April 23, 2024

ద్వారకా తిరుమల

రచన: శ్యామసుందర రావు

కలియుగ దైవము శ్రీ వేంకటేశ్వరునికి తెలుగునాట ముఖ్యమైన దేవాలయాలు ఉన్నాయి
వాటిలోఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో నది పారివాహిక ప్రదేశాలలో చాలా
ప్రసిద్ధి చెందిన దేవాలయలు ఉన్నాయి వాటిలో స్వయంభువుగా ప్రత్యక్షమైన
వేంకటేశ్వర స్వామిని చీమల పుట్ట నుండి వెలికి తీసిన ద్వారక అనే ముని పేరు
మీదుగా ఈ ప్రదేశానికి “ద్వారక తిరుమల” అని పేరు వచ్చింది. సుదర్శన
క్షేత్రమైన ద్వారక తిరుమల చిన్నతిరుపతిగా ప్రసిద్ధి చెందినది. ద్వారకుడు
ఉత్తరాభి ముఖుడై తపస్సు చేశాడట. కనుక ఆ మునికి ప్రత్యక్షమైన స్వామి
దక్షిణాభిముఖుడై యున్నాడు. మూలవిరాట్టు దక్షిణముఖంగా ఉడడం కూడా అరుదు
ద్వారకా తిరుమలకి చిన్న తిరుపతి అన్న మారు పేరు వ్యవహారంలో వుంది.
ద్వారకుడు అనే బ్రాహ్మణుడు అతని భార్య సునంద జీవితాంతం తిరుపతి వెళ్లి
ప్రతిఏటా వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేవారు, ఆయనకు ముసలితనం వచ్చి
ఆలయానికి అంతదూరం రావడం కష్టం కావడంతో స్వామివారే ఇక్కడ వెలిశారని, ఆ
ద్వారకుని పేరటనే ద్వారకా తిరుమలగా పేరు వచ్చిందని భావిస్తారు. ఐతే
చెట్లుకొట్టి కట్టెలు అమ్ముకోవడం-దారుకము వృత్తిగా కలవారు ,
దారువులు(చెట్లు) ఎక్కువగా వుండడంతో, మెట్ట ప్రాంతానికి ద్వారం వంటిది
కావడం వంటి కారణాలతో ద్వారకా తిరుమల అయిందని మరొక వాదం వుంది. తిరుమలను
పెద్ద తిరుపతిగా వ్యవహరిస్తూ ఆ క్రమంలోనే దీనిని చిన్న తిరుపతిగా
వ్యవహరిస్తూంటారు
ద్వారకా తిరుమల ఆంధ్ర ప్రదేశ్ లో పశ్చిమ గోదావరి జిల్లా లో ఏలూరుకు 42
కిమీ ల దూరములో ఉన్నది. 15 కిమీ ల దూరములో భీమడోలు రైల్వే స్టేషన్
ఉంది.ఇక్కడ శేషాద్రి కొండపై శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువు దీరియున్నారు.
“పెద్దతిరుపతి” (తిరుమల తిరుపతి)లో తీర్చుకోవడానికి మ్రొక్కిన మ్రొక్కును
“చిన్నతిరుపతి”లో తీర్చుకున్నా అదే ఫలం లభిస్తుంది. కాని చిన్నతిరుపతిలో
తీర్చుకోవడానికి మ్రొక్కిన మ్రొక్కును చిన్నతిరుపతిలోనే తీర్చుకోవాలని
స్థానికంగా భక్తుల నమ్మకం. ఒకే విమాన శిఖరము క్రింద రెండు విగ్రహములు
ఉండటము ఇక్కడి విశేషము. ఒక విగ్రహము సంపూర్ణమైనది. రెండవది స్వామియొక్క
పై భాగము మాత్రమే కనుపించు అర్ధ విగ్రహము.
స్థల పురాణము ప్రకారము ఈ క్షేత్రము రాముని తండ్రి దశరథ మహారాజు ముందు
కాలము నాటిదని భావిస్తారు.ద్వారకా తిరుమల దేవాలయము చాలా పురాతనమైనదిగా
అంటే కృత యుగము నుండి భక్తుల చే పూజలు అందుకొన్న దేవాలయముగా పురాణాలలో
పేర్కొనబడింది.బ్రహ్మ పురాణములో పేర్కొన్నట్లుగా శ్రీరామ చంద్రుని
తాతగారైన అజా మహారాజు తన వివాహము కొరకు ఇందుమతి స్వయంవరం కోసము వెళుతూ
దారిలో ఈ దేవాలయములో శ్రీ వేంకటేశ్వరుని దర్శించుకోకుండా వెళతాడుట
అందువల్ల ఇందుమతి స్వయంవరం లో మాల వేసిన ఇతర రాజులతో యుద్ధము చేయవలసి
వచ్చింది అప్పుడు తన తప్పు తెలుసుకొని శ్రీ వేంకటేశ్వరుని దర్శనము వలన
సుఖాంతమవుతుంది “ద్వారకుడు” అనే ఋషి తపసు చేసి స్వామివారి పాదసేవను
కోరాడు. కనుక పాదములు పూజించే భాగ్యం అతనికి దక్కింది. పైభాగము మాత్రమే
మనకు దర్శనమిస్తుంది. విశిష్టాద్వైత బోధకులైన శ్రీ రామానుజాచార్యులు ఈ
క్షేత్రాన్ని దర్శించినారనీ, అందరూ స్వామి పాదపూజ చేసుకొనే భాగ్యం
కలిగించడానికి మరొక నిలువెత్తు విగ్రహాన్ని స్వయంవ్యక్త ధ్రువమూర్తికి
వెనుకవైపు పీఠంపై వైఖాన సాగమం ప్రకారం ప్రతిష్ఠించారని అంటారు.
స్వయంభువుగా వెలసిన, అర్ధభాగం మాత్రం దర్శనమిచ్చే, ప్రతిమను
కొలిచినందువలన మోక్షం సిద్ధిస్తుందనీ, తరువాత ప్రతిష్ఠింపబడిన పూర్తిగా
కనుపించే ప్రతిమను కొలిచినందువలన ధర్మార్ధకామ పురుషార్ధములు సమకూరుతాయనీ
భక్తుల విశ్వాసం. ఇక్కడ స్వామి వారికి అభిషేకము చేయక పోవడము ఇంకొక
విశేషము. ఒక చిన్న నీటి బొట్టు పడినా అది స్వామి విగ్రహము క్రిందనున్న
ఎర్రచీమలను కదుల్చును. ఈ గుడి యొక్క సంప్రదాయము ప్రకారము ప్రతియేటా రెండు
కళ్యానోత్సవములు వైశాఖ, ఆశ్వయిజ మాసములలో జరుపుతారు. ఇందుకు కారణం-
స్వయంభూమూర్తి వైశాఖమాసంలో దర్శన మిచ్చారనీ, సంపూర్ణ విగ్రహాన్ని
ఆశ్వయుజంలో ప్రతిష్ఠించారనీ చెబుతారు. గుడి ప్రవేశంలో కళ్యాణ మంటపం ఉంది.
మంటపం దాటి మెట్లు ఎక్కే ప్రాంభంభంలో (తొలిపమెట్టు వద్ద) పాదుకా మండపంలో
స్వామి పాదాలున్నాయి. శ్రీపాదాలకు నమస్కరించి భక్తులు పైకెక్కుతారు. పైకి
వెళ్లే మెట్ల మార్గంలో రెండు ప్రక్కలా దశావతారముల విగ్రహములు
ప్రతిష్ఠింపబడినవి. మెట్లకు తూర్పునైపున అన్నదాన సత్రం, ఆండాళ్ సదనం
ఉన్నాయి. పడమటివైపు పద్మావతి సదనం, దేవాలయం కార్యాలయం, నిత్యకళ్యాణ మండపం
ఉన్నాయి.
ప్రస్తుతము ఉన్న గుడిని, విమానము, మంటపము, గోపురము, ప్రాకారాలను నూజివీడు
జమిందార్ ధర్మా అప్పారావు (1762-1827) కాలంలో కట్టించారు. బంగారు
ఆభరణాలు, వెండి వాహనాలు రాణీ చిన్నమ్మరావు (1877-1902) సమర్పించారు.ఆలయ
ప్రధాన ద్వారం లోపల ఇరువైపుల, గర్భగుడికి అభిముఖంగా, ద్వారకాముని,
అన్నమాచార్యుల విగ్రహాలున్నాయి. ద్వారం పైభాగాన (లోపల) సప్తర్షుల
విగ్రహాలున్నాయి. గర్భగుడి చుట్టూ ఉన్న ప్రదక్షిణ మార్గం వెంట ప్రహరీని
ఆనుకొని 12 మంది ఆళ్వారుల ప్రతిమలు ఉన్నాయి. ప్రదక్షిణా మార్గంలో
దీపారాధన మంటపం ఉంది. ప్రధాన మందిరంలో ఆంజనేయస్వామి, గరుడస్వామిల చిన్న
మందిరాలు (ధ్వజస్తంభం వెనుక) ఉన్నాయి. గర్భగుడిలో స్వయంభూ వేంకటేశ్వర
స్వామి, ప్రతిష్ఠింపబడిన వేంకటేశ్వరస్వామి ప్రతిమలు కన్నులపండువుగా
దర్శనమిస్తాయి ప్రతిష్టించ బడిన శ్రీ వేంకటేశ్వరుని ప్రతిమను శ్రీమద్
రామానుజాచార్యులవారు 11 వ శతాబ్దములో ప్రతిష్టించారు అని స్థల పురాణాల
ద్వారా తెలుస్తుంది ఆ ప్రక్కనే కుడివైపు అర్ధ మంటపంలో తూర్పు ముఖంగా
మంగతాయారు, అండాళ్ (శ్రీదేవి, భూదేవి) అమ్మవార్లు కొలువై ఉన్నారు.
శుక్రవారం అమ్మవార్లకు విశేష కుంకుమపూజ చేస్తారు.
.ప్రధానాలయానికి తూర్పువైపున యాగశాల, వాహనశాల, మహానివేదనశాల, పడమటినైపున
తిరువంటపడి పరికరాలశాల ఉన్నాయి. నాలుగు దిక్కులా నాలుగు గాలి
గోపురాలున్నాయి. వీటిలో పెద్దదైన దక్షిణ దిక్కు గాలిగోపురం ఐదు
అంతస్తులది. గోపురములో చక్కని దక్షిణ భారత శిల్పశైలిని దర్శించవచ్చు.
గుడి ప్రాకారము చుట్టూ పన్నెండుగురు ఆళ్వారుల విగ్రహములు
ప్రతిష్ఠింపబడ్డాయి. పడమరవైపు ప్రక్కనే తలనీలాలు సమర్పించుకొనే కళ్యాణ
కట్ట ఉంది. కళ్యాణ కట్ట వద్ద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, ఒక నంది
విగ్రహం ఉన్నాయి.ఈ క్షేత్రములో లభించే ప్రతి శిలలో సుదర్శన ముద్ర
కనిపిస్తుందట,ఈ కొండా మీద తేజోమణి ఉన్నది అని అందువల్లే ఆలయ ప్రధాన
ద్వారము వేసినప్పటికీ ఆలయ గోపురము నుంచి దివ్య జ్యోతి కనిపిస్తుందని
అంటారు
గ్రామం పశ్చిమాన స్వామివారి పుష్కరిణి ఉంది. దీనిని సుదర్శన పుష్కరిణి
అని, నరసింహ సాగరమని, కుమార తీర్ధమనీ అంటారు.ఈ పుష్కరిణి నుండే
స్వామివారి అభిషేకానికి జలము తీసుకొని వెళతారు ఇక్కడ చక్ర తీర్ధము, రామ
తీర్ధము అనే రెండు స్నానఘట్టాలున్నాయి. ఇక్కడి రాళ్ళపై సుదర్శన (చక్రం)
ఆకృతి ఉన్నందున ఆ పేరు వచ్చింది. 1999లో పుష్కరిణి మధ్య మడపం
నిర్మించారు. ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ ద్వాదశి (క్షీరాబ్ధి ద్వాదశి)
నాడు తెప్పోత్సవం జరుపుతారు. గ్రామం లోపల విలాస మండపం, క్షీరాబ్ది మండపం,
ఉగాది మండపం, దసరా మండపం, సంక్రాంతి మండపం అనే కట్టడాలు వేరువేరు చోట్ల
ఉన్నాయి. పర్వదినాలలో తిరువీధుల సేవ జరిగినపుడు ఆయా మండపాలలో స్వామిని
“వేంచేపు” చేసి, అర్చన, ఆరగింపు, ప్రసాద వినియోగం జరుపుతారు.
ద్వారకాతిరుమలను దర్శించిన భక్తులు తలనీలాలు (తల వెంట్రుకలు) మొక్కుగా
సమర్పించడం ఞక ఆనవాయితీగా వస్తున్నాది. వెంకటేశ్వరుడు పద్మావతీ దేవిని
వివాహం చేసుకోవడానికి పూర్వం ఆశ్రమజీవనం గడుపుతున్నప్పుడు. తన ఆవు పాలు
తాగుతున్నాడని ఒక పశువుల కాపరి కోపంతో కొట్టడంతో తలపై ఆ దెబ్బకు కొంత
చర్మం కందిపోయి జుట్టు తొలగిపోయింది. ఈ సంఘటన వల్ల వెంకటేశ్వరుని
దివ్యమంగళ రూపానికి చిన్న మచ్చలా అనిపించిందని గాంధర్య కన్య యువరాణి అయిన
నీలాదేవి తన అపురూపమైన కొప్పునుంచి కొన్ని వెంట్రుకలను దేవదేవుని కోసం
ఇచ్చిందట. నీలాదేవి గౌరవార్ధం భక్తులు ఇచ్చే మొక్కుకాబట్టి తల నీలాలు
అంటారట. అట్టి మొక్కు తీచ్చుకునే ప్రదేశాన్ని కళ్యాణ కట్ట అంటారు.
ఈ కొండ ప్రత్యేకత ఏమిటి అంటే మాములుగా చూసేవాళ్లకు కూడా పాము ఆకృతి
కనిపిస్తుంది అనంతుడు అనే సర్ప రాజు పాము ఆకృతిలో మల్లికార్జునుడిని
తలపైన శ్రీ వేంకటేశ్వరుని తోక భాగములో మోస్తూ వైష్ణవానికి శైవానికి
సయోధ్యగా ఈ క్షేత్రము విరాజిల్లితుంది. కొండా మల్లికార్జున స్వామి
లింగాకారంలో కొండపై భాగములో ఉంది క్షేత్ర పాలకుడిగా వ్యవహరిస్తాడు. ఈ
క్షేత్రాన్ని దర్శించుకొనేవారు అక్కడి గ్రామా దేవత అయినా రేణుకా
దేవి(కుంకుళ్లమును) దర్శించుకుంటారు
అంబడిపూడి శ్యామసుందర రావు

1 thought on “ద్వారకా తిరుమల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *