రచన: మాలతి దేచిరాజు

ఆ ఫ్రైడే రోజు అనుకున్నట్టుగా షీబా ని తీసుకుని ఫ్యామిలీడే కి అటెండ్ అయ్యాడు గౌతమ్.

మీటింగ్ హాల్ లో చిన్న స్టేజ్ ఏర్పాటు చేసారు. దానిపైన ఒక టేబుల్, టేబుల్ కి దగ్గరగా నాలుగు కుర్చీలు. స్టేజ్ కి ఎదురుగా ఇంకొన్ని కుర్చీలు అమర్చి ఉన్నాయి. మధ్యలో ఖాళీ… స్టేజ్ పైకి రావడానికి దారి అది. ఎప్పటిలాగే ఈసారి కూడా ఒక సర్ప్రైజింగ్ స్పెషల్ గెస్ట్ వస్తాడనేది అందరికీ తెలిసిందే. కానీ అది ఎవరనేది మరి కాసేపట్లో తెలుస్తుంది.

స్టేజికి ఎదురుగా ఉన్న కుర్చీల్లో స్టాఫ్ అంతా కూర్చున్నారు. ఈవెంట్ మేనేజర్ ఏర్పాట్లు చూసుకుంటూ, ఏమైనా తప్పులుంటే సరి చేసుకుంటూ ఉన్నాడు. హెచ్.ఆర్ హెడ్ స్టేజి ఎక్కాడు.

అందరూ చప్పట్లతో స్వాగతం పలికారు.
“గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ .. ఎప్పుడూ ఇలాంటి ఈవెంట్ జరిగినా ఇంగ్లీష్ లోనే మాట్లాడడం కామన్..కానీ ఈ రోజు నేను అచ్చ తెలుగులో, ఇంకా చెప్పాలంటే నా మాతృభాష అయిన తెలుగులో మాట్లాడుతాను.” “బికాజ్….” అనగానే అరిచారు అందరూ.

“సారీ..సారీ..”

మళ్ళీ అరుపులు.

“క్షమించాలి.” అంతా శాంతించారు.

“కారణం ఏంటంటే ఈ రోజు మన ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా విచ్చేస్తున్నారు. ప్రముఖ రచయిత శ్రీ శ్రీ శ్రీ అనురాగ్ గాంధీ గారు మీ కర్ర తాళ…” తడబడ్డాడు అతను..

“మీ కర్ర …”మళ్ళా తడబాటు..

“మీ కర్రతా …ఛ” మైక్ పక్కకు పెట్టి అన్నాడు.

“మీ చప్పట్లతో ఆయనకు ఘన స్వాగతం పలకాలని కోరుకుంటున్నాను.”

అందరూ చప్పట్లు కొట్టారు. స్టేజ్ పైకి వస్తున్నాడు గాంధీ..

అందరి చప్పట్లు వింటూ చిరునవ్వుతో స్టేజ్ ఎక్కాడు. రెండు చేతులతో నమస్కరించాడు స్టాఫ్ అందరికీ.

హెచ్.ఆర్ హెడ్ ఆయనకు బొకే అందించాడు, చిరునవ్వుతో బొకే అందుకుని కూర్చున్నాడు గాంధీ.

“మన కంపెనీ మేనేజర్ శ్రీ పార్థసారథి
గారిని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాను” పార్థసారథి స్టేజ్ ఎక్కాడు. అందరూ చప్పట్లు. గాంధీకి నమస్కరిస్తూ కుర్చీలో కూర్చున్నాడు పార్థసారథి.

“మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన గాంధీ గారికి చిరు సత్కారం…” ఈ సారి అతను తడబడలేదు. శాలువా కప్పి, ఒక మొమెంటో అందించాడు మేనేజర్.

“ఇప్పుడు మన మేనేజర్ గారు మాట్లాడుతారు…తెలుగులో ” అన్నాడు హెచ్.ఆర్. అందరూ గోల చేసారు..కొందరు ఈలలు కూడా వేసారు. మొహమాటంగా మైక్ అందుకున్నాడుపార్థసారథి.

“అందరికీ నమస్కారం ..ముఖ్య అతిథిగా విచ్చేసిన అనురాగ్ గాంధీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు…”

తడబడకుండా మాట్లాడుతున్న అతన్ని చూసి నోరెళ్ళబెట్టారు అంతా.

“ఉద్యోగం అనగానే కేవలం పని, జీతం, వారాంతరాల్లో సెలవు… ఇదే కాదు అప్పుడప్పుడు మనమంతా ఒక కుటుంబం అని చెప్పడానికే ఇలాంటి కార్యక్రమాలు జరుపుకుంటూ ఉండాలి” అతని స్పష్టమైన తెలుగు చూసి ముచ్చటేసింది అందరికీ.

“కుటుంబం నడవాలంటే సమిష్టి కృషి ఉండాలి. అంతా ఒక్కటై పని చెయ్యాలి, కష్టపడాలి. ఫలితాన్ని అనుభవించాలి, ఆనందించాలి…” చప్పట్లు కొట్టారంతా…

“సాఫ్ట్ వేర్ ఉద్యోగం అనగానే ఏదో ఒత్తిడికి పరాకాష్ట అనుకుంటారు చాలామంది. ఒత్తిడి లేనిది ఎక్కడా..?” సమాధానం అక్కర్లేని ప్రశ్న అది.

“పని పెళ్ళాం లాంటిది … బాధ్యతగా చెయ్యాలి గాని భరిస్తూ చేయకూడదు…”
ఈ సారి టాప్ లేచిపోయేలా అరుపులు. అరిచిన వాళ్ళంతా ఆడవాళ్లే.

నవ్వి, “మిమ్మల్ని ఈ సందర్భంగా ఇలా కలుసుకోవడం ఆనందంగా ఉంది” అన్నాడు
అనురాగ్ వైపు తిరిగి… నవ్వాడు గాంధీ కృతజ్ఞతగా..

“పనిని ప్రేమించండి..పెళ్ళాన్ని కూడా ”
మళ్ళీ అరుపులు.

“నాకీ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞుడ్ని.” వెళ్లి తన కుర్చీలో కూర్చున్నాడు పార్థసారథి.

అందరూ చప్పట్లు కొట్టారు… మేనేజర్ మైక్ అందుకున్నాడు.

“ఇప్పుడు మన ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీ అనురాగ్ గాంధీ గారు మాట్లాడుతారు.

లేచి, వచ్చి మైక్ అందుకున్నాడు గాంధీ.
చప్పట్ల మోత గది అంతా వ్యాపించింది.

“గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ”
ఒక్క క్షణం నిశ్శబ్దం.

“ఏంటి అలా చూస్తున్నారు?” ప్రశ్నగా అన్నాడు.

“ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడేంటి అనా?”
అవునన్నట్టు చూస్తున్నారు.

“గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ!”
“ఈ మాట అర్థం కాని వాళ్ళు చేతులెత్తండి…” అన్నాడు. ఎవరూ చెయ్యి ఎత్తలేదు.

“దెన్, అందరికీ అర్థం అయ్యిందన్న
మాట..మరింకేంటి? తెలుగు లో మాట్లాడ్డం అంటే అర్థం అయ్యేలా మాట్లాడ్డం. తెలుగంటే పదాలు కాదు భావాలు…”

ఒక్కసారిగా విపరీతంగా చప్పట్ల మోత… రైటర్ అనిపించుకున్నాడ్రా అన్నట్టుగా ఉన్నాయవి..

“మనకి కలిగే ప్రతి భావాన్నీ మన మాతృభాషలోనే చెప్పలేం… ఎందుకు అంటే, ఆ కలిగిన భావాన్ని బట్టి భాష ఉంటుంది కాబట్టి … భాష కన్నా భావం ప్రధానం కాబట్టి…” నిజమే కదా అన్నట్టు చూస్తున్నాడు పార్థసారథి.

“ఓ షిట్..అంటాం కానీ, ఓ అశుద్ధం ..అనం కదా! మై ఫుట్ అంటాం ..నా కాలు అనగలమా?” మరింత గౌరవంగా చూస్తున్నారు గాంధీని అందరూ.

“మమ్మీ , అమ్మి(ఉర్దూ), ఆయీ,(మరాఠి ) అమ్మా ..పదాలలోనే తేడా భావం ఒకటే కదా!”

అందరి హృదయాలు దోచుకున్నాడతాను… ముఖ్యంగా అక్కడున్న స్త్రీలవి.

“ఎనీ వే కమింగ్ టు ద పాయింట్..నా మీద ప్రేమతో అభిమానంతో నన్ను ఈ ఈవెంట్ కి ఆహ్వానించిన.. హెచ్.ఆర్. మైకేల్ గారికి, మేనేజర్ పార్థసారథి గారికి మరియు మీ అందరికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు…” అంటూ చేతులెత్తి దండం పెట్టి కదలబోయాడతను.

అందరూ విస్మయంగా చూస్తున్నారు..అది గమనించి, “ఏంటి అలా చూస్తున్నారు..ఏదో చెప్తాడు అనుకుంటే భాష, భావం అంటూ ఏదో చెప్పి వెళ్ళిపోతున్నాడు ఏంటి అనా?”

అవునన్నట్టు చూస్తున్న వాళ్ళని చూసి నవ్వి..
“మీలో ఏ ఒక్కరికి పాతికేళ్ళు తక్కువ ఉండవు. ఇంకా మీకు ఎవరో ఏదో చెప్పాలి, అది విని ఏదో నేర్చుకోవాలి అనిపిస్తుందంటే నేను నమ్మను.”

ఒకరిద్దరికే అర్థమైంది అతని మాటల్లో సారం. ఆ ఒకరిద్దరిలో గౌతమ్ ది ప్రథమస్థానం.

“నేను ఏం చెప్పినా అది మీకు సంబంధించింది కానప్పుడు మీరు కనెక్ట్ కాలేరు. మీకు ఏం చెబితే కనెక్ట్ అవుతుందో తెలుసుకుని మాట్లాడేంత లౌక్యం నాకింకా రాలేదని నా నమ్మకం…సో..స్వస్తి..”అన్నాడు గాంధీ.

అర్థం కాకపోయినా తప్పదన్నట్టు మోగాయి చప్పట్లు. కార్యక్రమం ముగిసింది…

అందరూ డిన్నర్ చేస్తున్నారు.

గౌతమ్, షీబాని తన కొలీగ్స్ కి పరిచయం చేస్తున్నాడు.

“మీట్ మై వైఫ్ షీబా ..”

“హలో ”

తనకి హలో చెప్పిన ప్రతీ వ్యక్తికీ తిరిగి హలో చెప్పింది తను… అలా అందరికీ పరిచయం చేసాడు.

“శరత్ ..తెలుసు కదా ..” తెలుసన్నట్టు తలూపింది తను.

“బావున్నారా?” అంది.

“ఫైన్ ” అన్నాడు శరత్.

గాంధీ దగ్గర ఆటో గ్రాఫ్స్ తీసుకుంటున్నారంతా. గ్రూప్ ఫోటోలు దిగుతున్నారు. గౌతమ్ కూడా తన టీమ్ తో ఫోటో దిగాడు.

పార్టీ జరుగుతోంది…గౌతమ్ కి కాల్ వచ్చింది ..లిఫ్ట్ చేసి, “ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ లో బయల్దేరుతాం ..సరేనా బై..”అని కాల్ కట్ చేసాడు గౌతమ్.

“ఎక్స్ క్యూజ్ మీ ..” అన్న మాట వినగానే తల తిప్పి చూసాడు గౌతమ్.

గాంధీ నిలబడి ఉన్నాడు… ఏమిటన్నట్టు చూసాడు గౌతమ్.

“లోపలికి వెళ్ళాలి…” అన్నాడు గాంధీ.
అప్పుడు అర్ధం అయింది గౌతమ్ కి తను నిలుచుంది వాష్ రూమ్ డోర్ దగ్గర అని.

“సారీ..” అని దారిచ్చాడు.
గాంధీ లోపలికెళ్ళి కాసేపటికి వచ్చాడు.
“హలో సార్ అయామ్ గౌతమ్!” అని అతనికి
షేక్ హ్యాండ్ ఇచ్చాడు.

“హలో” గాంధీ కూడా షేక్ హ్యాండ్ ఇచ్చాడు.

“స్మాల్ క్వస్చెన్?” అన్నాడు గౌతమ్.

“యా…అడగండి…”
“మోక్ష (నీరెండ నవలకి సినిమా పేరు అది…) చూసాను. క్లైమాక్స్ లో నాకొక డౌట్ ఉంది.”

ఏమిటన్నట్టు, కనుబొమలు ఎగరేసాడు గాంధీ.

“తనని తార్చాలనుకున్న వాడ్ని ఏ అమ్మాయీ క్షమించదు… ఒప్పుకుంటాను.. కానీ ఆ అమ్మాయి అతన్ని చంపాక చట్టం నుంచి ఎంత తెలివిగా తప్పించుకుందో, చాలా వివరంగా చెప్పారు… అలాంటి వివరణ సమాజంలో ఇతర నేరస్తులకి దోహదపడితే ప్రమాదం కదా!”

నవ్వి.. “యూ నో మిస్టర్ గౌతమ్ …అదొక రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా రాసిన నవల.
నిజానికి ఆ అమ్మాయి తనంతట తనే లొంగిపోయింది… కానీ నా క్లైమాక్స్ లో తప్పించుకుంది. వాస్తవానికీ, కల్పనకీ తేడా ఉంటుంది. ఎందుకంటే వాస్తవికత కన్నా కల్పనకే ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. ఇన్ఫాక్ట్ మీరు కూడా అలా కనెక్ట్ అయ్యారు కాబట్టే మీలో ఆ అంశం గురించి కొంత మథనం
జరిగింది… లేదంటే మీరిలా నన్ను అడగరు కదా!”

నిజమే అనిపించింది అతనికి.

“బట్…కల్పన లోనే అసలైన వాస్తవాన్ని వాస్తవంగా చెప్పగలం.”

గౌతమ్ లో మళ్ళా సంశయం..

“డోంట్ థింక్ బిగ్ ..కూల్ ” అన్నాడు గాంధీ.

ఇంతలో అటు వచ్చింది షీబా..

“షీ ఈజ్ మై వైఫ్ షీబా ” పరిచయం చేసాడు గౌతమ్.

నమస్కరించింది షీబా.

“హలో..నైస్ పెయిర్ ..మీ జంట బావుంది గౌతమ్.” కితాబిచ్చడతాను.

నవ్వారు ఇద్దరు..సిగ్గుతో షీబా, మొహమాటంగా గౌతమ్.

అనుకోకుండా గాంధీ కళ్ళు షీబా కాళ్ళ వైపు చూసాయి.
“మీది లవ్ మ్యారేజా?” ప్రశ్నించాడు గాంధీ.

తడబడ్డాడు గౌతమ్. గాంధీ, చిన్నగా నవ్వాడు. ఆ నవ్వులో ‘దొరికేసావ్’ అన్న భావం కనిపించింది గౌతమ్ కి…

“అంటే సార్…” ఇంకా…తడబాటు లోనే ఉన్నాడతను.

ఇంతలో గాంధీకి ఫోన్ వచ్చింది.

“ఎక్స్ క్యూజ్ మీ ” అని కాల్ లిఫ్ట్ చేసాడతను.
గౌతమ్ ఊపిరి పీల్చుకున్నాడు… అక్కడనుంచి తక్షణమే కదిలాడు.

తన వెంట నడుస్తున్న షీబా మనసు గాంధీ అడిగిన ప్రశ్న దగ్గరే ఆగిపోయింది. తన అడుగు మాత్రమే కదులుతోంది.

*****************************

‘కావ్య’ వీక్లీ మ్యాగ్ జిన్ చూస్తున్నాడు గాంధీ… సమయం సాయంత్రం అయిదు కావొస్తుంది. ప్రకృతి ఆహ్లాదంగా ఉంది. చల్లని గాలి వీస్తుంటే పొగలు కక్కే కాఫీ కప్పు చేతిలో పట్టుకుని ఎదురుగా కనిపించిన మ్యాగజిన్ తీసి చూడ సాగేడు…

అలాపేజీలు తిప్పుతూ తిప్పుతూ టక్కున ఆగాడు….కళ్ళతో చదువుతున్నాడు.

‘సంధ్యా రాగం’

పగలంతా రగిలే సూర్యుడ్ని
చల్లార్చే రాగమది.
అరుణారుణ వర్ణమైన
రవితేజం చూస్తుంటే ,
ముద్దొస్తుంది
కిరణాల దుస్తులు విప్పి
నగ్నంగా ఉన్నట్టనిపిస్తుంది.
లాల పోసుకుంటున్న చంటి పిల్లాడ్ని
చూస్తున్నంత ముచ్చటగా ఉంది.
ఉదయం గడప దాటి బయటకు వెళ్ళే
మగాడిలా ఉండే సూర్యుడు
సాయంత్రానికి పసిపిల్లాడై పోతాడు
అదేంటో ..!
పడమర పానుపుపై పాడుకోగానే
మలి సంధ్య దీపం ఆర్పేస్తుంది కాబోలు..
అందుకేనా ఈ చీకటి?
‘బ్రతుకు.. వెలుగులో నడుస్తుంది
చీకటిలో తెలుస్తుంది…’
వెలుగులో గమనం ఉంది.
చీకటిలో తుది గమ్యం ఉంది.
మనిషి అలిసినా, మనసు అలిసినా…

– (సీమా మొహమ్మద్ )

చదవడం పూర్తి చేసాడతను. కాసేపు తను తనలా లేడు. తన చుట్టూ ఉన్న వాతావరణానికి ఈ కవితకి దగ్గర పోలికలున్నాయి. అందుకే అతను బాగా కనెక్ట్ అవ్వగలిగాడు.

కవిత, పాట, నవల…ఏదైనా కావచ్చు! వినే, చదివే సమయం, సందర్భం, ప్రదేశం… వీటి ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. సాయంత్రం పూట మెలోడి సాంగ్స్ వింటే కలిగే ప్రశాంతత ఫాస్ట్ బీట్ వింటే కలగదు. హుషారుగా ఉన్నప్పుడు మాస్ పాటలు వినాలనిపిస్తుంది.
సంగీతం, సాహిత్యం ప్రకృతితో ముడిపడి ఉంటాయి. ప్రకృతి ఎప్పుడూ మనసుతో ముడిపడి ఉంటుంది.

ఒక రచయితగా తనకి ఇది తెలియని విషయం కాదు.. అయినా ఎందుకో ఆ క్షణం అతను తనలోని పాఠకుడికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు… అప్పుడు తన మనసులో మెదిలిన మాట ‘ఎవరీ సీమా?’
*****
మొక్కలకి వాటర్ స్ప్రే కొడుతోంది సీమా.. కాలింగ్ బెల్ మోగింది.
“షీబా…ఎవరో చూడు.”

షీబా తలుపు తెరిచింది. ఎదురుగా కొరియర్ బాయ్ చేతిలో చిన్న ప్యాకెట్.

“సీమా?” అడిగాడతను.

“లోపలుంది …ఏంటి..?

“కొరియర్ మేడం.”

“సీమా….కొరియర్ వచ్చింది..”

“తీస్కో” అక్కడ్నుంచే చెప్పింది సీమా.

కొరియర్ బాయ్ షీబాకి ప్యాకెట్ అందించాడు. రిసీట్ మీద సంతకం తీస్కున్నాడు.

ప్యాకెట్ పైన
” FROM : ANURAG GAANDHI ..TO: SEEMAA ”
అని ఉంది.

గాంధీ నుంచి సీమాకి కొరియర్ రావడం కొంత ఆశ్చర్యం కలిగించినా ఆమె అది పట్టించుకోకుండా సీమాకి తెచ్చిచ్చింది.

“ఏం ఉంది అందులో చూడు..” అంది సీమా.

షీబా ప్యాకెట్ విప్పింది. ఒక బాక్స్ ఉంది, సన్నగా పొడుగ్గా. పెన్ బాక్స్ అని తెలుస్తోంది.

“పెన్..” అంటూ చూపించింది షీబా.

“ఇంకేం లేదా? చూసింది షీబా..

“ఏదో పేపర్ ఉంది.”

“చూడు.”

షీబా పేపర్ తీసి విప్పి చూసింది..

“ఏదో లెటర్ ..”

“చదువు..”అంది సీమా.

“బ్రతుకు – వెలుగులో తెలుస్తుంది, చీకటిలో కలుస్తుంది.”

– (అనురాగ్ గాంధి)

చదివింది షీబా.. ఇద్దరూ ఒకర్నొకరు చూసుకున్నారు.

“నీకు ఇతను ముందే తెలుసా..”? అడిగింది షీబా…

లేదన్నట్టు తల ఊపింది సీమా.

“మరీ…..”

“అంత ఆలోచించకు స్వాతి కి పంపిన ‘సంధ్యారాగం’ అనే కవితలో
‘బ్రతుకు..వెలుగులో నడుస్తుంది, చీకటిలో తెలుస్తుంది’ అని వ్రాసాను. రైటర్ కదా సవరించినట్టున్నాడు.”

నవ్వి, “ఇంతకీ నువ్వు రాసింది కరెక్టా..? అతను రాసింది కరెక్టా?” అడిగింది షీబా.

“ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ లో వాళ్ళు కరెక్ట్”

అవుననిపించింది షీబాకి.

“నీకో రహస్యం తెలుసా?” అడిగింది సీమా.

“ఏంటది?”

“ప్రపంచంలో అన్నిటికన్నా అందమైన అబద్ధం ఏంటో తెలుసా, కవిత్వం!”నవ్వింది షీబా, పగలబడి.

“ఎనీ వే కంగ్రాట్స్ ..”

“ఎందుకు?”

“నీ కవితని చదివి, స్పందించి అంత పెద్ద రైటర్ గిఫ్ట్ కూడా పంపాడంటే నీలో విషయం ఉందోయ్!” అంది చిలిపిగా చూస్తూ.

“ఏదో వ్రాసాను, పంపించాను… అతను చూసాడు… అందులో అంత వింత ఏముందిలే…” అంటూ కదిలింది సీమా లోపలికి…

తను సరదాగా రాసిన ఆ కవితే తన జీవితంలో అత్యంత కీలక పాత్ర పోషించబోతోందని కొద్ది రోజుల్లో తెలియనుంది ఆమెకి..
***

By Editor

One thought on “తామసి .. 2”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *