May 19, 2024

వెన్నుపోటు

రచన: అనుపమ రమేష్.

లంచ్ అవర్ అవటంతో అందరూ బాచేస్ గా వెళ్లి బొంచేసి వస్తున్నారు. రోజూ చివరగా వెళ్తారు కమల, మాలతి, లత… కొంత రష్ తగ్గుతుంది, ఫ్రీగా ఉంటుందని.
“ఏంటో ఈ ఉద్యోగాలు.. హడావిడి పడలేక చస్తున్నా” లత.
“అవును కానీ కొంత కావాలంటే కొంత వదులుకోవాలి” ఆంది మాలతి.
“నీకేమీ కష్టం తల్లీ.. ఇంట్లో అన్ని పనుల్లో చేదోడవాదోడుగా ఉంటారు మీ ఆయన” అని లతతో “నీ చేతిలో ఆర్ట్ ఉంది, పైగా ఒక ఇన్స్‌టిట్యూట్ కూడా నడుపుతావు వీకెండ్స్ లో. అదేదో ఫుల్ టైం చేసుకో వచ్చుగా. కావాలంటే ఇంకో బ్రాంచ్ ఓపెన్ చెయ్యి.. మీ ఫ్యామిలీ అంతా అర్టిస్తులే కదా.. ఒక్కోరు ఒక్కోటీ చూసుకోవచ్చు” అంది కమల.
“నాకో ఐడియ.. మా ఇంట్లో మొన్ననే ఒక పోర్షన్ ఖాళీ అయ్యింది..
ముగ్గురము కలిసి ఒక ఇన్స్‌టిట్యూట్ పెడితే ఎలా ఉంటుంది అంటారు?” మాలతి.
లంచ్ టైమ్ ఆయి పోవడం తో వాళ్ళ సీట్ల లోకి వెళ్లి పనిలో మునిగిపోయారు.
***
మర్నాడు మళ్లీ లంచ్ టైం లో ఆ టాపిక్ తెచ్చింది మాలతి.
“నిన్న మా ఇంట్లో వాళ్ళకి చెప్పాను. అందరూ మంచి ఆలోచన అన్నారు. మా ఆయన అయితే ఇంక జాబ్ చేసింది చాలు… అలా అయితే ఇంట్లో ఉన్నట్టూ ఉంటుంది, కళా పోషణ చేసినట్టూ ఉంటుంది” అన్నారు.
“ఏం లతా నువ్వేమీ అనట్లేదు?” కమల లతని చూస్తూ కనుబొమ్మలు ఎగురవేసింది.
చిన్నగా నవ్వింది లత. “ఆలోచిద్దాం లెండి. అన్నీ వర్కౌట్ చెయ్యాలి కదా. రెంటు, స్టూడెంట్స్ ఎందరు వస్తారు, ఫీజ్ , ముగ్గురం షేర్ చేసుకోవాలి కదా… దీర్ఘం తీసింది.
అమ్మో.. ఏదో సరదాగా ఉంటుంది అనుకుంటే సీరియస్‌గా తీసుకున్నట్టు వుంది.. కొంచం జాగ్రత్తగా ఉండాలి… మనసులో అనుకుంది కమల.
అందరూ ఒకరోజు మాలతి ఇంట్లో కలిశారు… పోర్షన్ చూసినట్టూ ఉంటుంది, అన్నీ డిస్కస్ చేసినట్టు ఉంటుందని.
“పేరు ఏం పెడదాం ఇన్స్‌టిట్యూట్ కి?” లత.
నువ్వు నడుపుతున్న దాని పేరే పెడదాము.. ఉదారంగా అంది మాలతి. వారించబోయి ఆగిపోయింది కమల.
“వచ్చిన దాంట్లో ముగ్గురం పంచుకుందాం. ముందుగా నువ్వు మాకు కొంచం ట్రైనింగ్ ఇవ్వు… మేము కూడా క్లాసెస్ తీసుకోవచ్చు నీకు వీలు కానప్పుడు” అంది కమల.
ఒక్క నిమిషం లత ముఖంలో భావాలు మారినట్లుగా అయ్యి తమాయించుకుంది.
అనుకున్నట్టుగానే మంచి రోజు చూసి మొదలుపెట్టారు. మొదట్లో ఒకరిద్దరు పక్క ఇంట్లో వాళ్ళు, మరు నెల, వచ్చిన వాళ్ళ చుట్టాలు, స్నేహితులు చేరుతూ వచ్చారు. మాలతి ఇంట్లో ఉండటంతో అందరినీ కాంటాక్ట్ చేసి స్టూడెంట్స్‌ని చేరేలా చేస్తుంది. చేరినప్పుడు వాళ్ళ అడ్రెస్స్, ఫోన్ నంబర్, ఫీజుతో పాటూ నోట్ చేసేవాళ్ళు.
మూడు నెలలు గడిచాయి. కలెక్షన్స్ ఒకసారి చూద్దాం.. అని కమల, మాలతి చూసి భాగాలు వేశారు. మనం ఇంకా ఫుల్ల్ గా చెప్పట్లేదు కదా.. లత కి ఈసారి సగం ఇచ్చెద్దాం. మిగిలినది మనం అట్టే ఉంచి డెవలప్ మెంట్ కి వాడదాం అని నిశ్చయించుకొని, అదే మాట లతతో చెప్పి అమౌంట్ ఇచ్చేశారు.
మరో మూడు నెలలు గడిచాయి కానీ లత దగ్గర అనుకున్నంత ఎక్స్పీరియన్స్ రాలేదనిపించింది ఇద్దరికీ. ఏమైనా అడిగితే చెయ్యండి.. చేయ్యండి.. అనేదే కానీ తప్పులు దిద్దటం, మెళుకువలు చెప్పటం చేసేది కాదు.
ఇదిలా ఉండగా ఒకరిద్దరు క్లాస్ కి రావటం తగ్గింది. ఫోన్ చేస్తే ఏదో చెప్పే వాళ్ళు. తరువాత తెలిసింది లత వాళ్ళ ఇంటికి వెళ్లి క్లాస్ తీసుకుంటుందని. అయినా దాని గురించి అడగలేదు లతని.
ఒకసారి లత ఊరు వెళ్ళా ల్సి వచ్చింది.
ఆ రోజు కమల ఆఫీస్ నుంచి తొందరగా వచ్చింది. మాలతి రోజూ లాగే తలుపులు, కిటికీలు తెరిచి అన్నీ రెడీగా ఉంచింది.
ఏంటి ఈ రోజు ఎవ్వరూ రాలేదు అని ఒక్కొక్కరికీ ఫోన్ చేశారు.
“ఈ రోజు లత గారు రామన్నారు కదండీ. మళ్ళీ వారం నుంచి వస్తాము”… ఇదే జవాబు అందరి దగ్గరా.
కమలకి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. “మనం ఉన్నాం కదా.. చూసుకుంటామని వాళ్లకు చెప్పకుండా ఏకంగా రావద్దని చెప్పిందంటే ఎన్టీ లత ఉద్దేశం? నాకు ముందునుంచీ కొంత డౌటు గానే ఉంది… ” కమల అరిచినట్టే అంది. మాలతి కూడా ” మనం ఇంత సపోర్ట్ ఇచ్చామని కృతజ్ఞత కూడా లేనట్టుంది తనకి. ”
“సరే నేను వెళ్ళొస్తా. ఆవిడ ఊరినుంచి వచ్చాక ఎందుకైనా మంచిది.. ఓ మీటింగ్ పెట్టుకుందాం”అంటూ కమల బాగ్ తీసుకుని వెళ్ళిపోయింది. వెళ్తూ వెళ్తూ ఇన్స్‌టిట్యూట్ నేమ్ ప్లేట్ పీకి పడేసింది. మాలతి వైపు తిరిగి.. “ఇది నీ తప్పు.. తన ఇన్స్‌టిట్యూట్ పెరెందుకు పెట్టుకొమన్నావ్? అందుకే ఇది తన సొంతమనుకుంటుంది. మనం వేరేది పెట్టాల్సింది. ”
వారం గడిచింది. ఫోన్ రింగ్ అయితే “హెల్లో” మాలతి.
“లత వచ్చేసింది… సాయంత్రం ముగ్గురం కలుద్దాం” అటునుండి కమల.
వచ్చిన వాళ్ళకి స్నాక్స్, స్ప్రైట్ ఇచ్చి ముభావంగా కూర్చుంది మాలతి. “మీ ఇద్దరికీ తెచ్చాను” అంటూ బాగ్ తెరిచి వాళ్ళ ఊరి స్పెషల్ స్వీట్ ఇచ్చింది. “థాంక్స్”. ఇద్దరూ ఒకేసారి అన్నారు.
కుశల ప్రశ్నలు అయ్యాక కమల టాపిక్ ఎత్తింది. ” ఎన్టీ లతా.. నువ్వు ఊరు వెళ్తే మేము క్లాస్ తీసుకునే వాళ్ళం కదా? వాళ్ళని రావద్దని ఎందుకు చెప్పావు” అని నిలదీసింది.
“అబ్బే… నేను అలా చెప్పలేదు. ఊరు వెళ్తున్నా అన్నాను అంతే. వాళ్ళు రాకపోతే నా తప్పేముంది?” దాటేయబోయింది లత.
“అసలు నువ్వు ఊరు వెళ్తున్నట్టు మాఎదురుగా చెప్పలేదు.. అంటే పెర్సనల్గా చెప్పావనే కదా?” దొంగ దొరికావన్నట్టు చూసింది కమల. మాలతి మౌనంగా వింటూ కూర్చుంది.
లతకి సమాధానం దొరకలేదు… సరికదా మాట మార్చబోయింది…
“అసలు ఇది టీమ్ వర్క్. . . మరి నీ ఉద్దేశమేంటి ఇలా చెయ్యటంలో?” నిలదీసింది కమల. అసలు ఇన్స్‌టిట్యూట్ పేరు కూడా వేరే పెడదాం… ముగ్గురికి నచ్చేటట్టు”
సరే… టాపిక్ ఎలాగో వచ్చింది. ఇది నా ఇన్స్‌టిట్యూట్ పేరు మీద అయితేనే వస్తాను. మళ్ళీ బాగ్ తెరిచి ” మన స్టూడెంట్ సుధ ఈ అమౌంట్ ఇచ్చింది. నాకు వేరేగా ఇచ్చింది లెండి. ”
“అంటే ఎన్టీ? మరి ఇక్కడ అమౌంట్ మనం పంచుకుంటున్న మాట ఏంటి? మాలతీ, నేను కొంత ఇన్వెస్ట్ చేసి ఫర్నీచర్ కొన్నాం కదా? నీకు హెల్ప్ లాగ, మాకూ బాగుంటుందని ప్లాన్ చేశాం కదా?
“అది మీ ఇష్టం” అనేసి వెళ్ళిపోయింది.
“మనుష్యులు ఇంత అన్యాయంగా కూడా ఆలోచిస్తా రా?” మెల్లగా అంది మాలతి.
“మనమేమీ ఓడిపోకూడదు. ట్రై చేసి కొత్త వాళ్ళని జాయిన్ చేసుకుని చెప్దాము. మనకి ఎక్సపీరియన్స్ అలాగే వస్తుంది. ”
అనుకున్నట్టుగానే ఒక బి. ఎఫ్. ఏ. అయిన అమ్మాయిని ట్యూటర్ గా పార్ట్ టైమ్ పెట్టుకుని “ఆర్ట్ క్లబ్” లో క్లాసులు నడిపించారు. ఆ నోటా ఈ నోటా తెలిసి ఇప్పుడు కళకళలాడుతోంది ఇన్స్‌టిట్యూట్.
వేలు చూపిస్తే మండ మింగుదామనుకున్న వాళ్ళందరికీ ఇలాంటి పాఠాలే ఎదురవుతాయి.

****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *