April 19, 2024

అమ్మా ! ఓ దుర్గమ్మ తల్లీ !

రచన. పోలయ్య

శ్రీరస్తు !
శుభమస్తు !
సుఖశాంతులు
ప్రాప్తిరస్తు ! అని
సిరిసంపదలను
భోగభాగ్యాలను
సుఖసంతోషాలను
శాంతిసౌభాగ్యాలను
అష్టైశ్వర్యాలనొసగేటి
కోరిన కోరికలన్నీ తీర్చేటి
ఆశలన్నీ కలలన్నీనెరవేర్చేటీ

అమ్మా ! ఓ దుర్గమ్మ తల్లీ !
మీ “అనుగ్రహం” కోసం
మీ “విగ్రహం” ముందర
“పెట్టెదం” దీపధూప నైవేద్యాలు
“కొట్టెదం” కోటి కొబ్బరికాయలు
“చేసెదం”చేతులు జోడించి
శిరస్సులు వొంచి
మీకు సాష్టాంగ నమస్కారాలు !
“పెట్టెదం”వేయి పొర్లుదండాలు !

అమ్మా ! ఓ దుర్గమ్మ తల్లీ !
నిను మదిలో
నమ్మిన చాలునులే
నవనీతం ! నవరసభరితం !
సువర్ణశోభితం !
సుఖమయమే మా జీవితం !

అమ్మా ! ఓ దుర్గమ్మ తల్లీ !
నిను నిత్యం భక్తితో
కొలిచిన చాలునులే
సుందరం !సుమధురం !
శుభకరం !
మధురం ! మనోహరం !
మంగళకరమే ! మా జీవితం !

అమ్మా ! ఓ దుర్గమ్మ తల్లీ!
ఓ దుఖనివారిణీ !
ఓ దుష్టసంహారిణీ !
ఓ మహిషాసుర మర్దిని !
రక్షణదుర్గమై
మా అందరిని రక్షించుము తల్లీ !
కులదైవమై, మా
కుటుంబాలను కాపాడుము తల్లీ !

అమ్మా ! ఓ దుర్గమ్మ తల్లీ !
మీ పాదాలకు ప్రణమిల్లి
మేము కోరుకునేదొక్కటే
ఉగ్రరూపం దాల్చి
ఉక్కిరిబిక్కిరి చేసే ఊపిరి తీసే
ఈ ప్రకృతి వైపరీత్యాల నుండి
మాకు ఉపశమనం కలిగించమని
కళ్ళుపొరలు కమ్మిన కామాంధులను
కాల్చి బూడిద చేయమని
“కాసింత ప్రశాంతతను” మాకు
ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం…
అందుకే అమ్మా ! ఓ దుర్గమ్మతల్లీ !
మీకు వందనం ! పాదాభివందనం !!

1 thought on “అమ్మా ! ఓ దుర్గమ్మ తల్లీ !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *