April 18, 2024

మనసుకు ఉద్దీపనగా నిలిచిన రచనా చికిత్స

సమీక్ష: సి. ఉమాదేవి

డా. లక్ష్మీ రాఘవగారు మన సమాజంలో జరుగుతున్న అనేక సమస్యలకు తన కథలద్వారా పరిష్కారమందించే ప్రయత్నం చేయడం ముదావహం. జీవితం వడ్డించిన విస్తరికాదు. ఎన్నో సమస్యలు మిళితమై మనసును పట్టి కుదుపుతాయి. కాని వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నపుడే మనిషి తన ఉనికిని స్థిరంగా నిలుపుకో గలుగుతాడు. ఈ నేపథ్యంలో రచయిత్రి మనకందించిన కథలు మనలో ఆలోచనాబీజానికి మొగ్గ తొడుగుతాయి.
ఇక మనం కథాబాటలోకి అడుగిడదాం. పుస్తకానికి శీర్షికగా నిలిచిన కథ మనసుకు చికిత్స. ఒకే చోట ఉద్యోగం చేస్తున్న మూర్తి రాజారావు సంభాషణ మన మనసుకు నిజంగా చికిత్సే. రాజారావు ఆఫీసుకు ప్రతిరోజు ఆలస్యంగా వచ్చినా పనిలో మాత్రం చక్కని ప్రతిభ చూపుతాడు. అయితే ఆఫీసరు మూర్తి అడిగిన ప్రశ్నకు రాజారావు తన బాధను వివరంగా చెప్పుకుంటాడు. మూర్తి ఇచ్చిన సలహా అతని మనసును ఉత్తేజపరుస్తుంది. జీవితం బాగుండాలంటే బుద్ధి మార్చుకోవాలి. అలాగే సమస్యను మరో కోణంలో చూడాలి అని చెప్పడం బాగుంది. ఆలోచనలకు మనసుకు చికిత్స అవసరమే అని రచయిత్రి చెప్పడం నిజమే కదా. ఎంతైనా అమ్మ కథ నేటి సమాజంలోని వింతపోకడలకు అధ్దం పట్టింది. తల్లిని వదిలించుకోవాలనే కొడుకు ఆమెను ఏదో ఒక బస్సులో ఎక్కిస్తాడు. ఆమె చెప్పిన బస్సు అది కాదని కండక్టరు బస్సులోనుండి దించివేస్తాడు. బస్సులోనే ఉన్న దినేష్ అనే వ్యక్తి ఆమెకు యాభైరూపాయలు చేతిలో పెట్టి తన మఫ్లర్ కూడా అందిస్తాడు. అయితే ఆమెను వృద్ధుల డేకేర్ లో చూసిన దినేష్ ఆమెను గుర్తుపడతాడు. తన దగ్గరున్న మూడువందలు కొడుక్కి చేర్చమని దినేష్ ను అడగడం తల్లి మనసును విశదపరుస్సుంది.
మార్పు కథ నేటి సమాజంలో జరుగుతున్న అనైతిక కార్యకలాపాలను ఎలా కట్టడి చేయాలో వివరించింది. సమాజం బాగుండాలంటే పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల బాధ్యతకూడా ఉంటుంది. తండ్రి రామచంద్ర కూతురు రమ్యను మూడు కంపెనీలు ఉద్యోగానికి పిలుస్తున్నాయి అంటే రమ్య లెక్చరర్ గా చేరాలనుకుంటుంది. మానవత్వపు విలువలు తెలియచేయాలనుకుంటుంది. సమాజంలో కదలికకు బీజం వేస్తుంది.
పోరాటం కథలో ఈరోజు కరోనా మనిషి జీవితాన్ని అతలాకుతలం చేస్తోంది. డాక్టర్లు పోలీసులు నిత్యం ప్రజాసేవలో తలమునకలవుతూ ఇంటికి కుటుంబసభ్యులకు దూరంగా బాధ్యతలు నిర్వహించడం చూస్తే వారికి ప్రణమిల్లాలనిపిస్తుంది.
రైతుల ఆవేదనను స్పష్ఠం చేసిన కథ ఆశయం. యువతలో కూడా వ్యవసాయంపట్ల అవగాహన పెరిగి రైతులకష్టాలను తీర్చేదిశగా అడుగు పడినప్పుడు ఆశయానికి పునాదులు పడతాయి అని చెప్పిన కథ. మాతృహృదయం తల్లి తనపిల్లలలో ఎవరు ఆర్థికంగా వెనకపడ్డారో వారిపైనే ధ్యాసంతాపెట్టి వారి ఉన్నతికి అభివృద్ధికి దోహదపడాలనుకుంటుంది. అయితే తల్లిని అపార్థం చేసుకున్న కూతురు గాయత్రి తల్లికి ఎప్పుడూ పిల్లలలో ఎవరికి కష్టం ఉంటుందో వారిమీదే ఎక్కువ దృష్టి ఉంటుందన్న నిజాన్ని స్వానుభవంతో తెలుసుకోవడం గాయత్రికే కాదు మన కళ్లు చెమ్మగిలుతాయి. మరెన్నో మంచికథల సమాహారం మనసుకు చికిత్స కథాసంపుటి. రచయిత్రికి అభినందనలు

2 thoughts on “మనసుకు ఉద్దీపనగా నిలిచిన రచనా చికిత్స

  1. ఈ సమీక్ష మనసుకు తగ్గ చికిత్సe.ఎంత అవసరమో తెలుపుతుంది. కథల్లోని విశిష్టతను తెలుపుతూ రాసిన విధానం పుస్తకం కొనుక్కుని అయినా చదవాలనిపిస్తిఉంది. ధన్యవాదాలు ఉమా దేవి గారూ .

Leave a Reply to C.Uma devi Cancel reply

Your email address will not be published. Required fields are marked *