April 20, 2024

ఎదురుచూపులు

రచన: లక్ష్మీ vsr

 

 

“ఎప్పుడు వస్తున్నావు కన్నా” విదేశంలో చదువుకుంటున్న కొడుకును అడిగింది వనజ

“కరోనా వల్ల ఫ్లైట్స్ తిరగడం లేదు కదమ్మా!ఎప్పుడు తిరిగితే అప్పుడు బయలుదేరి వస్తాను. వీడియో కాల్ లో చూస్తూనే వున్నావు కదా!బెంగపెట్టుకోకు. వచ్చేస్తా

నుగా!”

“ఏమో ఏమి రావడమో!నువ్వెళ్ళి మూడు సంవత్సరాలు అయింది. ఎప్పుడు వస్తావా అని కళ్ళల్లోవత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నాను. ”

“ఈసారి తప్పకుండా వస్తాను. నువ్వలా మాట్లాడుతుంటే నాకు బాధగా వుంటుంది. సరే నాన్న నువ్వు బాగానే వున్నారుగా. బయటకు వెళ్లకండి. పని వుండి నాన్న

వెళ్ళినా జాగ్రత్తలు తీసుకోమను. మీ ఇద్దరి ఆరోగ్యం జాగ్రత్త. ఇక వుంటాను. ”

“మేము జాగ్రత్తగానే వుంటాములే. నువ్వే అక్కడ ఒక్కడివే వున్నావు. జాగ్రత్త. ”అవతల ఫోన్ పెట్టేసిన శబ్దం వినబడటంతో   తను కూడ ఫోన్ ఆఫ్ చేసి కళ్ళు

తుడుచుకుంది వనజ.

అక్కడే వుండిఇదంతా గమనిస్తున్న మాధవరావు “వాడికి ధైర్యం చెప్పి నువ్వు కళ్ళనీళ్ళు పెట్టుకుంటావేంటి”అని అడిగాడు.

“మీకేం తెలుస్తుంది కన్నతల్లి బాధ. వాడిని చూసి యుగాలయినట్లుంది. చదువుకని వెళ్ళి మూడు సంవత్సరాలయ్యింది. ఈ యేడు వద్దామనుకుంటే లాక్డౌన్ వల్ల అన్ని దేశాల ఫ్లైట్స్ కాన్సిల్ చేసారు. ఇదిగో వస్తాడనుకుంటే ప్రయాణం వాయిదాపడింది. పరిస్థితి ఎప్పటికి చక్కపడుతుందో కూడ తెలియదు. ఎంత వీడియో కాల్

లో చూసినా కళ్ళెదురుగా చూసిన తృప్తి వుండదుగా!అసలు ఈ జన్మకు వాడిని చూడగలనా అన్న సందేహం కలుగుతోంది. ”

“ఛ. అలా పిచ్చి మాటలు మాట్లాడక. అశుభం పలకకూడదు. ఒకటి రెండు నెలలలో ఈ మహమ్మారి నెమ్మదిస్తుంది. రాజీవ్ అప్పుడు బయలుదేరి వస్తాడు. నువ్వు

అందరికీ ధైర్యం చెబుతావు.  నువ్వే ఇలా మాట్లాడితే మేమేం కావాలి. మనిషి కి నిరాశా నిస్పృహలు మానసిక దుర్భలత్వాన్ని కలగజేస్తాయ. ఆశ జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది. నీకేం కాదు. నీ కొడుకును కళ్ళారా చూసుకుంటావు. సంతోషంగా గడుపుతావు. అప్పుడు నీకు నేను గాని బయటి ప్రపంచం కాని కనిపించదు. ”అని వుత్సాహపరచడానికి ప్రయత్నించాడు మాధవరావు.

“చాల్లెండి సంబడం. ఇప్పటికే ఆలస్యమైంది. భోజనం వడ్డిస్తాను లేవండి. ”అని ముద్దుగా విసుక్కుంది వనజ.

ఆమె భయానికి కారణం లేకపోలేదు. బి. పి, షుగర్ లతో పాటు ఆయాసం కూడ వున్నది. ఇప్పుడు కరోనా భయం. ఎంత జాగ్రత్తగా వున్నా అనుకోని విధంగా వైరస్

బారిన పడితే తన శరీరానికి తట్టుకునే శక్తి లేదని భయం.

మధ్య మధ్య ఫోన్ లతో ఒక నెల గడిచిపోయింది. ఆ రోజు ఉదయమే రాజీవ్ ఫోన్ చేసి “ఇక్కడ వారి కోసం వాషింగ్టన్ నుండి ఢిల్లీకి స్పెషల్ ఫ్లైట్ వేస్తున్నారట. వారం రోజులలో నీ ముందుంటానమ్మా!”

వారంలో కొడుకు తన ముందుంటాడు అన్న ఆలోచనే వనజకు వెయ్యి యేనుగులు యెక్కినంత బలాన్ని కలిగించింది. మళ్ళీ అంతలోనే మనసు లో ఒకవులికి

పాటు. వాడు వచ్చి వెళ్ళేవరకు మందులు మరచిపోకుండా వేసుకోవాలి. ఆరోగ్యంగా జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే వాడు బాధ పడతాడు. వెళ్ళినాక మనశ్శాంతిగా వుండలేడు అని గట్టిగా అనుకుంది.

వారానికి కొడుకు నుంచి ఫోన్ “అమ్మా!మేము ఢిల్లీ లో దిగాము. కాని పద్నాలుగు రోజులు క్వారంటైన్ లో వుండాలట. అది పూర్తయినాక వస్తాను. ”అని

కాని క్వారంటైన్ పూర్తయినా అక్కడి నుంచి హైదరాబాదు కు వెళ్ళడానికి ప్రయాణసౌకర్యం లేకపోవడంతో మరికొన్ని రోజులు ఎదురుచూడాల్సి వచ్చింది. చివరకు ఎన్ . ఆర్. ఐ ల ఆందోళనతో హైదరాబాదుకు స్పెషల్ ఫ్లైట్ వేసారు. దానిలో హైదరాబాదు చేరుకున్నాడు రాజీవ్. అక్కడకు చేరగానే ఎన్. ఆర్. ఐ కాబట్టి తప్పనిసరిగా కోవిద్ టెష్ట్ చేసి నెగిటివ్ వచ్చినా గాని మరల పద్నాలుగు రోజులు పెయిడ్ క్వారంటైన్ లో వుంచారు.

తరువాత ప్రత్యేక బస్సులో విజయవాడ బయలుదేరాడు. రాష్ట్రం మారడంతో చెక్ పోష్టు దగ్గర మరల టెష్ట్ చేసి నెగిటివ్ వచ్చినా ఎన్.  ఆర్. ఐ కనుక హౌస్  క్వారంటైన్ లో వుంటానన్న హామీ తీసుకుని వదిలారు. ఇండియా వచ్చినాక కూడ నెలా పదిహేనురోజులకు కాని ఇంటికి చేరుకోలేక పోయాడు.

ఇంటికి చేరుకున్నాక తల్లి కనిపించక పోవడంతో”అమ్మేది నాన్నా”అని అడిగాడు.

“అమ్మ ఆసుపత్రి లో చేరిందన్న” వార్త చెప్పాడు తండ్రి.

“ఎందుకు? ఏమైంది? నేను రోజూ ఏదో ఒక టైములో ఫోన్ చేస్తూనే వున్నాను కదా. నాకెందుకు చెప్పలేదు. ”

“కొంచెం జ్వరం వచ్చింది. చిన్నచిన్న వాటికి హాస్పటల్ కి రావద్దన్నారు కదాని మామూలు జ్వరమేనని టాబ్లెట్లు వాడాము. కాని నాలుగు రోజులకి దగ్గుఎక్కువయింది. ఆ లక్షణాలు చూసి భయమేసి హాస్పటల్ కి తీసుకెళ్ళాను. టెష్ట్ చేసి కరోనా లక్షణాలు వున్నాయని ఆసుపత్రి లో చేర్చారురా! నన్ను కూడ ఇల్లు కదల వద్దన్నారు. ఇల్లంతా శానిటైజ్ చేసారు. ”అని చెప్పాడు.

“అయ్యో!అమ్మకెలా వచ్చింది. బయటకు వెళ్ళవద్దన్నాను కదా!జాగ్రత్తలు తీసుకోలేదా!ఎన్ని రోజులయ్యింది. నాకెందుకు చెప్పలేదు? అందకనేనా వారం నుంచి నేను ఎప్పుడు ఫోన్ చేసినా అమ్మ పనిలో వుంది. తరవాత మాట్లాడుతుందని చెబుతూ వస్తున్నావు. ”

“వారమయ్యింది. ఆసుపత్రిలో జాయిన్ చేసి. మేము జాగ్రత్తగానే వున్నాము. ఎలా అంటుకుందో మాకే తెలియడంలేదు. డాక్టర్లు అనడం అమ్మకు రెసిస్టెన్స్ తక్కువగా వుండటంతో బయటనుంచి తెచ్చిన వస్తువుల ద్వారా వచ్చివుండవచ్చని అనుమానించారు. నువ్వెలాగు వస్తావు కదా వచ్చినాక చెప్పమని అమ్మ మాట తీసుకున్నదిరా. అందుకే చెప్పలేదు. నువ్వు కంగారు పడతావని అంది. ”

వీరిలా మాట్లాడుతుండగానే ఆసుపత్రినుండి ఫోన్ వచ్చింది. వనజ గారు పోయారని కరోనాతో  మరణించారు కనుక బాడీ ఇవ్వడం కుదరదని తామే అంతిమసంస్కారం తామే చేస్తామని తెలియబరిచారు.

రాజీవ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తల్లిని చూడాలని ఆతృతగా సముద్రాలు దాటివస్తే కడసారి చూపులకు కూడ నోచుకోలేకపోయాడు. ఆ తల్లి మనసు కొడుకు కోసం ఎంత పరితపించిందో!ఆ కొడుకు దుఃఖాన్ని తీర్చడమెవరితరము? ఈదుఃఖానికి  కారణమెవరు?నెలన్నర క్రితమే ఇండియా వచ్చినప్పటికి  ప్రభుత్వాల మధ్య సమన్వయం లేక పోవడం, అనాలోచిత నిర్ణయాలవల్ల క్వారంటైన్ పేరుతో ఇంటికి చేరే అవకాశం లేకపోయింది.

ఏది ఏమైనా తల్లిని కడసారి చూడలేకపోయిన దుఃఖము రాజీవ్ కి ,  కొడుకుని పోయేముందు చూడలేక పోయిన అసంతృప్తి తల్లికి ఈ జన్మకి తీరే అవకాశం లేదు. ఇద్దరికీ ఎదురుచూపులే మిగిలాయి.

 

 

*************

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *