May 25, 2024

అమ్మమ్మ – 19

రచన: గిరిజ పీసపాటి

అమ్మమ్మ, డా పురుషోత్తంగారు మాట్లాడుకుంటూ ఉండగానే కారు పురుషోత్తం గారి ఇంటికి చేరింది. ఆయన నేరుగా ఇంట్లోకి వెళిపోయినా, అమ్మమ్మ మాత్రం బయట కాళ్ళు, చేతులు, ముఖం కడుక్కుని ఒకసారి లలితా పరమేశ్వకి మనసులోనే నమస్కరించుకుని, లోపలికి అడుగు పెట్టింది. రాజేశ్వరమ్మ గారు ఎదురు వచ్చి ఆప్యాయంగా పలకరించి, కాఫీ తెమ్మని వంట మనిషికి పురమాయించారు.

కానీ అమ్మమ్మ ఆవిడను వారించి, స్నానం, జపం పూర్తి కానిదే తాగనని చెప్పి నేరుగా పెరట్లోకి వెళ్ళి స్నానం, జపం పూర్తి చేసుకుని వచ్చి, తను తెచ్చిన మినిప సున్నుండలు, జంతికలు పురుషోత్తం గారి భార్యకు ఇచ్చింది. ఇంతలో వంట మనిషి కాఫీ తెచ్చి ఇస్తే తాగుతూ రాజేశ్వరమ్మ గారితో కబుర్లలో పడింది.

రెండు రోజుల అనంతరం పురుషోత్తం గారితో కలిసి తను వంట చెయ్యడానికి ఒప్పందం పడిన ఇంటికి బయలుదేరి వెళ్ళింది. పురుషోత్తం గారు అమ్మమ్మను వారికి పరిచయం చేసి, పరిస్థితుల వల్ల వంట పని చేయాల్సి వచ్చింది కానీ, ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తి అనీ, తమకు బంధువే అనీ, బాగా చూసుకోమని మరీ మరీ చెప్పారు.

తరువాత అమ్మమ్మతో మధ్యాహ్నం భోజనానికి తామంతా రాజేశ్వరత్తయ్యతో సహా వస్తామని, భోజనాల అనంతరం తిరిగి ఇంటికి వెళిపోదామని చెప్పి, హాస్పిటల్ కి వెళ్ళిపోయారు. ఆ ఇంటి ఇల్లాలు అమ్మమ్మని వంట చేయాల్సిన ప్రదేశానికి తీసుకెళ్ళి చూపించారు.

ఆ ఇంటిలో జరుగుతున్న కార్యక్రమం గృహప్రవేశం కనుక ముందుగా పొయ్యిని ఆవిడనే వెలిగించి, తమ ఇలవేల్పుకి దండం పెట్టుకోమని చెప్పింది అమ్మమ్మ. అనంతరం తను కూడా అగ్ని దేవుడికి, సూర్య భగవానుడికి, లలితా పరమేశ్వరికి నమస్కరించుకుని, వంట పని మొదలు పెట్టింది. అన్నిటికన్నా ముందు సత్యనారాయణ స్వామి ప్రసాదం తయారు చేసి వ్రతం సమయానికి అందించింది.

తనకు సహాయంగా వేరే మనుషులు ఎవరూ లేకపోవడం గమనించిన అమ్మమ్మ ఆ విషయం వారికి చెప్పడానికి బిడియపడి ఊరుకుంది. తరువాత కూరలు తరగడం, పూర్ణం బూరెలకి ఉండలు చుట్టడం మాత్రం వారి బంధువులలో ఇద్దరు స్త్రీలు వచ్చి సహాయం చేయగా మిగిలిన వంట మొత్తం ఒక్కర్తే సమయానికి పూర్తి చేసి, ఆ విషయం ఇంటి వారికి తెలియజేసింది.

తరువాత వంట గదిలో ఒక మూలన ఎవరికీ ఎదురు పడకుండా కూర్చుండిపోయింది. ఇంతలో అమ్మమ్మను వెతుక్కుంటూ రాజేశ్వరమ్మ గారు వచ్చి, కాసేపు మాట్లాడి, మిగిలిన వారిని కూడా పలకరించి మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళారు. కాసేపట్లోనే మొదటి బంక్తి భోజనానికి విస్తర్లు వేసారు. శుభకార్యాలకు విధవ స్త్రీలు వడ్డించకూడదని ఆచారం ఉంది కనుక వడ్డనకి మాత్రం తనను పిలవొద్దని, విస్తరిలో ఏ వంటకం ఎటువైపు వడ్డించాలని శాస్త్రం చెప్తోందో ఇంటావిడకి వివరించింది అమ్మమ్మ.

“అయ్యో! ఇంతమందికి, ఇంత వంటా ఒక్కరే వండి పెట్టారు. రాజేశ్వరమ్మ గారు వచ్చి మీకు సహాయంగా వేరే వంటవాళ్ళను ఇచ్చామో, లేదో కనుక్కునే వరకు మాకసలు ఆ విషయమే గుర్తు రాలేదు. క్షమించడమ్మా! ఇక మీరు విశ్రాంతి తీసుకోండి. మేము వడ్డిస్తాం. మగవారి భోజనాలు అవగానే మీకు కూడా భోజనం పెట్టేస్తాము” అని వారు అనగానే, వారికి వడ్డించాల్సిన ఆహార పదార్థాలు అందించసాగింది.

భోజనం చేస్తున్న అందరూ వంటలు అద్భుతంగా ఉన్నాయనీ, అప్పటివరకు ఏ ఫంక్షన్ లోనూ అంత రుచికరమైన భోజనం తినలేదని మెచ్చుకుంటుంటే అప్పటి వరకు తన వంట వారికి నచ్చుతుందో లేదోనని భయపడిన అమ్మమ్మ తృప్తిగా నిట్టూర్చింది.

మగవారి భోజనాలు అవగానే అమ్మమ్మని భోజనానికి రమ్మని పిలిచారు.

అందరి భోజనం అయ్యాక కానీ తాను తిననని అమ్మమ్మ చెప్పడంతో మిగిలిన వారు కూడా తినేసారు. ఆఖరున అమ్మమ్మ వంట గదిలోనే విస్తరి వేసుకుని భోజనం చేసింది. ఫంక్షన్ కి వచ్చిన బంధుమిత్రులంతా తిరుగు ప్రయాణం అయ్యారు. వారిలో కొందరు వంట చాలా బాగుందని, ఎవరు చేసారని అడగడంతో వారికి అమ్మమ్మని పరిచయం చేసారు వాళ్ళు.

అందరూ అమ్మమ్మ వంటను మెచ్చుకుని త్వరలో తమ ఇంట జరగబోయే కార్యాలకు వంట చేయమని అడగడంతో సరేనని ఒప్పుకుని, రాజేశ్వరమ్మ గారిని అడిగి వారి ఫోన్ నంబర్, అడ్రస్ వారికి ఇచ్చింది అమ్మమ్మ. అయితే పక్కనే ఉన్న రాజేశ్వరమ్మ గారు మాత్రం వారితో “వంటకు ఆవిడ వస్తారు కానీ, సహాయంగా ఇద్దరు లేదా ముగ్గురు మనుషులను (రుబ్బడం, దంచడం, కూరలు తరగడం వంటి వాటికి) ఇస్తేనే వస్తారని, మొత్తం వంట ఒక్కరూ చెయ్యడం కష్టం” అని ఖచ్చితంగా చెప్పడంతో వారు కూడా సరేనని ఒప్పుకున్నారు.

మూడు ఇళ్ళ వాళ్ళు అప్పటికప్పుడు అడ్వాన్స్ కూడా ఇచ్చి వంట చేయాల్సిన తేదీలు కూడా చెప్పడంతో సంతోషంగా అంగీకరించింది అమ్మమ్మ. ఒకటి ఉపనయనం, మరొకటి తద్దినం, మూడవది పెళ్ళి. పెళ్ళి వంటకి మాత్రం మూడు రోజులు వంట చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నారు.

“ఇక మనం కూడా బయలుదేరదామా!?” అని రాజేశ్వరమ్మ గారు అడగడంతో పెరట్లో ఆరేసిన పంచెలు తెచ్చుకుని, మడత పెట్టుకుని, తన చేతి సంచిలో సర్దుకుంది. ఇంతలో ఇంటివారు వచ్చి అమ్మమ్మకి దక్షిణ ఇచ్చి, బంధుమిత్రుల దగ్గర మాట రానివ్వకుండా కమ్మని భోజనం సమయానికి అందించారని మరోసారి మెచ్చుకుని, అమ్మమ్మ కాళ్ళకు నమస్కరించి, ఆశీస్సులు తీసుకున్నారు.

ఇంటికి రాగానే వాళ్ళు ఎంత డబ్బు ఇచ్చారా అని కుతూహలంగా లెక్కపెట్టుకున్న అమ్మమ్మ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అసలే పెద్ద కళ్ళేమో మరింత పెద్దగా మారిన అమ్మమ్మ కళ్ళ వంకే చూస్తున్న రాజేశ్వరమ్మ గారు పెద్దగా నవ్వి “ఏమిటమ్మా రాజ్యలక్ష్మమ్మా! కళ్ళను అంతగా విప్పార్చి చూసుకుంటున్నారు? హైదరాబాదులో మీ మొదటి సంపాదన ఎంతో కాస్త మాకూ చెప్పవమ్మా!” అంటూ మేలమాడేసరికి, చేతిలోని డబ్బును గభాల్న ఆవిడ చేతిలో పెట్టేసి, కన్నీళ్ళతో ఆవిడను రెండు చేతులతో చుట్టేసింది.

అమ్మమ్మ మానసిక స్థితిని అర్థం చేసుకున్న రాజేశ్వరమ్మ గారు అమ్మమ్మ వెన్ను నిమిరుతూ కాసేపు మౌనంగా ఉండిపోయారు. తరువాత “ఛఛ. ఏమిటిది చిన్న పిల్లలా!? మీ పరిస్థితిలో మరొకరుంటే ‘ఛీ’ కొడుతున్నా పడుతూ పుట్టింటిలోనో, అత్తింటిలోనో కాలం వెళ్ళదీసేవారు. కానీ మిమ్మల్ని మీరే ఓదార్చుకుని ధైర్యంగా మీ కాళ్ళ మీద మీరు నిలబడాలని అనుకున్నారు. అదే వ్యక్తిత్వం అంటే. మీలోని ఆ వ్యక్తిత్వమే నన్ను ఆకర్షించింది”.

“ఇది ప్రారంభం మాత్రమే. త్వరలోనే మీరు మరో పదిమందికి పని ఇచ్చే స్థాయికి ఎదగుతారు. అప్పుడు నా స్నేహితురాలిని చూసి నేను గర్వపడాలి. ఇంకెప్పుడూ మీ కళ్ళలో నీళ్ళు రాకూడదు. అలా అని నాకు మాటివ్వండి” అంటూ అమ్మమ్మ కన్నీళ్ళు తుడిచి, మాట ఇమ్మన్నట్లుగా చెయ్యి జాపారు రాజేశ్వరమ్మ గారు.

అమ్మమ్మ కూడా చిరు నవ్వు నవ్వుతూ ఆవిడ చేతిలో చేయి వేసింది ఇంకెప్పుడూ ఏడవనన్నట్లుగా తల అడ్డంగా ఊపుతూ. ఆ ఇద్దరు స్నేహితురాళ్ళను, వారి అన్యోన్యతను ముచ్చటగా చూస్తుండిపోయారు పురుషోత్తం గారు, అతని భార్య. ఒక డాక్టర్ కి, పేషెంట్ కి మధ్య ఉన్న బంధం అంత అపురూపమైన స్నేహ బంధంగా మారిందంటే సాధారణ విషయం కాదు కదా!

****** సశేషం ******

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *