March 28, 2024

పోలుద్దామా మరి?

రచన: మణి గోవిందరాజుల

దిగ్భ్రాంతిగా నిల్చుండిపోయింది నందిని..తలుపు విసురుగా వేసి వెళ్ళిన ప్రభు వేపే చూస్తూ. ఎప్పటిలాగే చిన్నగా మొదలయిన గొడవ పెద్దదయింది. అసలు జరుగుతున్నదేమిటో కూడా అర్థం కావడం లేదు. తనకే ఎందుకిలా అవుతుంది? అందరిళ్ళల్లో ఇలానే ఉంటుందా? వంట బాగా రాకపోతే అదో పెద్ద డిస్క్వాలిఫికేషనా? ఇంత చిన్న విషయానికి కూడా అంత పెద్ద గొడవ జరుగుతుందా? ఇహ ముందు ప్రేమికులు ఆ విషయాన్ని రూఢీగా తెలుసుకుని మరీ ప్రేమించాలి.తాను కూడా చాలా హాస్యకథలు చదివింది ఈ టాపిక్ మీద. చదివి నవ్వుకుందే కాని అది తనకే తగులుతుందని అనుకోలేదు. అయినా ఒక్క విషయం అనేమిలే ఎన్ని కలవాలో? మరి ఒక్క సారి చూసి ఒప్పుకునే పెళ్ళిచూపుల్లో ఇవన్నీ కనుక్కోవడానికి సమయం కూడా ఉండదు కదా? అయినా ఎన్ని జంటలు హాయిగా కాలం గడపడం లేదు? అందరిళ్ళల్లో ఇలానే గొడవలు అవుతాయా?
నాల్రోజుల క్రితం కొత్తగా కుదిరిన పనమ్మాయికి తనకు జరిగిన సంభాషణ జ్ఞాపకం వచ్చింది. దానికి ఇద్దరు పిల్లలు. అందరిళ్ళల్లో పని చేసుకుని వెళ్ళేసరికి రెండవుతుంది. మరి అప్పుడెళ్ళి వంట చేసుకోవాలి కదే అంటే మా అత్తమ్మ ఉంటుంది ఇంట్లో. ఇద్దరు పిల్లలకి ఎడం లేదు కదమ్మా?. వాళ్ళను చూట్టానికి మా అత్తమ్మ మా ఇంట్లో ఉంటుంది. నేనెళ్ళేసరికి వంటచేసి పిల్లలకు పెట్టి కరోనా భయం కదా? స్నానానికి వేణ్ణీళ్ళు కాచి ఉంచుతుంది. నేను స్నానం చేసి పిలగాళ్ళతో కాసేపు ఆడుకున్నాక నన్ను పడుకోమని పిల్లల్ని తాను ఆడిస్తుంది.ఇక సాయంత్రం వంట మటుకు నేను చేస్తాను”
“మరి మీ మామగారు లేరా?”
“అయ్యొ! ఉన్నారమ్మా. మా ఏరాలుకి పెద్ద పిల్లలు. ఆమె కూడా మా ఊళ్ళో స్కూల్లో పని చేస్తుంది. మా బావ పనికి పోతడు. అందుకని పిల్లలు ఇంటికొచ్చే వేళకు చూట్టానికి అని మా మామ అక్కడే ఉన్నడు. ఇంకొక్క ఏడాదైతే మా పిల్లలు పెద్దోళ్ళవుతే పాపం వాళ్ళిద్దరూ ఒకచోట ఉంటరు. మా ఏరాలు వాళ్ళు ఆయన్ని కూడా ఇక్కడికే వెళ్ళమంటారమ్మా. కాని మా మామే ఎదిగే పిల్లలకు పెద్దోళ్ళ అండ ఉండాలె. అంటూ అక్కణ్నే ఉంటడు. మా అత్తమ్మనేమో చిన్నపిల్లలకు ఆడోళ్ళ తోడుండాలే అంటూ ఇక్కడికి పంపిచ్చిండు” చెప్పుకొచ్చింది.
“మరి మీ ఆయన?”
“ఆయన ఆటో నడుపుతడు.. శాన మంచోడు. మా వోడొచ్చేసరికి ఆరవుతది. అప్పటికి వంట చేసి ఉంచితే అందరం కలిసి బయటికెళ్ళేటోళ్ళం కరొనా రాక ముందు. రోజు పొద్దున్నే నన్నిక్కడ దింపి ఆటో నడపనీకి పోతడు. మళ్ళీ నా పనయ్యాక ఫోన్ చేస్తే వచ్చి తీసుకెళ్ళి ఇంట్ల దింపి అన్నం తిని మళ్ళీ పోతడు” చెప్తుంటే దాని మొహం వెలిగి పోతున్నది.
ఆమె ముచ్చట విన్నాక ఎంతో సంతోషమనిపించింది. ప్రపంచం లో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనిపించింది. మంచితనానికి, సంస్కారానికి చదువుతో సంబంధం లేదేమో. వాళ్ళ అత్తమామలతో ఈ సో కాల్డ్ పెద్దమనుషులము అనుకునే తన అత్తమామలకు కౌన్సిలింగ్ క్లాసులు ఇప్పించాలి అన్నంత కోరిక కలిగింది. దాని మొగుడితో తన మొగుడికి కూడా క్లాసులు పీకించాలి. ఉక్రోషంగా అనుకుంది.
“ట్రింగ్! ట్రింగ్!!… ఫోన్ మోతకు ఆలోచిస్తూ కూర్చున్న నందిని ఈ లోకం లోకి వచ్చింది.
“నందూ! ఇవాళ ఇటొస్తానన్నావు కదా? వస్తున్నావా? పిల్లలు ఎదురు చూస్తున్నారు” అడిగింది నందిని తల్లి రాజ్యం.
“ఒక అరగంటలో బయలుదేరుతానమ్మా!” తల్లికి జవాబు చెప్పి ఫోన్ కట్ చేయగానే విపరీతమైన దుఃఖం ముంచుకొచ్చింది నందినికి. “ఎలా ఊహించుకుంది జీవితాన్ని? కష్టపడి ఇంజనీరింగ్ చదివింది. మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది.జాబ్ లో ఉండగానే ప్రేమించానంటూ వెంటపడితే నిజమని నమ్మింది. వద్దనడానికి కారణం కనపడలేదు. బాగా విద్యావంతులున్న కుటుంబం. అందుకని ఇంకో ఆలోచనే రాలేదు. మగవాళ్ళల్లో రెండు రూపాలు ఉంటాయేమొ? ప్రపంచం చూసే రూపమొకటి. కట్టుకున్న భార్యకు మాత్రమే పరిమితమయ్యే అసలైన రూపమింకొకటి.ఈ రెండో రూపం భార్యకు మాత్రమే పరిమితం కాబట్టి ప్రపంచానికి వాళ్ళు చాలా గొప్పవాళ్ళుగా, మంచి వాళ్ళుగానే ఉంటారు…పాపం నాలాంటి పిచ్చి మొహాలే ఆడవాళ్ళందరు కాబట్టీ అది చెప్పలేరు ఇది మింగలేరు” నిట్టూర్చింది నందిని. ప్రభు పూర్తిగా చెడ్డవాడని చెప్పలేము. అలాగని పూర్తిగా మంచివాడని ఒప్పుకోలేదు. తల్లి ఏదంటే అది. అందులోని మంచీ చెడు గ్రహించే విచక్షణ లేదు. పెళ్ళి సమయం లో కాస్త గొడవ చేయలేదు మగపెళ్ళి వాళ్ళు. ఎంతో మంది చెప్తేకాని తగ్గలేదు అత్తగారు. కాని ఆ పెళ్ళి అయి ఇప్పటికి ఇన్నేళ్ళు గడిచినా ఎత్తిపొడవడం మాత్రం తగ్గలేదు. ముఖ్యంగా బాధ కలిగించే సంగతేంటంటే వాళ్ళు అలా అంటుంటే నవ్వుతూ వింటాడు ప్రభు. ఇంకా విచిత్రం ఏంటంటే అత్తగారంటుంటే మామగారేమీ ఆపకపోవడం.అది తల్చుకున్న కొద్దీ నందినికి చాలా బాధ కలుగుతుంది. ఒక మనిషికి తృప్తి పడడం అనేది లేకపోతే ఏది చేసినా శాటిస్ఫై కారన్నది తన అత్తగారిని చూస్తే నిజమే అనిపిస్తుంది. ఇంకా విచిత్రం ఏమంటే అందరి దగ్గరా తనకు కోడలంటే ఎంత ప్రేమో చెప్తుంది. అందుకే ప్రతి వాళ్ళూ అబ్బ నువ్వెంత అదృష్టవంతురాలివే అంటే మింగలేదు. అసలు సంగతి చెప్పలేదు. సరే ఇవన్నీ ప్రతి ఇంటా కొద్దో గొప్ప తేడాలతో ఉండేవే.. కాని తనను అన్నిటికంటే ఎక్కువ బాదిస్తున్నది ప్రభు ప్రవర్తన.ఒక గొడవ జరిగినప్పుడు తలాతోకా లేకుండా గతమంతా గుర్తొస్తుందేమో!!
పొద్దున జరిగిన సంఘటన గుర్తొచ్చింది. ఈ రోజు పొద్దున్న ఎనిమిది నుండే కాల్స్ మొదలయ్యాయి తనకు. ఈ కరోనా కాదు కాని పిల్లలు ఆ టైం కి ఇంకా లేవరు. ప్రభు సాధారణంగా పొద్దున్నే లేస్తాడు. కాని చిన్నమెత్తు సాయం కూడ చేయడు. మొదట్లో ఆ విషయంగా చాలా సార్లు గొడవలయ్యి పిల్లలు గమనించడం మొదలు పెట్టాక ఇక తాను సాయం అడగడం మానేసి తనకు వీలైనంతవరకు చేసుకోవడం అలవాటు చేసుకుంది. వంట సగం అయ్యింది. మిగతాది తర్వాత చేదాములే అనుకుని వెళ్ళి కాల్ అటెండ్ అయింది.ఈ లోపల పిల్లలు లేచారు. గదిలో తాను కాల్ లో ఉండడం చూసి నిశ్శబ్దంగా వెళ్ళి హాల్లో కూర్చున్నారు. తొమ్మిదికి తాను వెళ్ళి చూసేసరికి పిల్లలిద్దరూ బిక్క మొహాలేసుకుని కూర్చున్నారు. తండ్రిని పాలు అడిగారట. మీ అమ్మ వచ్చాక ఇస్తుందిలే అన్నారట. అందుకని తాను కనపడగానే గట్టిగా పట్టుకుని ఏడవడం మొదలు పెట్టారు.ఆకలంటూ. అత్తగారూ వాళ్ళున్నట్లయితే పాలన్నా ఇచ్చేవాళ్ళు. వాళ్లేమో పెళ్ళికని వైజాగ్ వెళ్ళి అక్కడే మరిదీ వాళ్ళింట్లో చిక్కడిపోయారు.కాకపోతే ఆవిడుంటే ఇంకో రకం సమస్య. అత్తగారి చీర తొలిగిందని చెప్పినా కోపమే, చెప్పకపోయినా కోపమే అన్నట్లు, ఆవిడ ఒక పని చేసిందంటే తనకు డబల్ పని అవుతుంది. పైనుండి ఎలా చేసినా బాగుందని మెచ్చుకోవాలి. వద్దంటే కోపం. అలిగి కూర్చుందంటే ఆ అలక తీర్చడానికి ఆర్రోజులు. పోనీ ఈ విధంగా చేయండంటే నాకే చెప్తావా అంటూ మళ్లీ అలుగుతారు. తల్లి అలిగిందంటే కొడుకుగారు అలుగుతారు. వాళ్ళ అలకలు తీరడానికి చాలా కష్టాలు పడాలి. ఒక్కోసారి అత్తగారి కాళ్ళు పట్టుకుంటే కాని అలక వదలదు.అసలు నాలుగేళ్ళ పిల్ల అలిగితే ముద్దుగా ఉంటుంది. కాని … కిందికి అరవై ఏళ్ళొచ్చిన పెద్దావిడా, నలభై ఏళ్ళొచ్చిన కొడుకూ అలిక్కూర్చుంటే ఎంత అసహ్యంగా ఉంటుందో వాళకెందుకు అర్థం కాదో తనకర్థం కాదు.పైనుండి వాడడిగినట్లుగా చేయొచ్చు కదా అని సన్నాయి నొక్కులు.
“ప్రభూ! పిల్లలకి పాలు కలిపి ఇవ్వొచ్చు కదా? నేను కాల్ లో ఉన్నానని తెల్సు కదా?” సోఫాలో కూర్చుని పెద్ద కప్పుడు కాఫీ తాగుతున్న ప్రభూని కాస్త నిష్టూరంగా అడిగింది నందిని.
“వాళ్ళకు నేను కలిపితే నచ్చదు. నీకేమో పిల్లలను పెంచడం రాదు. పక్కింటి కీర్తన చూడు పిల్లల్ని ఎంత బాగా పెంచుతుందో? ఎలా అంటే అలా వింటారు” టీవీ మీంచి దృష్టి మరల్చకుండా ఎత్తిపొడిచాడు ప్రభు.
నిట్టూర్చి పిల్లలిద్దర్నీ తీసుకుని వంటింట్లోకి వెళ్ళింది నందిని. ఈ రోజు మూడు వరకు బ్యాక్ టు బ్యాక్ కాల్స్ ఉన్నాయి నందినికి. ప్రభుకి ఈ రోజు సెలవు. అయినా కూడా పిల్లల్ని పట్టించుకోడు. టైం చూసింది.”అమ్మమ్మా వాళ్ళింటికి వెళ్తారా?” అడగ్గానే పిల్లలు ఎగిరి గంతేసారు. హమ్మయ్య ఇక అమ్మ దగ్గర కెళ్తే అన్నీ చూసుకుంటుంది అనుకుని వాళ్ల బట్టలు బ్యాగ్ లో సర్ది “ప్రభూ ప్లీజ్! పిల్లల్ని అమ్మ దగ్గర దింపొస్తావా?” రిక్వెస్ట్ చేసింది.
“అందుకే నిన్ను ఆ జాబ్ మానేయమంటాను. నీ కొచ్చే బోడి జీతానికి అంత పని అక్కర్లేదు. ప్రకాష్ గాడి భార్య చూడు? జాబ్ జోలికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి మొగుణ్ణీ పిల్లల్నీ చూసుకుంటుంది” సర్కాస్టిగ్గా అన్నాడు ప్రభు.
“మరే! ఒక ఆయాని చేసుకోవాల్సింది” కోపంగా అని పిల్లల్ని లాప్టాప్ ని తీసుకుని విసురుగా బైటికి వచ్చి కార్ స్టార్ట్ చేసింది. ఆ నెక్స్ట్ కాల్ అటెండ్ అయ్యి మళ్ళీ ఇంటికొచ్చేప్పటికి ఇంకా అలానే కూర్చున్నాడు టీవీ చూస్తూ. ఒళ్ళు మండినా చేసేదేమీ లేక వర్క్ లోకి వెళ్ళిపోయింది.
కాల్స్ అన్నీ అయి బయటికి వచ్చి టేబుల్ మీద అన్నీ పెట్టి ప్రభు ని పిలిచింది అన్నానికి. వచ్చి కూర్చున్న ప్రభు అన్నం తింటూ “అంటే కోపం కాని నీకే పనీ చాత కాదు నందినీ. వరుణ్ గాడి భార్య చూడు ఇంచక్కా భలే వంట చేస్తుందట. వాడెంత లక్కీనో” ఓ పక్క లొట్టలేసుకుంటూ తింటూనే వేరే ఎవర్నో పొగుడుతున్న మొగుణ్ణి చూస్తుంటే అరికాలి మంట నెత్తికెక్కింది. అసలు నందినికి పోలిక అంటే ఇష్టం ఉండదు. అలాంటిది ప్రతి చిన్న దానికి ఎవరితోనో పోలుస్తుంటే కోపం రాదా? పిల్లలు కూడా లేరు ఆవేశం అణచుకోలేకపోయింది.
“ఇంకొక్కసారి నన్నెవరితోనన్నా పోల్చితే మర్యాదగా ఉండదు జాగ్రత్త!!” కోపంగా అరిచింది నందిని.
“ఏమి అంటే? ఏమి చేస్తావు? నిజంగానే నీకేమీ చేతకాదు. మొగుణ్ణి ఆకట్టుకోవడం చేతకాదు. వంట చేయడం రాదు. పిల్లల్ని పెంచడం రాదు. అవన్నీ చేసే వాళ్ళ గురించి చెప్తే నీకు నచ్చదు” తాను కూడా రెట్టించాడు ప్రభు. ఇద్దరికీ మాటా మాటా పెరిగింది. కోపంగా అప్పుడెళ్ళిన మనిషి ఇంకా ఇంటికి రాలేదు. అసలే బయటి పరిస్తితులు బాగాలేవు. భయమేసింది నందినికి. ఫోన్ చేస్తే ఎత్తడం లేదు. “పిల్లలు ఇక్కడే ఉంటామంటున్నారు. నీకు కుదిరినప్పుడే రా” అంటూ తల్లి మళ్ళీ ఫోన్ చేసింది.హమ్మయ్య అనుకుంది. ఇప్పుడు పిల్లల్ని తీసుకొచ్చినా వాళ్ళకు చేసే ఓపిక లేదు.సమయం రాత్రి ఎనిమిది అయింది..ఇంకా రాలేదు. పదయింది ఇంకా రాలేదు.ఏడుస్తూ హాల్లోనే కూర్చుంది. పదకొండున్నరకి తలుపు తీసిన చప్పుడుకి తలెత్తి చూసింది.లోపలికి వస్తూ కనపడ్డాడు ప్రభు. మనసులోంచి కొండంత భారం తగ్గినట్లై మళ్ళీ ఏడుపొచ్చింది. పొద్దుటినుండి పడిన ఆవేదన కన్నీళ్ళ రూపం లో బయటికి రాగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్రభుని హత్తుకుంది.దగ్గరికి తీసుకోవాల్సిన ప్రభు ఒక్క నెట్టుడు నెట్టి బెడ్ రూం లోకి వెళ్ళి తలుపేసుకున్నాడు. హతాశురాలైంది నందిని. ఎంతసేపు అలా కూర్చుందో తెలీలేదు. కిటికీ లో నుండి వెలుగురేకలు వస్తుండగా తెల తెల్లవారుతున్నదని అర్థమయింది. అప్పుడు కొద్దిగా స్థిమితంగా ఆలోచించి మొహం కడుక్కుని కాఫీ కలుపుకుని వచ్చి అది తాగిన తర్వాత లాప్టాప్ ముందేసుకుని కూర్చుంది.పక్కనే ప్రభు వచ్చి కూర్చున్నా పట్టించుకోలేదు. నిన్నటి కోపమంతా పోయినట్లుంది నవ్వుతూ ఏదో జోక్ చేసాడు. అతనన్న మాటలకు నవ్వి కాఫీ కలిపి ఇచ్చి “అమ్మ దగ్గరికి వెళ్తున్నాను” చెప్పి తన లాప్టాప్ తీసుకుని వెళ్తూ “ప్రభూ! చెక్ యువర్ మెయిల్” చెప్పి వెళ్ళిపోయింది.
కాఫీ తాగిన ప్రభు తీరిగ్గా మెయిల్ ఓపెన్ చేసాడు. ఆ ఏముంది ప్రతిసారిలాగే ఏదో బెదిరించి ఉంటుంది అనుకుంటూ.” డియర్ ప్రభూ! పిల్లలు రాత్రి అమ్మ దగ్గరే పడుకున్నారు. తీసుకు రావడానికి వెళ్తున్నాను. నా మార్నింగ్ కాల్స్ అయ్యాక లంచ్ టైం కి వస్తాను. వచ్చేసరికి వంట చేసి ఉంచు. పక్కింటి సుందరం, భార్య ఎక్కడికన్నా వెళ్తే వచ్చేసరికి వంట చేసి ఉంచుతాడు. మరి నువు కూడా నేర్చుకో. పిల్లలు కూరల్లో కారం ఎక్కువ తినరు. కొద్దిగా తగ్గించి వేసి వాళ్ళకు తీసాక కారం వేసి మళ్లీ కాసేపు చక్కగా మగ్గనివ్వు. మీ ఆఫీసులో పని చేసే వెంకట్ అలానే చేస్తాడట. అన్నం మరీ మెత్తగా వద్దు. అలాని పొడిగా వద్దు. వెనకింటి అతని పేరేంటో నాకు గుర్తు లేదు అలానే చక్కగా వండుతాడని వాళ్ళావిడ చెప్తుంది. కాస్త ఇల్లు నీట్ గా ఉంచి నువు కూడా నీట్ గా తయారవ్వు. లేకపోతే ఎప్పుడూ ఆ జిడ్డు మొహం వేసుకుని కూర్చుంటే చూడలేక చస్తున్నాను. మా ఆఫీసులో పనిచేసే సత్యం ఏ టైం లో ఇంటికెళ్ళీనా నీట్ గా కనపడతాడు. అన్నట్లు మర్చిపోయా పనమ్మాయి ఈ రోజు రానన్నది. ఆ కాసిని గిన్నెలూ కడిగి తుడిచి సర్దు. నీకు చెప్పానే మా ఆఫీసులో పని చేసే వాసంతీ వాళ్ళ ఆయన లేడూ? కంపెనీలో పెద్ద పోస్ట్ లో ఉన్నా కొద్దిగా కూడా భేషజం లేకుండా వాళ్ళావిడను కూర్చోబెట్టీ గిన్నెలన్నీ కడుగుతాడట. ఎప్పుడు నేర్చుకుంటావు ప్రభూ ఇవన్నీ? తొందరేమీ లేదు. నిదానంగా నేరుద్దువు కాని. అన్నట్లు బాత్రూమ్స్…పోనీలే అన్నప్రాసన నాడే ఆవకాయ ఎందుకు?ఈ రోజు అవి వదిలేయిలే…ఉంటాను మరి.
పీ యెస్ః పిల్లల్ని చూట్టానికి మీ అమ్మా వాళ్ళను రమ్మని పిలువు. మన పనమ్మాయి అత్తగారూ వాళ్ళు పిల్లల్ని ఇంచక్కా చూసుకుంటారట……
నువు ప్రేమించి వెంటపడి పెళ్ళి చేసుకున్న నీ ప్రియపత్ని…”

కళ్ళు తిరుగుతుండగా రెండో సారి చదవడానికి మసకలు కమ్మాయి. ప్రభూకి. ఒక్కసారిగా చేయాల్సిన పనులన్నీ తల చుట్టూ తిరగసాగాయి.ఎప్పటిలా ఏడుస్తూ రాయలేదు. బెదిరిస్తూ రాయలేదు. మెత్తని చెప్పుతో కొట్టినట్లుగా ఉంది ఆ ఉత్తరం. చెప్పిన పనులు చేయాలో. పురుషుణ్ణి అన్న అహంకారం అడ్డొస్తుండగా చేయొద్దో అర్థం కాక లాప్టాప్ లోకి చూస్తూండిపోయాడు ప్రభు.

5 thoughts on “పోలుద్దామా మరి?

  1. Super chala bagundi story congrates Andaru chadavalisina story chala interesting ga vundi very nice story All the best
    Lakshmi

  2. చాలా బాగుంది…”కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు”…ఈ కథ మగ వాళ్ళు అందరూ చదివితే బాగుంటుంది.

Leave a Reply to Sravya Cancel reply

Your email address will not be published. Required fields are marked *