April 25, 2024

భవ( బాల) సాగరాలు

రచన: గిరిజారాణి కలవల

” సుధీర్! బబ్లూ ఇంకా ఇంటికి రాలేదు! స్కూల్ వదిలి చాలా సేపయింది. వచ్చి ఫ్రెష్ అయి ఐఐటి కోచింగ్ క్లాస్ కి వెళ్ళాలి. టైమయిపోతోంది” అంటూ నీలిమ కంగారుగా భర్త కి ఫోన్ చేసింది.
ఆఫీసులో తలమునకలయే పనిలో కూరుకునిపోయి ఉన్న సుధీర్ కి, నీలిమ దగ్గర నుంచి వచ్చిన ఫోన్ కాల్ తో చిర్రెత్తిపోయాడు. అసలే , తను చేసిన ఫైల్ లో తప్పులు తడకలు ఉన్నాయని, సాయంత్రం ఎంత లేటయినా సరే పూర్తి చేసి తీరాలని,
ఇందాక బాస్ దగ్గర అక్షింతలు పడ్డాయేమో.. అది పూర్తి చేస్తూ కిందామీదా పడుతోంటే ఈ ఫోన్ ఒకటీ.. బాస్ మీద చూపించలేని కోపం నీలిమ మీద చూపించి ” కొంపలో ఖాళీగా ఉండి నువ్వేం చేస్తున్నావు? పిల్లాడి సంగతి చూడడానికి ఇప్పుడు నేను ఆఫీసు నుంచి పరుగెత్తుకురావాలా? ఎక్కడకి పోతాడు? వాడే వస్తాడులే.. టైమయిపోయిందేమో అని అటునుంచి అటే ఐఐటి క్లాస్ కి వెళ్ళుంటాడు. కనుక్కో… నాకు ఫోన్ చెయ్యకు. ఇక్కడ పనితో చాలా టెన్షన్ గా ఉన్నాను ” అంటూ ఫోన్ పెట్టేసి.. అనవసరంగా మూడునిముషాలు మాట్లాడాను.. ఛీఛీ టైమ్ వేస్ట్.. అనుకుంటూ ఫైల్ లో తలదూర్చాడు.

రాబోయే ప్రమోషన్ కోసం చాలా ఒత్తిడి పడుతున్నాడు సుధీర్. బాస్ ని ప్రసన్నం చేసుకోవడానికి కిందామీదా పడుతున్నాడు. ‘తానే మాత్రం నిర్లక్ష్యం చేసినా.. ఆ ప్రమోషన్ ని ఎగరేసుకుపోవడానికి గద్దల్లా కాచుకుని కూర్చున్నారు తన తోటి కొలిగ్స్. ఇంత టెన్షన్ పడేదీ.. ఇంట్లో భార్యా కొడుకు కోసమే కదా! ఇప్పుడున్న కారు మార్చేసి మరో కొత్త బ్రాండ్ కారు కొనాలి.తన కొలీగ్ వాసు వాళ్ళ మామగారు.. కొత్తగా వేసిన వెంచర్ లో డ్యూప్లెక్స్ ఇళ్లు బావున్నాయట.. ఒకటి తీసుకోమంటున్నాడు.. ఇప్పటికే సిటీలో రెండు, సొంత ఊళ్లో ఒకటి, మామగారి ఊళ్లో రెండు స్ధలాలు ఉన్నా.. ఇప్పుడు ఈ డ్యూప్లెక్స్ తీసుకోవాలనే నీలిమ కోరిక తీర్చాలి. ఈ ఏడాదైనా పారిస్ టూర్ పెట్టుకోవాలి.. ఇన్ని టెన్షన్లు, ఒత్తిడి ల మధ్య ఇక్కడ తనింత కష్టపడుతూంటే ఆమాత్రం కూడా అర్ధం చేసుకోదు నీలిమ. ఎప్పుడూ ఏదో ఒక నస. ఒక్క పిల్లాడు, వాడిని చదివించడానికీ, ఇంట్లో పనులకీ కూడా సతమతమయిపోతుంది. బబ్లూ ని ఎలాగైనా ఐఐటి టాప్ రేంకర్ చేయాలన్నదే తన అభిమతం. తన ఉద్యోగ ఒత్తిడి తో తను చూసుకుందుకి కుదరడం లేదని ఆ బాధ్యతను నీలిమ మీద పెడితే… ఇంట్లో కూర్చుని చేయలేకపోతోంది. వాడు టైము కి ఇంటికి రాకపోతే.. తను వెళ్లి చూసుకోవాలి కానీ పని మధ్యలో తనని రమ్మంటే ఎలా వస్తాడనుకుంది ‘ … అనుకున్నాడు సుధీర్.

* *. *

ఐఐటి కోచింగ్ సెంటర్ కి ఫోన్ చేసింది నీలిమ, ఒకవేళ స్కూల్ నుంచి తిన్నగా బబ్లూ అటే వెళ్లి పోయుంటాడేమో అని. రాలేదని చెప్పగానే గుండె గుభేలు మంది. స్కూల్ ఐదింటికే వదిలేస్తారు.. రాత్రి ఎనిమిది అవుతోంది.. ఇంతవరకూ బబ్లూ ఎక్కడకి వెళ్ళిందీ తెలియడం లేదు. ఈ రోజు డ్రైవర్ కి జ్వరం వచ్చిందని డ్యూటీ కి రాలేదు. తనే దింపవచ్చు కానీ, బ్యూటీ పార్లర్ కి వెళ్ళాలి అందుకని ఉదయం ఆటోలో పంపింది నీలిమ.
వాడి ఫ్రెండ్ సూరజ్ ఇంటికి ఫోన్ చేస్తే, ‘బబ్లూ ఈరోజు స్కూల్ కే రాలేదు కదాంటీ! ‘ అనేసరికి గాభరా ఇంకా ఎక్కువ అయింది నీలిమకి. సుధీర్ కి ఫోన్ చేస్తేంటే.. స్విచ్చ్ ఆఫ్ అని వస్తోంది.
అసలే ఈరోజు సుమిత్ర వాళ్ళింట్లో కిట్టీ పార్టీ కి అటెండ్ అవాలి. దానికోసమే ప్రత్యేకంగా కెంపుల సెట్ కొనుక్కుంది నీలిమ.
ఈరోజు డిన్నర్ కూడా అక్కడే.. సుమిత్ర సింగపూర్ నుంచి డిన్నర్ సెట్ తెచ్చిందట. అది చూపించినట్టుటుందని కిట్టీ పార్టీ మెంబర్స్ కి డిన్నర్ కూడా తనింట్లోనే అరేంజ్ చేసింది. పార్టీ మొదలయిపోయిందట. తనింకా రాలేదమని నీలిమకి ఫ్రెండ్స్ ఒకటే ఫోన్లు చేస్తున్నారు. ఈ ఒత్తిడి తట్టుకోలేకపోతోంటే ఈ బబ్లూ టెన్షన్ ఒకటి. ఆ ఐఐటి కోచింగ్ సెంటర్ లో ముందుగానే మూడు లక్షల ఫీజు కట్టేసాము. ఇప్పుడు వీడు స్కూల్ కి కూడా అటెండ్ అవకుండా ఎక్కడ పెత్తనాలు చేస్తున్నాడో ? ఈ సుధీర్ ఒకడు.. ఇంటి బాధ్యతలు ఏవీ పట్టించుకోకుండా తన నెత్తిన వేసాడు. షాపింగులూ, ఛాటింగులూ, లేడీస్ క్లబ్బులు ఇలా బోలెడు టెన్షన్ లలో తానుంటే.. బబ్లూ చదువుల గురించి తానెక్కడ పట్టించుకోగలదు. అప్పటికీ వంటపనికీ, ఇంటిపనికీ నౌకర్లు ఉన్నాకూడా.. తనకి టైం సరిపోవడంలేదు. ఫ్రెండ్స్ తో కిట్టీ పార్టీలు, పిక్నిక్ లు వీటితో ఒత్తిడి ఎక్కువగా ఉంటోంది. తప్పించుకోవడానికి ఎంత నామర్దా అవుతుందో సుధీర్ కి అర్ధం కావడం లేదు. ఇంతకీ బబ్లూ ఎక్కడకి వెళ్ళినట్టో.. సుధీర్ లేకుండా తానెక్కడ వెతకగలదు.. . ఇప్పటికే లేట్ అయిపోయింది అనుకుంటూ టెన్షన్ పడుతోంది నీలిమ.

* *. *

బంగినపల్లి మామిడి పండు ముక్కలు, సున్నుండలు, జంతికలు ప్లేటు నిండా తీసుకువచ్చింది జానకమ్మ. మండువాలో ఉయ్యాల బల్ల మీద రామారావు వళ్ళో పడుకుని కబుర్లు చెపుతూ ఉయ్యాల ఊగుతున్నాడు బబ్లూ.

” అమ్మానాన్న లకి చెప్పకుండా ఇలా రావడం తప్పుకదా బబ్లూ! పాపం వాళ్లు ఎంత కంగారు పడుతూంటారో? ఏవండీ, సుధీర్ కి ఫోన్ చేసి, బబ్లూ ఇక్కడ క్షేమంగా ఉన్నాడని, కంగారు పడొద్దని చెప్పండి”. మనవడి నోట్లో మామిడిపండు ముక్క పెడుతూ అంది జానకమ్మ.
” ఔను, బబ్లూ!ఇంతకీ ఇక్కడకి ఎలా రాగలిగావు? బస్సు ఎక్కడం ఎలా తెలిసింది? డబ్బులు ఎక్కడవి? అసలు ఎందుకు వచ్చావు? ” అంటూ రామారావు ప్రశ్నల మీద ప్రశ్నలు వేసారు.
” అబ్బ, ఉండండి, తాతయ్యా ! ముందు జంతికలు తినాలా? సున్నుండలు తినాలా ? అని టెన్షన్ పడుతోంటే, మధ్యలో మీ ప్రశ్నలేంటీ? తిన్నాక చెపుతాను లెండి ” అన్నాడు బబ్లూ తాపీగా.
” నిండా పదేళ్లు లేవు, భడవా! నీకు టెన్షన్ ఏంటీ? పైగా తినడానికి కూడా టెన్షనా? ” అన్నాడు రామారావు.
” భలేవారే తాతయ్యా! నాకసలు ఎన్ని టెన్షన్లు ఉన్నాయో మీకేం తెలుసూ? చాలా బోలెడు ఉన్నాయి. అమ్మానాన్నల కంటే నాకే ఎక్కువ ఉన్నాయి” అన్నాడు.
” ఔనా! ఏదీ ఒక్క టెన్షన్ చెప్పు చూద్దాం ” అన్నాడు రామారావు..
సున్నుండని ప్రీతిగా కొరుకుతూ, ” ఒక్కటంటే ఒక్కటే చెపుతాను మరి. ఎంత చలిగా ఉన్నా, ఎంత వానగా ఉన్నా కూడా ప్రతిరోజూ పొద్దున్నే లేపి, డ్రైవర్ తో బాడ్మింటన్ కోచింగ్ పంపుతారు. అదో పెద్ద టెన్షన్ నాకు. నాకు ఇష్టం లేని ఇలాంటి టెన్షన్లు ఇంకా బోలెడు ఉన్నాయి తాతయ్యా! ” అన్నాడు.
ఆ మాటతో రామారావు కి ఏదో అర్ధం అయీ, అవనట్టు తోచింది.
ఇంక వాడినేం ఒత్తిడి చేయకుండా, కొడుకు సుధీర్ కి ఫోన్ చేసి బబ్లూ ఇక్కడకి వచ్చినట్టుగా చెప్పకుండా, ముందుగా కుశల ప్రశ్నలు వేసి, తర్వాత ,” ఏదీ, బబ్లూ కి ఇయ్యి ఫోను, చాలా రోజులైంది వాడితో మాట్లాడి.” అన్నాడు.
” వాడు ఉదయం స్కూల్కి వెడుతున్నానని చెప్పి, వెళ్లి ఇంతవరకూ ఇంటికి రాలేదుు నాన్నా! నేనూ ఇప్పుడే ఆఫీసు నుంచి వచ్చాను. వాడు కనపడడం లేదని నీలిమ టెన్షన్ పడుతోంది.. కాసేపు చూసి పోలీస్ రిపోర్టు ఇద్దామనుకుంటున్నాము. మీరు కంగారు పడకండి ” అనేసరికి,
” నేనేం కంగారు పడడం లేదు. మీరూ కంగారు పడకండి.. వాడు ఇక్కడ మా దగ్గర క్షేమంగా ఉన్నాడు. వాడి వయసుని మించిన భారమూ, ఒత్తిడీ వాడి మీద వేసారు. వాడు అవి మోయలేకపోతున్నాడు. అందుకే మీకు చెప్పదలచుకున్నది ఏమిటంటే.. ఇకనుంచీ వాడు ఇక్కడ నా దగ్గర ఉంటాడు.ఈ ఊళ్లో వాడికి ఏం చదవాలని ఉందో, ఎంత వరకు చదవాలని ఉందో అవి చదివిస్తాను. ఏ మాత్రం ఒత్తిడి లేని జీవితం వాడు అనుభవించేలా నేను పెంచుతాను. ఈ విషయమై ఇక నువ్వు, నీలిమ ఎదురు మాట్లాడడానికి వీల్లేదు. కొన్ని రోజులు వాడిని చూడడానికి కూడా రాకండి. మీమీ ఒత్తిడిలంటారాా! వాటిిని మీరు కల్పించుకున్నవేే.. కాబట్టి వదిలించుకోవడానికి పెద్ద శ్రమ పడక్కర్లేదు. ఇక మీ జీవితం , మీ ఇష్టం. ” నిక్కచ్చి గా చెప్పి ఫోన్ పెట్టేసాడు రామారావు.
ఆ మాటలు విన్న బబ్లూ ఆనందంతో ఎగిరి గంతేసి, బామ్మ, తాతలని గట్టిగా కావలించుకుని,
” ప్లీజ్.. తాతయ్యా, బామ్మా! నన్ను అక్కడకి పంపకండి. ఇక్కడే సుబ్బుతో కలిసి స్కూల్ కి వెడతాను. బాగా చదువుకుంటాను “. అన్నాడు.
ఇందాక వాడు చెప్పిన ఒక్క మాటలోనే, బోలెడు బాల భవసాగరాలు కనిపించాయి రామారావుకి. ‘సుధీర్, నీలిమలు లేనిపోని అనవసరమైన ఒత్తిడి సాగరాలు సృష్టించుకుని.. ఎదురీదడానికి ఒత్తిడి పడుతూ… బబ్లూ చిన్ని జీవితాన్ని కూడా ఒత్తిడి కి లోను చేస్తున్నారు. పాపం.. ఆ చిట్టి మెదడు ఎన్నని తట్టుకోగలదు? చెపితే పంపరని.. చెప్పకుండా వచ్చేసాడు. వాడి మనసులో ఉన్న బాధ తమ దగ్గర వెళ్ళబుచ్చాడు. ఈ చిన్ని బొమ్మకి సరైన ఆకృతి తీర్చిదిద్దాల్సిన బాధ్యత తన మీద వేసుకుంటాను.. వాడు కోరుకున్న జీవితం.. ఒత్తిడి లేని జీవితం వాడికి అందిస్తాను. ‘ అనుకుంటూ ఒక ధృఢ నిశ్చయానికి వచ్చాడు.
అంతావిని ” టెన్షన్ అంటే ఏంటండీ?” అంది జానకమ్మ.
” ఇప్పటివరకూ మనకి లేనిదీ.. ఇకముందు కూడా మనకి రానిదీ.. అదే జానకీ.. ఇప్పుడు తెలుసుకుందామని టెన్షన్ పడకు.. ముందు బబ్లూ కి ఏం తినాలనుందో అడిగి అన్నీ చేసిపెట్టు” నవ్వుతూ అన్నాడు రామారావు.

*******

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *