April 25, 2024

నేర్పరి

రచన: జి.వి.ఎల్ నరసింహం

 

సుందరమ్మ ఉండేది, అక్కయ్యపాలెం. ఆవిడ భర్త రాజేశ్వరరావు, తాసీల్దారు చేస్తుండేవాడు. నడి వయసులో ఏక్సిడెంటులో పోయేడు. వారి ఏకైక సంతానం, రఘురాం. సుందరమ్మకు ఓ చెల్లెలు ఉంది. పేరు జానకి. భర్త మోహనరావుతో, ఆమె సీతమ్మపేటలో ఉంటుంది. సంతానం కలుగలేదు. అక్కచెల్లెళ్ళిద్దరకు, ఒకరిపై ఒకరికి వల్లమాలిన అభిమానం. జానకి, రఘురాముని స్వంత కొడుకులా ప్రేమిస్తుంది. రఘురాం కూడా పిన్నిని స్వంత తల్లిలాగే గౌరవిస్తాడు. సుందరమ్మ అన్న అర్జునరావు, లాయరు. గాజువాకలో ఉంటాడు. చిన్నప్పుడు కలసి మెలసి ఉన్నా, పెళ్లినాటినుండి భార్య ట్యూషను ప్రభావం వల్ల, అక్కచెల్లెళ్ళతో అంటీఅంటనట్లుంటున్నాడు. అతని కొడుకు గణేష్, మర్చంట్ నేవీలో చేరేడు. కూతురు ఈశ్వరి, పదో తరగతి పరీక్షలతో మూడు సార్లు ఢీకొని, ఓటమి ఒప్పుకొని, వాటి జోలికి వెళ్లడం మానేసింది. టీ.వి. సీరియల్సుకు, వీరాభిమాని.

తండ్రి రాజేశ్వరరావు పోయిననాటికి, రఘురాం, తొమ్మిదో తరగతిలో ఉండేవాడు. అప్పటినుండి, సుందరమ్మపై ఇంటి బాధ్యతంతా పడ్డాది. చెల్లెలు జానకి, మరది మోహనరావు, అనేక విషయాలలో కావలసిన సహాయం అందజేస్తుండేవారు. తల్లికి చేదోడువాదోడుగా ఉంటూ, రఘురాం ఫిజిక్సులో పి.జి. చేసి, ఓ ప్రైవేటు కాలేజీలో లెక్చరరుగా చేరేడు.

అటు, సుందరమ్మ అన్న అర్జునరావుకు, కూతురు ఈశ్వరి, పెళ్లి ఒక సమస్యగా మారింది. చదువు విషయంలో కాంప్రమైజు అయి, కట్నాలకు ఆశ బడి, అయిదుగురు పెళ్లికొడుకులు, కేసుని పెళ్లిచూపులు వరకు తెచ్చినా, పెళ్లికూతురు ఆకారం చూసేక వెనక్కి తగ్గేరు. ఈ పరిణామాలతో అర్జునరావు ఫోకస్, మేనల్లుడు రఘురాం మీద బడ్డాది. భార్య కళ్యాణి సలహా మేరకు, తరచూ సుందరమ్మకు ఫోన్లు చేస్తూ, యోగక్షేమాలు కనుక్కోడం ప్రారంభించేడు. ఉగాదికి సుందరమ్మను రఘురాంతో బాటు భోజనానికి ఆహ్వానించేడు. ఆహ్వానం, చెల్లెలు జానకికి అందలేదని తెలిసి, సుందరమ్మ తన ఆహ్వానాన్ని మర్యాదగా తిరస్కరించింది. ప్రయత్నం విరమించుకోలేదు, అర్జునరావు. స్వయంగా ఆ విషయం మాట్లాడే ధైర్యం చాలక, ఓ మధ్యవర్తి పేరయ్య శాస్త్రి ద్వారా, కూతురు ఈశ్వరిని, రఘురాంకి ఆఫర్ చేసేడు. ఫలితం శూన్యం అయింది.

పవన్ కుమార్ గారు విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో ఒక ఉన్నతోద్యోగి. ఆయన కుమార్తె నీరజ, మేథ్స్ లో పి.జి. చేసి, రఘురాం పని చేస్తున్న కాలేజిలోనే లెక్చరరుగా చేరింది.. అప్పటికే, రఘురాం తెలివైనవాడని, సత్ప్రవర్తన గలవాడని, కాలేజీలో పేరు తెచ్చుకొన్నాడు. క్రొద్ది రోజులలోనే, నీరజ అది గమనించి, రఘురాంపై సదభిప్రాయం ఏర్పరుచుకొంది. నీరజ యొక్క గౌరవమయిన ప్రవర్తనను, రఘురాం మనసులో మెచ్చుకో సాగేడు. ఇద్దరూ, వారి వారి పరిధిలలోనే ఉంటూ, ఆదర్శమయిన స్నేహితులయ్యేరు. క్రమంగా ఆ స్నేహం, వారి పెద్దల అంగీకారంతో  వివాహబంధానికి పునాది వేసింది. పరిణామం, ఓ శుభ ముహూర్తాన, రఘురాం నీరజ మెడలో తాళి కట్టేడు. నీరజ ఇంట అడుగు పెట్టినప్పటినుండి, సుందరమ్మకు చాలవరకు ఉపశమనం లభించింది. అప్పటికే, ఇంటి యాజమాన్యం కొడుకు తన భుజాన వేసుకొన్నాడు. ఇప్పుడు, వంటిల్లు బాధ్యత, కోడలు నీరజ, తనదిగా చేసుకొంది. అక్క  కష్టాలు తీరేయని, చెల్లెలు జానకి సంతోషిస్తున్నాది.

దాంపత్య జీవిత ఫలితంగా, నీరజ తల్లి కాబోతోంది. ఈ శుభ పరిణామం తెలిసి, మనవడో, మనవరాలో,తెలుసుకొందామన్న అతృతతో, సుందరమ్మ చెల్లెలుతో కలసి, తను నమ్మే జ్యోతిష్కుడు, బ్రహ్మయ్య శాస్త్రిని సంప్రదించింది. జాతకాలు పరీక్షగా చూసి, తప్పక మగబిడ్డేనని ఆయన భవిష్య వాణి వినిపించగానే, అక్కచెల్లెళ్ళిద్దరి ఆనందానికి అంతు లేకపోయింది. స్టీలు ప్లాంటు కోలనీలో ఉంటున్న, వియ్యపురాలు జగదాంబకు, నిమిషాల మీద ఆ శుభ వార్త చేరింది. ఆవిడ,  ఆఫీసు పనిలో నిమగ్నుడై ఉన్న భర్త, పవన్ కుమారుకు ఆ మెసేజ్ వెంటనే ఫార్వర్డ్ చేసింది.

నీరజకు వేవిళ్ల రోజులు వెనక్కి వెళ్ళేయి. సీమంతం రోజులు దగ్గరకు వచ్చేయి. ఆ శుభకార్యం ఎప్పుడో తెలుసుకోవాలన్న కుతూహలంతో, సుందరమ్మ వియ్యపురాలిని సంప్రదించింది. ఆ సాంప్రదాయం, వారి కుటుంబంలో లేదని వినగానే, సుందరమ్మ నిరాశ చెందింది. అది గ్రహించిన జగదాంబ, భర్త సలహా తీసుకొని, గంట తరువాత, ‘ఆ శుభకార్యం మీరు జరుపుకొంటే మాకు అభ్యంతరం లేదు’ అని ఫోనులో వియ్యపురాలికి తెలియజేసింది. సుందరమ్మకు ప్రాణం లేచొచ్చింది. వెంటనే, చెల్లెలు జానకికి, ఆ విషయం సంతోషంతో చెప్పింది. పిల్లలు లేని తనకు, భగవంతుడు ఓ సదవకాశం ప్రసాదించేడనుకొని, ఆ శుభకార్యం తన ఇంట జరిపిస్తానని అక్కను బ్రతిమలాడి  ఒప్పించింది, జానకి. అది తెలిసిన ఆమె భర్త మోహనరావు కూడా సంతోషించేడు. బ్రహ్మయ్యశాస్త్రి గారు ముహూర్తం పెట్టేరు. జానకి ఇంట్లో పెళ్ళిసందడి ప్రారంభమయింది. కోడలుకు సుందరమ్మ రెండు జతల బంగారు గాజులు చేయించింది. వాటికి జానకి కూడా, తన వంతుగా మరో రెండు జతల బంగారు గాజులు కలిపింది. ఇద్దరూ, ఖరీదయిన చెరొక కంచి పట్టు చీర కొన్నారు. వియ్యాలవారికి స్వయంగా ఆహ్వానం అందజేసేరు. తప్పక వస్తామన్నారు. కార్యక్రమానికి కుటుంబ సమేతంగా రమ్మని, అన్న, అర్జునరావుని కూడా  ఉభయులు స్వయంగా ఆహ్వానించేరు. ‘రావడం కుదరదేమో’అని లాయరుగారు క్రొద్దిగా నసుగుతూ చెప్పబోతుంటే, ‘మాకు కుదరదు. వేరే పనులున్నాయి.’ అని ఆయన భార్యామణి, కళ్యాణి ఖచ్చితంగా కుండ బ్రద్దలు కొట్టినట్లు చెప్పింది.

సీమంతానికి సుమారుగా పాతిక మంది ముత్తయిదులు వచ్చేరు. సీమంతపు పెళ్లికూతురు నీరజకు, వారిలో ప్రతి ఒక్కరు గాజులు తొడిగి, ఆశీర్వదించేరు. తెర చాటునుండి కార్యక్రమాన్ని చూస్తున్న రఘురాం, తల్లి చవి చూస్తున్న ఆనందాన్ని గమనించి, ఎంతో సంతోషించేడు.

రెండు కుటుంబాలవారు ఎదురుచూస్తున్న రోజు ఆసన్నమయింది. ఒక కార్పొరేట్ హాస్పిటలులో నీరజ మాతృమూర్తి అయింది. బ్రహ్మయ్య శాస్త్రి గారి భవిష్యవాణి నిజమయింది.  పండంటి మగ బిడ్డడు, నీరజ ఒడిలో చేరేడు. అందరకు  ఒకటే సందడి. జానకి సందడి సరేసరి. బారసాల రోజు వచ్చింది. ‘వెంకట రాజేశ్వర పవనకుమార్’ అని, పళ్ళెంలోని బియ్యంలో ఉంగరంతో రాసేడు, రఘురాం. బర్త్ సర్టిఫికేటులో ‘గౌతమ్’ అని రాయించేరు.

నీరజ కాలేజీకి వెళ్లడం ప్రారంభించింది. ఇంటివద్ద, గౌతమ్ సంరక్షణకు సమస్య లేదు. వాడి బాధ్యతలన్నీ జనాకివే. రోజూ, మోహనరావు ఆఫీసుకు వెళుతూ, జానకిని వదినగారింట, డ్రాప్ చేసి వెళ్తుంటాడు. గుమ్మంలో  అడుగు పెట్టినప్పటినుండి, గౌతమ్ సంరక్షణలోనే మునిగి తేలుతూంటుంది, జానకి. రకరకాల ముద్దుపేర్లు,‘నా బంగారు కొండా’ ‘నా వజ్రాల మూటా’ అని వాడిని పలకరిస్తూంటుంది.

రోజులు గడుస్తున్నకొద్దీ, గౌతంకు చిన్న మామ్మ దగ్గర బాగా చనువయింది. ఎప్పుడయినా,  నీరజ, ‘కొన్నాళ్ళకు, వీడు మీరే తల్లనుకొంటాడేమో.’అని జోక్ చేస్తే, ‘అలా ఎప్పుడూ అనుకోడమ్మా. కాలేజీ నుండి నువ్వు రాగానే, నిన్ను చూసి ఎంత సంబరపడుతుంటాడో, నీకు తెలుసుగా.’ భరోసా ఇస్తున్నట్లు జానకి సమాధానం.

గౌతమ్ జీవితంలో విద్యాభ్యాసం మొదలయింది. కిండర్ గార్టెన్ లో ప్రవేశించేడు. రోజల్లా వాడితో గడపడానికి అలవాటుబడ్డ జానకి, ముద్దుల మనవడు బడినుండి ఎప్పుడు వస్తాడా, అని రోజూ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూంటుంది. వాడు రావడమేమిటి, ‘దొరకునా ఇటువంటి సేవ’అని వాడి సంరక్షణలో మునిగి తేలుతూంటుంది.. వాడున్ను, ‘చిన్న మామ్మ’ అంటూ, జానకి వెంటా ఉంటాడు, కుక్కపిల్లలా.

ఒక రాత్రి రఘురాం, నీరజ, వాళ్ళ బెడ్ రూములో గౌతమ్ హయ్యర్ ఎడ్యుకేషన్ గూర్చి ఆలోచనలో బడ్డారు.

‘రఘు, మన గౌతమ్ కెరియర్ విషయం ఏమైనా ఆలోచించేవా?’

‘ఆ విషయం నేనెప్పుడూ ఆలోచించ లేదు నీరూ. నువ్వేమయినా  ఆలోచించేవా.’ అని, ఆ విషయంలో భార్య ఆలోచనేమిటో తెలియగోరేడు, రఘురాం.

‘ఐ.ఏ.ఎస్. గాని, ఐ.పి.ఎస్. గాని అయితే బాగుంటుందేమో. ఈ రోజుల్లో హైలీ డిగ్నిఫైయడ్ కెరియర్స్ గదా అవి.’ అని నీరజ అభిప్రాయబడ్డాది.

‘కానీ, వాటిలో స్ట్రెస్సెస్ ఎండ్ స్ట్రైన్స్ ఎన్నో ఉంటాయి.’ ఆ ఉద్యోగాల్లో ప్రస్తుతం ఉన్నవారి కష్టసుఖాలు తెలిసిన రఘురాం స్పందన అది.

‘అయితే నీ ఒపీనియన్ ఏమిటి?’

‘ఇంజినీరు గాని డాక్టరు గాని అయితే ఎలా ఉంటుంది.’ రఘురాం ప్రశ్న.

‘సరేలే, ఇంకా చాలా టైముంది గదా. ఆ టైమ్ వచ్చినప్పుడు ఆలోచిద్దాం.’ అని అక్కడకు ఫుల్ స్టాప్ పెట్టింది, నీరజ.

ఒక రోజు సాయంత్రం, రఘు, నీరజ, వాళ్ళ కాలేజీ వార్షికోత్సవ కార్యక్రమాలు నిర్వహించడంలో ప్రధాన పాత్ర పోషించి, స్కూటరు మీద ఇంటికి బయలుదేరేరు. ఇద్దరూ కార్యక్రమ విశేషాలు సరదాగా నెమరు వేసుకొంటున్నారు. వాటిలో, ఒక విద్యార్ధి చేసిన మిమిక్రీని తలచుకొని అతణ్ణి మెచ్చుకొంటున్నారు. ఇంతలో, స్పీడుగా వస్తున్న ఒక లారీ, బ్రేక్స్ ఫెయిలయి, గృహోన్ముఖులవుతున్న దంపతుల స్కూటరును అకస్మాత్తుగా వెనుకనుండి ఢీకొంది. ఆ ప్రభావానికి, స్కూటరు వెనుక సీటులో ఉన్న నీరజ, విసిరి పడి, రోడ్డుప్రక్కన ఉన్న బండరాయికి తల గ్రుద్దుకోడంతో, అక్కడికక్కడే తుది శ్వాస విడిచింది.

ఆ  వార్త విన్న కుటుంబ సభ్యులందరు శోకసముద్రంలో మునిగిపోయేరు. అందరి ఆందోళన ఒకటే. తల్లి లేని జీవితాన్ని గౌతమ్ ఎలా తట్టుకొంటాడా, అని. దానికి తోడు, అప్పటికే మధుమేహం, గుండె జబ్బులతో బాధ పడుతున్న సుందరమ్మకు, మరో ఆరు నెలలు దాటకుండానే, నూరు సంవత్సరాలూ నిండిపోవడంతో, సమస్య మరీ జఠిలమైంది. ఈ అనూహ్య పరిస్థితులలో చిక్కుకొన్న  రఘరామూ, పినతల్లి  జానకి, తల్లి లేని లోటు తెలియకుండా చెయ్యడానికి, గౌతమ్ మీద వాళ్ళ దృష్టిని ఎక్కువగా కేంద్రీకరించేరు. కాని, సాయశక్తులా ఎంత సహకరిస్తున్నా, జానకికి తన కుటుంబ బాధ్యతలు కూడా ఉన్నాయి కదా.

అటు,  అర్జునరావుకు,  కూతురు ఈశ్వరి పెళ్లి, నిద్ర లేకుండా చేస్తున్నాది. పెళ్లిళ్ల  పెద్ద, పేరయ్య శాస్త్రి ఏవో సంబంధాలు తెస్తూనే ఉన్నా ప్రయోజనం లేకపోయింది.  చివరికి రెండో పెళ్లి సంబంధాలు కూడా ఫెయిల్ అయిపోవడంతో అర్జునరావు దంపతులకు ఆశలు సన్నగిల్లడం మొదలయింది. అర్జునరావు మరో మెట్టు క్రిందికి దిగేడు. ఆర్థికంగా వెనుకబడ్డ సంబంధమైనా, తనకు సరే అని, పేరయ్యశాస్త్రికి విన్నవించుకున్నాడు.  పేరయ్యశాస్త్రి మెదడులో మెరిసిందొక  ఆలోచన. మేనల్లుడు రఘురాంకు ఆఫర్ చెయ్యమని అర్జునరావుకు సలహా ఇచ్చేడు. గతంలో  ఆ ప్రయత్నం విఫలమయిందని నిస్పృహతో చెప్పిన సమాధానం విని, మారిన పరిస్థితులలో రఘురాం అంగీకరించవచ్చనిన్ని, తను ఒప్పించడానికి ప్రయత్నిస్తానని పేరయ్యశాస్త్రి హామీ ఇచ్చేడు.

రఘురాం,జానకీలను సంప్రతించేడు, పేరయ్యశాస్త్రి. ప్రస్తుత పరిస్థితులలో, చిన్నవాడైన గౌతమ్ సంరక్షణకు, ఆడ దిక్కు ఎంతయినా అవసరమని, కుటుంబంలోని పిల్ల ఈశ్వరి అయితే, గౌతంను ఆప్యాయంగా చూసుకుంటుందని నచ్చచెప్పి ఒప్పించేడు. ఫలితంగా ఓ శుభ ముహుర్తాన్న రఘురాం ఈశ్వరి మెడలో  తాళి కట్టేడు.

ఎట్టకేలకు,ఈశ్వరి పుట్టిల్లు వదలి, రఘురాం ఇంట ప్రవేశించింది. గౌతమ్ ను ఈశ్వరి ఎలా చూసుకొంటుందా అని, నిత్యం రఘురాం మనసులోబెంగ. కాని,క్రొద్దిరోజులలోనే, ఆదరాభిమానాలతో ఈశ్వరి గౌతముని చేరదీయడం పలు సార్లు గమనించేక, నిబ్బరబడ్డాడు. పినతల్లి జానకితో, ఆ విషయం పాలుపంచుకొన్నాడు. ‘నాయనా, ఎంతయినా, కుటుంబం లోని పిల్ల. తల్లి లేని పిల్లడు. వాడి మీద జాలి, అభిమానం, లేకుండా ఎలా బోతుంది. పేరయ్యశాస్త్రి గారు సరయిన సలహాయే ఇచ్చేరు. నీ మనసులో బెంగ తీరింది. మనకదే కావాల్సింది.’ అని సంతోషం వ్యక్తబరచింది, జానకి. కొంత అయిష్టంతోనే పెళ్లి చేసుకొన్నా, ఈశ్వరి అనుకూల ప్రవర్తనతో, రఘురాం ఈశ్వరికు దగ్గరయ్యేడు.

కాలచక్రం రెండు సంవత్సరాలు ముందుకు దొర్లింది. ఈశ్వరికి మగబిడ్డడు పుట్టేడు. విలాసరావు, అని నామకరణమయింది వాడికి. విలాసరావు ప్రవేశంతో, ఇంట్లో పరిస్థితులు తారుమారయ్యేయి. గౌతంకు పరోక్షంగా హింసలు మొదలయ్యేయి. వాడి మీద రోజుకో ఫిర్యాదు రఘురాముకు చేరుకొంటున్నాయి. కొద్దిరోజులలోనే, ఈశ్వరి దురుద్దేశాన్ని రఘురాం పసిగట్టేడు. గౌతమ్ మీద ఇప్పటివరకు ఒలకబోసిన ప్రేమ, కేవలం తనను మభ్యబెట్టడానికే, అని గ్రహించేడు. పిన్నితో విషయం చర్చించేడు. నిజానికి, అదంతా తల్లి దర్శకత్వంలో, రఘురాముని వశబరచుకోడానికి కూతురు ఆడిన నాటకం. బిడ్డ పుట్టేక, బయటబడ్డాది ఈశ్వరి నిజ స్వరూపం. రఘురాం, జానకి, దీర్ఘంగా ఆలోచించేరు.  గౌతంకు ఆ ఇంట్లో ప్రాణాపాయం కూడా ఉండవచ్చని ఇద్దరూ భయపడ్డారు. పరిణామం, గౌతమ్ శాశ్వతంగా చిన్న మామ్మ ఇంటికి చేరుకొన్నాడు. తమ ప్లాన్ 2 గూడా సక్సెస్ అయిందని,  తల్లీకూతుళ్లు సంబరబడ్డారు. రఘురాం, రోజూ వీలయినంత సమయం గౌతంతోనే గడప నారంభించేడు. రోజూ రాత్రి,  గౌతమ్ నిద్రబోయిన తరువాత ఇల్లు చేరుకొంటున్నాడు. ఈశ్వరి తన గూర్చి, కించిత్తు పట్టించుకోకపోవడంతో, రఘురాముకు జీవితం మీద విరక్తి పుట్ట నారంభించింది.

సంవత్సరాలు గడిచేయి. ఈశ్వరి పెంపకంలో విలాసరావుకు తను ఆడింది ఆట, పాడింది పాట, అయింది.  సరిదిద్దడానికి రఘురాం  ప్రయత్నిస్తే, వాడి విషయంలో కలుగజేసుకోవద్దని ఈశ్వరి హెచ్చరిక చెయ్యడంతో, పరిస్థితి చెయ్యి జారి, విలాసరావు సకల గుణాభిరాముడుగా మారేడు. అటు, జానకి రఘురాముల పెంపకంలో గౌతమ్ స్కూలు, కాలేజీలలో ఉత్తమ విద్యార్థిగా పేరు తెచ్చుకొన్నాడు. ఎంట్రన్స్ పరీక్షలలో  పాసయి, నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ , రూర్కెలాలో ఇంజినీరింగు పాసయి, బెంగుళూరులోని ఒక బహుళ జాతి కంపెనీలో ఇంజనీరుగా చేరేడు.

రఘురాముకు మరో సమస్య ఎదురయ్యింది. తల్లి సలహా మేరకు, ఆస్తినంతటిని తన పేర మార్చమని, రఘురాం మీద ఈశ్వరి రోజూ ఒత్తిడి పెట్ట నారంభించింది. అప్పటికే జీవితం మీద విరక్తి చెందుతున్న రఘురాం, అడ్డు చెప్పక, ఈశ్వరి కోరిక నెరవేర్చేడు. లాటరీలో కోటి రూపాయిలొచ్చినట్లు సంతోషించేరు, తల్లీకూతుళ్లు.

ఈశ్వరి సంతోషం అట్టే రోజులుండలేదు. సుపుత్రుడు విలాసరావు, రోజూ ఇంట్లో రాత్రింబగళ్లు సహచరులతో పేకాటలు, త్రాగుడు మొదలుపెట్టేడు. వారందరికు టీలు, టిఫిన్లు అందివ్వడం, ఈశ్వరి డ్యూటీ అయింది. అడ్డు చెబితే తిరగబడ్డానికి సిద్దమవుతున్నాడు, ముద్దుల కొడుకు.

జీవితం మీద విరక్తి చెందిన రఘురాం, మనశ్శాన్తి కోసం రామకృష్ణ  మిషనులో చేరడానికి నిశ్చయించుకున్నాడు. గౌతమ్, జీవితంలో స్థిరబడడంతో, పినతల్లి జానకికి, గౌతముకి, నచ్చచెప్పి, తను వారికెప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చి, రఘురాం రామకృష్ణ మిషనులోని సేవాకార్యక్రమాలకు అంకితమయిపోయేడు.

చిన్నమామ్మ తనను వదలి ఉండలేదని గౌతముకు బాగా తెలుసు. తాతగారు మోహనరావు, కూడా రిటైర్ కావడంతో వారిద్దరిని తనదగ్గరే శాశ్వతంగా ఉంచుకోవాలని నిశ్చయించి, స్వంత ఊరు చేరుకొన్నాడు, గౌతమ్. తన మనసులోని మాట గౌతమ్ చెప్పడంతో, జానకి, మోహనరావు, సంతోషంగా అంగీకరించేరు. మాటల సందర్భంలో గౌతమ్, ఈశ్వరి  విలాసరావుల యోగక్షేమాలు కనుక్కున్నాడు. విలాసరావు వ్యసనాలకు, ఆస్తి అంతా కర్పూరంలాగా హరించుకుపోయిందని, వాడు జాడ లేకుండా తిరుగుతున్నాడని, ఈశ్వరి వర్ణించలేని దీనావస్థలో ఉందని తెలుసుకొన్నాడు. భోజనం ముగియగానే, చిన్నమామ్మ సలహా తీసుకొని, ఈశ్వరిని కలిసేడు, గౌతమ్. పినతల్లి పరిస్థితి చూసి ద్రవించుకు పోయేడు. తనతోబాటు శాశ్వతంగా బెంగుళూరు  రమ్మనమని ఆహ్వానించేడు. ‘నీకు, మీ నాన్నకు నేను చేసిన అమానుష అన్యాయాలకు భగవంతుడు నాకు తగిన శిక్ష  వేసేడు. నన్ను ఆ శిక్ష అనుభవించనీ, నాయనా’అని ఈశ్వరి ఎంత చెప్పినా, ‘పిన్నీ, నిన్నిలా వదలి నేను వెళ్ళలేను. గతాన్ని మరచిపో. మరో ఆలోచన లేకుండా నాతో బయలుదేరు.’ అని గౌతమ్ పట్టుపట్టడంతో ఈశ్వరి ‘సరే’ అంది.

నలుగురూ బెంగుళూరు చేరుకొన్నారు. ఈ శుభ పరిణామం తెలిసి, చిన్నప్పుడు పిన్ని నేర్పిన సుమతీ శతకంలోని పద్యం, ‘అపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ’జ్ఞాపకం వచ్చి, రఘురాం తన తనయుని విశాలహృదయాన్ని మనసారా మెచ్చుకున్నాడు.

 

******

 

 

 

 

 

హామీ పత్రం

ఇందుమూలముగా  నేను జతబరచి  సమర్పిస్తున్న కథ – నేర్పరి ,

నా స్వీయ రచన.

దేనికీ  అనువాదముగాని అనుసరణ  గాని కాదు.

ఏ పత్రిక / వెబ్ మేగజీను / బ్లాగులలో  ప్రచురణ కాలేదు. వాటి పరిశీలనలోనూ  లేదు.

 

( గరిమెళ్ళ వెంకట లక్ష్మీ నరసింహం )

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *