May 19, 2024

స్పందన

రచన – డా. లక్ష్మీ రాఘవ.

శ్రావ్యకు చాలా సంతోషంగా వుంది. ఆ రోజు ఇన్నాళ్ళకి తన పుస్తకం పై సమీక్ష వచ్చింది. అదీ ఒక ప్రముఖ న్యూస్ పేపర్ ఆదివారం అనుబందంలో….
రెండు మూడు వారాలుగా ఆదివారం తెల్లారగానే ఆ ప్రముఖ న్యూస్ పేపర్ కోసం కాచుకునేది . ఎందుకంటే కొన్ని రోజులక్రితం ఆ పేపర్ కు సమీక్ష కొరకై తను రాసిన
కథా సంపుటిని పంపింది. అందుకే ఆదివారం రాగానే సమీక్ష వచ్చిందా? అని చూసేది. ఇన్నాళ్ళకి వచ్చింది. అది చదివి ఇంకా సంతోషపడిపోయింది. సమీక్ష చాలా బాగా రాసారు. కొన్ని కథలను ప్రస్తావిస్తూ చాలా ప్రత్యేకమైన విధంగా రచయిత వీటిని రాసారని, పుస్తకం లో ప్రతి కథా చదివించేలా వుందని అందరూ తప్పక చదవాల్సిన పుస్తకం అని రాసారు.
శ్రావ్య ఏంతో ఉత్సాహంగా వంటింట్లోకి వెళ్లి గబా, గబా టిఫన్, లంచ్ లు తొందరగా చేసేయ్యలన్న ఆతృత తో వుంది ఎందుకంటే మళ్ళీ సమీక్ష చూసి ఫోనులు వస్తే జవాబు తీరికగా చెప్పాలి కదా…
భర్త రాజేష్ రాగానే కాఫీ ఇచ్చింది. “ఏమిటో ఇవ్వాళ శ్రీమతి చాలా ఉత్సాహంగా వున్నారు”నవ్వుతూ అన్నాడు.
“ఒక్కసారి ఆదివారం అనుబంధం లో చూసి మళ్ళీ మాట్లాడండి” అంది విషయం చెప్పకుండా.
కాఫీ తీసుకుని రాజేష్ హాల్లోకి వెళ్లి న్యూస్ పేపర్ లో ఆదివారం మేగజైన్ చూసాడు. శ్రావ్య పుస్తక సమీక్ష చదివి వెంటనే వంటింట్లోకి వెళ్లి శ్రావ్యని దగ్గరగా తీసుకుంటూ “కంగ్రాట్స్ శ్రీమతిగారూ ..భలేవుంది సమీక్ష. తమరే గెలిచారు” అని తన చెవులు పట్టుకున్నాడు..
“అలా రావాలి దారికి…చెబితే విన్నారా ? పోయినసారి ఎంత నష్టపోయాం. ఈసారి నేరుగా నాకే స్పందన ఎలా వుందో తెలుస్తుందిగా…” కొంటెగా అంది.
“ఒప్పుకుంటున్నాను శ్రీమతీ…” అని చెంపలు వేసుకుంటూ హాల్లోకి వెళ్ళాడు.
శ్రావ్య కుక్కర్ పెడుతూంటే ఫోను మ్రోగింది..గబుక్కున మొబైల్ అందుకుని
“హలో” అంది.
“మీ పుస్తక సమీక్ష ఇప్పుడే చదివాను. చాలా బాగుందండీ. టైటిల్ కూడా అద్బుతంగా వుంది. మీరు రాసిన పుస్తకాలు ఇంకా ఉన్నాయా మేడం గారు. మీ భావనలు కథల్లో బాగా వున్నట్టు వుంది కావున అన్నీ చదవాలని నా కోరిక. నా అడ్రెస్స్ పెడతాను ఒక పుస్తకం పెడతారా?”
ఆ మాటలకి ఉప్పొంగి పోయింది శ్రావ్య. ఇంత స్పందన కలుగాజేస్తుందా ఒక సమీక్ష.?? ఆలోచనలలో ఇంకా ఎన్నో పుస్తకాలు వేసేయ్యాలి అన్న ఉత్సాహం వచ్చేసింది.
అలా కొన్ని ఫోన్లు శ్రావ్య కు చెవులకింపుగా ఆకాశం లో తేలిపోయేలా చేసాయి.
గబగబా వంటింటి పని ముగించింది. ఇంతలో మరో ఫోను!
“హలో అండీ..ఈ రోజు ఆదివారం మేగజైన్ లో మీ కథా సంపుటి గురించి వచ్చింది కదా ప్రతులకు అని మీ మొబైల్ నెంబరు ఇచ్చారు. సమీక్ష చాలా బాగుంది. నాకు ఒక పుస్తకం కావాలండీ “
“తప్పక పంపుతాను. మీరు మీ అడ్రెస్ ఈ మొబైల్ కు మేసేజ్ ఇవ్వండి..”
“మేడం, పేమెంట్ ఎలా? మీరు పుస్తకం వేల 150 రూపాయలు అని వుంది. అంతా పంపాలoటారా ?
“అవునండీ. ఇదే నెంబరుకు గూగుల్ పే చెయ్యాలి”
“సరేనండీ“
“మీ పేరు , వూరు చెప్పండి.”
“నేను మేసేజ్ చేస్తాను కదా” పెట్టేసాడు ఆయన. ఒక పేపర్ తీసుకుని కాల్ వచ్చిన నెంబర్లు రాసుకుంది శ్రావ్య. ఫోను మ్రోగింది
“హలో మేడం, సమీక్ష చూసి చేస్తున్నా, నాకు కావాలి పుస్తకం ఎలా?”
“మీరు మీ అడ్రెస్స్ ఈ నెంబరుకు మేసేజ్ చెయ్యండి. డబ్బు గూగల్ పే చెయ్యాలి”
“ముందు మీరు పంపండి. పుస్తకం వచ్చాక నేను డబ్బు పంపుతా…” శ్రావ్య కు మాటలు కరువైనాయి
“హలో మేడం. పుస్తకం కావాలి అని ఇందాక ఫోను చేసాను. మీరన్నట్టు google పే చేసాను. వెంటనే కొరియర్ చెయ్యండి” …..కోరియరా? అది ఎనబై రూపాయలు అవుతుంది బాబూ….అని చెప్పలేక పోయింది.
తరువాత వచ్చిన కాల్స్ ఇలా వున్నాయి.
“అమ్మా, మీ పుస్తకం మా సీనియర్ సిటిజన్స్ గ్రంధాలయానికి కావాలి. దయ చేసి మాకు ఒక ఫ్రీ కాఫీ కావాలి”
“అమ్మా నేను ఎక్కువ చదువుకోలేదు. అయినా కథలు చదవటం ఇష్టం .ఒక పుస్తకం నాకు పంపుతారా? అడ్రెస్ పెడతాను”
“అమ్మా నేనొక వేద పండితుడిని. నా వయసు 83 ఏళ్లు. మీ పుస్తకం శీర్షిక బాగుంది. ఒక్కటి ఉచితం గా పంపగలరా? అడ్రెస్ చేబుతాను రాసుకోండి. నాకు మెసేజ్ చెయ్యడానికి చెయ్యి వణుకు తుంది…” మాట్లాడకుండా అడ్రెస్ రాసుకుంది శ్రావ్య.
“మీ పుస్తకం కొరకు గూగుల్ పే చేయడం రాదు కనుక నేను M.O చేస్తాను కొంచెం అడ్రెస్ ఇవ్వండి. “
“నా పేరు జానకి, ఈ రోజు మీ సమీక్ష తరువాత ఇచ్చిన ఫోను చూసి కాల్ చేస్తున్నాను. నాకు పెరాలిసిస్ వచ్చి నడిచే పరిస్థితి లేదు. మేము చాలా బీదవారం. మీకు ఫోను చేసి అడిగితె ఏదైనా సహాయం చేయగలరేమో అని ….” జవాబు చెప్పడం కష్టం అయ్యింది శ్రావ్యకు.
ఫోన్లలో మాట్లాడుతూనే బోజనాలు కూడా ముగించడం అయ్యింది. రాజేష్
“నేను కాస్సేపు పడుకుని వస్తాను నీకు ఎలాగూ ఫోన్లు వస్తూనే వున్నాయి కదా. వీలయితే కాస్త రెస్ట్ తీసుకో…” అని బెడ్ రూ౦ లోకి వెళ్ళాడు. ఆదివారం అతని రొటీన్ అదే.
ఫోన్లు ఇంకా కొన్ని వచ్చాయి. అందరి పేర్లు రాసుకు౦ది కాబట్టి ఎవరు డబ్బు పంపారు అన్నది. చూసుకుంటూ, బాంక్ మెసేజ్ కూడా చూసి ఒక పక్కగా రాసుకుంది.
ఐదు మంది మాత్రమే డబ్బు పంపారు. మిగిలిన వన్నీ వేస్ట్ కాల్సే.
అయినా ఓపికగా అందరికీ జవాబు చెప్పింది.
ఈ లిస్టు చూపితే రాజేష్ తప్పక ఏడిపిస్తాడు..
ఎందుకంటే…….
శ్రావ్య రాసిన మొదటి పుస్తకం సమీక్షలకు పంపినప్పుడు “ప్రతులకు పుస్తక కేంద్రాలు” అని రాసి పంపింది. రెండు పుస్తక కేంద్రాలలో పుస్తకాలు ఇచ్చివున్నది కావున.
అప్పుడు మంచి సమీక్షలు వచ్చినా తన ఫోను నెంబరు ఇవ్వలేదు కాబట్టి ఫోన్లు రాలేదు.
అయినా సమీక్షలు బాగా వచ్చాయి కాబట్టి తన పుస్తకాలు అన్నీ అమ్ముడు పోయి ఉంటాయని, ఎంత వచ్చిందో చూసి డబ్బు సెటిల్ చేసుకోవచ్చని ఒక వారం తరువాత వారి దగ్గరకు వెళ్ళినప్పుడు వారి సమాధానం విని ఆశ్చర్య పోయింది.
“సమీక్షలు వచ్చినంత మాత్రాన అందరూ వచ్చి పుస్తకాలు కొనెయ్యరు మేడం. మీకు ఇది మొదటి పుస్తకం కాబట్టి ఆతృతగా వుంది. ఇంకా కొన్ని రోజులు చూసాక పుస్తకాలు అమ్ముడుపొతే మా పెర్సెంట్ తీసి మీకు చెక్ ఇస్తాము.” అన్నాడు మేమేజర్ .
ఒక్కసారిగా నీరసపడిపోయి షాపులో తన పుస్తకం ఎక్కడ ఉందా అని చూసింది. ఎక్కడా కనపడక పోయేసరికి “ఇక్కడ display లో నా పుస్తకం లేదే” అనింది.
“మీది మొదటి పుస్తకం కదా. కొత్త రచయితలవి లోపల రూమ్ లో పెట్టాము. ఇక్కడ అందరూ పెద్ద పేరున్న రచయితలది పెడతాము.”
“అలా ఐయితే ఇక్కడకు వచ్చిన వారికి మా పుస్తకాలు మీ దగ్గర వున్నాయని ఎలా తెలుస్తుంది ??” అన్నది గాబరాగా.
“కొద్దిగా ఖాళీ అవగానే పెడతాము మేడం. మీరు వర్రీ కాకండి. మీ పుస్తకాలు అమ్ముడుపొతే మేమే మీకు ఫోను చేబుతాము” అంటూన్న అతని సమాధానం తో మరీ నీరసపడిపోయింది శ్రావ్య.
అందుకే “రెండవ పుస్తకం నేరుగా నేనే అమ్ముతాను “అని వాదించింది రాజేష్ తో ఎందుకంటే రాజేష్ “నీ ఫోను నెంబరు ఇస్తే చాలా న్యూసెన్స్, వద్దు “అని అన్నాడు.
అదీ సంగతి!
***.
ఇంతలో రాజేష్ లేచి వస్తే కాఫీ కలిపి తెచ్చింది ఇద్దరికీ. తాగుతూ “ఈసారి నీ నెంబరు ఇచ్చే ముచ్చట తీరింది కదా ఎన్ని ఫోన్లు వచ్చాయేమిటి ?” అడుగుతుంటే అన్నీ చెప్పడానికి సిగ్గు అనిపించి.
“బాగానే వచ్చాయి. కొంతమంది డబ్బుకూడా పంపారు. రేపు పుస్తకాలు లు పాక్ చేసి పంపాలి.” అంది వివరాలు ఇవ్వకుండా.
“పోన్లే, నీ ముచ్చట తీరింది కదా” అన్నాడు రాజేష్.
రాత్రి పది గంటలకి మళ్ళీ మోగింది ఫోను.
శ్రావ్య ఫోను తీసి”హలో” అనగానే పెట్టేసారు. మరో రెండుసార్లు అదే నెంబరుతో అలాగే చేసేసరికి
“ఈ సారి నాకివ్వు, నే మాట్లాడతా” అన్నాడు రాజేష్. మూడోసారి రింగ్ అవగానే రాజేష్ తీసుకుని “హలో “ అనగానే ..పెట్టేసారు.
మళ్ళీ రాలేదు ఫోను. ఫోను నెంబరు దొరికితే ఇలా వాడుకునే ఆకతాయిలు కూడా వుంటారు అనిపించింది శ్రావ్యకు .
కొద్దిగా పేరు వచ్చాక పుస్తకాలు బుక్ స్టోర్ లోనే బాగా అమ్ముడు పోతాయని తెలియని శ్రావ్యకు ఈ సారి మంచి అనుభవం అయ్యింది రెండవ పుస్తకం తోటే…..
ఏదైనా అనుభవంలోకి వస్తే కదా తెలిసేది!
ఏమైనా వచ్చిన కొన్ని ఫోన్లతో శ్రావ్య లోని రచయితకు ఒక కిక్కు వచ్చిందంటే అతిశయోక్తి కాదు.
*****>

3 thoughts on “స్పందన

  1. స్పందన కథ కొత్తగా రచనలు చేసే వాళ్లకి ముందు జాగ్రత్త చెప్పినట్టుగా ఉంది. బాగుందండీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *