March 28, 2024

కవి పరిచయం – అనురాధ బండి

రచన: లక్ష్మీ రాధిక

కదులుతున్నట్టు కనపడని కృష్ణవేణిలా ఆమె కవిత్వం ఒక నది. సరిగ్గా చూస్తే వెన్నెల్లో వీణానాదంలా, వెండిమబ్బు దూదిపింజెలా,నిస్పక్షపాతపు కవితలా, బంగారు కలల నుంచీ వాస్తవపు విడ్డూరాల దాకా విస్తరించి ఉంటుంది. తన కవనంలో.. కమ్ముకునే కలతలూ, నిరాశా నిట్టూర్పు గేయాలూ, అంతులేని ఆలోచనా స్రవంతిలూ, పునర్వేచన చేసేలా దీప్తివంతమై ఉంటాయి. ఆ పదాలు గుండెల్లో గెంతులేసే అలల సవ్వళ్ళలా ఉలిక్కిపెడుతుంటాయి. తనే మరి..మన అనురాధ బండి.
ముఖపుస్తక నేస్తంగా తన కవనాల సాక్షిగా పరిమళించే నక్షత్రం. ఒక ఉన్నత వ్యక్తిత్వపు విలాసం ఆమె అక్షరం. ఆవిష్కరించే ప్రతిపదమూ దాన్ని ధృవపరిచేట్టు ఉండటం ఓ ప్రత్యేకత. నానారీతుల మనసుల్లోని వైవిధ్యము ఆకాశంలో విరిసే హరివిల్లంత స్పష్టంగా తన కవనంలో కనిపిస్తాయి. మూగ గొంతుకి ఒకేసారి మాటలొచ్చినట్టు ఒక ఆర్ద్రత ప్రతివాక్యంలోనూ స్పష్టమవుతుంది. నిశీధి క్రీనీడల్లో నవీన మార్గమున్నట్టు గుండెతడికే చిగురించే పువ్వులెన్నో తన పదములో. చూపులకు అమాయకంగా ఉంటూ తన పద గాంభీర్యంతో చాలా విలక్షణ సలక్షణంగా అనిపిస్తారు అనురాధ. అనామక అనుభూతులెన్నో పరిచయించే అనురాధ మెల్లిగా మన హృదయాన్ని ఆక్రమిస్తారనడంలో సందేహం లేదు.
చీకటిలో ముడుచుకుపోయే రాత్రి అందం, జాబిలి చుట్టూ తిరుగుతూ చేసే మువ్వల శబ్దం, ఆలోచనల మెరుపుల్లో గుండె తణుకులీనడం, ఆకాశపు ఆకర్షణ మొత్తం కలబోసుకుని ఆమె కలంలో ఇమిడిపోతుంది.
రాత్రి వెండి అద్దంలాంటి చందమామకి, బంగారు నక్షత్రాలకి సెలవు చెప్పేసాక, జ్ఞాపకాలకీ గడిపెట్టేసాక ఏమవుతుందో తన మాటల్లో చూద్దాం..
” మనసు చీకటి, మనిషి చీకటి
నిద్రకి కలలు మాత్రమే రంగులు అని పాడుకుంటూ
మెదడుకి చీకటిపడలేదని నవ్వుకుంటూ
నా చుట్టూ నేనే కంచెని కట్టేసా”
ఎంత అద్భుతమైన భావమిది.
ఏడుపు అనివార్యమైనప్పుడు అశృవులకి దారిచ్చి కళ్ళకీ, నోటికీ స్వేవ్ఛను ప్రసాదించడం ఉత్తమమని, కన్నీళ్ళు కూడా రాల్చలేని కళ్ళని చూసి జాలిపడమంటూ, మనుషుల మధ్య వాళ్ళూ వీళ్ళూ అని తేడా చూపించని సమానత్వం కావాలంటారు. ఇంత గొప్ప ఆలోచనలు పరిణితి చెందిన వారు మాత్రమే రాయగలరనిపిస్తుంది.
చీకటి కళ్ళు విప్పుకున్నప్పుడు, గాఢాంధకారం కాని సృష్టి మాత్రం నక్షత్రకొసల్లో ఆశల ఊయలూగుతుందట. ఆకాశపు కదలికలు వింటూ నిదురించిన తీరం, సముద్రపు రెప్పలకు కలనిస్తుందట. ఏ జాలరీ వలవేసి పట్టుకోలేని ఇలాంటి సంగతిని ఎవరు మాత్రం రాయగలరు అంటూ వినూత్నంగా ఆవిష్కరిస్తూనే మనల్ని ప్రశ్నిస్తారు.
చీకటికి గొంతువిప్పి జరిగిన పరిచయంలో వెలుతురు అవసరం రాదంటూ, కొన్ని దృశ్యాలు మాత్రం హృదయ విదారకాలంటారు. తడిలేని పొడిచూపు కలిగి కాంతిని ఇరికించుకోలేని మనుషులు మనసులనుండీ దూరమైపోతున్నారని విచారిస్తారు.
విషాదం ఎందుకంత బాగుంటుందో, కొందరు స్వేచ్ఛను కాదనుకుని ఎటుచూసినా శిధిలాలను మిగులుస్తారు. కొన్ని అక్షరాలేమో బ్రతుకు ఆకాశంలో మెరుపులవుతాయట. కవులు కవితలు అచ్చవగానే కవిత్వాన్ని వదిలేస్తే, కలం నవ్వుకున్నట్టు, మనమూ కలల్ని యాంత్రిక భావాలతోనే కట్టేయాలట. ఇంత విభిన్నంగా కవితను కూర్చడం తన ప్రత్యేకత.
“ఆశ ఆకాశమవ్వొచ్చు..కానీ పిచ్చి అవ్వకూడదు.
వెలుతురు కావాలంటే..కిటికీ తియ్యాలి.
వెన్నెల కావాలంటే..పున్నమి తెలియాలి.
నిదురలో ..నక్షత్రాలు రాలవు.
కలలకి కన్నీరు..అడ్డు కాదు.
విని వదిలే ఔదార్యం..మనసుకు అవసరం.
వసంతమంటే…శిశిరం తెలిస్తేనే”
జీవితాన్ని ఎంతో లోతుగా ఆలోచించి చాలా సరళంగా, సహజంగా మనకి అందజేసారు అనురాధ.
“కన్నీటి చుక్కలు కూడా నాటకంలో పాత్రదారులే అని తేలిపోయినప్పుడు
యాంత్రికతల నడిబజారులో చప్పట్లన్నీ
నిజాలు కావనీ..
ఏ అబద్ధమొచ్చీ సాక్ష్యం ఇవ్వదనీ..
బంధాల సాగరంలో మునిగి లోతుల్ని ఆరాతీయాలనే ఏ ఒక్కరూ నిజానికి విజేతలు కారనీ..
లెక్కతేలని కోణాల జాబితా తయారుచేద్దామనుకునే ఎవరైనా సరే మద్యలో ఆగిపోవల్సిందేననీ
నువ్వో నీలాంటివాళ్ళో.. నిర్వేదసారాన్ని గ్రహించిన నవ్వేదో నవ్వుతుంటారు..!!”
మనసుని మెలిపెట్టే విషయాలను ఇలా నిజాయితీగా చెప్పి అనుబంధాలను పరిశీలించమని అన్యాపదేశంగా చెప్పారు.
ఈ మధ్యకాలం, చిట్టి కవితలతో పాటు ఆంగ్లంలో కూడా అద్భుతమైన తన భావాల్ని సరికొత్తగా వినిపిస్తున్నారు.
“కొట్టివెయ్యబడిన జవాబులూ
అలిగిన ప్రశ్నలూ
మరి, కలాన్ని పట్టుకున్న… గురువుకి శిక్షో..?!
ముద్దుముద్దు గులాబీలూ
తరలెళ్ళిపోయిన ముళ్ళూ
అసలిప్పుడు, కాలాన్ని …చెట్టుకి కూల్చిందెవరో..?!
అంటూ కొత్తకోణంలో తన జిజ్ఞాసను చర్చించారు.
కొన్ని కాల్పానిక, వ్యంగ్యాస్త్రాలతో కూడినా, అంతర్లీనంగా మనసుకి హత్తుకుంటూ, ఎంతో వివేచన చేసేలా వైరుధ్య భావాలతో ఉంటాయి కనుకే అనురాధ కవితలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. మరిన్ని విలక్షణమైన కవితలు రాసి అందరినీ ఆకట్టుకుంటూ, త్వరలో మరపురాని ఓ సంకలనానికి శ్రీకారం చుడతారని ఆశిస్తూ…

 

1 thought on “కవి పరిచయం – అనురాధ బండి

  1. లవ్వూ..బోత్..
    బంగారు తల్లులూ..

    అక్షరాలను
    చిటికెన వేలు పట్టి..
    దిశా నిర్థేశం చేస్తూ..

    వెలుగుల పంచనీకి..
    దశ దిశలకీ నడిపిస్తున్నందుకు..
    మేం..మిమ్మల్ని మరింతగా ప్రేమిస్తున్నాం..

    మేం..చదువరులం..
    మీ కలాలకు ..గళాలకు..
    ఋణపడి వుంటాం..

    మేం ..
    సాధారణ పాఠకులం..

    పద్యమో..పరి …
    గొంతు కడ్డం పడి
    మా పఠన పయనం..
    ఆగిపోతున్న వేళ..వచనమే..
    మాకు సరియైన పచనమని..

    మీ వంటి
    సుమనస్కులెందరో..
    మా..పఠనాభిలాషను..
    భుజానికెత్తుకున్నారు…

    సరళ తెలుగాక్షరాలలో..
    వెన్నెల వెలుగులు పంచుతున్నారు..

    ధన్యవాదాలు..మీకు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *