May 25, 2024

కంభంపాటి కథలు – ప్రయాణం

రచన: కంభంపాటి రవీంద్ర

భ్రమరకి ఒకటే భయంగా ఉంది .. ఊరంతా కరోనా అట .. ఊరంతా ఏమిటీ ..రాష్టం , దేశం ప్రపంచం .. అంతా కరోనా ! తనుండే కాకినాడలో అయితే జనాలు విచ్చలవిడిగా తిరిగేస్తున్నారు … బయటకి వెళ్ళాలన్నా .. ఇంట్లోకి ఎవరినన్నా రానివ్వాలన్నా చాలా భయంగా ఉంది !
పని పిల్లని, పేపర్ వాడిని మానిపించేసింది.. అపార్ట్మెంట్ లో ఇరుగు, పొరుగు ఎవరి తలుపులు వారు మూసుక్కూచున్నారు.. మనిషన్న వాడి మొహాన నాలుగు మాట్లాడి మూడ్రోజులైంది.
నిన్న సాయంత్రం కోడలు అమెరికా నుంచి ఫోను చెయ్యగానే.. శుభ్రంగా నాలుగు దులిపి పారేసింది భ్రమర. ‘అసలు నేనంటే.. నీకు లెక్కలేదు.. పెళ్ళైయ్యాక వాడు బొత్తిగా నీ చేతిలో రిమోట్ కంట్రోలైపోయేడు.. తల్లనేది ఒకత్తుందనీ.. దాన్ని కూడా దగ్గిరికి తెచ్చుకుని.. మనతో ఉంచుకుందామనీ.. వాడికి ఆలోచన లేదు.. నువ్వైతే ఆ ఆలోచనే రానివ్వవు’ అనేసరికి ఏడుపు మొహం పెట్టుకున్న కోడలు చెప్పింది..’ లేదత్తయ్యా.. అన్ని ఫ్లైట్లు తిరగడం లేదు.. ఏవో కొన్ని మాత్రమే తిరుగుతున్నాయి.. ఈయన కూడా మీకు టిక్కెట్టు కోసం ప్రయత్నిస్తున్నారు’ అంటూ!
‘ సరే.. ఏదో ఒకటేడడవండి..నాగ్గానీ కరోనా వచ్చిందో.. మీ ఇద్దరూ నన్ను పట్టించుకోవడం లేదని ఉత్తరం రాసి మరీ పోతాను.. కాబట్టి నన్ను కూడా అమెరికా తీసుకుపొండి’ అల్టిమేటం ఇచ్చింది భ్రమర
‘మీరు కూడా మాతో ఉంటేనే మాక్కూడా బావుంటుందత్తయ్యా .. కానీ బయట చూసేరు కదా .. పరిస్థితులు అస్సలు బాగోలేవు ‘ కోడలు చెప్పబోయింది
‘అమెరికాలో ఉన్న నీకే పరిస్థితులు అలా ఉంటే , ఈ దిక్కుమాలిన ఇండియా లో ఉన్న నా పరిస్థితులు ఎలా ఉంటాయో ఎప్పుడైనా ఆలోచించేవా ?’ కసిరిందావిడ
‘సరే అత్తయ్యా .. ఆయనతో మాట్లాడతాను .. ఇందాకే చెప్పేరు … ఒకట్రెండు రోజుల్లో టికెట్ బుక్ చేస్తానని ‘ అని కోడలు చెబుతూంటే , ఫోన్ పెట్టేసింది భ్రమర .
కాసేపు అలా అపార్ట్మెంట్ బాల్కనీలోకి వెళ్ళి నుంచుంటే .. దూరంగా ఎవరో మనిషి దున్నపోతుని తోలుకొస్తూ కనిపించేడు . కాస్త పరికించి చూస్తే .. అతని చేతిలో తాడు యమపాశంలా , అతను యముడిలా కనిపించేడు . ఆ వెళ్ళేవాడు వెళ్ళకుండా తనకేసి తీక్షణంగా ..ఒకింత ఆశ్చర్యంగా చూసేడు . దెబ్బకి భయపడిన భ్రమర ‘అమ్మో ..ఖచ్చితంగా యముడే .. నా మీద కన్ను పడింది ‘ అనుకుని పరిగెత్తుకునెళ్ళి దేవుడి గది ముందు కూచుని , ఏడవడం మొదలెట్టింది .. ‘ఇన్నేసి పూజలు చేసేను నీకు … ఎప్పుడైనా నా మొరాలకించేవా ?… అక్కడ నా కొడుకేమో నాకో ఫ్లైట్ టిక్కెట్టు బుక్ చెయ్యడు .. ప్రతిదానికీ ఆ కోడలు ముండొకటి అడ్డుపడుతుందనుకుంటాను .. ఇక్కడ చూస్తే .. ఇందాకే ఎవడో యములాడిలా కనిపించేడు .. యములాడిలా ఏమిటీ .. యముడే .. ఆ దున్నపోతూ , పాశం . ఆ మాత్రం గుర్తుపట్టలేనా ఏమిటీ ?.. నాకు ఆ ఫ్లైట్ టిక్కెట్టు తెప్పించి .. నన్ను హాయిగా అమెరికా పంపెయ్యొచ్చుగా .. అక్కడే నా చావేదో చస్తాను ‘ అంటూ చాలా సేపు దణ్ణమెట్టుకుంది భ్రమర !
కాస్సేపు టీవీ పెట్టుకుని చూస్తూ , వీలైనప్పుడు కొడుకుని , కోడల్నితిట్టుకుంటూ , కుదిరినప్పుడు దేవుణ్ణి తల్చుకుంటూ .. అలాగే సోఫా లో నిద్రపోయిన భ్రమర కి , ఫోన్ రింగవ్వడం తో మెలకువ వచ్చింది! అట్నుంచి కొడుకు కిరణ్ ఫోన్లో ‘ఉత్సాహంగా చెప్పేడు, ‘అమ్మా .. నీకు ఫ్లైట్ టికెట్ దొరికింది .. ఇంకో నాలుగు రోజుల్లో ప్రయాణం ..టికెట్ నీకు ఈమెయిల్ చేసాను ‘
‘సర్సర్లే .. ఇన్ని సార్లు ఫోన్ చేసి మొత్తుకుంటే గానీ నీకు , కోడలికి కుదర్లేదన్నమాట నాకు టికెట్ బుక్ చెయ్యడం’ అంటూ ఫోన్ పెట్టేసింది భ్రమర !
*********
ఆ రోజు సాయంత్రం భక్తుల నుంచి దేవుడు గారికి కాస్త తీరుబాటు దొరికి, తన అంతఃపురం బాల్కనీలో కూచునుంటే .. దూరంగా మహిషం మీద వెళ్తున్న యమధర్మరాజు కనిపించేడు
చప్పట్లు కొట్టి పిలిచి , ‘ఏవయ్యా .. యమధర్మరాజా .. నా భక్తురాలొకావిడని తీక్షణంగా చూసి భయపెట్టేవట .. దాంతో జడిసి అమెరికా పారిపోయిందావిడ .. ఏమిటి సంగతి ?’ అని అడిగితే , యమధర్మరాజు ‘దేవదేవా .. మీ భక్తురాలా ? ఎవరామె ?…. ఆమె నామధేయమేమి ? ‘ ఆశ్చర్యం వెలిబుచ్చేడు
‘భ్రమర అని .. ‘ అంటూ దేవుడు చెప్పబోతూంటే .. యమధర్మరాజు అందుకుని .. ‘ఓహ్ .. ఆ కాకినాడ ఆవిడేనా ?.. ఇంకో వారం రోజుల్లో ఆవిడకి నాతో అమెరికాలో అపాయింట్మెంట్ ఉంది .. అలాంటిది . ఇంకా కాకినాడ లోనే ఉందేమిటా అని ఆశ్చర్యంగా చూసేను .. నాదసలే సీరియస్ ఫేసు కదా .. నా ఆశ్చర్యం ఆవిడకి తీక్షణం గా కనిపించుంటుంది ‘ అంటూ బదులిచ్చేడు !
గమనిక : కొన్ని వందల ఏళ్ల క్రితం నాటి అరబిక్ కథని కొంత వాడుకున్నాను

2 thoughts on “కంభంపాటి కథలు – ప్రయాణం

  1. హ..హ.హ ..భలే వుంది అండి. రామేశ్వరం పోయినా శనీశ్వరుడు వదలడనీ.. విధి వ్రాత తప్పించటం అసాధ్యం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *