April 18, 2024

రాజీపడిన బంధం – 8

రచన: ఉమాభారతి

“చెప్పానుగా, సందీప్ ని చూసుకోడానికే నాకు సమయం చాలదు. వారానికో మారు ఇక్కడ స్థానిక పశు సంరక్షణ సంస్థ పని కూడా చూస్తాను. మొత్తానికి అలిసిపోయాను. అదీగాక, మా ఆయనతో నాకు పెద్దగా సఖ్యత కూడా లేదులే. నేనిప్పుడున్న పరిస్థితిలో మరో బిడ్డ అంటే, నాకు ఆసక్తిగా లేదు. అంతకంటే విషయమేమీ లేదు” అన్నాను.
చిత్రకి సమాధానం సంతృప్తికరంగానే ఇచ్చాననిపించింది.
“బిడ్డని వద్దనుకున్నంత మాత్రాన నీ చింతలు, బాధ్యతలు పోవు. పైగా ఆ బిడ్డే నీ జీవితంలోకి మార్పు తెస్తుందేమో! ఆలోచించుకో. అయినా మీ సంపద, పరపతి అనుభవించడానికి కడుపున పుట్టిన పిల్లలుంటే మంచిదేగా! చక్కగా పెంచి, వారిని వృద్ధిలోకి తెచ్చి, వారి సుఖసంతోషాలని పంచుకో…సరేనా?”, “నీకెప్పుడు ఏది కావాలన్నా, మాట్లాడాలన్నా ఫోన్ చేయి. వచ్చి వాలిపోతాను, నీవు బాగోవడమే ముఖ్యం. ఇక పడుకో” అని ఫోన్ పెట్టేసింది చిత్ర.
చిన్నప్పటి నుండి చిత్ర అంతే. ఎదుటివారు సంతోషంగా ఉన్నారా లేదా అని కనిపెట్టగలిగేది. సహాయం చేయాలని చూసేది. అందుకే డాక్టర్ అవ్వాలని అనుకొనేది.
రోడ్డు ప్రమాదంలో తల్లితండ్రులని పోగొట్టుకున్న చిత్ర, పదేళ్లప్పుడే కేరళ నుండి మేనమామ దగ్గరికి వచ్చేసింది. బాగా ఆస్థిపరురాలని చెప్పుకునేవారు చిత్ర గురించి. మా ఇంటికి నాలుగిళ్ళవతల పెద్ద భవంతిలో వాళ్ళ మేనమామ దగ్గర పెరిగింది. మంచి మనస్సు, మంచి ఆలోచన ఉన్న అమ్మాయి. నాకు పదో యేట పరిచయమైన చిత్ర, స్నేహమంటే ప్రాణం పెట్టే శ్రేయోభిలాషి.
ఆకస్మాత్తుగా, ఇన్నాళ్ల తరువాత నీలినీడలు కమ్ముకున్న నా జీవితంలోకి నా ప్రాణస్నేహితురాలు అడుగు పెట్టాలని చూస్తుంది. నాకు చేయూత నిస్తానంటుంది. సంతోషపడాలా?…లేక బయటపడాలా?…
కడుపున మోస్తున్న బిడ్డని వదిలించుకోవాలని నాకూ లేదు. నా పరిస్థితి అటువంటిది. గర్భం ఉంచుకోవాలా లేదా అన్న విషయంలో ఒకటి రెండురోజుల్లో నిర్ణయం తీసుకోవాలి. మరి కొత్తగా ఇప్పుడు చిత్ర చెప్పింది కూడా ఆలోచిస్తూ నిద్రలోకి జారాను.

**

మా ఆహ్వానం పై.. చిత్ర, ఆనంద్ ప్రతి ఆదివారం ఇంటికి వస్తున్నారు. అత్తయ్య, మామయ్యలకి వారి పట్ల ఇష్టం ఏర్పడ్డంతో, వాళ్ళని ఆప్తుల్లా భావించడం మొదలుపెట్టారు. ఇక శ్యాంది కలివిడిగా ఉండే నైజం అవడంతో, కలిసినప్పుడల్లా ఆనంద్ తో సరదాగానే ఉంటున్నారు. ఇద్దరికీ కుదిరితే ఎప్పుడన్నా టెన్నిస్ ఆడుతున్నారు కూడా. చిత్ర రాకతో జీవితంలో ఓ స్నేహం, ఆప్యాయత, ఓ ఆలంబన దొరికినట్టయింది. ఇక సందీప్ సంతోషానికి అంతే లేదు. ఆదివారం అంటే ‘అంటీ, అంకుల్’ తో ఆనందాల రోజు వాడికి.
హాస్పిటల్ కి దగ్గరగా ఉన్న కొత్త కాంప్లెక్స్ లో, ఫ్లాట్ కొన్నారు చిత్ర వాళ్ళు. వారి గృహప్రవేశం మా అత్తయ్య, మామయ్యల ఆధ్వర్యంలోనే జరగాలన్నారు.

**

గృహప్రవేశం పూజకి మేమంతా కాస్త ముందుగానే చిత్ర వాళ్ళ కొత్తింటికి చేరాము. హాస్పిటల్ నుండి వాళ్ళతో పనిచేసే వారి కుటుంబాలు కొందరొచ్చారు. ప్రయాణం చేయలేక చిత్ర మామయ్య, కుదరక లండన్ నుండి ఆనంద్ వాళ్ళ అన్నయ్య రాలేకపోయారట.
శ్యాం మాతోపాటే వచ్చినా …పూజకి మాత్రం ఉండి, ప్రసాదం తీసుకుని పనుందంటూ వెళ్ళిపోయ్యారు. ఆ వెనుకే భోజనాలయ్యాక మిగతా అతిధులతో పాటు అత్తయ్యావాళ్ళు కూడా ఇంటికి బయలుదేరిపోయారు.
ఇంకా నిర్మాణం పూర్తి కాని క్లబ్-హౌజ్, ఎదురుగా ప్రత్యేకంగా పిల్లల కోసమే నిర్మిస్తున్న క్రీడా రంగం, పార్క్ అట…చూపించడానికి సందీప్ ని తీసుకెళ్ళారు ఆనంద్.
“కిచెన్ క్లీన్ చేద్దామా?” అని పైకి లేవబోయాను.
“నీవేమి చేయద్దు. వచ్చి కాసేపు కూర్చో” అని చేయి పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టేసింది చిత్ర.
‘సంతోషం…తల్లీ.. నీవు బిడ్డని వద్దనుకోవడం లేదని నాకు అర్ధమయింది. పోతే మీ ఆయనకి, నీకు మధ్యన పొంతన లేకపోవడం సంగతి మాత్రం నువ్వు చెప్పు” అంటూ నా పక్కనే కూర్చుని నా చేయిపై తట్టింది… సులువుగా ఏ విషయమూ వదలని చిత్ర.
ఇబ్బందిగా అనిపించి తలెత్తి తన వైపు చూసాను…
“మొన్న నీవలా అన్నాక, ఈవేళ మిమ్మల్ని గమనించాను. మీ మధ్య స్నేహభావం గాని, సంభాషణ గాని లేదని అనిపించింది. విషయమేమిటో చెప్పు నీల. నేను నీ స్నేహితురాలిని మాత్రమే కాదు…ఒక డాక్టర్ని కూడా. అందునా సైకియాట్రిస్టుని. నీకు సాయం చేయగలను” అని భజం పై చేయి వేసింది..
నేను ఫక్కున నవ్వేసాను. “ ఏమి లేదులేవే తల్లీ. శ్యాం ఒత్తి మొరటు మనిషి. స్నేహం, సఖ్యత తెలియవు. నాతోనే కాదు. మా పెంపుడు కుక్కలతో, సందీప్ తో, అందరితో అలాగే ఉంటాడు. అందుకే నాకు శ్యాంతో గొడవ. సరేనా?” అని తేల్చేస్తూ మంచినీళ్ళ కోసం లేచాను.
“ఓహో, మన కాలేజీ రోజుల్లో ‘మొరటోడు’ సినిమాలో లాగానా?” అని చిత్ర అనగానే, ఇద్దరం నవ్వుకున్నాము.
అంతలో ఆనంద్, సందీప్ వచ్చేసారు. నేను లేకుండా, బాబుని అలా మరొకరి వెంట పంపించడం కూడా మొదటి సారే. నా బిడ్డ బధ్రత విషయంలో, నన్ను మినహాయించి..వేరొకర్ని నమ్మగలిగి నందుకు హాయిగా అనిపించింది.
మరికాసేపటికి, సాయంత్రం ఆరయ్యాక… సందీప్ కి పార్లర్ లో ఐస్క్రీం తినిపించి మమ్మల్ని మా ఇంటి వద్ద వదిలారు చిత్ర, ఆనంద్.
**
ఈ సారి ప్రెగ్నెన్సీకి కూడా కష్టం లేకుండా అత్తయ్య నన్ను శ్రద్ధగా చూసుకుంటున్నారు. నాకు ఐదో నెల వచ్చింది. వేవిళ్ళు కూడా తగ్గాయి.
చిత్ర వాళ్ళు ఢిల్లీ వచ్చి మూడు నెల్లయ్యింది. చిత్ర, ఆనంద్ మా కుటుంబానికి సన్నిహితులయ్యారు. వాళ్ళంతట వాళ్ళు వచ్చేస్తారని తెలిసినా …ఆదివారాలు పొద్దున్నే చిత్ర, ఆనంద్ లని ఫోన్ చేసి లంచ్ కి ఆహ్వానిస్తారు శ్యాం… సందీప్ కైతే సొంత తండ్రితో కూడా లేని స్నేహం, సాన్నిహిత్యం ఆనంద్ అంకుల్ తో కుదిరింది.

**

ఎందుకో మరి, ఈరోజు జిమ్ నుండి రాగానే, మరింత పెందరాలే లంచ్ కి వచ్చేయమని ఆనంద్ కి ఫోన్ చేసారు శ్యాం….ఎప్పటిలా ఆదివారం మెన్యూ పురమాయించకుండా, తానే మార్కెట్ నుండి కావలసిన కూరలు తెచ్చి, దగ్గరుండి అత్తయ్య చేత వండించారు కూడా. చాలా ఆనందంగా కనిపించారు. ఏదో విశేషం ఉంటుందనుకున్నాను…. చిత్ర వాళ్ళ కోసం ఎదురు చూస్తూ, మధ్య హాల్లో సందీప్ తో కాసేపు టీవీ లో కార్టూన్స్ చూడసాగారు…
చిత్ర, ఆనంద్ లు వచ్చాక, తానే దగ్గరుండి వంటకాలు చేయించానని చెబుతూ, స్వయంగా వారికి స్నాక్స్ అందించారు శ్యాం… భోంచేసేప్పుడు కూడా ఎక్కువ సమయం అందరికీ వడ్డించడంలోనే గడిపారు…
ఇక ఆ తరువాత, “ఆమ్మా, నేను తెచ్చిన స్వీట్స్ కూడా పెట్టు మాకు” అంటూ అత్తయ్యని తొందరపెట్టారు…..
అందరికీ స్వీట్స్ అందాక, మా అందరిని ఉద్దేశించి, “నోరు తీపి చేసుకున్నారుగా! ఇప్పుడు ఓ ముఖ్యమైన విషయం చెబుతాను…” అనడంతో…అందరం ఆయన వంక చూసాము..
“ఈ యేడు, ప్రపంచవ్యాప్తిగా పేరొందిన టెక్నాలజీ కంపనీలతో మా కంపెని పోటాపోటీగా నిలిచింది. ఇరవై అగ్రశ్రేణి కంపనీల జాబితాలో మూడవ స్థానంలో చేర్చబడింది. ఢిల్లీ స్టేట్ లో మాత్రమె కాక జాతీయంగా కూడా అత్యత్తమ వ్యాపార సంస్థగా ప్రకటించారు ‘ఇండియన్ నేషనల్ చాంబర్ ఆఫ్ కామెర్స్”…క్షణమాగారు..
“కాబట్టి వచ్చే ఆదివారం ‘చాంబర్ ఆఫ్ కామర్స్’ అవార్డ్స్ వేడుకకి మా కుటుంబంతో పాటు చిత్రా, ఆనంద్ లకి కూడా నా ప్రత్యేక ఆహ్వానం” అన్నారు సంతోషంగా శ్యాం….
అందరి ముఖాల్లో ఒక్కసారిగా ఆనందం కనబడింది.
“నీలవేణి ఇంట అడుగు పెట్టాక శ్యాం బిజినెస్, రాబడి పదింతలు పెరిగాయి. …అంతా మా కోడలి అదృష్టం” అంటూ ఆ అభివృద్దికి కారణం నాకాపాదించారు మామయ్య…
“అందులో సందేహమే లేదు”…. అన్నారు శ్యాం…“ఢిల్లీ వ్యాపార ప్రపంచంలో, శ్యాం పట్టిందల్లా బంగారమవుతుందని చెప్పుకుంటారు…” అన్నారు ఆనంద్ అభినందిస్తూ.
‘నా చేయి పట్టుకుని నాతో ఏడడుగులు నడిచాక మాత్రం, నా జీవితంలో అశాంతిని నింపారు మీ ..శ్యాం…’ అనుకున్నాను.

**
శ్యాం బయటకి అందరి వద్ద కనబరిచే మృదుత్వం, నాపట్ల ఎందుకు చూపించరో నాకు అర్ధమే అవదు. నా ప్రమేయం లేకుండా, నా అయిష్టాన్ని పట్టించుకోకుండా, భర్తగా నా పై తన అధికారం చెలాయిస్తూనే ఉన్నారు. కొనసాగుతున్న మా దాంపత్య జీవితం కూడా ‘సంసారం’ అన్న ముసుగు వేసిన నరకకూపం. ….శ్యాం నన్ను తాకిన ప్రతిసారి నా అణువణువు అయిష్టతతో ఎదురుతిరుగుతుంది.
‘ఎలా నాకు నిష్కృతి లభించేనో’ అన్నదే నిత్యం నా ఆలోచన. ఇకపైన అతని చేరువగా మెలిగే సందర్భమే రాకుండా జాగ్రత్త పడాలని నిర్ణయించుకున్నాను. భూదేవంత ఓర్పునివ్వమని ఆ దేవుణ్ణి ప్రార్దిస్తుంటాను….
‘నా కొడుకుని పెంచి, పెద్ద చేసి వృద్దిలోకి తేవడమే నాకు మిగిలిన సంతోషం’ అనుకుని తేలిక పడుతుంటాను..పసివాడు సందీప్ ..పాపం…శారీరక ఆటుపోట్ల నుండి కోలుకుంటూ ఆటల్లో, చదువుల్లో చక్కగా కొనసాగుతున్నాడు. చిన్మయ మిషన్ వారి ‘బాలవిహార్’ ప్రోగ్రాంలో కూడా ఆసక్తిగా పాల్గొంటున్నాడు. భగవద్గీత శ్లోకాలు కూడా చక్కగా వల్లిస్తాడు. వాటి అర్ధాలు చెప్పడానికి అత్తయ్య ఉండనే ఉన్నారు…
**
‘చాంబర్ ఆఫ్ కామర్స్ – ఐ.టి శాఖ’ వారి సన్మాన సభకి అందరం కలిసే వెళ్ళాము…..
“..భారతదేశంలోనే ఉత్తమ ఐ.టి సంస్థ నిర్వాహకులు, శ్రీ శ్యాం ప్రసాద్ మధురై ని ఘనంగా సన్మానిస్తున్న ఈ సందర్భంలో, విచ్చేసిన మీ అందరికీ వందనాలు…” అన్న సంస్థ సెక్రెటరీ వ్యాఖ్యతో సభ ఆరంభమైంది.
కరతాళధ్వనులతో మారుమ్రోగింది సిటీ హాల్….
“పదేళ్ళ క్రితం ‘ఐర్లాండ్ గ్లోబల్ కార్పోరేషన్’ సహకారంతో స్థాపించబడ్డ ఐ.టి సంస్థని ‘శ్యాం బిజినెస్ సొల్యూషన్స్’ గా వృద్ది పరిచారు – శ్యాంప్రసాద్. అతని ఆధీనంలోనే సంస్థ అంచెలంచెలుగా ఎదిగి, ఐదేళ్ళగా ఢిల్లీ మహా నగరంలో ఆర్ధికంగా, వ్యవస్తాపికంగా మొదటి స్థానం సంపాదించింది.
ఆ సంస్థ నిర్వాహకుడిగా ఐదో సారి అవార్డు అందుకోబోతున్న ఈ వ్యాపారవేత్తకిప్రభుత్వఐ.టి శాఖ తరఫున కూడా అభినందనలు”అని శ్యాంని కొనియాడుతూ అవార్డు అందించారు ఐ.టి శాఖామాత్యులు. గౌరవ అతిధిగా విచ్చేసిన ‘ఐర్లాండ్ గ్లోబల్ కార్పోరేషన్’ బోర్డ్ మెంబర్, చార్లెస్ డిక్సన్ తమ సంస్థ తరఫున కూడా శ్యాంకి జ్ఞాపికప్రదానం చేసారు.
“శ్యాం ప్రసాద్ తల్లితండ్రులు – మిస్టర్. నారాయణ్ మధురై అండ్ మిసెస్ శ్రీదేవి నారయణ్” అంటూ ప్రేక్షకుల్లో ఉన్న అత్తయ్య మామయ్య గార్లని ప్రత్యేకంగా గుర్తించారు నిర్వాహకులు.
శ్యాం గౌరవార్ధం ఏర్పాటు చేసిన సభకి మాతోపాటు చిత్ర, ఆనంద్ కూడా వచ్చారు. సందీప్ కి చాలా ఉత్సాహంగా, డాడి అంటే రెట్టింపు గర్వంగా ఉంది. శ్యాం పక్కనే కూర్చున్నాడు..
సభ అవగానే కుటంబం అంతా కలిసి డిన్నర్ కి తాజ్ హోటల్ కి వెళ్ళాము.
“నాకు మీరు అన్న లాంటి వారు శ్యాం, చాలా గర్వంగా ఉంది” అంటూ చిత్ర అభినందించింది. శుభాకాంక్షలు తెలిపారు ఆనంద్.
**
తాజ్ లో డిన్నర్ అయ్యాక ఇల్లు చేరేప్పటికి, రాత్రి పదకొండయింది.
ఆలస్యం అయినా హోంవర్క్ చేస్తూ కూర్చున్నాడు సందీప్. సగం చదివిన నవల ’వాటర్ ఫర్ ఎలిఫెంట్స్’ చేతిలోకి తీసుకుని వాడి గదిలోనే నేనూ నడుం వాల్చాను.
అర్దరాత్రి దాటాక పడక చేరిన సందీప్, రెండే నిముషాల్లో గురక పెట్టడం మొదలుపెట్టాడు. పక్క మీద చేరడమే ఆలస్యం, మొద్దునిద్రకి పడతాడు వీడు’ అనుకుంటూ, .. చదువుతున్న నవల మూసి పక్కనే ఉన్న టేబిల్ మీద పెట్టాను….
దాహమనిపించి గేమ్ రూంలో ఉన్న ఫ్రిజ్ లోని మంచినీళ్ళ కోసం వెళ్లాను. అక్కడే అలమారా నుండి బుక్స్ తీసుకుంటున్న శ్యాం ని గమనించనే లేదు. గ్లాసులోకి నీళ్ళు వొంపుకుని వెనుతిరిగేప్పటికి, ఎదురుగా ప్రత్యక్షమై అడ్డుగా నిలబడ్డాడు శ్యాం. ఉలిక్కిపడి వడిగా అక్కడినుండి వెళ్ళబోయాను. యేదోక నెపంతో కొద్దికాలంగా దూరంగా ఉండగలిగిన నేను, ఇలా చిక్కినందుకు ఏడుపోచ్చింది.
రెండుచేతులతో గట్టిగా నన్ను వాటేసి అదిమి పట్టుకున్నాడు. ఆ ఉడుంపట్టు విడిపించుకోడానికి శాయశక్తులా ప్రయత్నించాను. చేత్తో నా నోరు మూసేసి, తన గదిలోకి బలవంతంగా లాక్కుని వెళ్ళాడు. తలుపు గడియ వేసాక గాని నా నోటి మీది చేయి తీయలేదు.
తప్పుకొని తలుపు వైపు అడుగు వేయగానే మళ్ళీ నన్ను అడ్డుకున్నాడు. అరిస్తే, పెద్దవాళ్ళు, సందీప్ అంతా లేస్తారు. ఎలా? ఏం చేయాలి? అనుకుంటుండగా నన్ను గిర్రున తన వైపుకి తిప్పుకున్నాడు. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. కోపంగా ఉన్నాడు.
“ఎంతకాలం నీ మొండితనం నీలా? వేవిళ్ళు, కోపాలు, పోట్లాటలు ఇక చాలు. నా సంతోషంలో కూడా పాలు పంచుకోవా? ఈ రోజు నిన్ను వదిలేది లేదు” అంటూ నా జుట్టు పట్టుకొని బలవంతంగా మంచం వైపు నడిపించాడు. నా నవనాడులు చచ్చిపోయాయి. ఎప్పటిలా లొంగదీసుకోబోయాడు.
మొదటిసారిగా బలంగా ప్రటిఘటించాను, పెనుగులాడాను. నా నడుం మీద ఉన్న శ్యాం అరచేతిని నారెండు చేతులతో మెలిపెట్టి వెనక్కి వంచాను. ఒక్కసారిగా నా మీద పట్టు వదిలాడు.
వెనుతిరిగి వాకిలి వైపు విసురుగా పరిగెట్టబోతే చీర కుచ్చెళ్లు అడ్డంపడి అదాట్టుగా పక్కనే ఉన్న అల్మారా మీదకి తూలాను. తలకి గట్టిగా దెబ్బ తగిలింది. కుడి వైపు చెంప, పెదవులపై కూడా బలంగా అల్మారా గుద్దుకుంది.
అదాట్టుగా అంతటి దెబ్బలు తగిలిన కుదుపుకి కడుపులో తిప్పేయడం కూడా తెలుస్తుంది. తల, శరీరం మొద్దుబారిపోయాయి. నా శక్తినంతా ఒడ్డినా, నా భర్త పైశాచికానికి బలైపోయింది నా వ్యక్తిత్వం. స్పృహ కోల్పోవడం తెలుస్తుంది..
**
కళ్ళు తెరవడం కష్టంగా ఉంది. కాసేపటికి గాని కొంచెంగా తెరవలేకపోయాను.. చుట్టూ కలయజూసినా అంతా మసగ్గా ఉంది. పడుకొని ఉన్నానని గ్రహించాను. టైం ఎంతయిందో? లేవాలని ప్రయత్నిస్తే, వొళ్ళు గుదిబండలా కదలడం లేదు. మరికాసేపటికి హస్పిటల్లో ఉన్నానని అర్ధమయ్యింది.
చేతులకి స్ట్రాపు వేసి సెలైన్ బాటిల్ కి కనెక్ట్ చేసి ఉంది. ఓ చేత్తో మొద్దుబారి నట్టనిపిస్తున్న నా ముఖాన్ని తడిమితే, పెదవులు పగిలి చిట్లినట్టుగా, కణతల మీద బాగా దెబ్బ తగిలి వాచినట్టుగా, నొప్పిగా అనిపించింది. నుదిటి మీద బ్యాండేజీ వేసుంది. కడుపులో బాగా నొప్పెడుతుంది.
ఏమైఉంటుందని ఆలోచిస్తే, రాత్రి జరిగిన సంఘటన, నా మీద జరిగిన అత్యాచారం గుర్తుకొచ్చింది. పిడికిళ్ళు బిగుసుకున్నాయి. కోపంతో కణతలు అదిరాయి.
సందీప్ ఎక్కడ? ఏమయ్యాడు? నా వెన్నెముక లోనుండి వణుకు మొదలయ్యింది. “ఎవరు అక్కడ? నర్స్, నర్స్” అని గట్టిగా అరుస్తున్నా నా గొంతు నాకే వినబడలేదు. అసహనంగా కళ్ళు మూసుకున్నాను. దూరంగా చిత్ర గొంతు వినబడింది. ఆదుర్దాగా వాకిలి వైపు చూసాను. మరో డాక్టర్ తో కలిసి చిత్ర లోనికి వచ్చింది. వెంట ఓ నర్స్ కూడా.
“ఎలా ఉంది ఇప్పుడు?” అంటూ చిత్ర నా దగ్గరగా వచ్చింది. రెండో డాక్టర్ తన పేరు మాలిని అని పరిచయం చేసుకుంది. నా పల్స్ పట్టి చూసి వెంటున్న నర్స్ కి ఏవో సూచనలు ఇచ్చింది.
నన్ను పరీక్షించి, “చూడమ్మా, ఇప్పటికి నువ్వు ఓకే. బ్లీడింగ్ అయితే తగ్గింది. అయినా ఇంకో రెండురోజులు వేచి చూస్తే కాని నీ గర్భం సురక్షితంగా కొనసాగుతుందో లేదో నిర్దారించలేము. పోతే నీకు నా సలహా ఏమంటే, ముందు నువ్వు పూర్తిగా రిలాక్స్ అవ్వాలి. మెట్లు ఎక్కేప్పుడు, దిగేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కడుపుతో ఉండీ అలా అర్దరాత్రి చీకట్లో మెట్లు దిగడాలు చేయకూడదు” హితవు పలికారు డాక్టరమ్మ.
తల వంచుకుని వింటున్నాను…
“నిజానికి, అంతటి దెబ్బలకి కూడా ఇప్పటి నీ పరిస్థితి పర్వాలేదనే చెప్పాలి. విశ్రాంతి తీసుకో” అని నా చేయి తట్టి, చిత్రకి చెప్పి వెళ్ళిపోయింది డాక్టర్.
“సందీప్ ఎక్కడ? వాడిని వెంటనే చూడాలి. అసలు నేనిక్కడికి ఎప్పుడు వచ్చాను? ఎలా?” అని అడిగాను చిత్రని. నా గొంతు నాకే ఎక్కడో బావిలోలా వినిపిస్తుంది.
నా తల మీద చేయి వేసి నిమురుతూ, “నీలమ్మా, కడుపుతో ఉండీ, అసలు మెట్ల మీద అంత దూకుడుగా పరుగు పెట్టడం ఏమిటి? లైట్స్ కూడా వేసుకోలేదట. ఎంత ప్రమాదం తప్పిందో! వేళకి శ్యాం అక్కడే ఉండబట్టి, నయమైంది. పడింది చెక్క రైలింగ్ మీద కాబట్టి సరిపోయింది. లేదంటే, దెబ్బలు మరింత తీవ్రంగా ఉండేవేమో” అని చిత్ర అంటుండగా తన సెల్ మోగింది.
చిత్ర చెయ్యి పట్టి వారించాను, ‘ఫోన్ అలా ఉంచి ముందు నాకు ఒక కాగితం కలం ఇమ్మని, మాట్లాడలేను కాబట్టి కాగితం మీద రాస్తాను’ అని సైగ చేసాను.
నవ్వుతూనే కాస్త ఆశ్చర్యపోతూ తన నోట్పాడ్ అందించింది.
“సందీప్ ని వెంటనే చూడాలి. వాడిని, మా ఇంట్లో ఎవ్వరూ చూసుకోలేరు కాబట్టి నేను ఇక్కడినుండి ఇంటికి వెళ్ళేంత మటుకు, వాడిని మీ ఇంట్లో ఉండనివ్వు. క్యాండి, మిండీలని కనిపెట్టుకుని ఉండమని జీవన్ కి చెప్పు. ఇకపోతే, నన్ను వీలయినంత త్వరగా ఇంటికి పంపే ఏర్పాటు చెయ్యి. నన్ను అర్ధం చేసుకో చిత్రా…. నేను చాల క్లిష్ట పరిస్థితిలో ఉన్నాను” అని రాసి కన్నీళ్ళతో కాగితం చిత్రకి అందించాను.
అది చదివిన చిత్ర ముఖం గంభీరంగా మారింది. “ఒక్క గంటలో నేను వెళ్లి వాడిని తెస్తాను. నువ్వు బెంగపెట్టుకోకు. నువ్వు చెప్పినట్టే అన్నీ చేస్తాను. త్వరలో వస్తాను” అని నర్స్ చేత నాకు ఇంజెక్షన్ చేయించి వెళ్ళింది చిత్ర.

సశేషం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *