March 29, 2024

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 53

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య

ఈ కీర్తన అధ్యాత్మికమైన మేలుకొలుపు కీర్తన అయినప్పటికి అన్నమయ్య శృంగార రసాన్ని కూడా మేళవించి రచించిన అందమైన హరిమేలుకొలుపు.
కీర్తన:
పల్లవి: మేదిని జీవులఁ గావ మేలుకోవయ్యా
నీ దయే మాకెల్ల రక్ష నిద్ర మేలుకోవయ్యా ॥పల్లవి॥
చ.1 తగుగోపికల కన్నుఁదామరలు వికసించె
మిగుల సూర్యనేత్రుఁడ మేలుకోవయ్యా
తెగువ రాక్షసులనే తిమిరము విరియఁగ
నెగడిన పరంజ్యోతి నిద్ర మేలుకోవయ్యా ॥మేదిని॥
చ.2 ఘనదురితపు నల్లఁగలువలు వికసించె
మినుకు శశివర్ణుఁడ మేలుకోవయ్యా
పనివడి వేదాలనే పక్షులెల్లాఁ బలుకఁగ
జనక యాశ్రితపారిజాత మేలుకోవయ్య ॥మేదిని॥
చ.3 వరలక్ష్మికుచచక్రవాకము లొండొంటి రాయ
మెరయు దోషారహిత మేలుకోవయ్యా
పొరసి నీవు నిత్యభోగములు భోగించ
నిరతి శ్రీవేంకటేశ నేఁడు మేలుకోవయ్యా ॥మేదిని॥
(రాగం భూపాళం; సం: 1-377 – రాగిరేకు – 79-2)

విశ్లేషణ:
పల్లవి: మేదిని జీవులఁ గావ మేలుకోవయ్యా
నీ దయే మాకెల్ల రక్ష నిద్ర మేలుకోవయ్యా
శ్రీమహావిష్ణువు ఈ సకల చరాచర జగత్తును రక్షించే దేవ దేవుడు. కలియుగంలో తిరుమలలో శ్రీవేంకటేశ్వరుడై వెలసిన స్వామి. అలాంటి స్వామిని నిద్రలేపుతూ మేలుకొలుపు పాడుతున్నాడు అన్నమయ్య. కౌసల్యా సుప్రజా రామా! అన్నట్లుగానే ఈ పృధ్వీ మండలంపై ఉన్న సమస్త జీవకోటిని రక్షించవలసిన అవసరం ఉన్నది మహాప్రభో! మేలుకొనండి. మీ దయవల్లనే ఈ జగత్తు సమస్తం రక్షింపబడుతున్నది అంటూ మేలుకొలుపు కొనసాగిస్తూ ఉన్నాడు అన్నమయ్య.

చ.1 తగుగోపికల కన్నుఁదామరలు వికసించె
మిగుల సూర్యనేత్రుఁడ మేలుకోవయ్యా
తెగువ రాక్షసులనే తిమిరము విరియఁగ
నెగడిన పరంజ్యోతి నిద్ర మేలుకోవయ్యా
స్వామీ గోపికల కన్నులు తామర పుష్పాల వలె వికసించి ఉన్నాయి. సూర్య నేత్రుడా మేలుకో! రాక్షసివలే ఈ నల్లనైన తిమిరాన్ని వదలగొట్టే విధంగా మేలుకో! పరంజ్యోతి స్వరూపుడవై అందరి అంతరాత్మలలో కొలువైన ఓ అంతర్యామీ! శ్రీనివాసా! మేలుకో!

చ.2 ఘనదురితపు నల్లఁగలువలు వికసించె
మినుకు శశివర్ణుఁడ మేలుకోవయ్యా
పనివడి వేదాలనే పక్షులెల్లాఁ బలుకఁగ
జనక యాశ్రితపారిజాత మేలుకోవయ్య
ఘనము దురితము అనే నల్ల కలువలు వికసించాయి అనడంలో అమ్మ అలమేలు మంగమ్మ కూడా మేల్కొని నీకొరకై ఎదురు చూస్తూ ఉన్నది. మినుకు మినుకుమని మెరిసే చంద్రుని వంటి శరీరపు వర్ణము కలవాడా మేలుకో! ఉదాయాన్నే వేదమంత్రోచ్ఛారణతో సమానంగా పక్షులెల్లా పలుకుతున్నాయి. ఆశ్రితులకొరకై పుట్టిన పారిజాతమా! మేలుకోవయ్యా! అంటున్నాడు.

చ.3 వరలక్ష్మికుచచక్రవాకము లొండొంటి రాయ
మెరయు దోషారహిత మేలుకోవయ్యా
పొరసి నీవు నిత్యభోగములు భోగించ
నిరతి శ్రీవేంకటేశ నేఁడు మేలుకోవయ్యా

శ్రీ మహాలక్ష్మి వక్షములు రెండూ ఒకదానికొకటి ఒరుసుకుంటూ ఉన్నాయి. నీవు వేరు అమ్మ వేరు కాదు కదా! ఉభయులూ ఒకటే! ఓ దోషములేని శ్రీనివాసా మేలులో! నీకు మేమందించే నిత్య భోగాలు స్వీకరించే సమయమాసన్నమయినదంటూ నిత్య జాగృతుడైన స్వామికి మేలుకొలుపు సరస శృంగార భరితంగా పలుకుతున్నాడు అన్నమయ్య.

ముఖ్యమైన అర్ధములు:
మేదిని = భూమండలము; కావ = రక్షింపగా; కన్ను తామరలు = తామరలవంటి కన్నులు; వికసించె = ప్రకాసిస్తున్నాయి; సూర్య నేత్రుడ = సూర్య బింబము వంటి కన్నులు గలవాడా, రాజీవ నేత్రుడా!; తిమిరము = చీకటి; నెగడు = వర్ధిల్లు; పరంజ్యోతి = అంతరాత్మ, అంతర్యామి, అకాయుడు, అక్షయము, సప్తర్షి మండలంలో వశిష్ఠుడుచుక్క దగ్గర కనపడీ కనపడకుండా ఉండే చిన్నచుక్క; ఘన దురితపు = గొప్పదైనటువంటి పాపము; నల్ల కలువలు = ఆ నల్లనైన ప్రమాదము వెళ్ళిపోయింది; మినుకు = మెరయు; శశివర్ణుడు = చంద్రవర్ణముగల; వేదాలనే పక్షులెల్లా బలుక = పక్షులు వేదాలు పలుకుతున్నాయి అనీ మరియూ వేదోచ్ఛారణ చేసే వేద పండితులు; ఆశ్రిత = నమ్మినవారి; పారిజాతమ = కల్పవృక్షము; కుచచక్రవాకము = వక్షోజములు; దోషరహిత = అనఘుడైన, పాపము లేని వాడా! పొరయు = కలుగు; నిత్య భోగములు = భగవంతునికి సమర్పించేవి – 1. గంధము, 2. తాంబూలము, 3. పుష్పము, 4. అన్నము, 5. వస్త్రము, 6. స్త్రీ, 7. శయ్య, 8. గానము మొదలైనవి; నిరతి = మిక్కిలి ఆసక్తి.

0o0-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *