డబ్బు వుంటే వీళ్లకి ఎలాంటి అభ్యంతరం వుండేది కాదుగా. తనకున్నదే దాచటానికి అవస్థ పడుతున్న నాన్నకి కోడలు తెచ్చే కట్నం ఎందుకు?
సంఘంలో తన స్టేటస్ తగ్గకూడదు. డబ్బుని డబ్బే ముడి పెట్టుకుంటుంది. మనిషిని కదు. మనసునీ కాదు. పెద్దతనం అడ్డం పెట్టుకుని మనల్ని బలహీనుల్ని చేసి చేతకానివాళ్లని చేస్తుంది పెద్ద తరం. తల్లిదండ్రులుగా వాళ్లని నేను గౌరవిస్తాను. అభిమానిస్తాను. కానీ యువతరపు కాళ్లకి బంధాలు వేసి క్రిందకి పడగొట్టే వాళ్ల అధికారాన్ని మాత్రం భరించలేను. నేనీ పెళ్లి చేసుకునే తీరతాను. ఇది నా నిర్ణయం. అంతే.” అంటూ శేఖర్ విసురుగా లోపలికి నడిచాడు.
ఈజీ చెయిర్లోనే పడుకున్నప్పటికి తూలిపడినట్లయింది సారధికి..

ఇంకా వుంది..

1 thought on “చంద్రోదయం – 8

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *