April 18, 2024

పనిమంతుడు సారంగ్

రచన ; కాదంబరి కుసుమాంబ

 

సారంగాపూర్ లో పుట్టాడు. కాబట్టి  సారంగ్ అని తాత శ్రీనివాస ప్రసాద్  చాలా ప్రీతితో పేరు పెట్టేసాడు. సారంగానికి చదువు అబ్బలేదు. ఫ్రెండ్స్ తో లల్లాయిపల్లాయి కబుర్లు చెప్పేటప్పుడు

‘నాకు ఇంత చక్కని పేరుని మా తాతయ్య పెట్టాడు. నా అబ్బ పెట్టలేదు. కాబట్టి నాకు విద్య అబ్బ లేదు.’ అదొక పెద్ద జోక్ అన్నట్లుగా  దోస్తుల గ్యాంగ్ విజిల్స్ వేస్తూచప్పట్లు  కొడుతూ పకపకా నవ్వుతుంటారు.

నూనూగు మీసాల నూత్న యవ్వనం వచ్చాక  పని నేర్చుకోక  పని చేతకాక. చేసే పనేమీ కనబడక  చిన్నపాటి చోరకళలను అభ్యసించసాగాడు సారంగం.

తొలి దొంగతనాన్ని  ఒక మోటార్ బైక్ తో  శ్రీకారం చుట్టాడు. పార్ట్స్ అన్నీ ఊడదీసి.

విడి విడి భాగాలను. రూపు మార్చిన ఆ వాహనాన్ని అమ్మాలని ట్రై చేసాడు.

కానీ ఊరి వాళ్ళకు దొరికి. నిఖార్సైన తన్నులు తిన్నాడు.

గ్రామప్రజలు  దగ్గర నిలబడి. వాడు ఊడీసిన భాగాలను  తిరిగి బిగించమన్నారు.

ఎటాగైతేనేం. సారంగుడు చెమటోడ్చి  మోటార్ వాహనాన్ని పూర్వరూపంతో వారికి అందించగలిగాడు.
ఒకే గూటి పక్షుల్లాగా చేరిన మిత్రులతో కలిసి. మళ్ళీ చిరు దొంగతనానికి ప్రయత్నం చేసాడు. మొదటిసారి మోటార్  అచ్చిరాలేదని.

ఈసారి. ఒక స్కూటర్ ని ఒకానొక గృహము నుండి ఒడుపుగా తస్కరించి. యధాప్రకారం  పార్టులన్నీ ఊడదీసాడు.

మరల ప్రజలకు దొరికిన వాడై. సారంగ్  పోలీస్ స్టేషన్ చేరాడు. ఏడు ఊచలను  అవి అరిగిపోయేదాకా  లెక్కపెట్టాడు.

ఇంట్లో వాళ్ళకి  వీడి పనులు తలవంపులుగా మారినవి.

ముచ్చటగా మూడోసారి  సైకిలును తస్కరించాడు. ఇంట్లో వాళ్ళే  ఈమారు పట్టుకున్నారు. అందరూ ‘నీ మూలాన్న. ఈ ఊళ్ళో తలెత్తుకు తిరగలేకున్నాము ‘ అంటూ తిట్టసాగారు.

ఎటూ తోచక. హడావుడిగా  అదే  బైసికిల్ మీద  డొంకదారిలో. అమిత వేగంతో  ఛల్  ఛలో ఛల్  పట్నంలోకి చేరాడు.

నగరంలో ఉన్న  బృహదీశ్వరరావు  సారంగ్ నాన్నమ్మకు దూరపు చుట్టం. తటాలున ఆ వేలు విడిచిన చుట్టరికాలు గుర్తుకువచ్చాయి.
అవసరం అన్నీ నేర్పుతుంది. అటూ ఇటూ ఇటూ తిరుగాడాడు. బంధువు అడ్రసును కనుక్కోగలి గాడు. ఇల్లు చేరి. స్వపరిచయాన్ని  నగిషీలు చెక్కి.  బృహదీశ్వరరావు చెవిని వేసి. వినయంగా నిలబడ్డాడు.

బృహదీశ్వరరావు  ఈ బంధుత్వం గురించి. ఆట్టే పట్టించుకోలేదు. గానీ. అతనిది కారు repairs షెడ్  బిజినెస్  ఇద్దరు మెకానిక్స్ పని మానేసి వెళ్ళిపోయారు.
ఇప్పుడు  బృహదీశ్వరరావుకి పనివాడు ఒకడు అవసరం.

వెంటనే  ‘సాయంత్రం చల్లబడ్డాక మా షెడ్ కి పద.’ అన్నాడు.

ఆ పూట గృహిణికి చెప్పి. భోజనం పెట్టించాడు. అన్నం తిని. సారంగ్ సైకిల్ ని రిపేర్ చేసు కున్నాడు.

అడ్డదారిలోముళ్ళబాటలో పడి వచ్చాడు. సైకిలు తుక్కు తుక్కు అయ్యింది.

ఆ డొక్కు సైకిల్  సారంగ్ చెయ్యి పడగానే నిమిషాల మీద స్వాధీనపతికగా మారింది.

కిటికీలోంచి అతనినే  బృహదీశ్వరరావు గమనిస్తున్నాడు.

‘సారంగ మంచి పనిమంతుడే.’ తృప్తిగా అనుకున్నాడు.

మూడేళ్ళు పూర్తి అయ్యేసరికి. సారంగ్  నైపుణ్యం కలిగిన పనివాడు అని ప్రశంసలు పొందాడు.

పల్లెకు వచ్చి. ‘మునుపు తాను ఎవరి ఇంట్లో సైకిల్ దొంగిలించాడో  ఆ ఇంటిని వెదుక్కుని వెళ్ళాడు.
అప్పటికే ఆ ఇంటి వారు పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నారు. ‘మాస్టారూ’ అని పలకరించాడు. కొత్త మోపెడ్ ని కొని ఇచ్చి.  పంతులుగారి కొడుకుని ‘క్షమించండి.’ అంటూ వారి కాళ్ళ మీద పడ్డాడు.

అటు తర్వాత  జరిగిన వింత పరిమాణం  ఊరి ప్రజలను ఆశ్చర్యచకితుల్ని చేసింది.

పంతులుగారి అమ్మాయిని. కాణీ కట్నం తీసుకోకుండా సారంగ్ పెళ్ళి చేసుకున్నాడు.
ఊరి మన్ననలను ఇబ్బడిముబ్బడిగా పొందాడు. చూస్తుండగానే పుష్కరం గడిచింది.
ఇప్పుడు అటు వెళ్తే మీకు కనబడే చక్కని దృశ్యాలు  పిల్లాపాపలలో సారంగ్  సొంత రిపేర్ షాపులో  పనులన్నీ చేసుకుంటూ. అక్కడ ఉన్న సిబ్బందికి పని నేర్పిస్తూ. పనులు పురమాయిస్తూ  కస్టమర్స్ ని. తెలిసినవాళ్ళని. అందరినీ పలకరిస్తూ ఉండడం.
‘దొంగిలించిన వస్తువులని బిగించీ బిగించీ. మొత్తానికి వీర పనిమంతుడు ఐ కూర్చున్నాడు. ఔరా’ అనుకుంటున్నారు. ముక్కు మీద వేలు వేసుకుని పల్లెలోని యావన్మందీ.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *