April 16, 2024

చంద్రోదయం – 10

రచన: మన్నెం శారద

“రెండు మూడేళ్ళు ఆగితే ఆ ముసిలోడు అంటే నీ మామగారు గుటుక్కు మనేవాడు. నీకా ఒక్కగానొక్క బిడ్డ. ఆస్తంతా చచ్చినట్లు నీ చేతికి దొరికేది. మొగుడు లేకపోతేనేం మహారాణిలా వుండేది జాతకం! ఈ పనికిమాలిన పెళ్లి వల్ల ఆ ఛాన్సు కాస్తా చక్కాబోయింది.”
స్వాతి తేలిగ్గా ఊపిరి తీసుకుంది.
అవన్నీ ఆమె చెప్పకపోయినా తనకీ తెలుసు. ఇది క్రొత్త విషయం కాదు. తను అన్నింటికి సిద్ధపడే ఈ పెళ్ళి చేసుకుంది.
“నాకు తెలుసు పిన్నిగారు!” అంది.
“ఏమిటి తెలుసునమ్మాయి? నీ గురించి ఆలోచిస్తే నా గుండె తరుక్కుపోతుంది తెలుసా? పసి వెధవ. మొగాడి మొదటి పెళ్ళాం పిల్లల్ని చూడ్డం రెండో పెళ్ళానికి విధాయక మవుతుంది గాని, రెండోపెళ్ళిచేసుకున్న ఆడదాని పిల్లల్ని ఏ మగాడు తన పిల్లల్నిగా చేరదీస్తాడు ? మగాడి పుట్టుకే అంత తల్లి; తనదీ అనుకున్న ఆడదాన్ని మరొకడు ముట్టుకున్నాడని తెలిస్తే పశువు అయిపోతాడు. ఏమో, నాకయితే నమ్మకం లేదు. బిడ్డ జాగ్రత్త సుమీ. పెద్దముండని. నాబిడ్డలాంటి దానివని జాగ్రత్త చెపుతున్నాను. సారధి ఎంత చెడ్డా నీ బిడ్డకి తండ్రికాలేడు. నీ మీద మోజుతో వాడిని దగ్గరికి తీసినా అది నటన అవుతుందే తప్ప గుండెలోంచి పొంగే ప్రేమ మాత్రం కాదు” అంది ఖచ్చితంగా జానకమ్మ.
స్వాతి ఆ మాటలకు నిశ్చేష్టురాలయింది.
“నే వెళ్ళోస్తానే తల్లీ!” జానకమ్మ పైకి లేచింది. స్వాతి ఆమె మాటల్ని విపించుకోలేదు. గుండెల్లోంచి దుఃఖం పైకి ఎగదన్నుతోంటే మునిపళ్ళతో పెదవుల్ని నొక్కి పట్టింది. జానకమ్మ మాటల్లో సత్యం వుందని అంతరాత్మ ప్రభోథిస్తోంది. కాని సారధి అలాంటివాడు కాదని మనస్సాక్షి చెబుతోంది. కేవలం అతను మోజు కొద్దీ తనని పెళ్ళి చేసుకొనివుంటాడంటే నమ్మలేకపోతోంది.
అందమైనవాడు!
మంచి పొజిషన్ లోవున్న వాడు!
కావాలంటే తనకన్నా అన్ని విధాలా ఉన్నత స్థానంలో వున్న ఆడదాన్ని భార్యగా పొందగల అర్హత అతనికి వుంది.
అతన్ని జానకమ్మ చెప్పిన రీతిలో అన్వయించుకొని ఆలోచించలేకపోతోంది స్వాతి. కానీ ఏదో భయం గుండెలో గూడు కట్టేసుకుని ఆమెని హాయిగా బ్రతకనివ్వటం లేదు.
జానకమ్మ వెళ్ళి అరగంటయినా స్వాతి తేరుకోలేకపోయింది. ఆమె విడిచి వెళ్ళిన విషవాయువుల ఘాటు ఆమె మెదడు పైన చాల బాగా పనిచేయటం మొదలు పెట్టింది. స్వాతి భరించలేనట్లు వెక్కి వెక్కి ఏడ్చింది.
సాయుత్రం ఆరుగంటలవుతోంది. సారధి, నానీ క్రింద ఆవరణలో క్రికెట్ ఆడుతున్నారు. సారధి బేటింగ్ చేస్తున్నాడు. నానీ బంతి విసురుతున్నాడు.
“డాడీ! డాడీ! నేను బేటింగ్ చేస్తాను డాడీ!” సారధి చొక్కాపుచ్చుకొని లాగుతూ గారాలు పోతున్నాడు నాని.
“నీ ముఖం. నువ్వు బేట్ ఎత్తలేవు” సారధి నచ్చచెబుతున్నాడు.
“లేదు డాడీ! ఎత్తగలను. మమ్మీ యిప్పుడే ఆమ్లెట్ పెట్టిందిగా; హార్లిక్సు కూడా తాగేను.” క్రింద సారధి, పైన బాల్కనీలోంచి చూస్తున్న స్వాతి కూడా ఒకేసారి నవ్వేసేరు.
సారధి పైకి చూసేడు.
స్వాతి సిగ్గుపడ్డట్టుగా మొహం తిప్పుకొంది.
“సరే! ఇదిగో బేట్ ! కానివ్వు!”
సారధి బేట్ అందించి – బంతి తీసుకుని దూరంగా వెళ్ళేడు.
క్రింది క్వార్టర్ అరుగుమీద కూర్చుని ఇదంతా చోద్యంగా చూస్తోంది జానకమ్మ, ఆమె కళ్ళు అసూయతో భగ్గుమంటున్నాయి.
నానీ సారధి విసిరిన బంతిని కొట్టబోయేడు. బంతి బేట్ కి దొరకలేదు. బేట్ నుదుటికి కొట్టుకుంది.
“అమ్మా” అంటూ నానీ క్రిందపడ్డాడు.
సారధి పరుగున వచ్చి నానిని పట్టుకున్నాడు.
స్వాతి హడావుడిగా రెండేసి మెట్లు దూకుతూ క్రిందకు వచ్చేసింది.
అప్పటికే సారధి నానీని భుజమ్మీద వేసుకుని గేటు తీసుకొని బయటకెళ్ళిపోయేడు.
స్వాతి గుండె చెదరింది. వాడి నుదిటి మీద కారుతున్న రక్తంచూసి సహించలేక పోయిందా తల్లి హృదయం!
ఒంటరిగా, వాడే లోకంగా బ్రతకటం చేతనేమో- వాడిమీద చిన్న దోమ వాలినా ఆమె తల్లడిల్లిపోతుంది.
ఆమె కళ్ళలోంచి నీళ్ళుపొంగేయి!
“అయినా పసిపిల్ల వాడి చేతికంత పెద్దబేట్ యిస్తారా? కన్నవాళ్ళయితే కదూ కష్టాలు తెలిసేది?” జానకమ్మ రంగంలోకి వచ్చేసింది.
స్వాతి మాట్లాడకుండా మెట్లెక్కింది.
సారధి తిరిగి వచ్చేవరకూ జానకమ్మ ఏదో పేలుతూనే వుంది.
సారధి నానీని పక్కమీద పడుకో బెట్టి ఫాన్ వేసేడు.
నానీ తలకి బాండేజ్ వేసుంది. “స్వాతీ! కాస్త హార్లిక్సు తీసుకురా” స్వాతి కదల్లేదు.
సారధి ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూసేడు.
నిశ్శబ్దంగా ఏడుస్తూందావిడ.
“ఛ! ఏవిటిది చిన్న పిల్లలా! ఆడుకునే పిల్లలకి దెబ్బతగలదా? అయినా అదేం పెద్దదెబ్బ కాదులే; కాస్త నిద్రపట్టడానికి ఇంజక్షన్ యిచ్చేరు అంతే.” సారధి స్వాతి దగ్గరకు వచ్చి అన్నాడు.
స్వాతి కళ్ళు తుడుచుకొని వంటగదిలోకి వెళ్ళింది. స్వాతి అందించిన హారిక్స్ నానీకి పట్టి స్వాతి పిలుపుతో భోజనానికి వెళ్ళేడు సారధి.
స్వాతి దగ్గరుండి నాలుగుముద్దలు తినిపించి – తన భోజనం అయిందనిపించి నానీ పక్కనే కూర్చున్నాడు సారధి. “నువ్వు పడుకో, నేను బాబుని చూస్తుంటాను” అని పేపరు తీసుకొని, నానీ పక్కనే చదువుతూ కూర్చున్నాడు సారధి.
మధ్య మధ్యలో నానీ ఉలిక్కిపడుతున్నాడు నిద్రలో.
సారధి ఓ చేతిని ఆ కుర్రాడిపైన వేశాడు.
పసివాడికి అకారణంగా దెబ్బతగిలినందుకు అతనికీ బాధగానే వుంది, చేతిలోని పేపర్ పక్కకి పడేసి సారధి నానీ మొహంలోకి చూసేడు.
అతని గుండె ఆవేదనతో నిండిపోయింది.
నానీవి అన్నీ శేఖర్ పోలికలే. నానిని చూస్తుంటే శేఖర్ బహుశా చిన్నతనంలో అలానే వుండేవాడేమో ననిపిస్తుంది.
సారధి మెల్లగా వంగి నానీ నుదుట ముద్దు పెట్టుకున్నాడు
అతని కళ్ళలో నీరు సుడులు తిరిగింది.
గుండెని చేత్తో పట్టుకుని ఎవరో అదృశ్యంగా పిండుతోన్నట్లుగా వుంది.
ఇలా ఎందుకు జరిగింది?
అదంతా నిజమా?
కలా?
సారధికి వాస్తవంలో జీవిస్తున్నట్టు లేదు. శేఖర్ చనిపోవడం యధార్ధం కాకపోతే ఎంత బాగుండును?
శేఖర్ చనిపోవడమే నిజమైతే మంచికి ఈ ప్రపంచంలో చోటెక్కడ?
సారధికి చెప్ప లేనంత ఉక్రోషం వస్తోంది.
శేఖర్ చావుకి తను పరోక్షంగా కారణం కాదుకదా అన్న అనుమానం అతన్ని పీడిస్తోంది.
తను శేఖర్ని శపించేడు.
ఆ శాపఫలమే అతన్ని కాటు వేసింది.
అది నిజమా?
మంచివాళ్ళకి శాపాలు తగులుతాయా?
తననో వ్యక్తిగా తీర్చిదిద్ది, తనకిలాంటి జీవితాన్ని ప్రసాదించిన పుణ్యమూర్తినా తను శపించింది?
“కాదు” అని గట్టిగా అరవాలనిపించింది. రెండుచేతులతో తలని గట్టిగా పట్టుకున్నాడు. ఆలోచనలతో తల పగిలి పోతోంది.
అతని మనసు గతంలోకి చొచ్చుకుపోతోంది…
– ఆ రోజు
శేఖర్ పెళ్ళిచూపులు.
శేఖర్ అప్పటికే తయారయిపోయి సారధిని తొందర పెట్టేడు.
“ఇంతకీ పెళ్ళికొడుకువి నువ్వా? నేనా?” అడిగేడు శేఖర్ సారధిని ఎంతకీ తయారు కాకపోవటం చూసి.

ఇంకా వుంది…

1 thought on “చంద్రోదయం – 10

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *