April 19, 2024

సానుభూతి పరాయణి

రచన: వాసా శ్రీనివాసరావు

 

ఆఫీసులో టెస్టర్ గా కొత్తగా జాయిన్ అయ్యింది, కేరళ అమ్మాయి రజియా. చాలా చలాకీ అమ్మాయి. పెళ్ళయ్యింది. మూడేళ్ళ బాబు, తరవాత ఇప్పుడు మళ్ళీ కన్సీవ్ అయిందట.

శ్రీకాంత్ ఆఫీస్ లో చాలా సీనియర్. ఎవరు కొత్తగా జాయిన్ అయినా ట్రైనింగ్ ఇచ్చేది అతనే. ట్రైనింగ్ అంటే రూములో కూర్చోబెట్టి క్లాసు చెప్పడు, కానీ వర్క్ అసైన్ చేసి, దగ్గరుండి చేయిస్తాడు. పని చేస్తూ నేర్చుకోవాలి అంటాడు.

మూడు నెలలు పూర్తయ్యింది, కానీ నేర్చుకున్నది అంతంత మాత్రమే! చాలా తెలివైన పిల్లలా కనిపించినా, పని ఏమాత్రం వంటబట్టలేదు. ఇంతలో మెటర్నిటీ లీవ్ అని చెప్పి వెళ్ళిపోయింది.

డెలివరీ అయిన మూణ్ణెల్ల తరవాత రీజాయిన్ అయింది, మొత్తం కథ మళ్ళీ మొదటికొచ్చింది!

ఒకరోజు ఒక సీరియస్ విషయం మీద ఇద్దరి మధ్యా చర్చ జరుగుతుండగా.. “నేను నర్సింగ్ బ్రేక్ తీసుకోవాలి.. క్రిటికల్.. నర్సింగ్ రూం బ్లాక్ చేసుకున్నాను, ఐదు నిముషాలు లేటు ఇప్పటికే” అంది.

“ప్లీజ్ కేరియాన్” అన్నాడు శ్రీకాంత్.

ఈ ఆడవాళ్ళని చూస్తే చాలా ఆశ్చర్యంవేస్తుంది. ఇంకొకరికి జన్మ నివ్వడానికి వాళ్ళు ఇంకో జన్మ ఎత్తినంత కష్టపడతారు. ప్రసవం తరవాత ఆఫీసుకి వచ్చేవాళ్లకి ఎంత కష్టం! అక్కడ ఆ చంటిపాపని ఇంటిదగ్గర మెయిడ్ చూసుకుంటుంది. ఆ పాపకి చెందాల్సిన తల్లిపాలు ఇక్కడ నేలపాలు అవుతాయి.

శ్రీకాంత్ కూతురు ఇంజినీరింగ్ చదువుతోంది. ఇంకో సంవత్సరంలో పూర్తి అయిపోతుంది. తరవాత ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు.. ఇప్పుడు రజియా ఉన్న పరిస్థితుల్లోనే తను కూడా ఉంటుంది అన్న అలోచన రాగానే మనసు ఏదోలా అయిపోయింది శ్రీకాంత్ కి!

ఆ తరవాత రజియా మీద అభిమానం రెట్టింపయ్యింది. పనిలో ఎన్ని తప్పులు జరిగినా కోప్పడకుండా సరిదిద్దేవాడు. అంతే కాకుండా, ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ కలిసి తినడం, తను కోస్టా నుంచి తెచ్చుకున్న కాఫీ షేర్ చెయ్యడమే కాకుండా, ఆఫీస్ ముగియగానే బస్ కోసం వెళ్లేటప్పుడు లిఫ్ట్ దగ్గర తనకోసం వైట్ చెయ్యడం అలవాటై పోయింది. సినిమాలు, పాటలు, వంటలు దగ్గరనుంచి ఎన్నోవిషయాలు మాట్లాడుకునేవారు. ఆమెతో మాట్లాడుతుంటే టైం తెలిసేది కాదు. ఆమెతో ఉన్నంతసేపూ తన కూతురితో ఉన్నట్టే ఉండేది శ్రీకాంత్ కి.

మరుసటి సంవత్సరం, బడ్జటింగ్ లో ఆమే వేరే టీం కి వెళ్ళిపోవలసి వచ్చింది. అందరూ శ్రీకాంత్ లా ఉండరుకదా.. ఆమె చేసిన ప్రతి చిన్న తప్పు తెరపైకి రావడం మొదలయ్యింది. కొత్త మేనేజర్ అరుపులు కేకలు వినిపిస్తున్నాయ్ అప్పుడప్పుడు. రజియాకి జీవితం దినదిన గండం అయిపోయింది. చివరికి డెపార్ట్‌మెంట్ హెడ్ కి కంప్లైంట్ వెళ్ళింది రజియా పనితీరు మీద.

ఆరోజు హెడ్ తో మీటింగ్. రజియాకి అరచేతులు చెమటతో తడిసిపోతున్నాయ్.

“నువ్వు శ్రీకాంత్ టీం లో ఉన్నప్పుడు ఎలాంటి కంప్లైంట్‌లు రాలేదు. ఇప్పుడెందుకిలా? వర్క్ మీద కాన్సెంట్రేట్ చెయ్యలేక పోతున్నావా? ఏమైనా పెర్సనల్ ప్రోబ్లంస్ ఉన్నాయా?” అంటూ చాలా సౌమ్యంగానే అడిగాడు హెడ్.

ఒక్కసారిగా కళ్ళనీళ్ళు వచ్చేసాయ్ రజియాకి. “నీ ప్రోబ్లం ఏమిటో చెప్పు. భయపడకు. ఆఫీసులో ఎవరితోనైనా ఇబ్బందులున్నాయా” మళ్ళీ గుచ్చిగుచ్చి అడిగాడు హెడ్.

“అంటే.. అది.. మరి.. శ్రీకాంత్..” అంటూ ఏం చెప్పాలో తెలీనట్టు ఆగిపోయింది ఏడుస్తూనే!

“ఆ.. శ్రీకాంత్? అతనితో ఎమైనా సమస్యలున్నాయా?” అన్నాడు హెడ్.

అప్రయత్నంగానే అవునన్నట్టు తలూపేసింది రజియా. ఆ సమయంలో తనకి సానుభూతి కావాలి. ఏదోటి చెప్పి సానుభూతి సంపాదించుకుంటే గండం గట్టెక్కేసినట్టే!

“వ్వాట్…? శ్రీకాంత్ తో ప్రోబ్లమా? నాకు అతను ఇరవయ్యేళ్ళుగా తెలుసు. మేమిద్దరం ఒకేసారి జాయిన్ అయ్యాం ఇక్కడ” అన్నాడు హెడ్ “నేను నమ్మను” అన్నట్టున్న టోన్‌లో!

“నాకు తెలుసు మీరు నమ్మరని. అందుకే చెప్పలేదు” అంది. “అలా అనికాదు.. ఏమైనా అపార్థాలుంటే క్లియర్ చేసుకుందాం. అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పు” అన్నాడు హెడ్.

ఇప్పుడు తను చెప్పే విషయం అపార్థం అని అస్సలు అనిపించకూడదని మనసులోనే అనుకుంది. తను నమ్మించాలి ఎలాగైనా.. ఇప్పుడు కాదు అనలేని పరిస్థితి. ఒకవేళ వెనక్కి తీసుకుంటే ఆ పరిస్థితి నుంచి బయట పడటం సాధ్యం కాదు.

“అవును, అతను చాలా మంచివాడే, కానీ నాకు అతనితోనే ప్రోబ్లం” అంది ఏడుపుకి కాస్త బ్రేక్ ఇచ్చి!

“వివరంగా, ధైర్యంగా చెప్పు.. నేను చూసుకుంటాను” అన్నాడు కుతూహలంగా.

“అతను నా ప్రైవసీకి ఇబ్బంది కలిగిస్తున్నాడు. రోజంతా నాతోనే ఇంటెరాక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ దగ్గరనుంచి, సాయంత్రం బస్టాప్ కెళ్ళేవరకూ నా కోసమే ఎదురు చూస్తుంటాడు. వద్దన్నా కాఫీ షేర్ చెయ్యడం.. అఫీసుకి సంబంధంలేని విషయాలు మాట్లాడటం చేస్తున్నాడు. సినిమాలు, పాటలు, వంటలు అంటూ ఏవేవో మాట్లాడుతుంటాడు. నాకు విసుగనిపిస్తుంది. అతని ప్రవర్తన అనుమానమొచ్చి, నన్ను మీ కూతురుగా ట్రీట్ చెయ్యండి అని కూడా చెప్పాను ఒకసారి. చూసేవాళ్ళకి కూడా లేనిపోని అనుమానాలొస్తున్నాయ్ మామీద.” అంటూ ఏవేవో చెప్పుకు పోతోంది. విస్తుపోయి వింటున్నాడు హెడ్.

“ఓ మై గాడ్! శ్రీకాంత్ ఇలాంటివాడు అనుకోలేదు. నేను అతనితో మాట్లాడతాను. నువ్వు ధైర్యంగా ఉండు. వర్క్ మీద దృష్టిపెట్టు. మిగిలిన సంగతులు నేను చూసుకుంటాను. టేక్ కేర్” అన్నాడు ముగిస్తూ!

“శ్రీకాంత్.. మీ వయసెక్కడ, ఆమె వయసెక్కడా? నీకు ఆమె అంత కూతురున్న సంగతి మర్చిపోయారా? మీరంటే నాకే కాదు.. ఆఫీసులో అందరికీ గౌరవం. ఆ గౌరవాన్ని నిలబెట్టుకుంటే మంచిది. మీరు కాబట్టి ఏ విధమైన ఏక్షన్ తీసుకోవట్లేదు. ఇకనైనా అలాంటి కంప్లైంట్స్ రాకుండా చూడండి” అంటూ కటువుగా చెప్తున్న హెడ్ ని విస్తుపోయి చూసాడు శ్రీకాంత్! హెడ్ చెప్పిన విషయాలు తన హెడ్ ని భూచక్రంలా తిప్పేసాయి. ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు శ్రీకాంత్ కి. ఎప్పుడూ ఎంతో రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడే హెడ్ నోటివెంట ఆ రకమైన మాటలు వినడం ఇరవయ్యేళ్ళలో మొదటిసారి. ఆ షాక్ నుంచి తేరుకోవడానికి శ్రీకాంత్ కి చాలా కాలం పట్టింది.

అఫీస్‌లో అందరు తనని వేరుచేసి చూడటం తెలుస్తోంది శ్రీనివాస్‌కి. సంవత్సరం గడిచిపోయింది భారంగా.. ప్రతిరోజూ అవమానంతో, సూటీపోటీ మాటలతో! తను ఎంతో ప్రయత్నించాడు రజియాతో మాట్లాడటానికి. ఆమె మొహం చాటేసింది. తన మొహం చూట్టానికి కూడా ఇష్టపడనట్టు అటువైపు తిప్పేసుకునేది. రజియా మీద ఆఫీసులో ఒక్కసారిగా అందరికీ సానుభూతి పెరిగిపోయింది. అందరూ ఆమె తప్పులని కవర్ చేస్తూ, సాయంచేసేవాళ్లే, కొత్త మేనేజర్ తో సహా. శ్రీకాంత్ మీద లేనిపోని అభాండాలు వేసినందుకు మనసులో బాధనిపించినా, తన పని జరుగుతోందని మౌనంగా ఉండిపోయింది.

శ్రీకాంత్ కి సహనం నశించింది. చివరికి రాజీనామా లెటర్ పట్టుకొని తిన్నగా హెడ్ దగ్గరకి వెళ్ళాడు. “ఆమె ఏ పరిస్థితుల్లో నామీద అలా చెప్పాల్సొచ్చిందో నాకు తెలీదు. అపార్థం చేసుకుందేమో, క్లారిఫై చేద్దాం అని ఇంతకాలం ఎదురు చూసాను. నాకు మాట్లాడే అవకాశమే ఇవ్వలేదు. ఇలాంటి అభాండాలు నెత్తినేసుకుని ఇక్కడ ఉండాల్సిన పనిలేదు. ఇక శలవు” అని రాజీనామా లేఖ అతనికిచ్చేసి వెళ్ళిపోబోతుండగా.. “ఆగండి.. కూర్చోండి.. ముందు నేను మీకు సారీ చెప్పాలి. విషయం పూర్తిగా తెలుసుకోకుండా మిమ్మల్ని హర్ట్ చేసినందుకు. నాకు వారం క్రితమే నిజాలు తెలిసాయి. నేనే మాట్లాడటానికి మిమ్మల్ని పిలుద్దామనుకుంటున్నాను” అని వివరంగా చెప్పడం మొదలెట్టాడు హెడ్.

“వారం రోజుల క్రితం రజియా ఏడుస్తూ నా దగ్గరకి వచ్చింది, రాజీనామాతో. మీరు గమనించారో లేదో, గత వారం రోజుల నుంచీ తను ఆఫీసుకి రావట్లేదు. ఆఫీసులో జరిగిన విషయం వాళ్ళ ఇంటిలో తెలిసిందట. ఆమె భర్త, అత్తమామలు, వాళ్ళ ఆచారం ప్రకారం ఆడవాళ్ళు బయటికి వెళ్ళ కూడదని, వెళ్తే ఇలాంటి అనర్థాలే జరుగుతాయని, ఇంతవరకూ చేసింది చాలు, ఇక ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చోమన్నారని చెప్పింది. ఆ రోజు తను ఏదో తప్పించుకోడానికి మీ మీద అలా చెప్పింది కానీ నిజానికి మీరంటే అలాంటి అభిప్రాయం ఆమెకి లేదట. అయితే తను చెప్పిన అబద్దంవల్ల తనకి తగిన శాస్తి జరిగిందని, మళ్ళీ జీవితం లో ఉద్యోగం చేసే అవకాశాన్నే కోల్పోయాను అంటూ పశ్చాత్తాపంతో చెప్పింది. తనకి ఎంతో సహాయం చేసి, ఎంతో అభిమానంగా చూసిన మీ మీద చాలా అవమాన కరమైన అభాండాలు వేసినందుకు క్షమించమని అడగడానికి కూడా తనకి అర్హతలేదని, మొహం చెల్లకే ఇంతవరకూ మీకు తన మొహం చూపించలేక పోయిందని చెప్పింది. ఇప్పుడు నిజం చెప్పినా ఇంట్లో వాళ్ళు నమ్మరని వాపోయింది” అన్నాడు!

“జరగాల్సిన అనర్థం జరిగిపోయింది. అఫీసులో అందరికీ ఒక ఇంప్రెషన్ పడిపోయింది. ఇప్పుడు చెప్పి ఏం లాభం?” అన్నాడు శ్రీకాంత్ నిస్త్రాణగా.

“భలేవారే.. ఇలాంటి సెన్షేషనల్ విషయాలు జనాల్లోకెళ్ళడం ఎంతసేపండీ? మీరు చూస్తూ ఉండండి.. అతి త్వరలో అలాంటివన్నీ సమసిపోతాయ్. విషయం తెలిసాకా, మీ సహనానికి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంత జరిగినా అంత ఓర్పుతో ఉండటం ఎవ్వరికీ సాధ్యం కాదు. మీకు హేట్సాఫ్! ఇకపై ఆ సానుభూతిపరాయణి గురించి అలోచించడం మానేసి ప్రశాంతంగా ఉండండి” అన్నాడు షేక్ హాండ్ ఇచ్చి, మళ్ళీ ఇంకోసారి సారీ చెప్తూ.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *