April 26, 2024

అమ్మమ్మ – 18

రచన: గిరిజ పీసపాటి

డాక్టర్ రాజేశ్వరమ్మ గారి దగ్గర నుండి ఇంటికి వచ్చిన అమ్మమ్మ ఆలోచనలో పడిపోయింది.
‘తనమీద ఉన్న అభిమానం కొద్దీ రాజేశ్వరమ్మ గారు తనని హైదరాబాదు తీసుకెళ్తానన్నా అక్కడికెళ్లగానే ఆవిడకు తన విషయం ఏ గుర్తుంటుంది? ఒకవేళ ఉన్నా ఇది తెలిసిన ఊరు, ఎరిగిన మనుషులు కనుక పని ఇప్పించగలిగారు కానీ అక్కడ ఆవిడ తనకి పని ఎలా ఇప్పించగలరు? ఒకవేళ ఇప్పించినా ఆ మహానగరంలో ముక్కు మొహం తెలియని మనుషుల మధ్య ఒంటరిగా తను ఎలా బతకగలదు? ఏదో గుట్టుగా జీవితం గడిచిపోతోందనుకుంటున్నంతలో మళ్ళీ సమస్య మొదటికి వచ్చిందే’ అని బాధ పడసాగింది.
అమ్మమ్మ పరిస్థితి చూసిన వరలక్ష్మమ్మగారు కూడా అమ్మమ్మకి సహాయం చెయ్యలేకపోతున్నందుకు బాధ పడసాగారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా అంతంతమాత్రమే. పెద్ద కొడుకొకు జీతం ఒక్కటే ఇంటిల్లిపాదికీ ఆధారం. చిన్న కొడుకుకు హైదరాబాదు హై కోర్టులో ఉద్యోగం రాగానే భార్యను తీసుకొని హైదరాబాదు వెళ్ళిపోయి వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు.
కానీ రాజేశ్వరమ్మ గారు కూడా అమ్మమ్మ లాగే ఖచ్చితమైన మనిషి. మాట ఇస్తే తప్పని వ్యక్తి. హైదరాబాదు వెళ్ళగానే ఆవిడ మొదట చేసిన పని మేనల్లుడు డాక్టర్ పురుషోత్తంకి అమ్మమ్మ విషయం చెప్పడం.
ఆయన కూడా తెనాలి వచ్చినపుడు అమ్మమ్మ, తాతయ్యలను చూసారు కనుక వెంటనే తన తోటి డాక్టర్స్ కి, తన దగ్గరకు వచ్చే పేషెంట్స్ కి (బ్రాహ్మణులకు మాత్రమే. ఆ కాలం మనిషి కనుక అమ్మమ్మకు మడి, అచారం బాగా ఎక్కువ) ఏ ఫంక్షన్ చేసుకున్నా, వంట మనిషి అవసరమైతే తనకి చెప్పమని, తమకు తెలిసినావిడ ఉందని చెప్పసాగారు.
రాజేశ్వరమ్మ గారు హైదరాబాదు వెళ్ళిన నెలరోజులకి ఆవిడ నుండి అమ్మమ్మకి ఉత్తరం వచ్చింది. తన స్నేహితురాలు రాసిన ఉత్తరాన్ని ఆనందంగా చదువుకున్న అమ్మమ్మ, ఏం చెయ్యాలో తోచని అయోమయ పరిస్థితిలో పడిపోయినా వెంటనే తేరుకుని, “నాయనా!” అంటూ పెద్దన్నయ్యను పిలిచి ఉత్తరం ఆయన చేతిలో పెట్టింది.
ఆ ఉత్తరంలో ‘తను హైదరాబాదులో తెలిసినవారందరికీ మీ గురించి చెప్పానని, వెంటనే ఇద్దరు డాక్టర్లు తమ ఇంటిలో జరిగే ఫంక్షన్స్ కి మీరు వంట చేయడానికి ఒప్పుకుని అడ్వాన్స్ కూడా ఇచ్చారని, ఈ ఉత్తరంతో పాటు ఆ డబ్బు కూడా MO చేస్తున్నానని, ఒకవేళ ఇక్కడ మీకు ఉండడం ఇష్టం లేకపోతే ఒప్పందం పడ్డ రెండిళ్ళలో వంట పని పూర్తి చేసి వెళిపోవచ్చనీ, నా మాట కొట్టెయ్యరనే నమ్మకంతోనే ఇలా చేసానని, వెంటనే ట్రైన్ కి రిజర్వేషన్ చేయించుకుని, ఏ ట్రైన్ కి వచ్చేది తెలియజేస్తే పురుషోత్తం స్టేషన్ కి వచ్చి, మిమ్మల్ని ఇంటికి తీసుకొస్తాడని’ రాసారు.
పెద్దన్నయ్య ఉత్తరం చదువుతుండగానే MO కూడా అందడంతో, అమ్మమ్మ అందులోంచి కొంత డబ్బు తీసి పెద్దన్నయ్యకి ఇచ్చి “ఎల్లుండి ట్రైన్ కి రిజర్వేషన్ చేయించు” అని చెప్పింది. పెద్దన్నయ్య సైకిల్ మీద రైల్వేస్టేషన్ కి వెళ్ళగానే వరలక్ష్మమ్మగారికి కూడా విషయం చెప్పి, తనకి అవసరమైన బట్టలు, సామాను సర్దుకోసాగింది.
తరువాత కిరాణా షాపు ఓనరుకి కబురు చేసి, ఆయన రాగానే తనకి కావలసిన సామాను లిస్టు ఇచ్చి వెంటనే పంపించమంది. ఆయన సామాను పంపగానే వాటిని బాగుచేసే పనిలో పడింది. ఇంతలో పెద్దన్నయ్య వచ్చి “ఎల్లుండి గోదావరికి టికెట్ చేయించాను పెద్దమ్మా!” అంటూ టికెట్ చేతిలో పెట్టాడు.
మర్నాడు నిద్ర లేవగానే స్నానం చేసి వంట చేసుకుని పెందరాడే తినేసి, పెద్దన్నయ్యను కేకేసి, మర్నాడు గోదావరికి తను బయలుదేరి వస్తున్నట్లు, కంపార్ట్మెంట్ నంబర్, బెర్త్ నంబర్ తో సహా ఉత్తరంలో ఉన్న అడ్రస్ కు టెలిగ్రామ్ ఇమ్మని పురమాయించింది.
తరువాత రోలు, తిరగలి ముందేసుకుని వరలక్ష్మమ్మ సహాయంతో మినప సున్నుండలు, జంతికలు చేసి, వరలక్ష్మమ్మగారికి సగం ఇచ్చి, రెండవ సగం డబ్బాలలో సర్దింది. తరువాత దగ్గరి బంధువుల ఇళ్ళకు వెళ్ళి హైదరాబాదు వెళ్తున్న విషయం చెప్పింది.
మర్నాడు ఉదయాన్నే అందరికీ పేరు పేరునా వెళ్ళొస్తానని చెప్పింది. వీధి వీధంతా అమ్మమ్మకు వీడ్కోలు చెప్పడానికి ఇంటికి వచ్చారు. వరలక్ష్మమ్మను కౌగలించుకుని కన్నీళ్ళతో వీడ్కోలు చెప్పింది. తరువాత పెద్దన్నయ్య సాయంతో విజయవాడ వరకు బస్ లో వచ్చి, అక్కడ గోదావరి ట్రైన్ ఎక్కింది అమ్మమ్మ.
ట్రైన్ కదలగానే కన్నీటితో పెద్దన్నయ్యకు చెయ్యూపుతూ, అతను కనుమరుగయ్యేవరకు రెప్ప కూడా వాల్చకుండా చూస్తూ కూర్చుంది. ఏనాడూ చెయ్యని ఒంటరి ప్రయాణం. అదీ ఎప్పుడూ వెళ్ళని హైదరాబాదు మహా నగరానికి.
‘మద్రాసులో నివసించినప్పుడు కూడా ఆయతోనో, కాంచనమాల, కన్నాంబ, టంగుటూరి సూర్యకుమారి గార్లతోనో కారులో తప్ప, ఇలా ఒంటరిగా ఎప్పుడూ వెళ్ళి ఎక్కడా ఉండాల్సిన అవసరం రాలేదు. రాముడువలస వెళ్ళినపుడు ఒంటరిగానే వెళ్ళినా నాగను, పసి పిల్లను చూడబోతున్న ఆనందంతో ఒంటరితనం తెలియలేదు. పైగా అక్కడ శాశ్వతంగా ఉండిపోవడానికి వెళ్ళలేదు కనుక తిరిగి తెనాలి వచ్చేస్తాననే ధీమాతో వెళ్ళింది. అన్నిటికీ తను నమ్ముకున్న ఆ లలితా పరమేశ్వరే తనకు తోడు’.
‘అమ్మా! ముందు నువ్వు నడువు. నీ అడుగుజాడలలో నన్ను చెయ్యి పట్టుకుని మరీ నడిపించు’ అనుకుంది. మర్నాడు ట్రైన్ రైల్వేస్టేషన్ స్టేషన్ కి చేరగానే అందరూ హడావుడిగా ట్రైన్ దిగుతున్నా, తను మాత్రం కదలకుండా తన సీట్ వద్దే కూర్చుని విండో లోంచి డాక్టర్ పురుషోత్తం కోసం ప్లాట్‌ఫారమ్ మీద ఉన్న జనంలో వెతకసాగింది.
డాక్టర్ పురుషోత్తం కనపడగానే “నాయనా పురుషోత్తం!” అంటూ గట్టిగా కేక వేసి పిలిచింది. చేతిలో టెలిగ్రామ్ తో ట్రైన్ కాంపార్ట్మెంట్ నంబర్స్ చూసుకుంటూ వస్తున్న పురుషోత్తంకి అమ్మమ్మ కేక వినిపించి, అటువైపు చూడగానే చెయ్యూపుతూ కనిపించింది అమ్మమ్మ.
ఆయన గబగబా ట్రైన్ ఎక్కి అమ్మమ్మకి నమస్కరించి, ఒక రైల్వే కూలీని కేకేసి, అమ్మమ్మ ట్రంకు పెట్టె, బెడ్డింగ్ అతని తలకెత్తి, అమ్మమ్మ చెయ్యి పట్టుకుని జాగ్రత్తగా కారు దగ్గరకు తీసుకెళ్ళారు. ఇద్దరూ కారులో వస్తున్నప్పుడు దారిలో కనబడిన కట్టడాలను అమ్మమ్మకి చూపిస్తూ, వాటి వెనుక ఉన్న చారిత్రక విషయాలు చెప్పసాగారు.
అమ్మమ్మ అక్కడ శాశ్వతంగా ఉండడానికి భయపడుతుంటే ఆయన నవ్వి “ఈ ఊరు వచ్చిన కొత్తల్లో నేనూ ఇలాగే భయపడ్డాను అత్తయ్యా! ఇప్పుడు అలవాటైపోలేదూ! అలాగే మీరూ అలవాటు పడిపోతారు. ఇక్కడ అందరూ మంచివాళ్ళే. అలాగే అందరికీ తెలుగు బాగా వచ్చు.”
“మీ వంటలు ఇక్కడ రుచి చూసారంటే ఇక్కడి వాళ్ళు మిమ్మల్ని తిరిగి వెళ్ళనివ్వరు సరికదా! మీకు ఊరు వెళ్ళాలనే ఆలోచన కూడా రానంత పని దొరుకుతుంది. నాకా నమ్మకం ఉంది. మీకు ఊరు అలవాటు అయ్యేదాకా నేను మిమ్మల్ని వెళ్ళాల్సిన చోట దింపి, తిరిగి తీసుకొస్తాను. భయపడకండి అత్తయ్యా!” అంటూ ధైర్యం చెప్పారు.

***** సశేషం *****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *