April 19, 2024

రాజీపడిన బంధం – 7

రచన: ఉమాభారతి

ఎంతసేపు పడుకొన్నానో! కళ్ళు తెరిచి చూస్తే, టైమ్ సాయంత్రం ఆరు గంటలయ్యింది. వొళ్ళు తెలియకుండా నిద్రపోయానన్నమాట. ఈ పాటికి సందీప్ స్నేహితులంతా ఇళ్ళకి వెళ్లిపోయుంటారు.
లేచి చన్నీళ్ళతో మొహం కడుక్కొని గది నుండి బయటకి వస్తుంటే, సందీప్ కేకలు వినబడుతున్నాయి. చీర సరిచేసుకొని అటుగా వెళుతుంటే సందీప్ అరుపులు, ఏడుపు మరింత బిగ్గరగా వినిపించాయి.
“జానకీ, వెళ్లి అమ్మని తీసుకురావే” అంటున్నారు అత్తయ్య.
“ఏరా శ్యాం, ఇందాకటి వరకు బాబుతో అక్కడే ఉన్నావుగా! వాడే ఆడుకుంటాడు అని నాకు చెప్పి మరీ లోనికెళ్ళావుగా!.. ఈ ఐదు నిముషాల్లోనే ఏమయిందిరా? వాడంతలా ఏడుస్తున్నాడే?” ఆవిడ మాటలు మరింత బిగ్గరగా ఆదుర్దాగా వినబడుతున్నాయి..
టెన్నిస్ కోర్ట్స్ వద్దకు పరుగుపెట్టాను. అక్కడ బాల్-షూటర్ మెషిన్ ఇంకా బంతుల్ని గుప్పిస్తూనే ఉంది. శ్యాం, సందీప్ కోర్ట్స్ బయట ఉన్నారు.
“ఏమయింది? నా బాబుని మళ్ళీ ఏం చేసారు?” అంటూ సందీప్ భుజాల మీదున్న శ్యాం చేతులు లాగేసాను. సందీప్ ని ఎత్తుకొని కాస్త దూరంలో ఉన్న కుర్చీలో కుదేసి, రక్తం కారుతున్న వాడి ముఖాన్ని చూశాను. నోట్లోంచి ఆగకుండా రక్తం వస్తుంది. ఎడం పక్క కణత కమిలిపోయి బంతి గట్టిగా తగిలిన దెబ్బ. వాడిని అలా చూసి తట్టుకోలేక పోయాను. కడుపు తరుక్కుపోయింది. యేడుస్తున్న వాడిని ఎలా వొదార్చాలో తోచక, వాడిని గుండెలకి హత్తుకుని నేనూ కన్నీళ్ల పర్యంతమయ్యాను.
“దెబ్బేమన్నా తగిలుంటే మన డాక్టర్ని పిలవండి” అంటూ దగ్గరగా వచ్చిన అత్తయ్య, సందీప్ ముఖం మీద దెబ్బలు చూసి భయపడినట్టుగా ఆగిపోయారు.
“చక్కగా అడుకుంటున్నాడని అనుకున్నానే! అప్పటివరకు శ్యాం వాడితోనే ఉన్నాడుగా! మరేమయిందో ఏమిటో! పాపం బిడ్డకి ఎంత గాయం, ఎంత బాధ” అంటూ బాబు వంక చూస్తూ గొడవ పడిపోతున్నారామె.
శ్యాం వచ్చి బాబుని ఎత్తుకోబోయారు.
“మీరు చేసింది చాలు శ్యాం…. వాడిని ఇలా ఆడించవద్దని చెప్పినా మీరు వినరుగా! నా బిడ్డ జోలికి ఇక రాకండి” అంటూ దు:ఖాన్ని ఆపుకుంటూ డ్రైవర్ సాయంతో బాబుని తీసుకొని కారెక్కాను.
“నీవు కూడా వెళ్ళరా శ్యాం, నీలకి అసలే వొంట్లో బాగోలేదు. నాన్నని వెంట తీసుకొని వెంటనే వెళ్ళు” అంటూ వెనుక నుండి అత్తయ్యగారి గొంతు వినబడింది.
కారు నడుపుతూ, సందీప్ బాబు పరిస్థితికి నొచ్చుకున్నాడు డ్రైవర్. “ఇలా జరగడం దురదృష్టం మేడమ్. శ్యాం సార్ మధ్యాహ్నం మూడింటికే ఇంటికి వచ్చారు. పిల్లలతో ఆడుతూ సార్ టెన్నిస్ కోర్ట్స్ లోనే చాలా సేపు ఉన్నారండి. సార్ తో పిల్లలు ఉషారుగా ఆడారు మేడమ్. పెద్దమ్మగారు కూడా అక్కడే కూర్చుని ఉన్నారు” అతను చెప్పేది మౌనంగానే వింటున్నాను.
“ఐదు దాటాక, సందీప్ బాబు ఫ్రెండ్స్ ని వాళ్ళ ఇళ్ళ దగ్గర దిగవిడిచి వచ్చి, కారు శుభ్రం చేస్తుండగా బాబు ఏడుపు వినిపించింది. వెంటనే అటుగా పరిగెత్తాను మేడమ్” చెపుక్కు పోతున్నాడు డ్రైవర్.
“టెన్నిస్ కోర్ట్స్ లో మెషీన్ నుండి విసురుగా తన పైకి వస్తున్న బంతుల్ని తిరిగి కొట్టలేక అల్లాడిపోతున్నాడు సందీప్ బాబు. ఇంతలో.. శ్యాంబాబు పరుగున వచ్చి సందీప్ బాబుని కోర్ట్స్ బయటికి తెచ్చారు. అప్పుడే మీరూ వచ్చారు” అని ముగించాడు.
అంటే.. నేను లోనికి వెళ్లి నిద్రపోయిన సమయంలో శ్యాం వచ్చారన్నమాట. మొత్తానికి సందీప్ ని టెన్నిస్ కోర్ట్స్ లో ఉంచి బాల్-షూటర్ స్విచ్ ని… శ్యాం కదా వెయ్యాలి. కావాలనే అలా చేశారా? ఔనన్న మాటేగా! లేదంటే, దగ్గరుండి ఆడించాలి కాని మొదటిసారి బాల్-షూటర్ తో చిన్నవాణ్ణి ఒంటరిగా వదిలి వెళ్లడం ఏమిటి?…..
అక్కడే ఉన్నా అసలు జరిగిందేదీ అత్తయ్యకి తెలియదు. నాకు మాత్రం శ్యాం అలక్ష్యం అర్ధమయ్యి మనసు స్తంభించి పోయాయి.
‘ఇటువంటి ఖాతరు లేని మనిషికా, నేను మరొక బిడ్డను కనివ్వబోయేది? పసివాడినొక్కణ్ణి కాపాడుకోలేక పోతున్నానే? సందీప్ విషయంగా నా అభిప్రాయాలు తెలిసుండీ ఎంతటి నిర్లక్ష్యం? భగవంతుడా నాకు నిష్కృతి లేదా?’ అని గట్టిగా తల పట్టుకున్నాను.
హాస్పిటల్ రావడంతో బాబుతో బధ్రంగా కారు దిగి వడిగా లోనికి వెళ్లాను.
**
అపోలో హాస్పిటల్, పీడియాట్రిక్ వార్డ్
ఎమెర్జెన్సీ రూమ్ డాక్టర్లు సందీప్ ముఖం మీద గాయం శుభ్రం చేసాక పరీక్షలు జరిపారు. నోటిలో రెండు పళ్ళు ఊడాయని, చిగుళ్ళు కణతలు బాగా ఒరుసుకు పోయాయనీ నిర్దారించారు.
తలనొప్పి అని వాడు చెప్పడంతో, ముఖం మీది వాపు తగ్గాక కళ్ళు పరీక్ష చేయించాలని రిపోర్ట్ ఇచ్చారు.
మొదటినుండీ సందీప్ ని చూసే పీడియాట్రిషన్ కూడా సమయానికి అందుబాటులోకి రావడం అదృష్టం. బాబు రిపోర్ట్స్ ఆయనే చూడ్డం కాస్త ఊరటనిచ్చింది.
శ్యాం, మామయ్య నాతో పాటు వెయిటింగ్ రూం లోనే ఉన్నారు. కాసేపటికి డాక్టర్ పిలిపిస్తే, వెళ్లి డాక్టర్ గారి ఎదురుగా కూర్చున్నాము.
నా వంక చూసారాయన. “బిడ్డని జాగ్రత్తగా చుసుకోవాలి కదా! బాబుకి పదేపదే తీవ్రంగా గాయాలవడం బాగలేదమ్మా? మీకు అంతగా సమయం లేకపోతే పనివాళ్ళని పెట్టవచ్చు కదా! బాబు ఫైల్ తిరగేశాను. ఇంతకు మునుపు రిస్ట్- ఫ్రాక్చర్ కూడా అయింది. అది నాకు గుర్తే.
ఇప్పుడు కణత మీద తగిలింది గట్టి దెబ్బ కాబట్టి, కంటిచూపు పై ప్రభావం పడవచ్చు. ఏమైనా కంటి పరీక్ష అయ్యాకనే తెలుస్తుంది” అన్న డాక్టర్ మాటలు వింటూ జీవచ్చవంలా అయిపోయాను.
అసలు దెబ్బలెలా తగిలాయి అని అడిగారు.
“సందీప్ సరదా పడుతుంటే, టెన్నిస్ కోర్ట్స్ లో బాల్-షూటర్ ఆన్ చేసాను. బంతుల్ని తిరిగి కొట్టడం కూడా నేర్పించి, వాడు ఆడగలగడం చూసాకే ఐదు నిమిషాల పాటు ఇంట్లోకి వెళ్లాను. కానైతే బాబుకి, షూటర్ వేగం హెచ్చయుండవచ్చు. దాంతో, బంతిని తిప్పికొట్టలేక అటువంటి తీవ్ర గాయాలకి గురయ్యాడు. వాడి అరుపులకి నేను వెళ్లేలోగానే బాబుకి ఇలా అయింది” శ్యాం తానే స్వయంగా జరిగిన సంఘటన బేరీజు వేసి డాక్టరుకి వివరించారు.
“చూడండి శ్యాంప్రసాద్, బాబు విషయంలో మునుపటి రిస్ట్-ఫ్రాక్చర్, ఇప్పటి ఈ తీవ్రమైన గాయాలకి కారణం మీ ఆశ్రద్ద అనిపిస్తుంది……పైగా వాడంతట వాడు చేసుకున్న గాయాలు కావు కాబట్టి, మీపైనే నిర్లక్ష్య ఆరోపణలకి కూడా తావివ్వగలవు” క్షణమాగి మా అందరి వంక నిశితంగా చూశారాయన…
“మీ కుటుంబం నాకు బాగా పరిచయం. ఆ స్నేహభావంతోనే మీకు చెబుతున్నాను.. బాబు శారీరకంగా బలమైన వాడు కూడా కాదాయె. ఎనిమిదేళ్ళకి – ఆరేళ్ళ వాడిలా ఉన్నాడు…. బాబుని ఇకనుండి పెద్దవాళ్ళతో గాని, అలివికాని ఆటలు గాని ఆడనీయకండి” అన్నారాయన గంభీరంగా…
“ఇప్పుడు అవసరమైన చికిత్స చేసి మందులు రాసాను. టైముకి మందులు వేసి కాస్త కనిపెట్టుకుని ఉండండి. బాబుని నాలుగు రోజుల్లో మళ్ళీ చూస్తాను. ఐ.సి.యు నుండి డిశ్చార్జ్ అయిన తరువాత బాబుని ఇంటికి తీసుకు వెళ్ళండి” అంటూ రాసిన ప్రిస్క్రిప్షన్ కాగితం బల్ల పైనుంచారు.
డాక్టర్ మాటలు వింటున్న నాకు శ్యాం పీక నులిమి చంపేయాలన్నంత కోపం వచ్చింది. డాక్టర్ రాసిన మందుల కాగితం తీసుకొని, బాబు కోసం ఐ.సి.యు వైపు వెళ్లాను.
శ్యాం నా వెనువెంటే వచ్చారు. “నేను బిల్ కట్టి, మందులు తీసుకొస్తాను” అంటూ నా చేతిలోని ప్రిస్క్రిప్షన్ తీసుకోబోయారు. ఇవ్వనన్నా, నా చేతినుండి బలవంతంగా తీసుకొన్నారు.
‘ఈ పరిస్థితుల నుండి, నన్ను నేను ఎలా విడదీసుకోవాలి? పిల్లల భవిష్యత్తు ఏమిటి? ఏదో ఓ మార్గం దొరకపుచ్చుకోవాలి. ఇది నా బిడ్డల కోసం నా ఒంటరి పోరాటమే’ అన్ని మనసు హెచ్చరించింది..
అన్నీ తెలిసినా అత్తయ్య చేయగలిగిందేమీ ఉండదు…ఆవిడ పెద్దావిడ. కాక శ్యాం తల్లి. పైగా ఇటువంటి విషయాలు ఆమె అర్ధం చేసుకోలేరు. ఓ తండ్రి తన బిడ్డకి ఉద్దేశపూర్వకంగా హాని చేయగలడన్న ఊహ కూడా ఆమెకి రాదు..
**
సందీప్ కి డెంటిస్ట్, కళ్ళ డాక్టర్ల వద్ద రెండువారాల పాటు పరీక్షలు, సంప్రదింపులు పూర్తయ్యాయి. దెబ్బ తగిలి ఊడిన పళ్ళ వల్ల నష్టం లేకపోయినా ఎడం వైపు చిగుళ్ళు బాగా దెబ్బ తిన్నాయట. తిరిగి రాబోయే పళ్ళ విషయంలో వేచి చూడాలనన్నారు.
కణతల మీద దెబ్బ గట్టిగా తగలడం వల్ల, ఎడమ కంటి చూపు మందగించిందట. వాడి తల నొప్పులుకి మాత్రం కళ్ళద్దాలు వెంటనే వేయించాలని సూచించారు.
పండంటి నా బాబుకి వచ్చిన ఈ దౌర్భాగ్యం నన్ను మానసికంగా, శారీరకంగా కృంగదీసింది. జీవితం మీద విరక్తి ఏర్పడింది. ఇటువంటి పరిస్థితిలో ఉన్న నేను, కడుపున ఉన్న మరో బిడ్డని మోసి, కనీ పెంచే ఓపిక, యోగ్యత నాకు లేవు అనిపించింది. ఎందాకని నేను నా బిడ్డలని విచక్షణాజ్ఞానం లేని తండ్రి నుండి కాపాడుకోగలను? సాధ్యమయ్యేనా? ఆలోచనలతో బుర్ర వేడెక్కింది.
నా పడక, నివాసం పూర్తిగా సందీప్ గదిలోకి మార్చేశాను.
**
సందీప్ ముఖం మీద దెబ్బలు మానాడానికి, నెల పైనే పట్టింది. గాయాలకి వాడిన మందులు, క్రీమ్స్ కూడా ఇక మానేయవచ్చన్నారు డాక్టర్లు. వాడికి కళ్ళద్దాలు మాత్రం వాడాలన్నారు.
వాడి కంటిచూపు మెరుగయ్యేనో లేదో అని దిగులుగా ఉంటుంది. నా మనస్తాపాన్ని నా భర్త దుర్మార్గుడుకి తెలియజేసే మార్గాలు వెతకసాగాను.
**
ఓ రోజు పొద్దున్నే శ్యాం గదిలోకి వెళ్లాను. ఆఫీసుకి వెళ్ళే సన్నాహాల్లో ఉన్నాడు. నా అలికిడికి, అద్దం ముందున్న శ్యాం వెనుతిరిగి చూసాడు.
“ఏమి సంగతి? చాలా కాలం తరువాత నా ముఖం చూడాలనిపించిందా? రా కూర్చో” అంటూ నా వైపు రాబోయాడు.
“ఆగండి…. నేను చెప్పేది వినవలసిన అవసరం మీకు ఉంది. మీరే కూర్చోండి” అని నేను వాకిలి పక్కనే ఉన్న మోడా మీద కూర్చున్నాను. శ్యాం నా వైఖరికి కాస్త విస్తుపోయినట్టుగా దూరంగా బెడ్ మీద కూర్చున్నాడు.
“నా మీద గాని, నా బిడ్డ మీద గాని చేయి వేయాలన్న ఆలోచన ఇకనైనా మానుకోండి. ఇక మనమధ్య ఎటువంటి సంబంధము ఉండకూడదు. నాకిష్టం లేదు. మీ లోని మొరటుతనం బిడ్డని అవిటివాడిని చేసింది. నాకు తెలిసి, కావాలనే పదేపదే నిర్లక్ష్యంగా మీరు మన బిడ్డకి, నా పెంపుడు కుక్కలికి బౌతికంగా హాని కలిగిస్తున్నారు. ఇలాగే సాగనిస్తే, మీ వైఖరిలో మార్పు ఉండదని తెలుసు” అని సూటిగా శ్యాం ముఖంలోకి చూసాను.
నా వంకే చూస్తున్న అతని కళ్ళు కోపంగా ఉన్నాయి.

సూటిగా అలా శ్యాం వంక చూస్తూనే, “ఇక కడుపులో ఉన్న ఈ బిడ్డకి జన్మ నివ్వడం కూడా నాకు ఇష్టం లేదు. మీరు ఏమి చేయదలచినా నా ఈ నిర్ణయాల్లో మార్పు ఉండబోదు. మా మీద జులుం సాధించాలని చూస్తే నేను సహించను. ఇక మీ ఇష్టం” అని చెప్పి గబా గబా ఆ గది నుండి వెళ్లి పోయాను.
**
ని స్కూల్ కి రెడీ చేస్తుంటే నా ఫోన్ మోగింది. రిసీవ్ చేసాను.
“హలో, నేనే చిత్రని. ఎలా ఉన్నావు నీలమ్మ? నేనిప్పుడు ఢిల్లీలోనే ఉన్నాను. నీకు ఎంతో దూరంలో కూడా కాదు” అంటున్న చిత్ర మాట విని ఆశ్చర్యపోయాను.
“నేను, ఆనంద్ ఢిల్లీ అపోలో హాస్పిటల్లో రెసిడెంట్ సైకియాట్రిస్ట్స్ గా ఉద్యోగాల్లో చేరాము. ఈ ఆదివారం నీకు ‘ఓకే’ అంటే మిమ్మల్ని కలవడానికి వస్తాము” చాల ఉత్సాహంగా అంది చిత్ర.
“తప్పకుండా రండి చిత్రా” అన్నాను. నాకూ సంతోషంగా అనిపించింది.
**
ఆదివారం పొద్దున్న పదింటికి సందీప్ కి గిఫ్ట్, ఫ్రూట్ బాస్కెట్ తీసుకొని వచ్చారు చిత్ర, ఆనంద్. చిత్ర భర్త ఆనంద్ ని వాళ్ళ పెళ్ళప్పుడు చూశాను. శ్యాం, ఆయన్ని కలవడం మాత్రం మొదటిసారే.
వాళ్ళతో కాసేపు మాట్లాడి భోంచేసాక, పనుందంటూ శ్యాం బయటకి వెళ్లారు. శ్యాం ముభావంగా ఉన్నారనిపించింది నాకు. అత్తయ్య, మామయ్య చిత్ర వాళ్ళతో చాలాసేపు సరదాగా మాట్లాడుతూ గడిపారు.
“అంకుల్, ఆంటీ” అంటూ వాళ్ళతోనే ఉన్నాడు సందీప్. పనికట్టుకుని ఆనంద్, చిత్రలకి తన స్విమ్మింగ్ పూల్, బాస్కెట్బాల్, టెన్నిస్ కోర్ట్స్ చూపించాడు. క్యాండి, మిండి లని పరిచయం చేసాడు.
“అంకుల్, నేను మా డాడీ లాగా టెన్నిస్ బాగా ఆడగలను. మీరూ ఆడతారా?” ఆనంద్ ని ప్రశ్నిస్తూ, కబుర్లు చెబుతూ ఉండిపోయాడు వాడు. ఆనంద్ క్కూడా పిల్లలంటే ఇష్టమని తెలుస్తుంది.
శ్యాం వల్ల కలిగే ఆపదల దృష్ట్యా సందీప్ విషయంలో అతిజాగ్రత్తగా ఉండే నేను, సంకోచించకుండా బాబుని ఆనంద్ కి దగ్గరగా వెళ్ళనివ్వడం నాకే కొత్తగా అనిపించింది.. ఆనంద్ పట్ల నాకు కలిగిన సద్భావన వల్లే కావచ్చు…
సందీప్ తో ఆనంద్ గారు బాస్కెట్బాల్ ఆడుతూంటే చూస్తూ.. చిత్ర, నేను టీ తాగుతూ ఇంటి వెనుక వరండాలో కూర్చున్నాము.
“సరే ఇప్పుడు చెప్పు. మునపటంత సంతోషంగా లేవెందుకు? ఏమవుతుంది? నువ్వు హాయిగా ఉన్నావని నాకు అనిపించడం లేదు” అంది చిత్ర నన్ను చూస్తూ.
‘అంతలా బయటికి కనబడి పోతున్నానా?’ అని ఇబ్బందిగా అనిపించింది. ‘ఏమని చెబుతాను? ఎలా చెబుతాను? అనుకున్నాను.
క్షణమాగి, “ఏంలేదు చిత్రా, నేనిప్పుడు మళ్ళీ గర్భవతిని.. వొంట్లో బాగోవడం లేదు. సందీప్ పనులన్నీ నేనే చూసుకోవాలి. యాతనగా ఉంది. శ్యాం తన కంపెనీ పనితో యమబిజీగా ఉంటారు. ఈ సమయంలో మరో బిడ్డని కనాలని గాని.. పెంచి పెద్ద చేయాలని గాని నాకు లేదు. ఓపిక లేదనుకో” అంటూ నవ్వేసాను.
“ఏమిటి? బిడ్డ వద్ధనుకుంటున్నావా? నేననుకున్న దాని కంటే నీకు ఎక్కువే చిక్కులు చింతలు ఉన్నట్టున్నాయే?” చిత్ర అంటుండగానే సందీప్, ఆనంద్ మా వైపుగా వచ్చారు.
“మమ్మీ, ఆనంద్ అంకుల్ కి నాతో బాస్కెట్బాల్, టెన్నిస్ ఆడ్డానికి టైం ఉంటుందంట. ప్రతి సండే రమ్మని అడగనా మమ్మీ?” నా వద్దకు వచ్చి, అడిగాడు సందీప్…
“సందీప్ తో ఆడ్డానికి, వాళ్ళ డాడీకి అస్సలు సమయం ఉండదంటగా! అందుకే, ఎప్పుడన్నా వచ్చి ఆడతానని చెప్పాను” నవ్వుతూ ఆనంద్.
“మీ వాడు చిన్నగానే ఉన్నాడు గాని బాగా ఉషారు. బాస్కెట్బాల్ నా కంటే బాగా ఆడి నన్ను ఓడించాడు…అయినా ఇంత సన్నగా ఎలా ఉన్నాడు? వాడిని డైట్ మీద ఉంచారా నీలవేణి గారు?” ఆనంద్ నవ్వుతూనే అన్నా, ఆ మాటలు నా గుండెల్ని పిండేసాయి. వాడి మణికట్టు విరిగిన విషయం మొదలుకొని వాడికి తగిలిన దెబ్బలన్నీ జ్ఞాపకం వచ్చాయి.
“నీలమ్మా, మేము వెళ్లిరామా మరి?” అంటూ పైకి లేచింది చిత్ర. వీలు చేసుకొని మళ్ళీ కలుస్తామంటూ అందరికీ చెప్పి వెళ్ళారు ఆనంద్.
**
రాత్రి తొమ్మిదిన్నరకి సందీప్కి బెడ్-స్టోరి చదువుతుండగా.. చిత్ర ఫోన్ చేసింది. “ఇప్పుడు చెప్పమ్మా నీలమ్మ, సంగతి ఏంటి? బిడ్డ వద్దు అనుకోడానికి కారణమేంటి?” చనువుగా అడిగింది.
“మన రమణికేమో సంతానం కలగడం లేదన్న దిగులు. మరి నువ్వేమో ఇలా కడుపున పడిన బిడ్డని వద్దనుకుంటున్నావు.. సంగతి తెలిస్తే నీ శ్రేయోభిలాషిగా సలహా ఇవ్వగలను. కాబట్టి చెప్పవే” అంది ఆదుర్దాగా.
నిద్రలోకి జారుకుంటున్న సందీప్ కి దుప్పటి కప్పి, మెల్లగా లేచి బాల్కనీలోకి నడిచాను. చిత్ర మళ్ళీ ఇలా ఆరా తీస్తుందంటే…అబద్దం చెప్పాలేను, అసలేమీ లేదని చెప్పి నమ్మించనూ లేను. సమాధానపరచ వలసిందే….
సశేషం

1 thought on “రాజీపడిన బంధం – 7

Leave a Reply to మాలిక పత్రిక అక్టోబర్ 2020 సంచికకు స్వాగతం – మాలిక పత్రిక Cancel reply

Your email address will not be published. Required fields are marked *