April 19, 2024

రామేశ్వర ఆలయం

రచన: అంబడిపూడి శ్యామసుందర రావు .

పరమేశ్వరునికి ఉన్న 12 జ్యోతిర్లింగాలలో దక్షిణాదిన ఉన్న రామేశ్వరము లోని
ఆలయము ఒకటి ఈ దేవాలయము రామేశ్వర ద్వీపములో ఉంది ఇక్కడి ప్రధాన దేవాలయము
రామనాధ స్వామి ఆలయము ఈ దేవాలయాన్ని నిత్యము వేలాది మంది భక్తులు దాని
పవిత్రత మరియు నిర్మాణ సౌందర్యం కోసం దర్శించుకుంటారు ఈ ఆలయం మూడు
ముఖ్యమైన భారతీయ మత విభాగాలలో పవిత్ర తీర్థయాత్రగా పరిగణించబడుతుంది.ఆ మత
విభాగాలు శైవ మతం (శివుడిని ఆరాధించేవారు) వైష్ణవిజం (విష్ణువును
ఆరాధించేవారు) మరియు స్మార్తిజం (స్మృతులను అధీకృత గ్రంథాలుగా
అనుసరించేవారు, మరియు అన్ని దేవుళ్ళను బ్రాహ్మణులుగా ఆరాధించేవారు
బ్రాహ్మణుల విభాగం, వారు అధ్వైత సూత్రాన్ని అనుసరిస్తారు)
కొన్ని వేదాలు మరియు పురాణాల ప్రకారం రామేశ్వరంని “గంధమధనం” అని
వ్యవహరించెడి వారు మరియు రాముడు రాకముందే, రామేశ్వరంలో ఒక శివాలయం
ఉన్నదని వారి నమ్మకము.ఈ మందిరంలోని శివ – లింగాన్ని త్రేతా యుగంలో (1.2
మిలియన్ సంవత్సరాల క్రితం) శ్రీ రాముని చేత స్థాపించబడిందని నమ్ముతారు.
పౌరాణిక చరిత్ర ప్రకారము బ్రాహ్మణుడైన రావణాసురుడిని చంపిన పాప
పరిహారార్ధము లంక నుండి వచ్చిన శ్రీరాముడు రామేశ్వరము చేరినాక శివుని
ఆరాధించటానికి శివలింగము కావలసి వచ్చింది అందువల్ల పూజలు చేయటానికి రెండు
శివలింగాలను తీసుకు రావలసినదిగా హనుమంతుని కైలాసానికి పంపిస్తాడు కానీ
హనుమంతుడు రాకపోయేసరికి వేళమించిపోతున్నదని సీతా అమ్మవారు ఇసుకతో చేసిన
సైకత లింగాన్నిమునుల సలహా మేరకు ప్రతిష్టిస్తాడు సీతాదేవి నిర్మించిన
శివలింగానికి రాముల వారు ఆచారాలతో పూజలు, చేశారు. అన్ని పూర్తయిన తర్వాత
హనుమంతుడు శివలింగాలతో రామేశ్వరం ఒడ్డుకు చేరుకున్నాడు.
హనుమంతుడు తానూ తెచ్చిన శివలింగాన్ని ప్రతిష్టించి పూజలు చేయమని
శ్రీరాముని ప్రార్ధిస్తాడు అంతటితో ఆగకుండ సీతా అమ్మవారు చేసి
శ్రీరాముడు ప్రతిష్టించిన సైకత (ఇసుక) లింగాన్ని తొలగించాలని
ప్రయత్నిస్తాడు కానీ విఫలమవుతాడు అప్పుడు శ్రీరాముడు హనుమంతుని సమాధాన
పరచి,”నీవు తెచ్చిన లింగానికి మొదట పూజలు జరుగుతాయి ఆ తరువాతనే నేను
ప్రతిష్టించిన సైకత లింగానికి పూజలు జరుగుతాయని హనుమంతునికి హామీ
ఇచ్చాడు నేటికీ అదే సాంప్రదాయము రామేశ్వరము లో కొనసాగుతుంది హనుమంతుడు
తెచ్చిన శివలింగాన్ని విశ్వనాథుడు అని పిలుస్తారు.
మొదట్లో అంటే10 వ శతాబ్దం వరకు రామేశ్వరం ఆలయం ఒక చిన్న తాటాకుల మండపములో
ఉండెది , ఈ ఆలయమును ఒక ముని నిర్వహించె వారు. ఈ ఆలయం మరియు దాని
నిర్మాణాత్మక నిర్మాణాలు 12 వ మరియు 16 వ శతాబ్దాల మధ్య వివిధ రాజులచే
అభివృద్ధి చెందాయి స్పష్టమైన చారిత్రక ఆధారాల ద్వారా రామేశ్వరం వివిధ
రాజవంశాల క్రింద పాలించబడినది. పాండ్య రాజ్యం (చోళ రాజ్యానికి ముందు
రామేశ్వరం క్రీ.శ 9 వ శతాబ్దం వరకు) మదురై పాండ్య రాజ్య పాలనలో ఉన్నది.
క్రీ.శ. 1012 నుండి 1040 వరకు చోళ రాజ్యం,1153 – 1186 CE వరకు జాఫ్నా
రాజ్యము, క్రీ.శ 1253 – 1268 వరకు పాండ్య రాజ్యము,13 వ – 17 వ శతాబ్దం
వరకు విజయనగర రాజ్యం (మదురై నాయకులు)
సేతుపతిస్ (రామనాథపురం పాలించటానికి మదురై నాయక్ చేత నియమించబడిన వారు)
పాండ్య మరియు చోళ రాజ్య కాలంలో చైనా, అరేబియా, సుమేరియా, ఈజిప్ట్, రోమ్
వంటి వివిధ దేశాలకు వివిధ రకాల శంఖాలు (ప్రధానంగా దక్షిణావర్త శంఖం)
మరియు ముత్యాలు (తెలుపు, నలుపు, గోధుమ) ఎగుమతులు జరిగినవని చారిత్రక
ఆధారాలు చెబుతున్నాయి. రామేశ్వరం ఆ సమయంలో ఒక ముఖ్యమైన నౌకాశ్రయంగా
పనిచేసినది.
చోళ మరియు పాండ్య గొప్ప రాజ్యాలు అయినప్పటికీ, వారు తమ పాలనలో వివిధ
దేవాలయాల స్థాపనలలో సహకరించినప్పటికీ, రామేశ్వరం ఆలయ అభివృద్ధిలో వారి
సహకారం చాలా తక్కువ. రామేశ్వరం ఆలయ నిర్మాణం విస్తరణ సేతుపతి రాజులు
ప్రధాన సహకారంతో జరిగినది.
ఈ ఆలయ నిర్మాణము ద్రావిడ శైలిలో ఉంటుంది. ఆలయము చుట్టూ ప్రహరీగోడ
ఉంటుంది. తూర్పు వైపున ఉండే ప్రహరీ గోడ 865 అడుగుల పొడవు ,పడమర దక్షిణ
ఉత్తర దిక్కులలో ప్రహరీ గోడ 657 అడుగుల పొడవుతో నిర్మింపబడింది. నాలుగు
వైపులా ఆలయ ప్రవేశ ద్వారము పైన గోపురాలు ఉంటాయి
రామనాథస్వామి ఆలయమును ప్రాకారాలు,సన్నిధిలు (ఆలయం లోపల చిన్న
మందిరాలు),తీర్థాలు,మండపాలు అని వర్గాలుగా విభజించారు.
ఆలయములోని సన్నిధులు 10 మరియు 11 వ శతాబ్దాల కాలంలో పరాంతక చోళ మరియు రాజ
రాజ చోళ రాజుల చేత నిర్మించబడ్డాయి. ఈ దేవాలయాలు మూడవ ప్రాకారము యొక్క
పడమటి వైపున ఉన్నాయి.శ్రీలంక రాజు పరాక్రమబాహు (క్రీ.శ 1153 – 1186) 12 వ
శతాబ్దం చివరిలో ఆలయం లోపల ప్రధాన సన్నిధులను మరియు మొదటి ప్రాకారమును
నిర్మించారు 1404 CE లో విజయనగర రాజవంశం యొక్క హరిహర – II రెండవ
ప్రాకారము పనులను ప్రారంభించారు కాని పనులు పూర్తి కాలేదు (16 వ
శతాబ్దంలో రెండవ ప్రాకారము యొక్క తూర్పు భాగాలను తిరుమలై సేతుపతి
నిర్మించారు).ఆ తరువాత క్రీ.శ 1414 లో శ్రీలంకన్ (తమిళ) రాజు పరరాజశేఖర
ఆర్యచక్రవర్తి సహాయంతో ఉదయన్ సేతుపతి శ్రీలంక త్రింకోమలై నుండి గ్రానైట్
రాళ్లను తెచ్చి వాటితో పునరుద్ధరణ ప్రక్రియను, రామనాథస్వామి ఆలయ
పునర్నిర్మాణాన్ని ప్రారంభించారు.
పరమ శివుని ముందు 17 అడుగుల ఎత్తు మరియు 12 అడుగుల వెడల్పు కలిగిన గొప్ప
నంది విగ్రహాన్ని చిన్న ఉడైయాన్ కట్టతేవర్ నిర్మించారు. పల్లియరాయ్ మరియు
అంబాల్ సన్నిధి ముందు మంటపములను రవి విజయ రఘునాథ సేతుపతి
నిర్మించారు.పశ్చిమ గోపురం (78 అడుగుల ఎత్తు పశ్చిమ రాజ గోపురము) మరియు
ఆలయ బయటి గోడలను క్రీ.శ 1434 నాటికి నాగూర్ వైశ్య భక్తుడు అందించిన
విరాళాల సహాయంతో నిర్మించారు.1722 వ సంవత్సరంలో విజయ రఘునాథ సేతుపతి
రామనాథస్వామి ఆలయం మూడవ ప్రాకారమునకు పునాది రాయి వేశారు, తరువాత ఈ పని
చెల్లా ముత్తు విజయ రఘునాథ సేతుపతి చేత చేయబడి 1772 నాటికి ముత్తు
రామలింగ విజయ రఘునాథ సేతుపతి పాలనలో పూర్తయింది.తూర్పు రాజ గోపురము యొక్క
చిన్న భాగాన్ని అప్పటికే 17 వ శతాబ్దంలో తలవాయి సేతుపతి ప్రారంభించారు
కాని పూర్తి కాలేదు. ఈ తూర్పు రాజ గోపురం (తూర్పు రాజ గోపురము 126 అడుగుల
ఎత్తు మరియు 9 అంతస్తులు) 1897 నుండి 1904 మధ్య సంవత్సరాల్లో దేవకోట్టై
A.L.A.R కుటుంబం విరాళాల ద్వారా నిర్మించబడింది.
రామేశ్వరం ఆలయం మూడవ ప్రాకారము ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయ ప్రాకారము,
దాని కొలతలు.స్తంభాల సంఖ్య 1212, ఎత్తు 22 అడుగులు 7.5 అంగుళాలు.బాహ్య
వలయము (తూర్పు – పడమర) 690 అడుగులు (ఉత్తర దక్షిణ) 435 అడుగులు ఇన్నర్
వింగ్ (తూర్పు – పడమర) 649 అడుగులు ఇన్నర్ వింగ్ (ఉత్తర దక్షిణ) 395
అడుగులు పైకప్పు పైభాగంలో ఉన్న రాళ్ళు 40 అడుగుల పొడవు వరకు ఉంటాయి.
ప్రాకారములోని స్థంభాలన్నీ అందమైన శిల్పాలతో చెక్కబడ్డాయి.ఈ ఆలయంలోని
ప్రధాన దేవత (మూలవర్), రాముడు ప్రతిష్ఠించిన శివలింగం ఈ సన్నిధిలో
ఉన్న్దది. శివలింగాన్ని సముద్రపు ఇసుకతో సీతదేవి (శ్రీరాముని భార్య)
నిర్మించారని భక్తుల నమ్మకము కైలాసము నుండి హనుమంతుడు తీసుకువచ్చిన
రెండు శివలింగాలలో ఇది ఒకటి. ఈ సన్నిధి రామనాథస్వామి సన్నిధికి ఉత్తరం
వైపు ఉన్నది. ఈ శివలింగానికి మాత్రమే పూజలు మరియు నైవేద్యాలు మొదట
జరుగుతాయి.
సేతు పురాణ గ్రంథం ప్రకారం, రామేశ్వరం పరిసరాల్లో పూర్తిగా 64 తీర్థాలు
(పవిత్ర జల వనరులు) ఉన్నాయి. వాటిలో ఇరవై రెండు తీర్థాలు రామనాథస్వామి
ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి. రామేశ్వరం ఆలయం లోపల ఉన్న 22 బావులలో ఉదయం 5:30
నుండి 12:00 వరకు మరియు మధ్యాహ్నం 3:30 నుండి 6:00 గంటల వరకు భక్తులు
స్నానం చేయడానికి అనుమతిస్తారు.తడి దుస్తులతో ఆలయ దేవతలను పూజించడానికి
భక్తులను అనుమతించరు, కాబట్టి భక్తులు స్నానం చేసిన తర్వాత ధరించడానికి
పొడి బట్టలు తీసుకెళ్లాలి
విశాలాక్షి విశ్వనాథర్ భార్య. ఈ సన్నిధి విశ్వనాథర్ సన్నిధికి దగ్గరలో
ఉన్నది. విశ్వనాథర్ తో సంబంధం ఉన్న పూజలన్నిఈమెకు కూడ
చేయుదురు.పార్వతవర్తిని అమ్మన్ రామనాథస్వామి భార్య, ఈ మందిరం రామనాథ
స్వామికి ఎడమ వైపున ఉంది మరియు దక్షిణ దిశలో ఉంది. అంబాల్ విగ్రహం పద్మ
పీఠము మీద నిలబడి చేతిలో రెండు కమలాలతో మనకు దర్శనము. ఈ మందిరంలో “శ్రీ
చక్రం” ఏర్పాటు చేయబడినది. పార్వతవర్తిని అంబాల్ మందిరం తమిళనాడు యొక్క
శక్తి పీఠాలలో ఒకటి. అంబాల్ మందిరం యొక్క విమనము కూడా బంగారంతో పూత
పూయబడింది. అంబాల్ యొక్క ఇతర పేర్లు: పార్వతి దేవి, మలై వలార్ కాథాలి,
ధాట్చాయిని.రామేశ్వరం ఆలయంలో అంబాల్ మందిరానికి వాయువ్య మూలలో విష్ణు
మందిరము ఉన్నది. శివాలయం లోపల విష్ణు మందిరాలు ఉన్న అతికొద్ది దేవాలయాలలో
ఈ ఆలయం ఒకటి. విష్ణువు యొక్క భంగిమను (తిరుక్కోలము)“ఆనంద శయన” అంటారు.
ఇతర పేర్లు: పల్లికొండ పెరుమాళ్, పెరుమాళ్. ఇచట ఆలుమగలు సంతాన, సౌబ్యాగ
గణపతిని పూజించడం ద్వారా సంతానం, సౌబ్యాగ్యం లభిస్తుందని నమ్ముతారు. ఈ
మందిరం అంబాల్ మందిరానికి నైరుతి మూలలో ఉన్నది.
మూడవ ప్రాకారము పడమటి వైపు రాముల వారి మందిరం ఉన్నది. ఈ రామ మందిరాన్ని
కోదండ రామ సన్నిధి అని వ్యవహరింతురు. ఈ మందిరంలో రాములవారు సీత, లక్ష్మణ
హనుమంతు సమేతంగా భక్తులకు దర్శనము. మూడవ ప్రాకారము యొక్క ఈశాన్య మూలలో
ఉన్నది, ఈ మందిరం లోపలి భాగం పూర్తిగా రుద్రాక్షాలతో అలంకరించబడినది. ఈ
మందిరం లోపల మహా విష్ణు విగ్రహం ఉన్నది. భక్టులు అగ్ని తీర్ధములో పూజలు
చేసి నాగ ధోషం పోవడానికి ఈ మందిరం లోపల నాగ విగ్రహాలను ఏర్పాటు చేస్తారు
యోగభ్యాసాన్ని కనిపెట్టి, రూపొందించిన యోగి పతంజలి సమాధి ఈ మందిరం లోపల
ఉన్నది. పతంజలి ఋషి యోగాకు తండ్రి అని అంటారు. ఆ సమాధి స్థలంలో ఒక యోగ
చక్రం ఏర్పాటు చేయబడింది మరియు నెయ్యిని ఉపయోగించి వెలిగించిన అఖండ
జ్యోతి సమాధి వద్ద ఉంచబడినది.
మహా గణపతి సన్నిధి:దక్షిణాన నంది మండపంలో ఉంటుంది ఇతనిని వినాయగ,
పిల్లయార్ అని వ్యవహరింతురు.మొదట గణపతిని పూజించాలి అనేది హిందూ
సంప్రదాయం. కాబట్టి భక్తుడు మొదట తమ ఆరాధనను గణపతితో ప్రారంభిస్తారు
కార్తికేయన్ను శివుని కుమారుడిగా కూడా పరిగణిస్తారు, అతను భక్తులను తన
ఇద్దరు భార్యలైన దేవ్యానై, మరియు వల్లిలతో దర్శనము. ఈ మందిరం నంది
విగ్రహానికి ఉత్తరం వైపు ఉంది. ఇతర పేర్లు: మురుగన్, సుబ్రమణియార్.నంది
మండపం సమీపంలో నవ గ్రహాల విగ్రహాలు గలవు. గొప్ప నంది విగ్రహం 17 అడుగుల
ఎత్తు మరియు 12 అడుగుల వెడల్పు మరియు ఇటుకలు, సున్నపు రాళ్ళు మరియు
సముద్రపు పెంకులతో నిర్మించబడింది. నంది విగ్రహం స్వామి శివుడిని
ఎదుర్కొంటుంది. ప్రదోషం అని పిలువబడే దినమున నందికి ప్రత్యేక పూజలు (ఈ
రోజు నెలవారీ రెండుసార్లు వస్తుంది) జరుగును.
రామ నాథస్వామి ఆలయంలోని హనుమంతుడి విగ్రహం 16 అడుగుల ఎత్తు గాని మనకు 8
అడుగుల విగ్రహమే ప్రదర్శించబడుతుంది. మిగిలిన సగం భూమిలో నీటి కింద
మునిగి ఉంటుంది. హనుమంతుడి ముఖం మరియు శరీరం పూర్తిగా సింధూరం పొడితో
పూయబడి ఉండును. ఈ హనుమంతుడిని “వీర హనుమాన్” అని పిలుస్తారు.ఇవన్నీ
రామేశ్వరము ఆలయములోని కొన్ని విశేషాలు మాత్రమే ఇంకా చాలా విశేషాలు
ప్రత్యేకతలు ఉన్నాయి దక్షిణాదిలో ముఖ్యముగా తమిళ్ నాడు దేవాలయాలకు
ప్రసిద్ధి అన్ని చాలా పెద్ద పెద్ద దేవాలయాలు ఎంతో చరిత్ర కలిగినవి
దర్శనీయ పుణ్యక్షేత్రలు శిల్పసంపదకు ఆధ్యాత్మికతకు పట్టుగొమ్మలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *