April 19, 2024

నాన్న అడుగుజాడలే పరమావధి

సమీక్ష: సి. ఉమాదేవి

 

మొవ్వ రామకృష్ణగారు రచించిన శత కవితా సంకలనం నాన్న అడుగుజాడల్లో ప్రతి కవితలో కవి మనసు పారదర్శకంగా కనిపిస్తుంది.  వారి వెన్నుతట్టి ప్రోత్సాహాన్నందించిన రామా చంద్రమౌళిగారు,  సౌభాగ్యగారు, నందినీ సిధారెడ్డిగారు, లంకా శివరామకృష్ణగారు,  ప్రచురించిన జగన్నాథశర్మగారికి వారు అర్పించిన అక్షరాంజలి మనసును సంతోషంతో నింపుతుంది.

తల్లిప్రేమ ఎన్నటికి మరువలేము. అయితే తండ్రి మనపట్ల చూపే అనురాగంలో బాధ్యాతయుతమైన ప్రేమ వెలకట్టలేనిది. ఈ సమాజంలో మనం తలెత్తుకు తిరగాలంటే నాన్న అడుగుజాడల్లో నడవాల్సిందే అని చెప్పడం ముదావహం. తండ్రిలోని నైజం మంచైనా, చెడైనా మనకు గుణపాఠమే అనడం అక్షరసత్యం.

కవితలను చదువుతున్నంతసేపు మన మనసులో ప్రతి అంశం విశ్లేషణకు గురవుతుంది. మా కడుపునింపి తాను పస్తులుండి సంతోషంతో కడుపు నింపుకున్న నాన్న ఎవరికైనా , ఎప్పటికైనా గుర్తొస్తూనే వుంటాడు అని చెప్పడంలో ప్రతి బిడ్డకు తన తండ్రి తమ గురించి పడిన కష్టాలు గుర్తుకువచ్చి కన్నులలో కన్నీరురాక మానదు. అమ్మ నవమాసాలు మోసి కని పెంచిన దేవత అంటూ నాన్న కనబడని మమతానురాగాలతో వెలుగొందే దేవుడనడం అక్షరసత్యం. నాన్న వేసే ప్రతి అడుగులో ప్రతి బిడ్డకు రాచబాటే కనబడాలి అనడంలో తండ్రిని ఉన్నత స్థానంపై నిలిపింది. నమ్మకం మరో చక్కని కవిత దేశ సరిహద్దులనుండి నాన్నకు వచ్చిన పిలుపుకు చిరునవ్వుతో అమ్మ పంపినప్పుడు

నాన్నకై కళ్లుకాయలు కాచేలా ఆరు వసంతాలు ఎదురు చూస్తూనే ఉన్నపుడు నాన్న రాక అమ్మ సంతోషానికి అడ్డుకట్ట పడలేదు. అయితే దేశసరిహద్దులకు వెళ్లిన నాన్న ఇక ఎప్పటికి తిరిగిరాడనే వార్త చదివినపుడు మన మనసును పట్టికుదుపుతుంది.  అయితే నాన్న అడుగుజాడల్లోనే నడవలాన్నదే నా ధ్యేయం, కర్తవ్యం అంటూ అమ్మను నా గుండెల్లో పెట్టి చూసుకుంటాను అని చెప్పినపుడు మనసు ఉద్వేగభరితమవుతుంది. అడుగుల సవ్వడి మరో చక్కని కవిత.  నాన్న గొప్పతనం, అమ్మ మంచితనం నిండు సంసారం. మనుగడ సాగించే గుండె ధైర్యం-ఎల్లవేళలా మన గుండెల్లో మారుమ్రోగే ఆ అడుగుల సవ్వడులు మన అమ్మ నాన్నలవే అనడం నిజమే కదా!కరోనా దెబ్బకు లాక్ డౌన్ కష్టాలను పాబందీ-ఉగాది కవితలో విశదీకరించడం వాస్తవాన్ని కళ్లకు కట్టింది. మరెన్నో కవితల సమాహారం నాన్న అడుగు జాడల్లో కవితాసంపుటి. చక్కని కవితలందించిన మొవ్వ రామకృష్ణగారికి అభినందనలు.

 

 

1 thought on “నాన్న అడుగుజాడలే పరమావధి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *