June 19, 2024

గురువులు కృపాచార్యుడు, ద్రోణుడు

రచన: అంబడిపూడి శ్యామసుందర రావు

కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు మహా భారతములోని ముఖ్యమైన పాత్రలు కౌరవులకు, పాండవులకు విద్యలు నేర్పిన గురువులు కురుక్షేత్ర యుద్దములో సైన్యాన్ని నడిపించిన అతిరధ మహారధులు భీష్ముని తదనంతరము కౌరవ సైన్యానికి నాయకత్వము వహించినవాడు ద్రోణుడు. ద్రోణాచార్యుడు గురువులలో అగ్రగణ్యుడు అందుచేతనే ప్రభుత్వము వారు కూడా ఆటలకు శిక్షణ ఇచ్చే విశిష్టమైన కోచ్ లకు ద్రోణాచార్య అవార్డు ఇస్తున్నారు. వీరువురు గురించి క్లుప్తముగా తెలుసుకుందాము.
కృపాచార్యుడు బ్రహ్మ నాల్గవ అవతారము. ఈయన శతానంద మహర్షి మనుమడు. మహాభారతంలో కౌరవులకు, పాండవులకు గురువు. మహాభారత యుద్ధమందు కౌరవుల తరపున యుద్ధం చేసాడు. యుద్ధం ముగిసిన తరువాత బ్రతికిఉన్నకొద్దిమందిలో ఇతడు ఒకడు. ఎనిమిదిమంది చిరంజీవులలో ఒకడు. కలియుగములోని 8వ మన్వంతరము లోని ఋషులలో గొప్పవాడు. కురుక్షేత్ర యుద్ధం తరువాత అర్జునుడి మనుమడైన పరీక్షిత్తుకు ఆచార్యునిగా నియమింప బడ్డాడు . కృపాచార్యుని జన్మవృత్తాంతము తెలుసుకుందాము గౌతమ మహర్షి కుమారుడైన శతానంద మహర్షికి సత్య ధృతి అనే కుమారుడున్నాడు. సత్య ధృతి జన్మించడమే విల్లంబులతో జన్మించాడు కనుక శరధ్వంతుడు అనే పేరుతో పిలువబడసాగాడు. . ధనుర్విద్య ఇతనికి పుట్టుకతోనే ప్రాప్తించింది. ఇతనికి చిన్నతనం నుంచే వేదాల మీద కన్నా అస్త్ర విద్యలపైన ఎక్కువగా ఆసక్తిని కనబరచసాగాడు. కొంతకాలం తపస్సు చేసి అన్ని యుద్ధవిద్యల్లో ఆరితేరాడు. ధనుర్విద్యలో తిరుగులేని మహా వీరుడైనాడు దీన్ని గమనిస్తున్న దేవతలు, ముఖ్యంగా ఇంద్రుడు కలవరపడసాగాడు. ఇంద్రుడు అద్భుత సౌందర్యరాశియైన జలపది అనే దేవకన్యను ఆయన బ్రహ్మచర్యాన్ని ఆటంకపరచేందుకు నియమించాడు. ఆమె శరద్వంతుడి వద్దకు వచ్చి వివిధ రకాలుగా ఆకర్షించడానికి ప్రయత్నించింది. మహా సౌందర్యవతి అయిన ఆమెను చూచినదే సత్యధృతి చేతిలోని విల్లమ్ములు జారి క్రిందపడ్డాయి. అది గ్రహించి తన కామోద్రేకమును నిగ్రహించుకొనెను. కాని, అతనికి తెలియకుండకుండా రేతః పతనమై అది రెల్లుగడ్డిలో పడెను. అది రెండు భాగములై అందులోనుంచి ఒక బాలుడు, ఒక బాలిక జన్మించారు. కొంతకాలమునకు శంతన మహారాజు వేటాడుచు అక్కడికి వచ్చి వారిని చూచి తన బిడ్డలుగా పెంచుకొన్నాడు. వారికి జాతక కర్మాది సంస్కారములు గావించి తన కృపతో పెంచబడ్డారు కావున వారికి కృపుడు, కృపి అని నామకరణము చేయించాడు.
ఈ సంగతి గ్రహించిన సత్యధృతి శంతనునితో తన సంగతి చెప్పి కృపునకు చతుర్విధ ధనుర్వేదములును నానా విధ శాస్త్రములను నేర్పాడు. అతడే విలువిద్యయందు పరమాచార్యుడై భీష్ముని ప్రార్ధనమున కౌరవ పాండవులకు గురువు అయి వారికి యుద్ధ విద్యలలో తర్ఫీదు ఇచ్చాడు మహాభారతము లోని ఉద్యోగపర్వంలో భీష్ముడు కృపాచార్యుని మహారధిగా ప్రకటిస్తాడు అంటే యుద్దములో 60, 000 మంది యోధులతో ఒకే సారి పోరాడగలిగిన వాడు అని అర్ధము. ద్రోణాచార్యుడు లేదా ద్రోణుడు భరద్వాజ మహాముని పుత్రుడు భరద్వాజ మహాముని
ఒకనాడు గంగా నది తీరములో తపము ఆచరిస్తున్నప్పుడు అప్సర కన్యలలో మేటి అయిన ఘృతాచి పై అనుకోకుండా భరద్వాజుని దృష్టి ఆమెపై పడి రేతః స్కలనం జరుగుతుంది. అది గ్రహించిన మహర్షి ఆ వీర్యాన్ని గ్రహించి ద్రోణ అనే యజ్ఞపాత్రలో ఉంచగా కొన్నాళ్లకు ఆ ద్రోణ గర్భము విడివడి అందులో నుండి ఒక కుమారుడు ఉద్బవిస్తాడు అతడే ద్రోణాచార్యుడు. మహాభారతంలో ఈయనది కీలకమైన పాత్ర. చిన్నతనంలో తండ్రి దగ్గర వేదవేదాంగాలతో పాటు విలువిద్యను కూడా నేర్చుకున్నాడు. ఈయనతో పాటు పాంచాల దేశపు రాజకుమారుడు ద్రుపదుడు కూడా అవే విద్యలు నేర్చుకున్నాడు. వీరిద్దరికీ గాఢమైన స్నేహం కుదిరింది. ఆ కారణంగా ద్రుపదుడు తాను రాజయ్యాక ద్రోణుడికి సగం రాజ్యం ఇస్తానని అంటూ ఉండేవాడు. ఆశ్రమవాసం పూర్తి చేసుకున్న తరువాత కృపాచార్యుడి చెల్లెలు కృపిని వివాహం చేసుకున్నాడు. వీరి కుమారుని పేరు అశ్వత్థామ. అశ్వత్థామ జననానంతరం అతనిని పోషించటం కూడా వీలుకాని దుర్భర దారిద్ర్యంతో బాదపడుతుంటాడు. పరశురాముడు తన ధనమంతా బ్రాహ్మణులకు దానం ఇస్తున్నాడని విని అతని వద్దకు దానం స్వీకరించడానికి వెళ్తాడు. ద్రోణుడు అక్కడకు చేరే సమయానికి పరశురాముడు ధనమంతా దానం చేసాడు. పరశురాముడు ద్రోణుని చూసి నాదగ్గర ఉన్న ధనమంతా దానం చేసాను ఇప్పుడు నా దగ్గర నా శరీరం అస్త్రవిద్య మాత్రమే ఉన్నాయి కాబట్టి అస్త్రవిద్య కావాలంటే నేర్పుతానని చెప్పాడు. ద్రోణుడు అందుకు సమ్మతించి అతని వద్ద అస్త్రవిద్య నేర్చుకున్నాడు. అది తరువాతి కాలంలో హస్థినాపురంలో కౌరవులకు పాండవులకు అస్త్రవిద్య నేర్పటానికి దారితీసింది. బావగారు అయిన కృపాచార్యుని దగ్గరకు చేరతాడు
ఒకరోజు కురు పాండవులు బంతి అట ఆడుకుంటూ ఉన్నప్పుడు ఆ బంతి లోతైన బావిలో పడుతుంది ఆ బంతిని తీయటం చేతకాక పిల్లలు బావి చుట్టూ తిరుగుతున్నాసమయములో చూసిన ద్రోణుడు , “రాకుమారులు, కృపాచార్యుని శిష్యులు అయి ఉండి కూడా బంతిని శర సంధానముతో తీయలేరా”అని బాణాలతో లాఘవంగా బంతిని తీసి రాకుమారులకు ఇచ్చాడు. విషయము తెలుసుకున్నభీష్ముడు ద్రోణుడిని పిల్లలకు ధనుర్విద్య నేర్పమని కోరగా ఆనాటినుండి ద్రోణుడు కృపాచార్యునితో కురుపాండవులకు ఆచార్యునిగా ఉంటూ వారిని ధనుర్విద్యలో నిష్ణాతులుగా చేసాడు
ద్రుపదుడి జన్మ వృత్తాంతము కూడా తెలుసుకోదగ్గదే. భరద్వాజ మునికి పాంచాలదేశ రాజు అయిన వృషతుడు స్నేహితుడు. వృషతుడు తపస్సు చేస్తూ సమీపంలో పూలు కోస్తున్న మేనకను చూసి రేతఃస్ఖలనం అయ్యింది. అప్పుడు జన్మించిన వాడే ద్రుపదుడు. ద్రుపదుడికే యజ్ఞసేనుడని కూడా పేరు. వృషతుడు ద్రుపదుణ్ణి తనరాజ్యానికి తీసుకెళ్ళకుండా భరద్వాజ ముని దగ్గరే ఉంచుతాడు భరద్వాజుడు తన కొడుకైన ద్రోణునికి స్నేహితుడి కొడుకైన ద్రుపదుడికి కలిపి వేదవేదాంగాలు, విలువిద్య నేర్పించాడు ఆవిధముగా ద్రోణుడు, ద్రుపదుడు భరద్వాజుని దగ్గర కలిసి మంచి స్నేహితులుగా పెరిగారు .
కొన్నాళ్ళకు వృషతుడు మరణించడంతో ద్రుపదుడు పాంచాల రాజ్యానికి రాజవుతాడు. వెళుతూ వెళుతూ తన స్నేహితుడైన ద్రోణుని కూడా తన రాజ్యానికి ఆహ్వానిస్తాడు. ద్రుపదుడు వెళ్ళిపోయిన తర్వాత ద్రోణుడు అగ్నివేశుడు అనే మహాముని దగ్గర మరల ధనుర్విద్యనభ్యసించాడు. ఆయన దగ్గర ఆగ్నేయాస్త్రం లాంటి దివ్యాస్త్రాలను పాదించాడు. తరువాత బాల్య మిత్రుడు ద్రుపదుడు విద్యాభ్యాస సమయంలో ఇచ్చిన మాటను పురస్కరించుకుని ఆతని సహాయం కోరటానికి వెళతాడు. కానీ ద్రుపదుడు అతనిని అవమానించి రిక్త హస్తాలతో వెనుకకు పంపించాడు. ఆ అవమానాన్ని సహించలేని ద్రోణుడు అతనినిఎలాగైనా తిరిగి అవమానించాలని పంతం పడతాడు
ద్రోణాచార్యుడు కౌరవులకూ, పాండవులకు రాజగురువు. దేవశాస్త్రాలతో సహా యుద్ధవిద్యలలోనూ, అస్త్ర శస్త్రలలోనూ ఆరితేరిన వాడు. అర్జునుడు అతనికి ప్రియవిద్యార్థి. వారందరిలో అర్జునుడు ద్రోణుని అభిమానాన్ని చూరగొన్నాడు ఆ తరువాత గురుదక్షిణగా ద్రుపదుని పట్టి బంధించి అతనికి బుద్ధి చెప్పి తిరిగి పంపించటం భారతంలో ఒక ప్రధాన ఘట్టం ద్రోణుడికి ప్రియమైనవారు ఎవరున్నా ఉన్నారంటే అది తన కుమారుడు అశ్వథ్థామ కానీ ద్రోణుడు అర్జునిడిని తనకన్నా గొప్ప ధనుర్ధారిని చేస్తానని మాట ఇస్తాడు ఆ కారణముగానే ద్రోణుడు ఏకలవ్యుడిని కుడిచేయి బ్రొటనవేలు గురుదక్షిణగా అడిగాడు అన్న అపవాదును మూటగట్టుకుంటాడు కానీ నిజానికి ద్రోణుడు రాజధర్మము పాటిస్తాడు ఏకలవ్యుడు తనకు విలువిద్య భోధించామని అడిగినప్పుడు తాను కురు పాండవులకు విద్యబోధించటానికి నియమింపబడ్డవాడు కాబట్టి అన్యులకు విద్యాబోధన చేయరాదు. అదీగాక ఏకలవ్యుడు రాకుమారుడు కాదు అటువంటి వ్యక్తి కాబట్టే తన విలువిద్యకు భంగము కలిగిస్తున్న కుక్క మూతిని బాణాలతో మూయిస్తాడు. ఆ విధముగా విచక్షణా రహితముగా ప్రవర్తించే ఆటవిక జాతివాడికి ఎక్కువ శక్తి ఉండటం మంచిది కాదు అని ద్రోణుడు అభిప్రాయ పడి ఏకలవ్యుడి బొటనవేలు గురుదక్షిణగా అడుగుతాడు కానీ అర్జుని మీద అభిమానంతో అలా చేసాడని లోకము అనుకుంటుంది.
కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు అశ్వత్థామలను యుద్దములో ఓడించటము లేదా సంహరించటం అంత సులువైన పని కాదు కృపాచార్యుడు, అశ్వత్థామ చిరంజీవులు. ద్రోణుడు అమిత శక్తి సంపన్నుడు యుద్ధ వ్యూహ రచనలో అమితమైన నేర్పు ఉన్నవాడు కాబట్టే కురుక్షేత్ర యుద్దములో పద్మవ్యూహాన్ని అమలుపరుస్తాడు ఆ తరువాత ద్రోణుడిని సంహరించటానికి శ్రీ కృష్ణుని సలహా మేరకు ధర్మరాజుచే యుద్ధము 15 వ రోజున ధర్మరాజుచే “అశ్వత్థామ హతః కుంజరః “అని చెప్పిస్తారు అబద్ధము అది ధర్మరాజు చెప్పిన మాట విని అశ్వత్థామ మరణించాడు అని భావించి అస్త్ర సన్యాసము చేస్తే ద్రోణుడిని ద్రుపదుడి కొడుకు అయినా దృష్టద్రుమ్యుడు ఆయనను చంపగలిగాడు ఆ విధముగా ద్రోణుని చరిత్ర ముగుస్తుంది
కృపాచార్యుడు, ద్రోణుడు ఇద్దరు రాజధర్మానికి లోబడి కౌరవులు అన్యాయముగా యుద్దానికి దిగారని తెలిసి కూడా అధర్మము వైపున వుండి యుద్దములో పాల్గొంటారు. వారితో పాటే అశ్వత్థామ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *