June 24, 2024

జీవితమంటే..

రచన: విజయలక్ష్మీ పండిట్

ఉదయం ఐదు గంటలకే లేచి మిద్దె పైన వాకింగ్ చేస్తున్నాను.
రోజు తూర్పున ఇంటిముందు మెల్లమెల్లగా తన ప్రత్యూష కిరణాలు సంధించి చీకట్లను పరుగులు పెట్టిస్తూ ఎఱ్ఱని బంతిలా ఆకాశం పొత్తిళ్ళలో వెలిగిపోయే ఉదయించే బాలభానుడి అందాలను తిలకిస్తూ నడవడం నా కెంతో ఇష్టం.
ఇంటి చుట్టూ ఎత్తుగా పెరిగిన చెట్ల కొమ్మలనుండి వీచే చల్లని గాలి ఒకవైపు శరీరాన్ని మృదువుగా తాకుతూంటే, ఆదిత్యుని లేత కిరణాల స్పర్శతో శరీరానికి మనసుకు చెప్పలేని స్వాంతన.
ప్రకృతి అందించే ఆ అందాలను ఆస్వాదించడానికి మన మనసు పరిస్థితి ఎంత ముఖ్యమో నాకు అప్పుడప్పుడు అవగతమవుతూంటుంది.
వారం రోజులుగా ఆ చల్లని గాలి, వెచ్చని కిరణాలు అందంగా రంగులు మారుతున్న ఆకాశాన్ని నా
మనసు పూర్తిగా ఆస్వాదించే స్థితిలో లేదు.
నా స్నేహితురాలు అనూరాధ నాతో వాళ్ళ అమ్మాయి సిరిని గురించి చెప్పినప్పటినుండి ఏదో తెలియని వెలితి, నిరుత్సాహము మనసును ఆవహించింది.
“ఎంత విచిత్రం ఈ మనసు.. ! ఏ పెద్ద సమస్య లేకుండా మనం ప్రేమించే వారు సంతోషంగా ఉంటే ఆ ప్రేమలో మునిగి తేలుతూండే మనసు చిన్ని అందాలకు ఆప్యాయత నిండిన పలకరింపులకు దూదిపింజలా తేలికై విహరిస్తుంది. ఆ ఉత్సాహం శరీరమంతా పాకి జీవితం అందమైన అనుభవమవుతుంది.
కాని మనకిష్టమయిన వారికి ఊహించని సంఘటనలు సమస్యలు ఎదురైనపుడు
ఆకృతిలేని ఆ మనసే ఎన్నో టన్నుల బరువును మోస్తున్నట్టు.. ఆ భారమంతా మనిషిపై పడి జీవితం బరువవుతుంది.”
అంతలో… , సమస్య అనే పదము నా ఆలోచనలో మెదలగానే నాకు ఆ మధ్య చదివిన ఒక కొటేషన్
మరల గుర్తుకొచ్చింది.
”జీవితం ఒక సమస్య కాదు పరిష్కరించడానికి,
జీవితం ఒక వాస్తవం దానిని అనుభవించడమే.”
ఆలోచించే కొద్ది ఎంతలోతైన చింతన అనిపించింది. అనురాధ కూతురు సిరి సమస్యను విన్నప్పటి నుండి ఆ కొటేషన్ వారం రోజులనుండి పదే పదే గుర్తుకొస్తూంది. ముడుచుకపోయిన నా మనసుకు ఆ కొటేషన్ ఒక టానిక్ లా పనిచేసి మెల్ల మెల్లగా కోలుకోసాగింది.
యవ్వనంలో సినిమాలను చూసి, నవలలు చదివి నా భర్త ఇలాఉండాలని అమ్మాయిలు, భార్య ఇలా వుండాలని అబ్బాయిలు వైవాహిక జీవితాన్ని మనసులో ముద్రవేసుకుని అలా ఉండాలని కలలు కంటారు. వాస్తవ జీవితంలో అవి నెరవేరకపోతే ఇష్టంలేని ప్రతి చిన్న విషయాన్ని సమస్యగా చిత్రించుకుని కృంగిపోతారు. సరయిన ఆలోచన అవగాహన లోపించి మనసు అపరిపక్వత వల్ల జీవితమంటేనే ఓ పెద్ద సమస్య అని మనసులో ముద్ర వేసుకుంటారు.
అదే ధ్యాసలో మెల్లగా నడుస్తున్నాను. ఆ సమయంలో నా మనసు కాలంలో వెనుకకు పరిగెత్తింది. గడిచిన మా జీవితాలను పరామర్శిస్తూ.

***

మా నాన్న అనురాధ వాళ్ళనాన్న మంచి స్నేహితులు. మా రెండు కుటుంబాలు తరచుగా కలుసుకోవడంవల్ల
చిన్నప్పుడు నుండి నాకు తోబుట్టువులు లేక నేను, అనురాధ అక్క చెల్లెళ్ళలా మెలిగాము. నాకంటే ఒక సంవత్సరం పెద్దది అనురాధ. తనకు ఒక తమ్ముడున్నాడు.
ఇద్దరం ఒకే స్కూల్ , కాలేజిలో చదువుకున్నాము.
అనురాధకంటే నేను ఎక్కువ ఎమోషనల్. నాకు త్వరగా కోపమొస్తుంది. ఏదైన సమస్య వస్తే కుంగిపోవడం నా నైజం. అనూరాధ మనస్తత్వం నాకు వ్యతిరేకం. దేనికి తొందరగా రియాక్టు కాదు. సమస్య వస్తే తొందరపడకుండా ఆలోచిస్తుంది.
అదృష్టవశాత్తు మా వైవాహిక జీవితాలు బాగానే గడిచాయని చెప్పాలి. అనూరాధ పెండ్లి తన మేనమామ కొడుకు రాజశేఖర్ తో జరిగింది. చిన్నప్పటి నుండి అలా పేరుపెట్టి పెంచిన వాళ్ళ అమ్మమ్మ, అమ్మ కోరిక ప్రకారం వాళ్ళ తాతగారి పెద్ద ఆస్తికి అతను ఒకడే వారసుడు. అనురాధ రాజశేఖర్ కూడా ఆ ఆలోచనలతోనే పెరిగారు కాబట్టి తన పెండ్లి డిగ్రీ కోర్సు పూర్తి కాగానే జరిగిపోయింది. రాజశేఖర్ కూడా అగ్రికల్చర్ లో డిగ్రీ పూర్తి చేసి తమ వ్యవసాయ భూములను, పంటలను తానే పర్యవేక్షణ చేసుకుంటున్నాడు.
నాకు పి. జి. కోర్సు పూర్తి చేసి లెక్చరర్ జాబు చేయాలనే కోరిక ఉండేది. అందుకు కారణం నా కజిన్ బ్రదర్ భాస్కర్ అతని భార్య ఇందిర. ఇద్దరు డిగ్రీ కాలేజిలో లెక్చరర్లగా చేసేవారు. మా అన్న వదినలను కలిసినపుడు ఉద్యోగం చేసి ఆర్థికంగా స్వతంత్రురాలయిన మా వదినలో తొంగచూసే ఆత్మస్తైర్యం హుందాతనం నాకు ఇష్టం.
ఒక పద్దతిలో ఇంటిఖర్చులను ఇద్దరు కలిసి చెర్చించుకుంటూ అన్యోన్నంగా సాగే వారి సంసారం నాకు నచ్చేది.
మా అన్న వదినల సహాయంతో మా అమ్మనాన్నను ఒప్పించి ఇంగ్లీషులో M. A. పూర్తి చేశాను. త్వరగానే హైదరాబాద్ లో లెక్చరర్ ఉద్యోగంలో చేరాను.
తరువాత ఒక సంవత్సరానికి మా బందువులవైపు ఒక పెండ్లిలో మా వదిన వైపు బందువు రామకృష్ణ నన్ను చూసి ఇష్టపడ్డాడు. మా అన్న వదినతో మా నాన్న అమ్మలకు కబురు పంపారు రామకృష్ణ తల్లితండ్రులు. మేమిరువురము అన్న వదిన వాళ్ళ ఇంట్లో కలిసి మాట్లాడుకునే ఏర్పాటు కూడా చేశారు.
రామకృష్ణ L. L. B. చదివి హైకోర్టులో అడ్వకేట్ గా పనిచేస్తున్నాడు. వాళ్ళ నాన్న సీనియర్ లాయర్
మా ఇరువురి అభిరుచులు, మా ఉద్యోగాల గురించి , మా ఆదర్శభావాలు, మహిళల పై అతని అభిప్రాయాలు, విషయాలపై దాదాపు రెండుగంటలు మాట్లాడుకున్నాము.
మేమిద్దరం పెండ్లికి ఒప్పుకోవడంతో ఇరుకుటుంబాలు కలిసి పెండ్లి ముహూర్తాలు నిర్ణయించి మా పెండ్లి చేశారు. మా పెండ్లి నాటికి అనూరాధకు ఒక కొడుకు విక్రమ్. తరువాత మూడు సంవత్సరాలకు మా ఇరువురికి దాదాపు ఒక నెల తేడాతో కూతుళ్లు పుట్టారు.
అనూరాధ కూతురు సిరి మా అమ్మాయి శ్లోక కంటే ఒక నెల పెద్దిది. సిరి, శ్లోక ఇద్దరు బి. టెక్. ఎలక్ట్రానిక్స్ లో చేరారు. మూడో సంవత్సరంనుండి G. R. E , Toefl test కు ప్రిపరేషన్ మొదలుపెట్టి U. S. లో యూనివర్సిటిలో M. S. చేసి తరువాత అమెరికాలోనే సాప్ట్ వేర్ ఇంజినీర్లుగా ఉద్యోగాలలో చేరారు.
అనూరాధ కొడుకు విక్రమ్ ఒక సంవత్సరం ముందు అమెరికాలో టెలికమ్యూనికేషన్ ఇంజనీరుగా జాబ్
లో చేరాడు. ఉద్యోగాలలో రెండు సంవత్సరాలు గడిచాక వచ్చిన సంబంధాలను విచారించుకుని మొదట అనురాధ వాళ్ళు సిరి పెండ్లి చేశారు. సిరి భర్త శేఖర్ కూడా అమెరికాలో సాఫ్టువేర్ ఉద్యోగం.
సిరి పెళ్ళి తరువాత ఆరునెలలకు మా శ్లోక పెండ్లి జరిగింది. మా అల్లుడు ఆనంద్ కూడా అమెరికాలో ఉద్యోగం. శ్లోక వాళ్ళ కంపెనీలో పనిచేసేవాడు. శ్లోకను పెండ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేశాడు.
శ్లోక కూడ ఆరునెలలు అతన్ని గమనించి తనకూ ఆనంద్ నచ్చాడని మాకు చెప్పింది.
ఇరువైపుల కుటుంబాలు కలిసి పెండ్లి చేశాము. విక్రమ్ బి. టెక్. లో తన బాచ్మేట్ అర్చన
ఇద్దరు ఇష్టపడ్డారు. ఇరువైపుల అమ్మానాన్నల సమ్మతితో వారి పెండ్లి జరిగింది.
విక్రమ్ , సిరి, శ్లోక కుటుంబాలు నాలుగయిదు గంటల కారుప్రయాణం దూరంలో ఉంటూ, అప్పుడప్పుడు నెలకో రెండునెలలకో వీకెండ్సుకు కలుసుకుంటూ ఉంటారు.
కొత్తల్లో ప్రతి రోజు ఏదో ఒక పూట మాతో ఫేస్ టైమ్ చేస్తేకాని మా శ్లోకకు నిద్ర పట్టేది కాదు. రాను రాను ఉద్యోగం , సంసారంలో పడి వారంలో రెండు మూడు మార్లు మాట్లాడేవాళ్ళు ఫేస్ టైం లో.
ఆలోచిస్తూ నడుస్తున్న నాకు కొద్దిసేపు కూర్చోవాలనిపించి అక్కడే ఉన్న సినెంట్ బెంచి పై కూర్చున్నా. మొహానికి పట్టిన చిరుచెమటలను నా నైటి పై వేసుకున్న కాటన్ దుప్పట్టాతో తుడుచుకుని సీసాలోని మంచినీళ్ళు తాగుతూంటే, పదిరోజుల క్రితం అనురాథ సిరి మా యింటికి వచ్చినప్పటి సంఘటన నా మదిలో తిరిగింది రీలులా.

***
ఆ రోజు శనివారం సాయంత్రం అనూరాధ ఫోన్ చేసి
“జయ.. నేను సిరి రేపు హైదరాబాద్ వస్తున్నాము. తమ్ముడి ఇంట్లో దిగి ఫోన్ చేస్తాను. ట్రైనుకు టైమవుతూంది” అని పెట్టేసింది.
అనూరాధ వాళ్ళు విశాఖపట్నంలో ఉంటారు.
మరుసటి రోజు ఆదివారం పదిగంటల సమయంలో అనూరాధ ఫోన్ చేసి “జయా సాయంత్రం మీ ఇంటికి వస్తాము. ఏమి ప్రోగ్రామ్ లేదు కదా మీకు” అంది.
“మీ కోసమే వెయిటింగ్.. , అదే మా ప్రోగ్రామ్ అని సిరి ఎప్పుడు వచ్చింది యు. ఎస్. నుండి” అడిగాను
“వస్తానుగా.. చెబుతాను ఉంటాను జయ “అని ఫోన్ కట్ సేసింది.
సాయంత్రం బాదామ్ హవుస్ నుండి అనూరాథకు సిరికి ఇష్టమయిన స్వీట్సు , కారప్పూస, మిక్చరు తెప్పించి నేను రామకృష్ణ వెయిట్ చేస్తూంటే వచ్చింది అనూరాథ ఒక్కటే.
“సిరి ఎక్కడ” అడిగాము ఇద్దరం ఒకేసారి.
సిరి వాళ్ళ ఫ్రెండ్ రమ్య ను కలవాలని వెళ్ళింది.
వాళ్ళు ఇక్కడే ఉంటారు. ఇటే వస్తుంది ఇద్దరం కలిసి వెళతాము”అని,
“ఎలా ఉన్నారు ఇద్దరు “అంటూ సోఫాలో కూర్చుంది.
“మంచినీళ్ళు తాగుతావా అను “ అని అడిగి నీళ్ళ గ్లాసు తేవడానికి నేను డైనింగ్ హల్ లోకి వెళుతుంటే నా వెనకలే వచ్చింది అనూరాధ. మంచినీళ్ళు తాగి గ్లాసు టేబుల్ పైన పెట్టి మా ఇంటి వెనకల ఉన్న సిటవుట్ లోకి నడిచి అక్కడ చెయిర్ లో కూర్చుంది. “ఇక్కడ కూర్చుందాము జయ “ అని. మేమిద్దరం కలిసి నపుడు ఆ సిటవుట్ లో కూర్చుని కబుర్లు చెపుకోవడం మా ఇద్దరికి ఇష్టం.
ఎండ వాన పడకుండా పైన రూఫ్ చేయించాము. చుట్టు పూల చెట్లు, జామ , నిమ్మ , మామిడి , దానిమ్మ కొన్ని కూరగాయల చెట్లు వేశాము. అన్నిపూల ఆకుల పరిమళాలు కలిసి గాలిలో తేలుతూ తాకుతూంటే ఆ చెట్ల కొమ్మలపై ఎగురుతూ పిట్టలు పలకరిస్తాయి.
నేను రామకృష్ణ సాయంకాలలో అక్కడ కూర్చొని టీ తాగుతూ , తీరిక సమయాలలో పుస్తకాలు చదువుకుంటూ మాట్లాడుకుంటూ గడుపుతాము.
“శ్లోక బాగుందా.. , ఫోన్ చేసిందా “ అని అడిగింది
“ఆ బాగానే ఉంది. ఆనందు శ్లోక నిన్ననే ఫోన్ చేసారు.
శ్లోక చెప్పింది సిరి వారం క్రితం ఇండియాకు వచ్చిందని.
“ఎందుకేంటి అనూ అంత సడన్ గా. ” అన్నాను.
“ఇండియాకు వచ్చే వారం రోజులు ముందు అన్నది , కొన్ని రోజులు వచ్చి మీ దగ్గర ఉండాలని వస్తున్నాను. రెండు వారాలు లీవు దొరికింది. నాన్నకు టైఫాయిడ్ తగ్గిపోయిందా“ అని మరలా..
“ఇద్దరు రావడం లేదు శేఖర్ కు లీవు దొరకలేదంది”
“అనూ.. రాజశేఖర్ కు ఇప్పుడెలాగుంది. టైఫాయిడ్ పూర్తిగా తగ్గిందా “ అన్నాను.
“తగ్గింది కొంచెం వీక్ అయ్యారు. ఇప్పుడు బాగానే ఉన్నారు “ అంది అను.
“నీ కిష్టమని రసమలై తెప్పించాను ఉండు అను”అని మూడు కప్పుల్లో రసమలైలు వేసి అనూరాథ కిచ్చి ఒక కప్పు హాల్ లో రామకృష్ణ కిచ్చి ట్రేలో కారప్పూస గిన్నె, నా రసమలై కప్పు పెట్టుకుని వచ్చికూర్చున్నాను. ”
అనూరాధ రెండు రసమలైలు తిని ఆగి “ జయ.. , సిరి, శేఖర్ విడాకులకు అప్లై చేసుకున్నారు. ఇద్దరు కలిసి సమ్మతితో తీసుకున్న నిర్ణయమిది”అంది.
“నాకు షాక్ తగిలినట్లయి అదేంటి ఏమయింది అనూ.. , ఎందుకు?” కంగారుగా అడిగాను.
“ పిల్లల జీవితాన్ని వాళ్ళు నిర్ణయించుకోనీక చస్తామని బెదిరించి, ఆంక్షలు పెట్టి తల్లి తండ్రులు ఇష్టం లేని పెండ్లిళ్ళు చేస్తే ఇలానే ఉంటుంది పర్యవసానం. ”అంటూ చెప్పుకొచ్చింది అనూరాధ.
సిరి పెండ్లయిన దాదాపు ఆరునెలల తరువాత సిరికి వాళ్ళ కంపెని లో కొత్తగా చేరిన సుధ అనే అమ్మాయి కాఫీటైంలో సిరితో కలిసినపుడు మీ హస్బెండ్ శేఖర్ తనకు తెలుసని చెప్పిందట. పెండ్లి కాక ముందు శేఖర్ స్నేహితుడు ఒకడు ఆక్సిజెంట్ లో చనిపోయాడట. అతని భార్య రమకు శేఖర్ మోరల్ సపోర్టుగా కావాల్సిన సహాయం చేస్తూ ఇద్దరి మధ్య స్నేహం పెరిగి సహజీవనం చేసేవారట. పెండ్లి కూడా చేసుకుంటారని అందరము అనుకున్నాము కాని శేఖర్ పేరెంట్స చాల గొడవ పెట్టి శేఖర్ కు వేరే పెండ్లి చేశారని తెలిసింది. మీరు శేఖర్ భార్య అని తెలిసి చెప్పాలనిపించింది” అన్నదంట ఆ అమ్మాయి.
ఆ విషయం తెలిసినప్పడు మొదట సిరి నమ్మలేదట.
కాని శేఖర్ అప్పుడప్పుడు డిప్రెస్డ్ గా ఉండడం శ్లోక గమనించి అడిగినపుడు ఆఫీసు పని ఎక్కువయిందని ఏదో చెప్పేవాడట. మధ్యలో కంపెని పని అని రెండు మూడు రోజులు వెళ్ళేవాడట.
సిరికి ఆ షాకింగ్ న్యూస్ తెలిసాక ఒక నిర్ణయానికొచ్చి శేఖర్ కు తన నిర్ణయాన్ని తెలపాలని అనుకుంటుండగా శేఖర్ ఆ వీకెండ్ రోజు సిరిని కూర్చోబెట్టి.. ,
“సిరి… , సుధ నాకు ఫోన్ చేసి నీతో మాట్లాడిన విషయం చెప్పింది. సుధ ద్వారా నా గురించి నీకు తెలిసిన విషయం నిజమే. నన్ను క్షమించు సిరి “అని చెప్పుకొచ్చాడట.
“మా అమ్మనాన్నలకు ముఖ్యంగా మా అమ్మకు నేను రమతో ఉండడం, రమ ను పెండ్లి చేసుకోవడం ఇష్టం లేదు. రమ దురదృష్టజాతకురాలని ముద్ర పడింది మా అమ్మ మనసులో. చేసుకున్నావంటే విషం తాగి చచ్చిపోతానని నేను వేరే పెండ్లికి ఒప్పుకునేంతవరకు తిండి తిననని మొండికేసి నా మెడలు వంచి నీకు తాళి కట్టించింది. నేను ఇన్ని రోజులు మానసికంగా నరకాన్ని అనుభవిస్తున్నాను. నిన్ను మోసం చేశాననే భావన నన్ను తినేస్తూంది సిరి. నన్ను క్షమించు” అని ఏడ్చాడంట.
నీతో చెప్పుకోలేక రమను మరిచిపోలేక నరకమనుభవిస్తున్నాను. నేను నీకు తగను సిరి. మీ అమ్మ నాన్న మంచితనం , నీ వ్యక్తిత్వం మంచిహృదయం ముందు నేను ఓడిపోయాను. చాలామార్లు చెప్పాలని అనుకున్నా నాకు ధైర్యం చాలలేదు సిరి. నీవేనిర్ణయం తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు” అన్నాడంట.
“సిరి ఏమందట “ అడిగాను.
“నేను నీతో విడాకులు తీసుకుని విడిపోవాలని నిర్ణ యించుకున్నాను. తరువాత నీవు రమను పెండ్లి చేసుకుంటావా శేఖర్. ” అని సిరి అడిగిందంట.
“శేఖర్ కాసేపు మౌనంగా ఉండి , రమను పెండ్లి చేసుకుంటాను “ అన్నాడట.
“అలాగే శేఖర్.. , నీ గత జీవితం విషయం సుధ నుండి విన్నప్పుడే నా మనసు ఇక మనం… అదే నేను పెండ్లి ముసుగులో నీతో కలిసి ఉండలేనన్న నిర్ణయం చేసుకున్నాను. నీవు రమను పెండ్లి చేసుకుని
జీవించడమే సరయిన నిర్ణయం. మనమిద్దరం విడాకులకు అప్లై చేసుకుందామన్నదట సిరి“ అని
కాసేపాగి అంది అనూరాధ.. ,
“వాళ్ళిద్దరి మధ్య ఈ సంభాషణ జరిగి రెండు నెలలౌతున్నా. సిరి ఆ విషయాలేవి మాతో ఎప్పుడు చెప్పలేదు. తను ఇండియాకు వచ్చిన తరువాత మాతో చెప్పాలని నిర్ణయించుకున్నానని అనింది. అది విన్న తరువాత మా మనసులు మొద్దుబారిపోయాయి జయ. సిరి తనే మా ఇద్దరిని ఓదార్చింది”
“ఇదే నీ నిర్ణయమా సిరి “అని వాళ్ళ నాన్న అడిగినపుడు
“జరిగిన విషయాలు తెలిసినాక అదే మంచి నిర్ణయమనిపింది నాన్న “అంది సిరి.
కొద్ది సేపయినాక “నీ నిర్ణయం ప్రకారమే కానియమ్మా అన్నాడు రాజశేఖర్” అని ఎమోషనల్ అయిపోయి అనూ మాటలు ఆగిపోయాయి.
“బాధపడకు అనూ… “ అంటున్నానే గాని నాకు ఏడుపాగలేదు. నోటికి నా చీరచెంగు అడ్డు పెట్టుకున్నాను ఏడుపు శబ్ధం పైకి వినపడకూడదని.
ఇద్దరం అలా ఉండిపోయాము.
“అమ్మా…. , జయ ఆంటీ” అని సిరి పిలుస్తూ మా దగ్గరికి వచ్చింది. మా అవస్థలు చూసి ఇద్దరి భుజాల మీద చెరొక చేయి వేసి…
“అమ్మా.. ఆంటీ…. మీరు నాకు ధైర్యం చెప్పడంపోయి మీరిలాగుంటే ఎలా చెప్పండి. జీవితం మనం అనుకున్నట్లే ఉంటే అది జీవితమెలా అవుతుంది. జీవితం తన వాస్తవ రూపాన్ని ప్రదర్శించుకుంటూ సాగి పోతూంటుంది. మనం మన జీవితంలో మంచి చెడ్డలను విశ్లేషించుకుంటూ పాజిటివ్ నిర్ణయాలు తీసుకుని మైండ్ సెట్ చేసుకుని కాలంతో ముందుకు సాగిపోవడమే.. అప్పుడు జీవితమొక సమస్యగా మనకనిపించదు. ఇటీస్ ఆల్ అవర్ ఆటిట్యూడ్ టువార్డ్స లైఫ్. ” అని.. , “ఆంటీ.. నా కలాఖండ్ స్వీట్ ఏది “అంటూ నన్ను చుట్టేసింది సిరి.
సిరిని పొదిమి పట్టుకుని నుదుటిపై ముద్దు పెట్టుకుంటూ ,.. “ ఈ బంగారు బిడ్డను సరయిన తోడుతో కలిపి తన జీవితాన్ని మరలా చిగురింపచేయి స్వామి “ అని మనసులో దేవుడికి మొక్కుకున్నా.
కలాఖండ్ , రసమలై సిరికిచ్చాను. ఇష్టంగా తింటూ రామకృష్ణకు అమెరికా కబుర్లు చెప్పింది.
గంట తరువాత అనూరాధ తమ్ముడు చంద్రశేఖర్ రావడంతో ఇద్దరూ వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన తరువాత రామకృష్ణతో చెప్పాను సిరి విడాకుల విషయం.
“అవునా… ఎంతపని జరిగిందని “ బాధపడ్డాడు రామకృష్ణ.
తనకు సమస్యలు ఎదురయినా మనసును నిభాయించుకుని , జీవితపు ఒడుదుడుకులను సహజంగా ఆహ్వానిస్తూ ధైర్యంగా తీర్చిదిద్దుకునే నేర్పు, ఓర్పు సిరిలో చూసి నాకు ఆశ్ఛర్యం, ఆనందం కలిగాయి. ఎంత ఎదిగిపోయారీ పిల్లలు! మారుతున్నఈ కాలంలో జీవితంపట్ల పిల్లల అవగాహనలో ఎంత మార్పు” నా మనసు సమాధానపడసాగింది.
నా భుజం మీద చేయి ఆనడంతో ఈ లోకంలోకి వచ్చింది నా మనసు.
“ఏంటి జయ ఇక్కడే కూర్చుండిపోయావు. పనమ్మాయి పద్మ తలుపు దగ్గర వెయిట్ చేస్తూంది రా “ అంటూ
యోగా ముగించుకుని వచ్చిన రామకృష్ణ నా చేయి పట్టుకుని లేపి నడిపిస్తూ…
“ సిరి గుర్తుకొచ్చిందా జయా.. , తను మంచి నిర్ణయం తీసుకుంది. ఈ తరం యువతి యువకులకు ఆ అవగాహన , ధైర్యము లేకపోతే జీవితాన్ని ఒక సమస్యగా చిత్రించుకుని కుంగిపోతారు. సిరి ఈ తరం యువతులకు స్పూర్తి” అని రామకృష్ణ ఓదార్పుగా అంటుంటే.. ,
ఇద్దరం మెట్లుదిగి క్రిందికి నడిచాము.

2 thoughts on “జీవితమంటే..

  1. మంచి నిర్నయం. అటువంటి విషయాల్లో
    అలాంటి నిర్నయమే సముచితం మంచి కధ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *