April 24, 2024

నవరాత్రులలో రాత్రికే ప్రాదాన్యము.

రచన: సంధ్యా యల్లాప్రగడ
“సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే॥”
సంవత్సరములో వచ్చే నవరాత్రులలో శరన్నవరాత్రులు ముఖ్యమైనవి. శరత్నఋతువులో అశ్వీజమాసపు శుక్ల పాడ్యమి మొదలు నవమి వరకూ వచ్చే ఈ నవరాత్రులు పావనమైనవి, పరమ ప్రశస్తమైనవి.
సనాతన ధర్మములో వచ్చే పండుగలలో అత్యంత ఆహ్లాదకరమైన పండుగ ఈ నవరాత్రులతో కూడిన దసరా. వాతావరణములో వేడి, చలి లేని సమశీతల ఉష్ణోగతలతో వుండి ప్రకృతి కూడా రాగరంజితమై వుంటుంది ఈ సమయములో.
ఈ నవరాత్రుల సమయములో భారతదేశములో ఏ మూల చూసినా దాదాపు కోలాహలముతో కూడిన వాతావరణము వుంటుంది.  ఈ నవరాత్రులను “దుర్గా నవరాత్రులు” అని కూడా అంటారు. శక్తిని కొలిచే సాంప్రదాయములో నవ దుర్గలను  నవరాత్రులలో కొలుస్తారు కాబట్టి దుర్గా నవరాత్రులు అని పేరు.  ఈ తొమ్మిది రోజులూ రాత్రులకే పెద్దపీట. పాడ్యమి రాకమునుపే పూజకు సిద్ధం చేసుకొని, పూజ గది కడిగి ముగ్గు పెట్టుకొని వుంచుకుంటారు. పాడ్యమి రోజున భద్రమంటపము, కలశస్థాపన చేస్తారు.
ఈ ఉపాసన పాడ్యమి నుంచి నవమి వరకూ చేసి దశమి నాడు పూర్తి చెయ్యటము ఉత్తమము. అలా కుదరకపోతే ఏడు రోజులు, లేదా ఐదు రోజులు లేదా కనీసము చివరి మూడు రోజులైనా చేస్తారు.
దుర్గా దేవిని ఉపాసించటము దసరా. దసరా అంటే, రాక్షసుల మీద గెలుపు. రాక్షసులు అంటే తమో గుణముపై సత్వ గుణము యొక్క విజయము. మనలోని కలి లక్షణాలను నశింపచేసుకొని, మన స్వాత్మా రూపును పొందే ప్రక్రియ ఈ నవరాత్రి పూజలోని మర్మము. ఈ ఉపాసన వలన మానవులలో వున్న అహం నశిస్తుంది. అహమన్నది నశించిన వారు జీవన్ముక్తులవుతారని చెప్పనక్కర్లేదు.
  అన్ని ఉపాసనలలో ఉత్తమమైనది మాతృభావనతో చేసే ఉపాసన. దీని వల్ల అమ్మవారి కృప త్వరగా లభిస్తుంది. అందరి యడలా మాతృభావన వుంటుంది.  మాతృమూర్తి పిల్లలు కష్టపడితే
చూడలేదు. కాబట్టి జగన్మాత కూడా భక్తులను వెంఠనే అనుగ్రహిస్తుంది.  అమ్మవారిని వివిధ రూపాలుగా సేవించే ఈ కాలములో నవదుర్గలుగా పూజించే పద్ధతి ప్రసిద్ధమైన సంప్రదాయము.
బెంగాలు వైపు ఈ పద్ధతి బహుళ ప్రచారములో వుంది.
దుర్గా అనగా “దుఃఖేన గంతుం శక్యతే దుర్గా”.  కష్టము చేత తెలియబడునది. అంటే ఆమెను తెలుసుకొనటము చాలా కష్టము, అతి దుర్లభము, దుర్గము. మరో భావముగా చూస్తే దుర్గము నందు నివసించునది. మన దేహము నవ ద్వారము కల దుర్గము. మాయతో కప్పబడిన ఈ దేహ దుర్గమును ఛేదించట పరమ దుర్లభము. మహామాయ అయిన ఈ శక్తి ని, పరమాత్మ ను శరణు వేడితే తప్ప చేధించలేము. శివశక్త్యైక్యరూపిణి అయిన ఆ జగన్మాతను శరణు పొందాలి. ఉపాసన చెయ్యాలి. అలా సాధనతో చేదిస్తే అంతరాంతరములలో వున్న ఆత్మగా దర్శనమిస్తుంది దుర్గ. ఇదే ఈ దసరా పూజలలోని అంతరార్థము.
లోకములో దుఖాన్ని పోగొట్టు ఈ నామము ఐదు అక్షరాల సంపుటి.  ‘ద’ కారము దైత్యనాశనం – ఉ కారం విఘ్ననాశనము, “ర” కారము సర్వపాపదహనము, “గ” కారము అన్నింటినీ తొలగించునది, “ఆ” కారము ఆత్మానందము కలిగించే తల్లి. పూర్తిగా “దుర్గా”.
అమ్మవారిని దుర్గా అని తలచిన చాలు సర్వ దుఖాలను హరిస్తుంది. అందుకే లలితా నామాలలో మనము “దుర్లభా దుర్గమా దుర్గా దుఃఖహంత్రి సుఖప్రదా” అంటూ సేవిస్తాము.
ఇలా ఉపాసించబడు తల్లే దుర్గా.  ఈమెనే ఇచ్ఛా జ్ఞాన క్రియా శక్తి స్వరూపముగా మనలో నిలచి వున్నది. మనలోని చేతనగా వుంది మనలను నడుపుతున్న త్రిపురసుందరి ఈమె.
నవదుర్గలను స్తుతిస్తే మహాసిద్ధిని పొందటమే విజయము.
“ప్రథమం శైలపుత్రీ, ద్వితీయం బ్రహ్మచారిణీ, తృతీయం
చంద్రఘంట, కూష్మాండ చతుర్థకం, పంచమం స్కందమాత, షష్ఠం
కాత్యాయనీతి చ, సప్తమం కాలరాత్రీతి, మహాగౌరీతి చాష్టమం,
నవమం సిద్ధిదా ప్రోక్తా నవదుర్గా ప్రకీర్తితా!!”
1.శైలపుత్రీ.
“వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరాం।
వయషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీం॥”
ఈమె పూర్వము సతిగా జన్మించి యోగాగ్నిలో దగ్ధమై తిరిగి హిమవంతుని ఇంట
పుడుతుంది. అందువల్ల శైలపుత్రి అన్న నామము స్వీకరించినది. వృషభవాహనము కల ఈ తల్లి త్రిశూలము, కమలము ధరించి వుంటుంది. తలపై చంద్రవంక వుండి భక్తులను బ్రోచే తల్లిగా పూజింపడుతున్నది.
2.బ్రహ్మచారిణీ
“దధనా కర పద్మాభ్యాం అక్షమాలా కమండలః।
దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా॥”
సర్వులకూ శుభములు కలిగించే ఈ తల్లి పరమేశ్వరునికై తపస్సు చేసుకొనటానికి బయలుదేరినది. ఈమెను ‘ఉమ’ అని కూడా అంటారు. ఈమె జ్యోతిర్మయ స్వరూపముతో ప్రకాశిస్తూ వుంటుంది. చేతిలో కమండలము, జపమాల ధరించినది. ఈమె సిద్ధులకు అనంత ఫలప్రథములనిస్తుంది. ఈమె కృప కలిగితే సాధకులకు నిశ్చల దీక్ష, సర్వత్రా సిద్ధి, విజయము పొందగలరు.
3.చంద్రఘంటా
“పిండజప్రవరారూఢా చందకోపాస్త్రకైర్యుతా।
ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా॥”
ఈమె శిరస్సు నందు చంద్రుడు ఘంటాకృతిలో ఉండటము వలన ఈమెను చంద్రఘంటా అంటారు. పది చేతులతో ఖడ్గము, బాణము మొదలైన అస్త్రములు ధరించి యుద్ధ ముద్రలో వుంటుంది. సింహవాహిని. ఉపాసకులకు పరమ శాంతమును,శుభములను ఇచ్చు తల్లి.
4.కూష్మాండా
“సురాసంపూర్ణ కలశం రుధిరాప్లుతమేవ చ।
దధానా హస్తపద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తుమే॥”
అవలీలగా బ్రహ్మాండములను సృజించును కాబట్టి ఆమెను కూష్మాండ అన్న పేరు వచ్చింది. తేజోమయమైన రూపముతో అష్టభుజములతో విరాజిల్సునది. ఏడు చేతులు కమండలము, ధనస్సు, బాణము, కమలము, కలశము, చక్రము, గద ధరించినది. రోగాలు, శోకాలు రూపుమాపునది.
5. స్కందమాతా
“సింహాసనగతా నిత్యం పద్మాశ్రితకరద్వయా।
శుభదాస్తు సదా దేవీ స్కందమాతా యశస్వినీ॥”
కార్తికేయుడు అయిన స్కందుని మాత కాబట్టి ఈమెను స్కందమాత అన్నారు. నవరాత్రులలో ఐదవరోజున ఈమెను ఆరాధిస్తారు. అమ్మ వారి వడిలో స్కందుని కూర్చుండబెట్టుకుని వుంటుంది. గర్భస్రావాలు కాకుండా కాపాడుతుంది. పరమ తేజస్సుతో వుండే ఈ తల్లిని ఉపాసించటము వలన ప్రశాంతతను ఇస్తుంది.
6. కాత్యాయని
“చంద్రహాసోజ్జ్వలకరా శార్దూలవరవాహనా।
కాత్యాయనీ శుభం దద్యాదేవీ దానవ ఘాతినీ॥”
కాత్యాయన మహర్షి ఇంట జన్మించి కాత్యాయని అన్న నామము ధరించినది అమ్మవారు. ఈమె మహర్షల చేత పూజలందుకొనబడేది. గోపికలు కృష్ణుని చూడలేక గోకులములో ఈమెను పూజించి గోపాలకృష్ణుణి పొందారు. ఈమె ధర్మార్థ కామ మోక్షాలనిచ్చి చతుర్విధ పురుషార్ధములను ఇస్తుంది.
7 కాళరాత్రి
“ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నా ఖరాస్థితా |
లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్తశరీరిణీ ||
వామపాదోల్లసల్లోహలతాకంటకభూషణా |
వర్ధనమూర్ధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ ||”
నల్లని శరీరచ్ఛాయ గలది. కేశాలు చెల్లాచెదరైపోయి మెడలో మాల విద్యుత్తాంతులతో వుండి, మూడు కన్నులతో నాశిక నుంచి అగ్నిజ్వాలలు వెలబడుతుండగా ముళ్ళ కర్ర ఆయుధము ధరించి వుంటుంది. ఉపాసించిన భక్తులకు శుభంకరి. స్మరించి నంత భయములు తీరుస్తుంది. రాక్షసులకు భయంకరి. మహామాయ గా కూడా కొలవబడే ఈమె కరుణ అతి విస్తారము. త్వరగా సిద్ధిస్తుంది.
8. మహాగౌరి
“శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచిః |
మహాగౌరీ శుభం దద్యాన్మహాదేవప్రమోదదా ||”
ఈమె గౌర వర్ణ శోభలతో మల్లెపువ్వులు శంఖమును, చంద్రుని తలపింపచేస్తుంది. సద్యఫలదాయిని. ఈమెను ఉపాసించిన భక్తుల సర్వ పారములు తొలుగుతాయి.
9. సిద్ధిదాత్రీ
“సిద్ధగంధర్వయక్షాద్యైరసురైరమరైరపి |
సేవ్యమానా సదా భూయాత్సిద్ధిదా సిద్ధిదాయినీ ||”
సర్వసిద్ధులను ప్రసాదించు తల్లి కనుక సిద్ధిదాత్రీ. సాధకులకు లౌకిక పారమార్థిక మనోరథములు. సఫలమవుతాయి ఈమె సాధనలో.
ఈ తొమ్మది రోజులూ అమ్మవారికి లలితా నామాలతో పూజలు, సప్తశతితో ఆరాధన, కుంకమార్చనలు ప్రసిద్ది.  ఉపవాసము ఈ నవరాత్రులలో మరో ముఖ్యమైన విషయము. ఈ ఉపవాసము కూడా మూడు రకములు. పగలు ఉపవాసముండి రాత్రి తినటము.  పగలు తిని రాత్రి తినకపోవటము. పదిరోజులూ పండ్లు తిని వుండటము. వారి వారి శరీర స్థితిని బట్టి భక్తులు ఉపవాసదీక్షను పాటిస్తారు.
నవరాత్రులు చేసే వారికి గ్రహబాధలుండవు. అన్నీ గ్రహాలు అమ్మవారి అనుగ్రహముతో నడుస్తాయి కాబట్టి తన భక్తులకు గ్రహబాధలను తీసివేస్తుంది అమ్మవారు.
మహర్నవమి నాడు ఆయుధపూజ జరుపుతారు. శమీవృక్షమును సేవించి మిత్రులకు బందువులకు శమీ ఆకును పంచుతారు. ఇది ఇస్తూ –
“శమీ శమైతే పాపం
శమీశత్రు వినాశనము
అర్జునస్య ధనుర్ధారే
రామస్య ప్రియదర్శనము!” అని శ్లోకము చదువుతారు. ఇది తెలంగాణాలో తప్పక చేస్తారు.
పాండవులు తమ అజ్ఞాతవాసము పూర్తి చేసి, కౌరవుల మీద విజయఢంకా మ్రొగించిన రోజ కూడా ఇదే. ఇదే రోజున రాముడు తన వనవాసము పూర్తి చేసి అయ్యోధ వచ్చాడని కూడా పురాణగాథ.
 ఈ తొమ్మిది రోజుల వివిధ స్రోత్తాలతో అమ్మవారిని సేవించి ప్రతిరోజూ ఒక  తత్సంబంధమైన  నైవేద్యము సమర్పించి, సహస్రనామాలతో కుంకుమతో సేవిస్తారు. విజయదశమి నాడు ఈ నవరాత్రి వ్రతము పరిసమాప్తి చెస్తారు.  విజయదశమి నాడు ఏ పని ప్రారంభించినా ఎలాంటి అడ్డు వుండదని ఒక నమ్మకము.
ఎలాంటి కష్టమైన తీర్చి, గుండెలకు హత్తుకునే జగజ్జననిని తొమ్మిదిరోజులు అంగరంగముగా సేవించి, అహమన్నది తొలగించుకొని, జ్ఞానమన్న వరము పొందటానికి నవరాత్రుల కన్నా ఉత్తమమైన మార్గము మరిలేదంటే అతిశయోక్తి కాదు.
ప్రపంచములో చెలరేగిన గడ్డు స్థితిని తీర్చి జనజీవితము సక్రమముగా మారాలని ఈ నవరాత్రికి జగదంబను ప్రార్థిద్దాము.

1 thought on “నవరాత్రులలో రాత్రికే ప్రాదాన్యము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *