June 24, 2024

ఋణం

రచన: దొడ్డపనేని అఖిలాండేశ్వరి

“గుల్లూ ఏం డిసైడ్ చేసావ్? తోడు నీడవై జీవితాంతం నాతో కలిసి నడుస్తావనే ఆశ నెరవేరుతుందను కొంటున్నా, మరి నీతీర్పు ఏవిటో!” ఉత్సుకత నిండిన స్వరంతో ప్రశ్నించాడు కృష్ణవంశీ.
కృష్ణవంశీ మోకాలుమీద తన గడ్డం ఆన్చుకుని కూర్చుని అతని మొహంలోకి తదేకంగా చూస్తున్న గుల్షాద్ కళ్ళల్లో నీళ్ళు చిప్పిలి ముత్యాల సరాలయ్యాయి చెంపలమీద.
తన చేత్తో బుగ్గల మీది కన్నీటిని తుడుస్తూ ” ఛ!ఛ! కన్నీళ్ళెందుకు నీకు యిష్టమైతే అవునను లేదంటే లేదు, ఏడవకు ప్లీజ్ ” మెత్తని స్వరంతో అనునయంగా అన్నాడు .
“జీవిత సహచరిగా నీతో కలిసి నడవమన్నందు సంతోషపడనా లేక అమ్మగా అమైరా భవిష్యత్తు గురించి బెంగతో దిగులుపడనా? చెప్పాలంటే నా మనసుకి సరైన సమాధానం దొరకడం లేదు. కాస్తంత శాఖలు మారితేనే కొంపలు అంటుకుంటున్నంత హంగామా చేసే మావాళ్ళు మీవాళ్ళు మన పెళ్ళిని హర్షిస్తారా?” అంటూ ద్వయదీ భావం మనసులో కొట్టుమిట్టాడుతుండగా అభావంగా చూసింది వంశీ కళ్ళల్లోకి, బుగ్గలమీద జారిన కన్నీటిని చున్నితో తుడుచుకుంటూ.
గుల్షాద్ రెండుచేతుల్ని తన అరచేతుల్లో ఇముడ్చుకుని “చూడు ఈరోజు నుండి అమైరా నాబిడ్డ ప్లీజ్ ట్రస్ట్ మీ! నా మీద భరోసా వుంచు.” గుల్లు చేతిని తన నెత్తిమీద పెట్టుకుని కళ్ళలో ప్రేమ కురిపిస్తూ ధృడంగా పలికాడు. వింటున్న గుల్షాద్ కి ఇది అద్భుతమో ఆనందమో అర్ధంకాలేదు .
“ఆంటీ అంకుల్ వప్పుకుంటే నీ సమాధానం ఎస్సేగదా !” కాస్తంత చిలిపితనాన్ని ఆరాటంతో కలిపి ప్రశ్నించాడు.
అది జరిగే పనా? రోజుకి ఐదుసార్లు నమాజు చేయందే పొద్దు గడవదు తన ఇంట్లో. వంశీ తనని తాతగారికి పరిచయం చేసినప్పుడు చెప్పాడు నియమనిష్టలకు తాతగారి తరువాతే మరెవరన్నా ముత్యాలపల్లిలో అని జనం అనుకుంటారని. రెండువైపులా నిష్టా గరిష్టులు. ఏమవుతుందో ఏమో? కువకువ లాడింది గుల్షాద్ గుండె.
గుల్షాద్ మెరైన్ బయాలజీలో ఎమ్మేస్సి పట్టాపుచ్చుకుని ఉద్యోగంకోసం ఎదురు చూడకుండా ముత్యాలసాగు చేపట్టి దాదాపు రెండేళ్ళయింది. ఇప్పుడు పంట చేతికొచ్చింది.
తన స్వంతంకాదు ఈ సాగు చేస్తున్నచెరువు . అటు పుట్టింటివారికిగాని యిటు మెట్టినింటి వారికి గాని స్వంత చెరువు లేదా వ్యవసాయ భూములు లేవు. చెరువు లీజుకు కావాలని సోషల్ మీడియాలో యాడ్ పెడితే అగ్రికల్చర్ బియ్యసి చదివి సొంత వ్యవసాయం, చేపలు, ఆవుల పెంపకాలతో నిండా మునిగిన కృష్ణవంశీని ఆ విషయం విశేషంగా ఆకర్షించి తన చెరువు నివ్వడానికి అగ్రీ అయ్యాడు. ఇద్దరు కలిసి మెలిసి చేసుకుని లాభాలు పంచుకునేట్టు.
ఇక్కడ గుల్షాద్ రిక్వయిర్మెంట్ ఏమిటంటే చెరువుకు ప్రొటెక్షన్ కావాలి లేదంటే పంట దొంగల పాలవుతుంది. అదీకాక వంశీ అక్కడే ఉంటాడు కనుక తను 50 కిలో మీటర్లు ప్రయాణించి హైద్రాబాదునుండిఎప్పుడయినా ఒకరోజు రాకపోయినా దిగులుండదు.
వంశీ భువనేశ్వర్ CIFA (సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్) కు వెళ్ళి వారంరోజుల ట్రెయినింగ్ కూడా తీసుకున్నాడు ముత్యాల పెంపకంలో. ఇప్పుడు అన్ని పనుల్లో నేర్పరితనం సాధించాడు. ఆల్చిప్పల సెలక్షన్, వాటికి సర్జరీలు చేయడం తరువాత ఓపదిరోజులు వాటిని icuలోనుంచి జాగ్రత్తగా చూసుకోవడం , ఎప్పటికప్పుడు ఇద్దరు వాటిని అబ్జర్వ్ చేసి చనిపోయిన వాటిని తొలగించడం అవసరం అనుకున్నప్పుడు మందులు వాడడం , నెలకోసారి వాటిని క్లీన్ చేయడం , అవసరం పడ్డప్పుడు మేత అందించడం. ఇద్దరు కలిసి మెలిసి పనిచేస్తుంటే రెండేళ్ళు ఇట్టే తిరిగొచ్చాయి ఆనందంగా.
ఎంతో సాన్నిహిత్యం పెరిగింది ఇరువురి మధ్యా. అప్పుడప్పుడు ఇద్దరు కూచుని తమ కుటుంబాల గురించి సాంస్కృతిక సంబంధాలగురించి, గుల్షాద్ వివాహం, ఇష్టపడి చేసుకున్న భర్త పెళ్ళయి ఆర్నెల్లు తిరగకుండానే అమైరాను కడుపున మిగిల్చి తనని వంటరి దానిని చేసి యాక్సిడెంట్లో పోవడం తరువాత తను మనసు గట్టిపరచుకుని ఏవిధంగా చదువు ముగించిందో చెప్పేది.
కృష్ణవంశీ స్వాంతన వచనాలతో గుల్షాద్ ఎంతో సేదతీరింది ఈ రెండేళ్ళలో. రోజుకొకసారి అయినా చేస్తున్న పనిలో బంగారు భవిష్యత్తు అదీ తమ ఇద్దరి అభివృద్ధితో, కన్న కలలను సాకారం చేసుకోవాలని గట్టి పట్టుదలతో వున్నారు. పంట కూడా బాగుంది. ఆ మధ్య శాంపిల్గా కొన్ని ఆల్చిప్పలను రాండమ్ గా చెరువునుండి సేకరించి ముత్యాలను కలెక్టు చేసి చార్మినార్ మార్కెట్లో చూపిస్తే వారి పంటకు (ముత్యాలకు) మంచి ధర వచ్చింది. క్వాలిటి పరంగా ఎంతో బాగున్నాయి ముత్యాలు.
అలా యిద్దరి మధ్యా ఒకరంటే ఒకరికి అరమరికలులేని ప్రేమ-ఆప్యాయతలు, పొరపొచ్చాలు లేని స్నేహం, అంతకు మించిన మధుర భావనలు చిగురించాయి. కాని ఉచితానుచితాల దోబూచులాటల మధ్య ఇద్దరు గుంభనంగా ఉండిపోయారు.
అప్పుడప్పుడు గుల్షాద్ పేరెంట్స్ అమైరాను తీసుకుని ఫామ్ కి వస్తారు. ఆ ఏరియా అంతా వారికి తెలిసిందేనట. వారి పెద్దవారి మాటల ద్వారా విన్నదాన్నిబట్టి. గుల్షాద్ తాతగారు సుమారు డెబ్బై ఏళ్ళక్రితం అక్కడ తమకున్న ఆస్తిపాస్తులన్నిటిని అమ్ముకుని సిటీకొచ్చి స్థిరపడ్డారట.
వారికి తన ఫామ్ ని చూడగానే సంతృప్తితో కడుపు నిండిన భావన. కష్టపడే తత్వం కలిగిన కృష్ణవంశీని చూస్తే పరమానందం కలుగుతుంది. మెుత్తానికి అతని తీరు వారికి నచ్చింది. తను అతని పార్టనర్ షిప్ తో రాంగుస్టెప్స్ వేయడం లేదన్న నమ్మకం పేరెంట్స్ కి కలిగిందని గ్రహించి సంతోషించింది గుల్షాద్.
ఉన్నంటుండి వంశీ నిన్ననే తన మనసులోని భావాన్ని వెలిబుచ్చి గుల్షాద్ నిర్ణయంకోసం ఎదురు చూస్తున్నాడు. ఆలోచనలో పడింది గుల్షాద్…
—————
ఎప్పుడో డెబ్బైరెండేళ్ళకు పైబడిన నాటి మాట – అవి రజాకార్ల పీడనతో హైదరాబాదు రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా ఇప్పటి తెలంగాణావారు కునారిల్లుతున్నరోజులు. అసలు రజాకార్లు అంటే శాంతిని వాంఛించే స్వచ్చంద సేవకులని అర్ధం. అప్పటి హైదరాబాదు 7వ( చివరి)నవాబు అయిన మీర్ ఉస్మాన్ అలీఖాన్ రజాకార్లను తన రాజ్యంలో శాంతిని కాపాడటానికి అప్పాయింట్ చేసుకున్నాడు, అది ఒక ప్రయివేట్ సైన్యం. వారికి నాయకుడు ఖాసింరజ్వీ.
మొదట్లో వీరు ముస్లింల సాంస్కృతిక అభివృద్ధి కి, వారి వికాసానికి పనిచేసారు. కాని కాలక్రమేణా రజాకార్లు రాక్షసి మూకలుగా మారి హిందువులపై మత విద్వేషాల్ని రగిలించారు పాలకులు ఇతర ముస్లింలలో.
వారు హిందువుల ప్రాణ, మాన, ధన, ధాన్యాలను లూటీ చేస్తున్న వైనం హిందువుల గుండెల్లో రైళ్ళను అదను తప్పితే శరీరాలను తుపాకుల గుళ్ళతో జల్లెళ్ళుగా మారుస్తున్న కఠినమైన రోజులు.
హిందూమత విద్వేషి అయిన ఖాసింరజ్వీ నాయకత్వంలో ఈ మతోన్మాదులు ఊళ్ళ మీదపడి పోలీసు కాంపుల పేరున ధనాన్ని వసూలు చేసి ప్రభువుల ఖజానా నింపేవారు. దీనిని వ్యతిరేకించిన హిందువులపైన దాడులకు తెగబడి దోపిడీలు, దౌర్జన్యాలకు పాల్పడేవారు. రాగారాగా వారి ధోరణి పూర్తి హింసాత్మకంగా మారిపోయింది. అలా ప్రజలనుంచి దోచుకొచ్చిన డబ్బుతో ప్రభువులు వారి సామంతులు విలాసాలతో కూడిన భోగభాగ్యాలను అనుభవించేవారు.ఊయలవాడ,బోనగిరి, లింగాపూర్, బైరాన్ పల్లి, పరకాల, పెరుమండ్ల, ధర్మవరం, సూర్యాపేట, నల్గొండ లాంటి హైదరాబాదు చుట్టుపక్కల మరెన్నో ఇతర గ్రామాల ప్రజలను హింసించి చెడ దోచుకున్నారు తమ క్రూర చర్యలతోటి. … ..
అది 1947 వ సంవత్సరం ఆగస్టు 15, యావత్ భారతావని ఆనంద కోలాహాలాలమధ్య స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్న శుభవేళ , హైదరాబాదు ప్రజలు మాత్రం పెచ్చరిల్లిన రజాకార్ల దురాగతాలతో బితుకు బితుకుమంటూ కాలం గడుపుతున్నారు, తమకెప్పుడు మిగతా భారతీయుల్లా స్వేచ్ఛా సమయం ఆసన్నమవుతుందా అని ఎదురు చూపుల్తో.
మనకు స్వాతంత్ర్యం వచ్చేనాటికి దేశంలోవున్న చిన్నాపెద్దా సంస్థానాలన్నీ ఐక్యభారతావనిలో విలీనమైనాయి. కాని హైదరాబాదు నిజాము అందుకు సమ్మతించక నైజాం రాజ్యం’ ప్రత్యేక ముస్లిం స్వతంత్రరాజ్యంగా’ ఉంటుందని ప్రకటించి పాలకుల గుండెల్లో గుబులు పుట్టించాడు. భారత్ లో విలీనం చేయమని అప్పటి హోమ్ మంత్రి సర్దార్ వల్లభభాయ్ పటేలు ఎంత కోరినా అంగీకరించలేదు. కనీసం హైదరాబాదు రాష్ట్రాన్ని ముస్లిం రాష్ట్రంలా పాకిస్థాన్ లో కలపబోమని హామీ ఇవ్వమన్నా నిజాం సర్కారు అందుకు ససేమిరా వప్పుకోలేదు. ఇతర దేశాల మధ్యవర్తిత్వం కూడా అక్కరకు రాలేదు ఈ విషయంలో.
కాని రోజురోజుకు నైజాంరాజ్యంలో రజాకార్ల దురాగతాలు ఎక్కువైపోయాయి. దానికి తోడు పెరిగిపోయిన ఇతర రాజకీయ వత్తిళ్ళు, ముఖ్యంగా కమ్యునీస్టులు ప్రజాపోరాటాల పేరిట చేసే అలజడులు, వీటికి తోడు భారత ప్రభుత్వం రజాకార్లజోలికి వస్తే దేశమంతటా హిందువులను అల్లకల్లోలం చేస్తామన్న ఖాసింరజ్వీ బెదిరింపులు భారత సర్కారుని గుంజాటనలో పడేసి తదుపరి చర్యలకై వారిని ఊగిసలాటలకు, తెలంగాణా ప్రజలను అశాంతికి గురిచేసి తీవ్ర కష్టాల పాలు చేసింది .
సదాశివ శాస్త్రి బీబీనగర్ ఏరియాలోనే మంచికి , మర్యాదకు చిరునామాగా, వేదవిద్య తెలిసి మానవత్వం ఉన్న వ్యక్తిగా పేరు గడించాడు. ముత్యాలపల్లిలో కొలువైవున్న శివాలయంలో దేవుని సేవ చేసుకుంటూ చుట్టు పక్కల నాలుగు పల్లెల ప్రజల దైవకార్యాలకు ఇతర శుభ కార్యాలకు మంచిచెడులు తెలియజేస్తూ పౌరోహిత్యం వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. బ్రహ్మవర్చస్సుతో ప్రకాశంచే ఆయన్ను జనం దైవజ్ఞుడిగా భావించేవారు. ఇద్దరు పిల్లలు, ధర్మపత్ని గాయత్రి. దేనికిలోటులేని సంసారం. మూడవనెల తిరగని పురిటాలు గాయత్రి. బాబుకి పరమేశ్వర శాస్త్రి అని నామకరణం చేశారు.
ఆరోజుల్లో హైదరాబాదు స్టేట్లో యిప్పటిలా జలవనరులు లేవు. వ్యవసాయం ముఖ్యంగా చెరువుల క్రింద వర్షాధారంగా సాగేది, చాలా వరకు మెట్టపంటలే వారి జీవనాధారం. వారు ప్రధానంగా తినేది జొన్నలు, మక్కలూ, సజ్జలు. కపిలి/మోటబావుల కింద ఎకరారెండెకరాలు వరి పండిచేవారు. పండుగలు పబ్బాలప్పుడు అపురూపంగా ఆ వరి ధాన్యాన్ని బియ్యం చేసుకుని జాగ్రత్తగా వాడుకునేవారు. అదో అపురూపమైన ఘట్టం వారి జీవితాలలో.
ఈ ఛోటామియా ఖాసిం రజ్వీకి నమ్మినబంటు. నైజాంరాష్రంలోని భువనగిరి దాని చుట్టుపట్ల కొన్ని గ్రామాలలో శిస్తు వసూలు చేసే అధికారి. ఇతను తాను ప్రజలనుంచి దోచుకున్న ధనంతో ఖాసింకోసం గొప్పవిందు ఏర్పాటు చెయ్యాలనుకుంటాడు అతని వద్ద తన ప్రాపకం పెంచుకోవడానికి. ఇవ్వనని అడ్డం తిరిగిన స్త్రీ పురుషుల్ని అవమానపరచి , హింసించి, పసివాళ్ళని అమానుషంగా చంపి దోచుకున్నవాటితో విందులు చేసుకుంటారు, అదీ వారి నైజం అప్పట్లో.
సంక్రాంతి పండుగకు రెండు రోజులముందు ఛోటామియా అనుచరగణం తమ ఇలాకాలోని ఊళ్ళ మీదపడి వాళ్ళకి కావలసిన వస్తువుల్ని , డబ్బు, ఉప్పు, పప్పులు, బియ్యం, కోళ్ళు, మేకలు, గొఱ్ఱెలు ఒకటనేమిటి ఒక దావతుకు కావలసిన సమస్త సంభారాలను హిందువుల యిళ్ళనుండి దోచుకున్నారు.
అలా ఈ దుర్మార్గులు ఆ రోజు సదాశివ శాస్త్ర్రి యింటిమీద పడ్డారు, ! గాయత్రి ఒక్కతే పిల్లలతోవుంది ఆ సమయంలో. ఉట్లమీదున్న వెన్న నెయ్యి కుండలను, పండుగకు వండి పెట్టిన పలారాలను తీసుకున్నన్ని తీసుకుని యిల్లంతా చిందరవందర చేసి, బియ్యం యితర వస్తువులను విరజిమ్మి( కొద్దిపాటి అన్నకోపంతో) బూతులు తిట్టుకుంటూ పోయారు. పిల్లలిద్దరిని కావిలించుకుని గాయత్రి దుఃఖం బయటకు రాకుండా రోదిస్తుండగా ఎలాంటి దుస్థితిని చూడవలసి వస్తుందోనని గజగజ వణకుతూ యింట్లోకి వచ్చాడు శాస్త్రి .
పిల్లలతో సహా గాయత్రిని గుండెల్లో పొదువుకున్నాడు. బాణం తగిలిన పావురంలా చాలా సేపు వణికిపోతూ ఆ పైన పైకే బెక్కుతూ వుండిపోయింది గాయత్రి. “పీడకలలా భావించి మర్చిపో గాయత్రి. నువ్వు పిల్లలు ఏమయిపోయారో ఎలావున్నారోనని భయంతో గుండెలవిసి పోతుంటే ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని వచ్చాను. జీవంతో వున్న మీ ముగ్గుర్ని చూడగానే నిత్యమూ నేను కొలిచే శివయ్య నాతోడే వున్నాడని పిస్తొంది ” రెండు చేతులు పైకెత్తి మనసులో ఆది దేవుణ్ణి నిలుపుకుని మనసారా ప్రార్థించుకున్నాడు.
” పిల్లల జోలికి వచ్చి వాళ్ళకేం అపకారం తలపెట్టలేదుకదా ఆ దుర్మార్గులు? మూర్ఖులు” అని గొణుక్కుంటూ పిల్లల్ని తడుముతూ తట్టితట్టి అపురూపంగా చూసుకున్నాడు. తన పిల్లల్ని చూసుకుంటుంటే రామ్ యాదవ్ పిల్లాడు గుర్తుకొచ్చి మనసులో బావురుమని దుఃఖపడ్డాడు. పైకిమాత్రం అసలేమి జరగనట్లు గంభీరంగా ఉన్నాడు.
సదాశివ శాస్త్రి ఆ రోజు త్వరగా గుడికివెళ్ళి సంధ్య దీపం వెలిగించి మనస్సు తొందర చేస్తుంటే ప్రతిరోజులా ఎక్కువ సమయం అక్కడ ఉండకుండా గబగబ యింటికి బయలు దేరాడు. రచ్చబండ దగ్గరకొచ్చేసరికి చాంద్ సాహెబ్ కలిసాడు. ఇద్దరూ రెండు నిమిషాలు పిచ్చాపాటి మాట్లాడుకున్నారో లేదో రజాకార్లు వచ్చి దావత్ కి కావలసిన సామాను కోసం రామ్ యాదవ్ యింటి మీద, ఆ చుట్టపక్కల హిందువుల ఇళ్ళ మీద దాడిచేసారు రామ్ యాదవ్ ఇంట్లోని ఉట్టి మీదున్న వెన్నకుండను తీస్తుంటే రామ్ యాదవ్ భార్య లక్ష్మి అడ్డుపడింది ‘అన్నా అది తియ్యెద్దని’. రజాకార్ కోపంతో లక్ష్మి చంకలోని కొడుకుని గుంజుకుని గాల్లోకి పైకి ఎగర వేసి భయంతో బిక్క చచ్చి ఎడుస్తున్న పసివాడు కిందకు పడుతుంటే చేతిలోని బల్లెంతో అడ్డుకుంటాడు. బల్లెం దిగి పోయి పిల్లవాడిని నిట్టనిలువుగా చీలుస్తుంది. వాడి రుధిర ధారలతో భూమాత కళ్ళు ఎర్రబారతాయి. ప్రకృతి మూగబోయింది, గాలి స్థంబించింది.
ఆ దృశ్యం చూస్తున్న తల్లి గుండెలు ఆగిపోయాయి. కేవలం ఒక కుండెడు వెన్నకోసం పసివాడి ప్రాణాలు అన్యాయంగా గాలిలో కలిసిపోయాయి! వాడి వెనక వాడి తల్లి !చూస్తున్న అందరి కళ్ళల్లో భయం, భీతి తరువాత విస్ఫులింగాలు రాలాయి. మనసు వికలమైంది సదాశివ శాస్త్రికి.
“ఇల్లంతా ఏ విధంగా ఆగమాగం అయిందో ! వాళ్ళకు కావలిసినవి తీసుకుని మిగతావి ఎలా చెల్లాచెదురు చేసి పోయారో చూడండి” అంది దుఃఖం పొర్లుకొస్తుండగా గాయత్రి.
“నువ్వు పిల్లలు క్షేమంగావున్నారు, వీటిదేముందిలే మళ్ళీ ఏర్పరుచుకోవచ్చు” సముదాయించాడు తను నిబ్బరపడుతూ. అంతేకాని కొద్ది నిమిషాల క్రితం తాను రచ్చబండవద్ద, రామ్ యాదవ్ యింట్లో చూసిన సంఘటనల గురించి నోరు విప్పలేదు.
ఈ సంఘటనలతో భీతిల్లి దిమ్మర పోయిన హిందువులు ఖేద పడ్డారు. ప్రతీకారేచ్ఛతో రగిలిపోయారు. దేశ ప్రజలలందరూ స్వాతంత్ర్యానంతరం మొదటిసారి వచ్చిన సంక్రాంతి అని ఎంతో వేడుకగా జరుపుకుంటుంటే మాకేమిటి ఈ రజాకార్ల పాడుపీడ? అనుభవించిన వెతలతో వారు వ్యాకుల పడ్డారు మళ్ళీ అంతలోనే తేరుకుని అసలు తామెందుకు వెనుకంజ వేయాలని మొండితెగువతో ఉత్సాహాన్ని కొని తెచ్చుకుని సంబరాలకు శ్రీకారం చుట్టారు.
అది జనవరి 13, 1948 వ సంవత్సరం, ఆరోజు సంక్రాంతి భోగి పండుగ. అదే రోజు ఛోటామియా , ఖాసిం రజ్వీ కోసం అరేంజ్ చేసిన దావతు చోటు చేసుకుంది. ఆరోజు పొద్దుటే ఖాసిం రజ్వీ ఒక జీపులో, రెండు లారీల నిండా నిజాం నవాబు సైనికులు, రజాకార్లు హైదరాబాదు నుండి కోలాహలంగా బయలుదేరి ముత్యాలపల్లి ఏరియాకి వచ్చారు. వైభోగంగా ఏర్పాటు చేయబడిన ఆ విందులు కుడిచిన సైనికులు, ఖాసిం రజ్వీ కేరింతలు కొడుతూ హైదరాబాదుకు తిరుగు ప్రయాణ మయ్యారు.
వీరి కోలాహలాన్ని బీబీనగర్ రైల్వే స్టేషన్ వద్దనున్న సామాన్య ప్రజలు గమనించి – ఆ వచ్చేవారు కాంగ్రెస్ కార్యకర్తలనుకుని వారికి సంబరంగా జయజయధ్వానాలను పలుకుతారు. దీన్ని గ్రహించి క్రుద్ధులైన సైనికులు, రజాకార్లు నినదించిన ప్రజలను పట్టుకుని చితకబాదుతారు. భయంతో పారిపోయిన వారిని తరిమి తరిమి వెంటబడి పట్టుకుని చిత్రహింసలకు గురి చేసి చంపారు.
సైనికులు అలా వారిని తరుముతూ ఊళ్ళమీదపడి లూటీలకు పాల్పడి దావతు మత్తులో ఉచితానుచితాలు మరచిపోయి వారిఇళ్ళను తగులబెట్టి , దొరికిన స్త్రీలను చెరబట్టి మానభంగాలకు దిగడం , పురుషుల గోళ్ళను ఊడబెరకడం ఒకటి కాదు ఎన్నో రకాలుగా స్త్రీ పురుషులను హింసిస్తారు. ఈ సంఘటన మానని పుండులా హిందువుల గుండెల్లో మిగిలి పోయింది.
ఆరోజు ఏం జరిగిందంటే-” బీ బీ ఎక్కడవున్నారు?” హడావుడిగా యింట్లోకి వగరుస్తూ వస్తూ ఆందోళనతో ప్రశ్నించాడు చాంద్ సాహెబ్.
“జీ! వస్తున్నానండి”. లోపల అత్తగారి గదిలోనుండి హాలులోకి వచ్చింది కరీమా.
“పిల్లలేరి?” కంగారుగా అడిగాడు. “అత్తమ్మ దగ్గర మంచం మీద కూర్చుని వున్నారు.” మీరు నిశ్చింతగా ఉండవచ్చు అన్న సంకేతాన్ని గొంతులో ధ్వనింపచేస్తూ భర్తకు బదులుచ్చింది. ఆయనకు దగ్గరగా వచ్చి మెల్లగా లోగొంతుకతో చెప్పింది. ” గాయత్రమ్మ పిల్లలిద్దరిని తీసుకుని వచ్చింది. వద్దు పొమ్మనలేక పోయానండి ” తప్పుచేశానా అన్న సంశయంతో ఆయన మొహంలోకి కంగారుగా, భయం భయంగా చూసింది కరీమా.
“ఆ బద్మాషులు ఊళ్ళోకి వచ్చేస్తున్నారు. హిందువులను హింసిస్తున్నారు. గృహదహనాలు, ఆడవార్ని చెరబడుతున్నారు. పిల్లల్ని చంపేస్తున్నారు. ” అంటూ చూడశక్యం కాని ఆ దృశ్యాలు గుర్తొచ్చి తల గట్టిగా విదిల్చాడు.
“‘మంచిపని చేశావ్ బీ బీ. గాయత్రమ్మను ఎక్కడ దాచిపెట్టావ్?”
“కొట్టు( స్టోర్ రూమ్) గదిలో వడ్ల గాదె వెనకాల బురఖాకప్పి కూర్చోబెట్టాను. అక్కడ వెలుతురు తక్కువగావుండి చీకటిగావుంది. గబుక్కున కనపడదు ఒకవేళ ఎవరన్నా లోపలికి వెళ్ళి చూసినా!”
“హమ్మయ్య ! మంచి పని చేసావ్ బీ బీ.”
“ఈ ఆలోచన నాక్కూడా రాలేదండి. మీ అమ్మగారు వెళ్ళి గాయత్రిని, పిల్లలిద్దరిని తీసుకొచ్చారు. శాస్త్రిగారు కూడా యింట్లో లేరు. మొన్నజరిగిన గందరగోళంనుండే వాళ్ళింకా తేరుకోలేదు. అత్తమ్మను చూడగానే గాయత్రమ్మ ఏడ్చేసిందట ప్రస్తుత పరిస్థితి తలుచుకుని. మనింటికొస్తే మనకేమి తిప్పలొస్తదో తమతోనని ముందు రానని పేచీ పెట్టిందంట. పిల్లల మొహం చూడమని అత్తమ్మ సమజాయిస్తే చివరికి వచ్చింది” అబద్ధం చెప్పినందుకు కించిత్తు లజ్జతోనే ఆయన యిక తిట్టరని రూఢి చేసుకుని ఉన్న సత్యాన్ని ఓపెన్గా వెల్లడించింది కరీమా.
“చిన్నోడు నిద్రపోతున్నాడు, పెద్ద పిల్లోడు మన పిల్లలతోబాటు అత్తమ్మ మంచం మీదేవున్నాడు. ఆవిడ కథలు చెబుతూ వాళ్ళను మరిపిస్తుంది గోలచేయకుండా” అంది .
“వస్తూ వస్తూ నేనింకో పనికూడా చేసాను.దారిలో సదాశివ శాస్త్రి కలిశాడు యింటికి వస్తూ. బలవంతాన అతడిని మన యింటికి తీసుకొచ్చి ఇంటెనక జొన్నచేలో దాపెట్టి వచ్చాను. నేను పిలిచే వరకూ బయటికి రావద్దన్నాను. మరి గాయత్రమ్మను కూడా అక్కడేవుంచితే ఒకరి కొకరు తోడుగావుంటారు కదా! ఆ బద్మాష్లు యిప్పుడే పోరు ఎంత టైము పడుతుందో! ఏ సమయంలో ఎటునుంచి వచ్చిపడతారో తెలీదు.” బాధ, రాబోయే ఆపదని తలుచుకుని బేజారు ధ్వనించింది చాంద్ సాహెబ్ గొంతులో. “సరే సరే జరిగేది జరుగుతుంది. మనం చేసే సాయం చేయాలికదా! ఆపై అల్లాదయ” అనునయంగా పలికాడు.
” నేను గాయత్రమ్మను తీసుకొస్తా. మరి చిన్నపిల్లవాడి సంగతి ఏమిటి? ” కరీమా సంతానంలో చిన్నపిల్లవాడి వయసు పది నెలలు. ఇద్దరు పసివాళ్లను చూస్తే వారికి తప్పకుండా సందేహం వస్తుంది. కరీమా గొంతు విన్న పెద్దమ్మ మంచం మీదనుండే జవాబు యిచ్చింది.
“కరీమా పిల్లలిద్దరికి పాలల్లో నా మందు ( నల్లమందు) కలిపి తాగించు. పాకలో పిడకల గుంత ఖాళీగా వుంది కదా! అందులో పెద్దవాడ్ని పడుకోబెట్టి పైన కొన్ని జొన్నకట్టలతో కప్పు కనబడకుండా. చిన్నవాడ్ని నా మంచం మీదే బొంతలను జరిపి గోడకు బొంతలకు మధ్యలో పడుకోబెడతాను. “అప్పటికప్పుడు నాలుగు బొంతలను మడిచి ఒకదానిమీద వొకటి పేర్చి బొంతల వెనుక గోడకు అడుగు దూరం ఖాళీ స్థలం చేసి అందులో చిన్నవాడ్ని పడుకోబెట్టి తాను బొంతలను ఆనుకుని జరిగి కూర్చుంది.
పెద్దమ్మకు రాత్రిళ్ళు ఆయాసం ఎక్కువగా వస్తుంటుంది, ఉబ్బసం వ్యాధితో బాధ పడుతుంది. మరీ అవసరమైనప్పుడు నల్లమందు వేసుకుంటుంది. అదీగాక చిన్న పిల్లలున్న ఇళ్ళల్లో ఎప్పుడూ వాంతులని విరేచనాలని, దగ్గు జలుబు లాంటి రుగ్మతలు వుంటుంటాయి అప్పుడు పిల్లలకు చనుబాలల్లో దానిని కలిపి తాగిస్తారు. వారాంతపు సంతల్లో దొరికుతుంది నల్లమందు.
కరీమా కొట్టు గదిలో కెళ్ళి గాయత్రికి విషయం చెప్పి తనని అక్కడనుండి తీసుకుని భర్తతో కలిసి ఇంటిని ఆనుకుని వున్న జొన్న చేలోకి వెళ్లారు. అది మోటబావి క్రింద రెండో పంటగా వేసిన జొన్నచేను. ఏపుగా , నేవళంగా పెరిగి బోల్డంత మరుగు కల్పిస్తుంది.
చాంద్ సాహెబ్ సదాశివ శాస్త్రి నుంచిన దాపునకెళ్ళి లో గొంతుకతో శాస్త్రిగారు అని పిలిచి అన్నాడు” గాయత్రి అమ్మను కూడా యిక్కడే వుంచుదాం అనుకుంటున్నాము. పిల్లలిద్దర్ని నిద్ర పుచ్చుతాం. కరీమా వాళ్ళను చూసుకుంటుంది , మీరు ఎలాంటి ఆలోచనా పెట్టుకోవద్దు వారి గురించి. నేను వచ్చి పిలిచే వరకు యిక్కడేవుండండి. బహుశ చీకటి పడేవేళ వరకు మీరుయిక్కడే వుండడం మంచిదేమో! ఆరాక్షసులు ఎప్పుడు వచ్చి పడతారో తెలీదు.”
గాయత్రిని శాస్త్రి గారిదగ్గర వదలి గిరుక్కున అదురుతున్న గుండెలతో చుట్టూ చూసుకుంటూ యింట్లోకి ప్రవేశించారు కరీమాదంపతులు.
అత్తగారు చెప్పినట్లే కరీమా రెండువేళ్ళమధ్య పిసరంత నల్లమందుని డబ్బానుండి తీసి చిన్నగరిటడు పాలల్లో రంగరించి పిల్లలిద్దరికి చెరి కొంచెము తాగిస్తుంది. చిన్నవాడు నిద్రలోనే గుటక వేస్తాడు. “అమ్మా మాకు”కరీమా పిల్లలు కూడా నోరు తెరిచారు. అందరి నోళ్ళల్లో తలా గరిటెడు పాలుపోసి “మీకు నాయనమ్మ కథ చెబుతుంది, చప్పుడు చెయ్యకుండా ఉండండి. మీరు అల్లరి చేస్తే పోలీసు బూచాళ్ళు వచ్చి మిమ్మల్ని పట్టుకుపోతారు” అని పిల్లలందరికి అర్థమయ్యేలా చెప్పి వారు బిక్కమొహాలేసుకుని చూస్తుంటే ఒక పళ్ళెంలో దోశెడు అటుకులు నాలుగైదు బెల్లంముక్కలు వేసి అత్తగారి కిచ్చింది పిల్లలకివ్వమని. గుండె అదురు ఇప్పటికి తగ్గింది కరీమాకు.
పెద్దమ్మకు గాయత్రి బొమ్మ కళ్ళల్లో మెసిలింది. చూడచక్కని రూపం దానికి తోడు పాపాయికి పాలు ఇస్తుందేమో పరిపుష్ఠిగా ఉంది మనిషి. ఆ ముష్కరుల కళ్ళల్లో పడితేయింకేమన్నా ఉందా? కనుగుడ్లు వెడల్పయినాయి భయంతో. తనుఎన్ని చూడలేదు ఈ కళ్ళతోటి పాపిష్ఠి వెధవల దురాగాతాలను. కామాంధులకి అమ్మలు లేరు అక్కచెల్లెళ్ళు లేరు ఆడది కనబడితే చాలు సిగలు కోసి, ద్రౌపతీ వస్త్రాపహరణం గావించి, మెడలో ని పుస్తెల్ని, కాళ్ళు, చేతులకున్న దండకడియాల్ని బలవంతంగా ఒంటినుండి గుంజుకోవడం ఇవ్వని వారి వంటిమీద గీసుకత్తితో గాట్లుపెట్టి దోచుకోవడం, వారి భర్తలు, అన్నదమ్ములు, తండ్రులు చూస్తుండగానే రేప్ చేయడం ఒకటా రెండా తలుచుకుంటుంటేనే పెద్దమ్మ ఒళ్ళు జలదరించింది. వేదనతో గుండె బరువెక్కింది.
ముత్యాలపల్లిలో మెజారిటీ ప్రజలు హిందువులే. 1948 కంటే ముందు ఆఊళ్ళో చాంద్ సాహెబ్, వాళ్ళ తమ్ముడి కుటుంబం తప్పితే ఇతర ముస్లింలు ఎవరూలేరు. చాంద్ సాహెబ్ తండ్రి ప్రభుత్వం తరపున ఇల్లిల్లూ తిరిగి సర్కార్ ఆదేశాలప్రకారం పన్నులు వసూలు చేసే అధికారికి సహాయకుడిగా ఉండేవాడు. ఆయన మరణానంతరం కొడుకు లిద్దరిలో ఎవరికి ఆయన కొలువివ్వలేదు. అయినా అన్నదమ్ములిద్దరూ ఆఊళ్ళోనేవుంటూ ఉన్న కొద్దిపాటి భూమిని సేద్యం చేసుకుంటూ ఊరిలోని మిగతా హిందువులతో కలిసి మెలిసి సంతోషంగా ఉన్నారు.
కాని క్రమేణా వారి జీవితాలలో మార్పులొచ్చాయి. రోజురోజుకి రజాకార్ల ధాష్ఠీకాలు పెరిగి వారు అడకత్తెరలో పోకచెక్కలుగా నలిగిపోతారు. కనీసం మనసులో అయ్యోపాపం అని అనుకోవడానికి కూడా భయంగొలిపే మతరాజకీయాల్ని చూసి వేదనకు లోనవుతారు. హందువులలానే వీరుకూడా హైదరాబాదుకు రజాకార్లనుండి విముక్తి ఎప్పుడెప్పుడని చకోరపక్షుల్లా ఎదురు చూసారు.
చివరికి హిందువులందరూ ఎదురు చూసిన ఘటన నిజరూపు దాల్చింది. 1948 , సెప్టెంబర్13న- భారత సైన్యం అన్ని వైపులనుండి హైదరాబాదును కమ్ముకుంది. విధి లేని పరిస్తితులలో నిజం నవాబు లొంగి పోయి హైదరాబాదు స్టేట్ ని సెప్టెంబర్ 17, 1948 న అఖండభారతావనిలో ఐక్యం చేశాడు.
ఎంతోమంది చనిపోయారు ఈ పోరాటంలో. కొంత సామాన్య జననష్టం జరిగింది. ఇంకొంత మంది సైనికులు, రజాకార్లు చనిపోగా మరికొంతమంది రజాకార్లు పాకిస్థాన్ కు పారిపోయారు. మిగిలిన వారు ప్రజల ఆగ్రహావేశాల నుండి తప్పించుకోవడానికి వేషభాషలను మార్చుకొని జనజీవన స్రవంతిలో కలిసిపోయారు.
ఆనాటి సదాశివ శాస్తి చిన్నకొడుకు పరమేశ్వర శాస్త్రి, పరమేశ్వర శాస్త్రి మనవడే మన కథానాయకుడు కృష్ణవంశీ. చాంద్ సాహెబ్- కరీమాల మునిమనుమరాలే గుల్షాద్.
ఎప్పుడో డెబ్బై ఏళ్ళ క్రిందటి గతం ప్లాష్ లా గిర్రున మదిలో తిరిగింది కరీమాకు. కొడుకు రహీం రాత్రి పరమేశ్వర శాస్త్రి వస్తున్నాడని మనుమరాలు గుల్షాద్ ద్వారా విని తనకు చెప్పినప్పుడు ఒక్కింత ఆశ్చర్యానికి లోనయింది. గుల్షాద్ – కృష్ణవంశీలు కలిసి పనిచేస్తున్నారన్న విషయం తనని మరింత ఆశ్చర్యానికి గురి చేసింది ఎక్కడెక్కడి మూలాలు, ఏనాటి కాలం? ఎప్పటి సంగతులు!
పరమేశ్వర శాస్త్రి మనవడి వ్యవసాయ కేంద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు గుల్షాద్ తో మాట్లాడిన సందర్భంలో విషయాలు గ్రహించి, ఆ పిల్ల చాంద్ సాహెబ్ మునిమనుమరాలే అని మనసులో అనుకుని మనవడి మనసులో గుల్షాద్ తన జీవిత సహచరి కావాలన్న వాంఛను పసిగట్టి ముందు వంశీనుంచి నిజం తెలుసుకోవాలని అతడితో మాట్లాడి తానంతా సానుకూలపరుస్తానని మనవడికి మాట ఇచ్చి ఈ విషయాలను ధృవపరచుకోడానికి ఓరోజు కృష్ణవంశీని తీసుకుని మెహదీపట్నంలో ఉంటున్న రహీం సాహెబ్ ఇంటికి వెడతారు. అయ్యా ఇదీ జరిగిన- జరుగుతున్న సంఘటనలు.
తెల్లని చొక్కా ధోవతిలతో నుదుట వెలుగులు చిమ్ముతున్న విభూతి రేఖల మధ్య అగ్నిలావెలుగొందే ఎర్రని బొట్టుతో , నున్నగా తళుకులీనుతున్న బట్టతల, పచ్చని పసిమి ఛాయతోఎంతో హుందాయైన మనిషి పరమేశ్వర శాస్త్రి. చూడగానే చెయ్యెత్తి నమస్సరించాలన్న కోరికను ఎదుటవారికి కలగజేసే రూపం ఆయనది. పరమేశ్వర శాస్త్రి, కృష్ణ వంశీలు రాగానే రహీం సాహెబ్ కొడుకు సయ్యద్ తో కలిసి కుశల ప్రశ్నలనంతరం వారిని తోడుకుని కరీమా పడుకున్న చోటుకి వచ్చారు.
“రండి నాయనా కూర్చోండి!” నెమ్మదిగాలేచి కూర్చుంటు చేత్తో పక్కనున్న కుర్చీ చూపించింది కరీమా.
సన్నగా తెల్లగా వడలి ముడతలు పడ్డ శరీరం, వెండి దారాల్లా మెరుస్తున్న జుట్టు, తమలపాకులా సున్నితమైన పండుటాకు ఆమె ఇప్పుడు. తొంభై ఏళ్ళు దాటిన వయసు. తెల్లని గ్లాస్కో చీర, పొడవు చేతుల ముస్లిం పెద్దలు వేసుకునే అంగీ దాదాపు మోకాళ్ళదాకావుంది.
ఆమెని చూడగానే వళ్ళు పులకించింది పరమేశ్వర శాస్త్రికి. జీవిత పర్యంతం ఎదురు చూసిన అపురూపమైన పెన్నిధి లభించిన ఫిలింగ్ కలిగింది. కొండంత కృతజ్ఞత గుండెల్ని బద్దలు చేసుకుని రక్తమై రక్తనాళాలలో ఎగజిమ్ముతూ శరీరమంతా వడివడిగా పరుగులు తీసింది. నీటితో నిండిన కళ్ళు చెలమలయ్యాయి. చూపు మసక బారింది.
“అమ్మా! ” అంటూ ఆర్తిగా ఆమె తెల్లటి దుప్పటి కప్పుకున్న పాదాలమీద శిరస్సునుంచి నమస్కరించాడు.
“అయ్యో నాయనా! ” అంది. కంగారు పడి తప్పు జరిగిందని విలవిలలాడింది కరీమా మనసు. కష్టం మీద కాళ్ళని పైకి గుంజుకుని ” తప్పు నాయనా మీరు బ్రాహ్మలు, పెద్దవారితో సమానం. తప్పు తప్పు నాకెందుకు ఈ గౌరవం? ” గజ గజ వణకుతున్న గొంతుతో అంది.
“ఆ రోజు మీ పిల్లల ప్రాణాల్ని పణంగా పెట్టి మీరు నన్ను , అన్నను, అమ్మానాన్నలను కాపాడి వుండక పోతే మేమేమైపోయేవాళ్ళమో ” కళ్ళు తుడుచుకున్నాడు పరమేశ్వర శాస్త్రి.
“అయ్యో తాతయ్యా మీ కుంకుమ బొట్టంతా నాన్నమ్మ దుప్పటికి అంటింది” నొచ్చుకున్నాడు కృష్ణవంశీ వాళ్ళేమన్నా తప్పుగా భావిస్తారేమోనని. తనుకూడా గుల్షాద్ వాళ్ళ నాన్నమ్మను చూడడం ఇదే మొదటిసారి.
జరిగిన ఘటనకు పరమేశ్వర శాస్త్రి ఎక్కడ నొచ్చుకుంటాడోనని “అయ్యయ్యో ” అంటూ తప్పుజరిగి పోయినట్లు కంగారుపడ్డాడు గుల్షాద్ తండ్రి సయ్యద్ సాహెబ్.
“బాబూ పొద్దున అమ్మ పరమేశ్వరికి పూజచేసి ఆవిడ కుంకుమను నేను అద్దుకున్నాను. అది ఎక్కడ ఎలా ఉండాలో నిర్ణయించేది ఆమే. అంతా అమ్మదయ!.
మీకు తెలీదు బాబూ ఆ రోజు నాకు నల్లమందు వేసిన తరువాత నేను మత్తుగా కొన్ని గంటలుగా నిద్రపోతుంటే నా గొంతెండి పోతుందని నాన్నమ్మ కోప్పడితే తన చనుబాలను నాకిచ్చింది అమ్మ. అది తప్పా ఒప్పా? బ్రాహ్మణులా ముసల్మానులా అన్నది కాదు. అప్పటికి అక్కడ అదే న్యాయం మరి దాని పేరే మానవత్వం. మానవత్వం లేని ఏ మతమయినా వేస్ట్. అది మీదా మాదా అనికాదు. నా తల్లి నాకు పాలిచ్చింది అంటే అది తన డ్యూటి. ఈ అమ్మ తన ప్రాణాల్ని,ఇంట్లో అందరి ప్రాణాల్ని ఫణంగా పెట్టి ఒక్క రోజయినా అర్ధరోజయినా మమ్మల్ని పాలిచ్చి సాకిందంటే అది మానవత్వం. మానవత్వాన్ని మించిన ధార్మిక కార్యం మరొకటి లేదు. నా జన్మకు నేను ఎప్పుడూ అమ్మను యిలా కలుసుకుంటానని, శిరస్సు వంచి నమస్కరిస్తానని అనుకోలేదు!
మా నాన్న సదాశివ శాస్త్రి ఎన్నిసార్లు గుర్తు చేసుకున్నాడో! ఎప్పుడూ నాకు చెప్పే వాడు ఎలా అయినా మీ అందరి ఋణం తీర్చుకోమని తన జీవితంతంలో తనకు ఆ అవకాశం దొరకలేదని ఎంతో అసంతృప్తితో నుండేవాడు.నిజంగా నేను కొలిచే అమ్మదయ ఇదంతా! మిమ్మల్ని ఈ విధంగా కలుసుకోవడం” ఆనందంతో ఉబ్బితబ్బిబ్బు పడ్డాడు.
చూస్తున్నవారంతా చిత్తరువులైనారు. అర్ధమైనట్టూ కానట్టూవుంది పరిస్థితి.
గుల్షాద్ వాళ్ళమ్మ ఈ లోపల అందరికి టీ బిస్కెట్స్ ఆఫర్ చేసింది, టీ తాగిన తరువాత పెళ్ళి పెద్దగా పరమేశ్వర శాస్త్రి పెద్దరికాన్ని వహిస్తూ ముందు కొచ్చి – కరీమా దగ్గరకు వెళ్ళి ఆవిడ రెండు చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని ” అమ్మా మిమ్మల్ని ఒక కోరిక కోరుతాను, మీరు కాదు అనకూడదు. కృష్ణవంశీకి గుల్షాద్ అంటే ఎంతోయిష్టం. మాకన్ని విషయాలు తెలుసు. గుల్షాద్ కి కూడా వంశీ అంటే మమతే కాని పాప విషయమై ఆలోచిస్తుంది, మీకు అలాంటి భయాలు ఏమి వద్దు. రెండేళ్ళనుండి ఆ అమ్మాయిని మేము గమనిస్తున్నాము. మీరు మతం గురించి ఆలోచించవద్దు. పాప గురించి బెంగొద్దు. తను మా బిడ్డనే, మీకెలాంటి సందేహంవద్దు. ఆనాడు నన్ను నీ బిడ్డగా భావించలేదా అమ్మా నువ్వు! మీరే లేకపోతే మేము ఏమయ్యేవారము? ఎంతోమంది చనిపోగా, ఊరంతా పరుశరామ ప్రీతి అయిందిట. మా తండ్రిగారు ఆ విషయాలు చెబుతూ మీ అందరి గురించి ముఖ్యంగా అమ్మగురించి మహోన్నతంగా చెబుతూ మళ్ళీజన్మలోనన్నా మీఋణం తీర్చుకుంటాననుకునేవారు.
ఆ అవకాశం మీరు ఈ రూపేణా మాకివ్వండమ్మా! పిల్లలిద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం. వాళ్ళ ఆశలు ఆశయాలు కలుస్తాయి. వంశీ తనకు తగిన జోడు. ఇద్దరూ కలిస్తే వాడిన గుల్షాద్ జీవితం చిగురులు తొడుగుతుంది .
రహీం సాహెబ్ , సయ్యద్ మీరేం అంటారు? తండ్రిగా మిమ్మల్ని తక్కువచేస్తున్నానని అనుకోవద్దు. అమ్మను చూసిన ఆనందంలో ముందుగా తన్ని ఈ కోరిక కోరాను” పరమేశ్వర శాస్త్రి సయ్యద్ సాహెబ్ చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని క్షమాపూర్వకమైన మెత్తని స్వరంతో అన్నాడు.
“ఇంత పెద్ద మనసు మీరు చూపిస్తుంటే నేనేమంటాను. కృష్ణవంశీ లాంటి హజ్బెండ్ గుల్షాద్ కి దొరికి నూతన జీవితాన్ని ఇస్తామంటే తండ్రిగా నాకింతకు మించిన ఆనంద మేముంటుంది. పెద్దలు మీరు నిండు మనసుతో శుభం జరుగుతుందంటే వద్దంటామా” గౌరవాదరాభిమానాలు ముప్పిరిగొనగా ఆత్మీయంగా కౌగలించుకున్నాడు పరమేశ్వర శాస్త్రిని.

1 thought on “ఋణం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *