March 28, 2023

తామసి – 2

రచన: మాలతి దేచిరాజు

లైబ్రరీ లో తనకి కావాల్సిన పుస్తకం కోసం వెతుకుతున్నాడు గాంధి.ఎంతకీ అది దొరకటం లేదు.దాదాపు లైబ్రరీ అంతా వెతికాడు.విసుగొచ్చి వెనుతిరిగాడు.చాలా రోజులైంది పేపర్ పై పెన్ను పెట్టి కొత్త నవల రాద్దామంటే ఏమీ ఇన్స్పిరేషన్ రావడం లేదు.పోనీ ఏవైనా పుస్తకాలు చదివితే అందులో ఏదో ఒక పాత్రని పట్టుకుని కథ అల్లుకోవచ్చు అన్నది అతని ఉద్దేశం.అలా రాసిన నవలలు కూడా ఉన్నాయి. అవి డబ్బైతే తెచ్చి పెడతాయి గాని అతనికి సంతృప్తిని ఇవ్వవు.అతనికి నిజమైన సంతృప్తి యదార్ధ సంఘటనలని ,నిజ జీవితంలోని పాత్రలని తీసుకుని కథ రాయడమే. కానీ ఈ మధ్య కాలంలో అంత గొప్ప ఘటనలేవి వినలేదు,టీ.వీ లో చూడలేదు. పేపర్ లో చదవలేదు.
బెంగాలి రచయిత ఎవరో “అమీ తుమీ కా బాలు బాషి”( ఐ లవ్ యు )అనే నవల రాసాడు.దాన్ని తెలుగులో “ఆకెళ్ళ నాగ శ్రీనివాస్” అనే తెలుగు ఉపాధ్యాయుడు (పండితుడు..ప్రొఫెషనల్ రైటర్ కాదు) “మదిలో మాట ” పేరుతో అనువదించాడు. ఆ పుస్తకం కోసమే లైబ్రరీకి వచ్చాడు తను..కారణం …అందులో జబేల్ అనే హీరోయిన్ భర్త పాత్ర చాలా విభిన్నంగా ఉన్నట్టు ఎవరి ద్వారానో విన్నాడు. ఆ పాత్రని బేస్ చేసుకుని నవల రాద్దాం అనుకున్నాడు ,కానీ ఫలితం లేదు చేసేది లేక కారెక్కి స్టార్ట్ చేసి పోనిచ్చాడు.అతని మనసంతా ఏదోలా ఉంది మొహంలో చిరాకు నెలకొంది ఫ్రేష్టేట్ అవుతున్నాడు.కారు ఎనభై వేగంలో వెళుతోంది. నెమ్మదిగా చీకటి పడుతుంది సమయం పావు తక్కువ ఆరు అయ్యింది.గేరు మార్చి స్పీడు పెంచాడు. అదే కొంప ముంచింది. దబ్ అని శబ్దం..కారు ఒక్కసారిగా ఆగింది.ముందుకి ఒరిగి సీటుకి గుద్దుకున్నాడు.డోర్ ఓపెన్ చేసి దిగి ముందు భాగం వైపు చూసాడు.ఫ్రంట్ వీల్ కింద పడి ఉన్నాడు గౌతమ్ .తృటిలో ప్రమాదం తప్పింది.థ్యాంక్ గాడ్ అనుకుని గౌతమ్ ని లేపడానికి ప్రయత్నించాడు.
“గౌతమ్..మిస్టర్ గౌతమ్ “ఉలుకు,పలుకు లేకుండా పడి ఉన్నాడు గౌతమ్.అప్పటికే చుట్టూ జనం మూగారు వాళ్ళు సాయం పట్టడంతో గౌతమ్ ని కార్లో ఎక్కించుకుని దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తీసుకెళ్ళాడు.
స్త్రేచ్చర్ మీద గౌతమ్ ని ఎమర్జెన్సి కి తీసుకుళ్ళారు. గాంధీని బయటే ఉండమని సైగ చేసింది నర్స్ చెయ్యి చూపిస్తూ.
పావు గంట గడిచింది…డాక్టర్ బయటకి వచ్చాడు.
“ఎలా ఉంది డాక్టర్ ” ఏ కంగారు లేకుండా నార్మల్ గా అడిగిన అతని తీరు వింతగా అనిపించింది డాక్టర్ కి.
“నథింగ్ టు వర్రీ ..హీ ఈజ్ ఆల్ రైట్ ..మీరు వెళ్లి చూడొచ్చు” అని చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్.
ఎమర్జెన్సి వార్డులో బెడ్ పైన పడుకుని ఉన్నాడు గౌతమ్..లోపలికి వస్తున్న గాంధీ షూ చప్పుడికి కళ్ళు తెరిచాడు నెమ్మదిగా ..
“ఐ యాం సారి మిస్టర్ గౌతమ్ …” ఫార్మలిటి గా చెప్పాడు.
“ఇట్స్ ఓకే …నా తప్పు కూడా ఉంది కదా ! ” అంత కన్నా డిప్లమేటిక్ గా చెప్పాడు.
ఏం మాట్లాడుకోవాలో తెలియని సందిగ్ధం ఇద్దరిలో నెలకొంది. చేసేది లేక గాంధి నే మాట కలిపాడు.
“మీ వాళ్లకి కాల్ చేస్తాను నెంబర్ ఇవ్వండి ”
“పర్లేదండి..ఐ కెన్ మేనేజ్ ”
“నో ..నో..అలా కాదు..నాకు అర్జెంట్ వర్క్ ఉంది మీ వాళ్ళెవరైనా వస్తే నేను బయల్దేరుతాను”
విస్మయంగా చూసాడు గౌతమ్..కనీసం తన పైన జాలి లేకపోయినా అతను చేసిన దానికి ప్రత్యోపకారంగా అయినా మాట్లాడటం లేదు ఇతను.తప్పు నాది కూడా అన్నందుకా?
“మిస్టర్ గౌతమ్..నెంబర్..”ఆలోచనలో ఉన్న గౌతమ్ ని కదుపుతూ అడిగాడు గాంధి..
“ఇట్స్ ఓకే సార్ నేను చూసుకుంటాను మీరు బయల్దేరండి.”
అతని మాటల్లో కటువుదనం ,కోపం రెండూ గాంధీకి నవ్వు తెప్పించాయి.
“చూడండి…గౌతమ్..నేను కావాలని యాక్సిడెంట్ చేయలేదు ..సో..నా తప్పు ఉంది అని అనుకోను. మన ప్రేమేయం లేకుండా జరిగే దాన్నే యాక్సిడెంట్ అంటారు.”
గౌతమ్ కి మరింత కోపం వచ్చింది.కానీ గాంధి చెప్పిన దాంట్లో వాస్తవాన్ని కూడా గుర్తించాడు.
“నిజంగానే నాకు పని ఉంది గౌతమ్..మీకు అంతగా ఏమీ కాలేదు కాబట్టే ఇంత క్యాజువల్ గా వెళ్తానన్నాను.”
గౌతమ్ కళ్ళు మూసి తెరిచాడు..అలాగే అన్నట్టు. గాంధి అక్కడ నుంచి కదిలాడు.ఇంకాసేపు ఉండి ఉంటే మరుసటి రోజు గౌతమ్ ,గాంధీల మధ్య జరిగే సంభాషణ ఇప్పుడే జరిగుండేది.
**************
ఎమర్జెన్సి వార్డ్ తలుపు దభాలని తెరుచుకుని వచ్చారు షీబా,సీమా
నర్స్ బీ.పి చెక్ చేస్తోంది .గౌతమ్ వాళ్ళని చూసాడు.
“ఎలా జరిగింది “(షీబా) ….”ఎలా ఉంది” (సీమా)
“ఐ యామ్ ఓకే …ఐ యామ్ ఓకే …నథింగ్ టు వరి జస్ట్ రోడ్ క్రాస్ చేస్తుంటే కార్ డ్యాష్ ఇచ్చింది అంతే.”
“ఏంటిది గౌతమ్ చూసుకోవచ్చుగా ..” అంది షీబా.
“ఇంతకీ యాక్సిడెంట్ చేసింది ఎవరు..?” అడిగింది సీమా.
నర్స్ బయటకి వెళ్ళిపోయింది తన పని ముగించుకుని.
“మొన్న ఫ్యామిలి డే కి చీఫ్ గెస్ట్ గా వచ్చారు కదా ..గాంధి ..అతను..”
“మరి పోలిస్ కంప్లైంట్ ఇచ్చావా ..?”ఉక్రోషంగా అంది సీమా..
“సీమా …ఇట్స్ జస్ట్ యాన్ యాక్సిడెంట్ ..నా తప్పు కూడా ఉంది.అండ్ అతనే హాస్పిటల్ లో జాయిన్ చేశాడు.”
“ఏడీ ..ఎక్కడ మరి.” రెట్టించింది సీమా..
“ఏదో అర్జెంట్ వర్క్ ఉందని ఇప్పుడే ..ఆయనలా వెళ్ళారు..మీరొచ్చారు.”
సీమా కి కోపం ముక్కు పైన నాట్యం చేసింది. మొహం ఎర్రగా మారింది.
***********
“ఈ రోజు ఉదయం గండిపేట్ చెరువులో గుర్తు తెలియని వ్యక్తి శవం దొరికింది..స్థానికుల సమాచారం అందుకోగానే పోలీసులు అప్రమత్తమై ఘటనా స్థలానికి చేరుకున్నారు..నిందితుడు ఎవరన్నది….”
అంటూ న్యూస్ వస్తోంది టీవీ లో కూరగాయలు కట్ చేస్తూ సోఫాలో కూర్చుని ఉంది షీబా..సీమా అక్వేరియం లో చేపలకి దానా వేస్తోంది..కాలింగ్ బెల్ మోగటంతో చేస్తున్న పని ఆపి వెళ్లి తలుపు తెరిచింది సీమా ..ఎదురుగా గాంధి….
ఆశ్చర్యం ,కోపం రెండిటిని చెరో కన్నులో చూపిస్తున్న ఆమెని చూసి
“గౌతమ్ ని కలవాలి” అన్నాడతను.
“చచ్చాడో , బ్రతికున్నాడో చూద్దామని వచ్చారా..?” నిర్మొహమాటంగా అంది.
అతని దగ్గర జవాబు లేదు.దోషి లా నిలబడటం తప్ప అతనేం చేయలేక చూస్తుండిపోయాడు.ఇంతకీ అసలు ఈమె ఎవరు..? గౌతమ్ వైఫ్ ఏమైంది..అనుకుంటుండగా…
“ఎవరు సీమా ” అంటూ వచ్చాడు గౌతమ్ .
“హలో సార్ …మీరా..రండి రండి.”స్వాగతించాడు.
గాంధీ నర్వస్ ఫీల్ అయ్యాడు.
“రండి సార్” మళ్ళీ అన్నాడు గౌతమ్.
సీమా పక్కకు జరిగింది..గాంధీ లోపలికి వచ్చాడు.
సోఫా లో కూర్చున్నాడు గాంధి ..షీబా టీ తెచ్చింది ఇద్దరికీ.
“బావున్నారా? ” టీ కప్ అందుకుంటూ అడిగాడు .
నవ్వుతోనే బదులిచ్చింది షీబా..టీ ఇచ్చి తను వెళ్ళిపోయింది.
టీ ఒక సిప్ చేసాడు గాంధి.
“ఎలా ఉంది గౌతమ్” అడిగాడు.
“ఫైన్ సార్ ..”టీ తాగడం పూర్తైంది.కప్ టీపాయ్ మీద పెడుతూ..గౌతమ్ కాలి బోటని వేలిని చూసాడు దానికి కట్టు కట్టి ఉంది..
“బోటని వేలికి ఏం తగిలింది…”అడిగాడు గాంధి..
“నెయిల్స్ కట్ చేయలేదు సో…గోరు ఊడింది ఎదురు దెబ్బ తగిలి..”చెప్పాడు
“ఐ యామ్ రియల్లీ సారి గౌతమ్..నిన్న నేను అలా వెళ్ళకుండా ఉండాల్సింది.”
నవ్వి ఊరుకున్నాడు గౌతమ్.
“లేట్ అయితే లైబ్రరి మూసేస్తారు.ఒక బుక్ కోసం అర్జెంట్ గా వెళ్ళవలసి వచ్చింది.”
సంజాయిషీ చెప్పుకున్నాడు గాంధి.
“పర్లేదు సార్..”
“ఒక విషయం అడుగుతాను మరోలా అనుకోరు కదా.?”
తనేం అడగాలనుకుంటున్నాడో గౌతమ్ ఉహించాడు.
“అడగండి..”
“షీబా మీ వైఫ్ ..మరీ…” చివరి వాక్యం కళ్ళతో చెప్పాడతను.
“ఇఫ్ యు డోంట్ మైండ్ మనం అలా బయటకి వెళ్లి మాట్లాడుకుందామా..”అన్నాడు గౌతమ్.
అంత గొప్ప రహస్యం ఏం చెప్తాడో చూద్దాం అనుకున్నాడు గాంధి.
కే.బీ.ఆర్ పార్క్ ..వాకింగ్ చేసే వాళ్ళు వాకింగ్ చేసుకుంటున్నారు ,కబుర్లు చెప్పుకునే వాళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నారు.
“నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది మిస్టర్ గౌతమ్..నేను ఎన్నో నవలలు చదివాను,ఎన్నో జీవితాల యదార్ధ సంఘటనలని నవలగా రాసాను..బట్ ఫస్ట్ టైం ఒకరి జీవితాన్ని నవలగా విన్నాను.”
గౌతమ్ మందహాసించాడు.
“ఇదంతా మీకెందుకు చెప్పానంటే …నాకు ఒక పరిష్కారం కావాలి..”
గాంధి భ్రుకటి ముడిపడింది.
“పరిష్కారమా.?..ఏంటది..?”
***************
కారులో వస్తూ గౌతమ్ చెప్పిన తన గతం గురించి ఆలోచించ సాగాడు గాంధి.అతను ఆలోచిస్తుంది గౌతమ్ అడిగిన పరిష్కారం గురించి కాదు ..అతను చెప్పిన కథని నవల గా ఎక్కడినుంచి మొదలెట్టాలని.. చాలా రోజుల తర్వాత తన కలానికి పదును పెట్టే అవకాశం దొరికింది.
యదార్ధ సంఘటన ఆధారంగా ఇన్నాళ్ళు తను రాసిన నవలలు ఒకెత్తు ఇప్పుడు రాయబోయేది ఒకెత్తు. కానీ అదే అతను రాయబోయే ఆఖరి నవలని అతనేమాత్రం ఉహించలేదు.
*************
ఒక సంవత్సరం తర్వాత
చిమ్మ చీకట్లో హెడ్ లైట్ వెలుగు రోడ్ మీద పడుతోంది. రయ్యిమంటూ దూసుకు వెళుతోంది గాంధి కారు. అతను కంగారుగా వెనక్కి చూస్తూ,ముందుకి చూస్తూ స్టీరింగ్ తిప్పుతున్నాడు..అతని కారుని పోలిసులు వెంబడిస్తున్నారు.మరింత వేగం పెంచాడు గాంధి..అర్ధ రాత్రి కావడంతో రోడ్లన్నీ నిర్మానుషంగా ఉన్నాయి..జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి రైటుకి గాని ,లెఫ్ట్ కి గాని తిప్పి ఉంటే అతను తప్పించుకునుండే వాడేమో, అతన్ని దురదృష్టం చాలా దగ్గరగా వెంటాడుతుంది కాబోలు … కారుని సరాసరి సిగ్నల్ నుంచి స్ట్రైట్ గా పోనిచ్చాడు…అదే అతను చేసిన తప్పు.
పోలీస్ కారు కూడా సిగ్నల్ దాటింది. ఏ.సి ఆన్ లో ఉన్నప్పటికీ చెమటలు పడుతున్నాయి అతనికి.. కళ్ళలో భయం, చేతుల్లో ఒణుకు.. మాదాపూర్ సిగ్నల్ సమీపిస్తున్నాడు.ఇప్పుడతను స్ట్రైట్ గా వెళితే సేఫ్..కానీ అతను లెఫ్ట్ కి తిప్పాడు రోడ్ ని అనుసరించి రైట్ కి తిరగగానే అతనికి అర్ధం అయ్యింది ఎంత తప్పు చేసాడో.
అరవై స్పీడు లో ఉన్న కారు నెమ్మదిగా స్లో అయ్యింది. స్పీడ్ మీటరు ముళ్ళు ’60’ నుంచి నెమ్మదిగా ‘0’ వైపుకి దిగుతోంది..ఎదురుగా బ్యారి గేట్స్ అడ్డంగా పెట్టి ,తుపాకులు గురి పెట్టి, ఓ పది మంది పోలీసులు నిలుచున్నారు… గాంధి గుండె…వేగం పెరిగింది..చెమట చుక్క నుదుటి పై నుంచి జారుతోంది.
********
ఇంటరాగేషన్ రూమ్ ..గాంధి కూర్చుని ఉన్నాడు.ఒకతను అతనికి ఎదురుగా వచ్చి నిలుచున్నాడు.నడుం వరకే కనిపిస్తోంది .గాంధి తలెత్తి చూసాడు. ప్రశాంతమైన ముఖం ,తెల్లటి రంగు ,గుండ్రని కళ్ళు ఉంగరాల జుట్టు.అతనే సి.ఐ
రుద్రాక్ష్.
“రుద్రాక్ష్ ..సి.ఐ రుద్రాక్ష్ ..” అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. గాంధీకి
గాంధి కూడా చెయ్యి అందించాడు.
“యూ..నో మిస్టర్ గాంధి! ఐ యామ్ వెరి బిగ్ ఫ్యాన్ ఆఫ్ యు.”
కూర్చుంటూ చెప్పాడతను..గాంధీకి ఆ సంగతి ప్రస్తుతం..అప్రస్తుతం.
“కమింగ్ టు ద పాయింట్…గౌతమ్ మీకు ఎలా పరిచయం.”
మొదటి ప్రశ్నగా అడిగాడు.
“ఒకసారి వాళ్ళ ఆఫీస్ లో ఫ్యామిలీ డే కి చీఫ్ గెస్ట్ గా పిలిచారు అదే మొదటి సారి అతన్ని కలవడం.ఆ రోజు అతని వైఫ్ షీబా కూడా ఉంది.
“షీబా అతని వైఫ్ అని గౌతమ్ మీతో చెప్పాడా?”
రెండో ప్రశ్న సంధించాడు.
“ఆ రోజు అక్కడ ఉన్న వాళ్ళందరికీ అతను అలాగే పరిచయం చేసాడు ఇంక్లుడింగ్ మీ.”
తలూపాడు రుద్రాక్ష్ సరే అన్నట్టు.
“మీకు సీమా తెలుసా..?”
“తెలుసు”
“ఎలా”
“తను స్వాతికి పంపిన ఒక పోయాం చదివి ..ఆమెకి పెన్ గిఫ్ట్ పంపాను.
తర్వాత గౌతమ్ ఇంట్లో చూసాను.”
“ఇంకెప్పుడు కలవలేదా..?”
“రెండు ,మూడు సార్లు కలిసాను.”
“రెండా..ముడా..?” స్వరం మారింది రుద్రాక్ష్ ది.గాంధి మౌనం వహించాడు..
“ఓకే..లీవ్ ఇట్..చివరి సారిగా ఎప్పుడు కలిసారు?”
“ఈ నెల పదిహేను తారీఖు శుక్రవారం.”తడబడకుండా చెప్పాడు గాంధి.
“కలిసి ఏం మాట్లాడారు..? ”
“క్యాజువల్ టాక్…” అతని గొంతు ఒణికింది.
“క్యా..జు..వ…ల్…టాక్….మ్ ..మిమ్మల్ని పెళ్ళి చేసుకోమని ఎప్పుడైనా అడిగారా ఆమెని.”
గుటక వేసాడు గాంధి సూటిగా వచ్చిన ఆ ప్రశ్నకి..గుడ్లప్పగించి చూస్తున్న గాంధీతో..
“మిస్టర్ గాంధి ఐ యామ్ ఆస్కింగ్ యు…” రెట్టించాడు.
“అడిగాను ..”తల వంచుకుని బదులిచ్చాడు.
“దానికి ఆమె ఏమంది..ఒప్పుకుందా?..”వంచి ఉన్న తలని అడ్డంగా ఊపాడు..లేదన్నట్టు.
“సో…మీ ప్రపోసల్ ని ఒప్పుకోలేదనే కారణంతో ప్లాన్ చేసి గౌతమ్ సూసైడ్ చేసుకునేలా చేసారు అవునా..?”
“నో……” బిగ్గరగా అరిచాడు గాంధి. కొన్ని సెకన్లు ఆ ధ్వని గది అంతా ప్రతిధ్వనించింది.
“యస్..మిస్టర్ గాంధి..కేవలం మిమ్మల్ని రిజెక్ట్ చేయడానికి ఆమెకి, మీకు ఉన్న కామన్ పాయింట్ గౌతమ్.”
గాంధి కళ్ళలో నీళ్ళు తిరిగాయి..అతను ఏడవసాగాడు..తమాయించుకుని,
“అతను చెప్పిన తన గతాన్ని ఆధారంగా చేసుకుని నవల రాసాను అంతే. అంతకు మించి నేను చేసింది ఏమీ లేదు..!”
“ఒప్పుకుంటాను మిస్టర్ గాంధి! బట్ ..అతను మీకు గతం మాత్రమే చెప్పాడు…భవిష్యత్తు చెప్పలేదు..అఫ్కోర్స్ చెప్పలేడు …బికాజ్ అతని భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది కాబట్టి.”
అర్ధం కానట్టు చూసాడు గాంధి.
“వాట్ ఐ మీన్ ఈజ్ …మీ నవల లో క్లైమాక్స్ యే అతని భవిష్యత్తు అంటున్నా..యు గాట్ మై పాయింట్ రైట్..”రుద్రాక్ష్ చెప్పింది అక్షరాల నిజం..ప్రేత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా గౌతమ్ చావుకి అతనే కారణం..అతనిలో ఆ బాధ కూడా ఉంది.
“సార్..నేను ఒక కమర్షియల్ యాస్పెక్ట్ లో ఆ క్లైమాక్స్ రాసాను..నిజంగా గౌతమ్ కి కీడు తలపెట్టే ఉద్దేశం నాకు ఏ మాత్రం లేదు..నన్ను నమ్మండి..”దీనంగా అన్నాడు అతను.
రుద్రాక్ష్ కాసేపు మౌనం వహించాడు.
“వెల్ …నాకు ఆ పుస్తకం ఎక్కడ ఉందో చెప్పండి. ఒకసారి చదివి అప్పుడు ఒక నిర్ణయానికి వస్తాను.”
“ఆ పుస్తకం ఇప్పుడు నా దగ్గర లేదు ఎక్కడో పోయింది.”నిరాశగా చెప్పాడు గాంధి.
“జస్ట్ షట్ అప్ …” కుర్చీ వెనక్కి తన్నాడు రుద్రాక్ష్ లేచి.
గాంధి లో కాస్త బెదురు పుట్టింది..రుద్రాక్ష్ శాంతించి..
“ఎనీ వే మిస్టర్ గాంధి..ఆ పుస్తకం దొరికితే నేను ఏమైనా హెల్ప్ చేయగలను.అదర్ వైస్ సారి…”అని వెళ్ళిపోయాడు రుద్రాక్ష్…అతని బూట్ల చప్పుడు తప్ప ఏమీ వినిపించలేదు. ఆ గదిలో గౌతమ్ ఫోటో కి దండ వేసి ఉంది. సీమా సోఫా లో కూర్చుని ఉంది. షీబా డైనింగ్ టేబెల్ మీద తలవాల్చి కూర్చుని ఉంది.ఇద్దరి కళ్ళలో కన్నీళ్లు కాని కారాణాలు వేరు.
కాలింగ్ బెల్ మోగింది.సీమా కదలలేదు.కాలింగ్ బెల్ మోగుతోంది షీబా కళ్ళు తుడుచుకుని సీమా వైపు కోపంగా చూస్తూ లేచి వెళ్లి తలుపు తీసింది. ఆమె కంగారు పడుతూ..”ఎవ..రు కావా..లి” అంది. గుమ్మం బయట ఉన్న రుద్రాక్ష్ ని చూసి…కారణం… అతను యూనిఫాం లో రాలేదు.
“లోపాలికి రావొచ్చా” అన్నాడతను..ఆమె అడిగిన దానికి సమాధానం చెప్పకుండా.
తప్పుకుని దారి ఇచ్చింది షీబా…ఇల్లంతా చూసాడు..సోఫాలో ఉన్న సీమా రుద్రాక్ష్ ని చూసి లేచింది.
“ఐ యామ్ సీ.ఐ రుద్రాక్ష్ ..గౌతమ్ కేస్ డీల్ చేస్తుంది నేనే .”చెప్పాడు.
“కూర్చోండి” అంది సీమా.
కుర్చున్నడతను.
“మీరూ కూర్చోండి” అన్నాడు ఇద్దర్ని ఉద్దేశించి. ఇద్దరూ కూర్చున్నారు.
“యాక్చువల్లి ఇలా రాకూడదు..బట్ యాజ్ యే ఆఫీసర్ గా కాకుండా ఒక వెల్ విషర్ గా వచ్చాను.”
ఇద్దరికీ అతను చెప్పింది అర్ధం కాలేదు. వాళ్ళిద్దరి ప్రస్నార్ధకమైన భావాలు గమనించి
“ఐ మీన్ …గౌతమ్ కి కాదు..గాంధీ కి..”అసలు సంగతి చెప్పాడు.
“గాంధీ రాసిన పుస్తకం గురించి మీకేమైనా తెలుసా.”అడిగాడు.
ఇద్దరూ అడ్డంగా తలూపారు తెలీదన్నట్లు.
“మరి ఆ పుస్తకమే గౌతమ్ చావుకి కారణమని ఎలా కేస్ వేసారు.?” ప్రశ్నించాడు.
“ఆ పుస్తకం చదివిన రోజు రాత్రే గౌతమ్ సూసైడ్ చేసుకున్నాడు.”దుఃఖం నిండిన గొంతుతో చెప్పింది సీమా.
“అతను పుస్తకం చదివిన సంగతి మీకెలా తెలుసు.”? ప్రశ్న..?
“తనే చెప్పాడు.”బదులిచ్చింది సీమా.
షీబా ఏమీ తెలియనట్టు కూర్చుంది. ఆమె వైపు చూసాడు రుద్రాక్ష్.
“నాకేం తెలీదండి…నేను ఈ ఇంట్లో, గౌతమ్ జీవితంలో ఉన్నానంటే ఉన్నానంతే..”అంది షీబా.
సీమా దుఃఖం నిండిన కళ్ళతో చూసింది తనని.
“నాతో తను కేవలం మంచి,చెడు మాత్రమే షేర్ చేసుకునే వాడు. ఫీలింగ్స్ ,ఎమోషన్స్ ఏమైనా తనతోనే.” చెప్పింది సీమాని ఉద్దేశించి..ఆ మాటలకి లోలోపల బాధ పడిందే గాని తిరిగి ఏమీ అనలేదు సీమా.
తదుపరి ప్రశ్నలు ఎవర్ని అడగాలో రుద్రాక్ష్ కి అర్ధం అయ్యింది.
“గౌతమ్ మీతో ఏం చెప్పాడు..” ? సీమాని చూస్తూ అడిగాడు..
సీమా జరిగిందంతా చెప్పింది రుద్రాక్ష్ కి. చెప్పడం ముగిసాక ..అతను ఇంకా ఏదో అడగడానికి సిద్ధమైయ్యాడు.
“ఇంతకీ ఆ పుస్తకం ఎక్కడ ఉందో గౌతమ్ మీకేమైనా చెప్పాడా..?”
“లేదు” అంది సీమా .
తను చదివాకే పుస్తకం మాయమైంది. ఇది క్లియర్…కాబట్టి ఇప్పుడు ఆ పుస్తకం గురించి తెలిసింది ఇద్దరే ఇద్దరు. ఒకరు గౌతమ్.ఇంకొకరు గాంధి.
అడగడానికి గౌతమ్ లేడు,చెప్పడానికి గాంధి దగ్గర సమాధానం లేదు.
ఏం చేయాలో ప్రస్తుతానికి రుద్రాక్ష్ కి కూడా అర్ధం కావట్లేదు.
“ఏదైనా అవసరం ఉంటే కబురు చేస్తాను..ప్లీజ్ కో.ఆపరేట్ విత్ అజ్ “అని కదిలాడు.
సరే అన్నట్టు తలూపారు ఇద్దరూ.
రుద్రాక్ష్ వెళ్ళిపోయాక సీమా కి అనుమానం వచ్చింది అసలింతకి ఆ పుస్తకం ఏమైందని..? ఎవరికీ తెలియని విషయం ఏంటంటే ఆ పుస్తకం గురించి తెలిసిన మరో వ్యక్తి ఉన్నాడని.

************************************

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

November 2020
M T W T F S S
« Oct   Dec »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30