March 28, 2024

ఎగిసే కెరటం నవలపై పత్ర సమర్పణ

వంగూరి ఫౌండేషన్, అమెరికా మరియు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తెలుగు విభాగం, తిరుపతి వారు నిర్వహించిన “21వ శతాబ్దపు స్త్రీల నవలలు” పై అంతర్జాతీయ సాహిత్య సమ్మేళనానికి ఎంపికయిన మాలిక రచన “ఎగిసే కెరటం”
.
స్వీయరచన పై పత్ర సమర్పణ_ శ్రీసత్య గౌతమి

ప్రస్తుత సంఘమునందలి ఆచార వ్యవహారాలను గమనిస్తూ, అందలి లోటుపాట్లను సవరిస్తూ, సంస్కరణ పూర్వకమైన చక్కని భవిష్యత్తును చూపాలనే ఉద్దేశ్యంతో నేను చేసిన ప్రయత్నం ఈ నవలారచన ‘ఎగిసేకెరటం’. ఈ ఎగిసేకెరటం నవలలోని కొన్ని సంఘటనలు పరిశోథనాప్రపంచంలోని కుళ్ళును, అవినీతిని, అక్రమ పద్ధతుల్ని ఎలుగెత్తి చూపుతాయి. సమకాలీన సాంఘిక పరిస్థితులను కళ్ళకు కట్టినట్లుగా, యథాతథంగా చిత్రించిన నవల ‘ఎగిసేకెరటం’. ఈ నవల ధారావాహికంగా “మాలిక” అంతర్జాల మాస పత్రికలో మార్చి 5, 2016 నుండి అక్టోబర్ 6, 2017 వరకు ఒక సంవత్సరంన్నర పాటు నడిచింది. నేటి ఆధునిక సమాజంలో వివిథ రూపాల్లో పురుషాధిక్యతను ప్రతిఘటిస్తూ, తమ వేష భాషలై జరుగుతున్న దాడిని ప్రశ్నిస్తూ వివిథ రూపాల్లో జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడుతోంది స్త్రీ. తనను తాను నిలబెట్టుకోవడానికి అహర్నిశలూ శ్రమిస్తోంది. తన ఎదుగుదల కుంటుపడకుండా అప్రమత్తంగా వుంటూ తగు చర్యలు తీసుకుంటోంది. స్త్రీ స్వేచ్చకు, తన శక్తికి క్రొత్త నిర్వచనాన్ని రచిస్తోంది. అయితే ఆ రచనాక్రమం సరియైనదైనప్పుడే ఆవిడ పాత్ర సుగమ మార్గాన్ని అనుసరిస్తుంది. ప్రతి మనిషిలో కూడా నాయకత్వం, ప్రతినాయకత్వం వంటి విభిన్న వ్యక్తిత్వాలుంటాయి. ఉదాహరణకు ఆమె: బతుకులో నాది అన్నప్రతిదాన్ని బలవంతంగా లాక్కోవాలని ప్రయత్నించే ప్రపంచానికి బుద్ధి చెప్పి నేను బలపడి ఇంకొకరికి బలాన్నిస్తాను అనుకోవడం నాయకత్వం. ఇదొక పోటీ ప్రపంచం చిన్న చేపను పెద్ద చేప మింగుతుంది నేను చేసిందీ అంతేగా అని అనుకుంటే అది స్వార్ధం. అట్టి స్వార్ధం ప్రతినాయకత్వం. అటువంటి ప్రతినాయకత్వపు లక్షణాలు గల స్త్రీ సింథియా కథే ఈ ఎగిసేకెరటం. ఈ నవలలో ఆమె ప్రథాన పాత్రధారి. తనకున్న స్వేఛ్ఛను, అవకాశాలను తన అవసరాలకోసం, తాను ఎదగడంకోసం ఎదుటివారిని ఎంత రిస్కులో పెట్టడానికయినా వెనుకడుగు వెయ్యని ధైర్యశాలి సింథియా. ఈ పద్దతి తాను కోరుకున్నవన్నిటినీ సమకూరుస్తున్నప్పుడు ఈ పద్ధతిలోనే సింథియా తన ఆత్మ విశ్వాసాన్ని పెంచుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. మరి ఆ పద్ధతే ఇంకా ఇంకా ఆమె కోరుకున్న ఫలాలను ఇచ్చిందా? తనను ఏ స్థానం నుండి, ఏ స్థానానికి తీసుకు వెళ్ళింది అన్నదే ఈ కథా నేపథ్యం. అవసరం, అవకాశం, పిరికితనం, స్వార్ధం …ఈ గుణాలు అందరిలో ఉండే మామూలు గుణాలే, కానీ వీటితో ఆచరణా విథానాలే వేరు వేరు. ఈ విథానాలే మంచి చెడుని వేరు పరిచి చూపిస్తాయి. సింథియా తన ఆలోచనా సరళికి తగ్గట్టుగా మనుష్యులను సమకూర్చుకుంటుంది. అందుకే వారి పాత్రలు కూడా ఈ నవలకు ఆయువుపట్లు. విచిత్రం ఏంటంటే ఆవిడ ఆచరణా విథానాలు ఆమె సమకూర్చుకున్న వారినందరినీ తనకు కాకుండా చేసేస్తాయి. ఆమెను ఒంటరిదాన్ని చేసేసి ఏడిపించేస్తాయి. ఇది నవలా నేపథ్యం. చివరకు ఆమె ఏమవుతుందో ఈ నవలంతా చదివితే తెలుస్తుంది. ఈ వీడియో సమీక్షలో వినండి. వీలయితే గౌసిప్సు (అనగా గౌతమి సిప్సు, కాఫీ సిప్సు లాగ) కోలం ను మళ్ళీ తిరగవేసి మొత్తం చదవగలరు. మీ అమూల్యమయిన అభిప్రాయాలను క్రింద బాక్సు లో తెలియజేయండి. వెంటనే నేను స్పందిస్తాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *