April 20, 2024

దీపపు వ్యక్తిత్వం

రచన: భమిడిపాటి స్వరాజ్య నాగరాజారావు.

దీపపు దివ్యవ్యక్తిత్వం
కొడిగడుతోంది దీపం
దైవపుఒడి చేరుతోంది,పాపం.
వేకువతో సమానంగా వెలుగులను పంచాలనే
ప్రయత్నంలోనే ప్రతిక్షణం జీవించి,
చీకటితెరలను తన శాయశక్తులా తెంచివేయాలనే
తాపత్రయాన్నిశ్వాసించిన ఈదీపం,
పాపం,తన చివరిక్షణాలను ఎదుర్కొంటోంది.
చీకటితెరలు తనని కప్పేస్తున్నా,
వెలుగురేఖలు తననివీడి వెళిపోతున్నా,
ధైన్యం లేకుండానే వెలుగుతోంది,
నిర్వికారంగానే మలుగుతోంది.
తన ఆఖరిశ్వాసను కూడా వెలుగును పంచుతూనే వదులుతోంది.
తనను వెలిగించిన వారికి కృతజ్ఞతను అలా తెలుపుకుంటోంది.
తను పోతేనేం?
మరోదీపం వెలిగించబడుతుందని తెలుసు,
తను లేకపోతేనేం?
మరోదీపం వెలుగును పంచుతుందని తెలుసు.
కర్తవ్యాన్ని నెరవేర్చగలిగానన్నఆనందమే
ఆదీపపు మోములో వ్యక్తమౌతోంది.
కోడిగడుతున్నానన్నఆవేదనకన్నా
కర్తవ్యనిర్వహణలో మలుగుతున్నాననే ఆనందంతో
దీపపుమనసు సంతృప్తమౌతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *