March 30, 2023

రాజీపడిన బంధం – 9

రచన: ఉమాభారతి కోసూరి

“మమ్మీ మమ్మీ” అంటూ సందీప్ నన్ను తట్టి లేపుతున్నట్టయింది. కలలోలా మగతగా కళ్ళు తెరిచాను. కల కాదు, నిజంగానే సందీప్ తన చేతులతో నన్ను తడుతున్నాడు. వాడి వెనుక చిత్ర నిలబడుంది. సందీప్ ని చూసిన సంతోషంతో … నా కళ్ళ వెంట ఆగని కన్నీరు చూసిన చిత్ర కళ్ళు కూడా చమర్చాయి. ఆ క్షణాన నా స్నేహితురాలు నా పాలిట దేవతలా అనిపించింది.
సందీప్ ని రెండురోజులు తన దగ్గరే ఉంచుకుంటానంటే అత్తయ్య కూడా సరేనన్నారంట. క్యాండి, మిండి కూడా బాగున్నాయిట. అత్తయ్యే స్వయంగా వాటిని జాగ్రత్తగా చూసుకుంటానని కూడా చిత్రకి చెప్పారట. ఇంకాసేపట్లో అత్తయ్య, శ్యాం, మామయ్య హాస్పిటల్ కి వస్తారట.
చిత్ర మాట్లాడుతుండగానే డా. మాలిని, నర్స్ వచ్చారు.
“చాల లక్కీ నువ్వు నీల. నీ అల్ట్రాసౌండ్, బ్లడ్ రిపోర్ట్ అన్నీ క్లియర్ గా ఉన్నాయి. ఈ క్షణం నుంచి బెడ్ రెస్ట్ తీసుకొని ఆరోగ్యం బధ్రంగా చూసుకుంటే, నీ బిడ్డ ఆరోగ్యంగా పుడుతుంది. నిన్ను రేపు పొద్దునే యింటికి పంపేయగలను” అంది డాక్టర్ మాలిని.
అక్కడే ఉన్న సందీప్ ని చూసి, “నీ కొడుకా? ముద్దుగా ఉన్నాడు” అని వాడి తల మీద జుట్టు చెదరగొడుతూ, “నీకింత జుట్టు ఎందుకురా?” నవ్వేసింది ఆమె.
“మళ్ళీ రేపు చూస్తానమ్మా” అని చిత్రకి చెప్పి వెళ్ళిపోయింది.
***
కాసేపటికి అత్తయ్య, మామయ్య, శ్యాం వచ్చారు. నన్ను పలకరించి, బెడ్ కి ఎదురుగా కూర్చున్నారు. నా ఆరోగ్యం గురించి వివరాలు తెలుసుకుని నాకు ధైర్యం చెప్పారు అత్తయ్య.
“చిత్ర ఆంటీతో నేను సినిమాకి వెళ్తున్నా” అంటూ వాళ్ళ నానమ్మకి, డాడీకి చెప్పాడు సందీప్. నాక్కూడా ‘బై’ చెప్పి చిత్రతో వెళ్లాడు.
అత్తయ్యవాళ్ళతో మాట్లాడాలనిపించలేదు. హాస్పిటల్లో, నాకు తెలివి వచ్చినప్పటి నుండి బాగా అలోచించాను. జరిగిన సంఘటనకి కుమిలిపోవడమే కాక మనసు మరింతగా బండబారిపోయింది.
***
మరికాసేపు నాతో అదీ ఇదీ మాట్లాడి, విశ్రాంతి తీసుకుని కోలుకోమని చెప్పి వెళ్ళారు అత్తయ్యావాళ్ళు.
శ్యాం మాత్రం నా వంక చూడ్డానికి కూడా జంకుతున్నారు అనిపించింది. కొద్దికాలంగా శ్యాంకి వీలయినంత దూరంగా మసులుకో గలిగాను. అందువల్ల కూడా నా పట్ల అతనికి కోపంగా ఉండడం సహజమే. ఫలితంగా ఇలా ద్వేషంతో నా పట్ల దౌర్జన్యంగా ప్రవర్తించారనిపించింది..
నా భర్త కేవలం దుర్మార్గుడే కాదు. తన దుర్మార్గాన్ని కప్పిపుచ్చుకునే అతి తెలివితేటలు కూడా ఉన్నవాడని ఇప్పుడు అర్ధమయ్యింది.
ఆ రాత్రి, గాయపడి అపస్మారక స్థితిలో ఉండుంటాను. తన ఉన్మాదం తగ్గాక, నా పరిస్థితి గమనించి, భయం వేసుంటుంది నా భర్త కిరాతకుడుకి.
అర్దరాత్రి సమయంలో ఎప్పుడో, నేను చీకట్లో గబగబా మెట్లు దిగుతూ పడిపోయానని అందరిని నమ్మించి, నన్ను తెచ్చి హాస్పిటల్లో చేర్పించాడన్నమాట. అసలా మనిషిని ఎలా, ఏం చేయాలి? ఈ ఊబి నుండి బయట పడలేనేమో! నా చుట్టూ ఉచ్చు బిగుస్తుంది అనిపించి బాధతో తల ముక్కలై పోయింది. నర్స్ ని పిలిచి తలపోటుకి మందిమ్మని అడిగాను.
**
హాస్పిటల్ నుండి వచ్చేసి వారం అవుతుంది.
సందీప్ కి టెన్నిస్ కోర్ట్స్ లో గాయాలయినప్పటి నుండి పై అంతస్తులోని వాడి గదిలోనే ఉంటూన్న నేను, బెడ్-రెస్ట్ తీసుకోవలసి రావడంతో, నివాసాన్ని కిందంతస్తులోని పిల్లల రూంకి మార్చాను.
అక్కడినుండి వెనక టెన్నిస్ కోర్ట్స్, తోట, డాగ్-హౌజ్ అన్నీ కనబడుతుంటాయి. తలుపు మూస్తే ఇంటితో సంబంధం లేనంత నిశబ్దంగా ఉంటుంది ఆ గది.
**
మళ్ళీ వారానికి నన్ను చూడ్డానికి అమ్మానాన్నాతో పాటు తమ్ముడు వినోద్ కూడా వచ్చాడు. వినోద్ కోసం ఇక్కడ కాలేజీల సమాచారం, ఎడ్మిషన్ గురించి వివరాలు తీసి పెడతానన్నారుట శ్యాం. వాడు చాలా సంతోషంగా ఉన్నాడు.
ఆనంద్, చిత్ర తరుచుగా వచ్చివెళుతున్నారు. ఆ సమయంలో శ్యాం ఇంట్లో ఉంటే మాత్రం చక్కగా కబుర్లు చెప్పి, బైట నుంచి ఫుడ్ తెప్పించి, వాళ్ళతో కలిసి భోంచేసి సరదాగా గడుపుతారు. చిత్ర కూడా ‘అన్నయ్యా’ అంటూ శ్యాంతో కలుపుగోలుగా ఉంటుంది.
అత్తయ్య వాళ్లకి తన వృత్తి లోని ఆసక్తికరమైన సంఘటనలు, మానసిక రుగ్మతలో విపరీత ధోరణుల గురించి చెబుతుంటారు ఆనంద్. ప్రతిసారి పెద్దవాళ్ళతో కాసేపు గడిపే వెళతారు వాళ్ళు.
అమ్మానాన్నలకి కూడా చిత్ర వాళ్ళతో మంచి కలక్షేపంగా ఉంది.
**
ఇంటికి వెళ్ళే ముందు, ఓ రోజు అమ్మ దగ్గర కూర్చుంది చిత్ర.
మాటల మధ్యలో, “ఏమిటి చిత్రా? మా నీలు అజాగ్రత్తగా మెట్ల మీదనుండి ఈ పడటమేమిటి? ఇంత దెబ్బలేమిటి? అయినా లోపల బిడ్డ బాగానే ఉందన్నారా? పర్వాలేదంటావా నువ్వు?” అంది కాస్త వ్యధగా.
చిత్ర నా వంక చూసింది.
“అంతా బాగానే ఉందమ్మా. నన్ను నమ్ము” అన్నాను.
“అవునాంటీ, ఇప్పుడు మాత్రం అంతా యదాతథం. బాగున్నట్టే లెక్క. కాబట్టి మీరు గాభరా పడవద్దు. ఇక ఈవిడ మెట్ల మీద నుండి పడటం అంటారా? అంత అజాగ్రత్త ఏమిటో ఆవిడకే తెలియాలి. అదీ ఇటువంటి సమయంలో. నేనూ అదే ప్రశ్న వేసాను” అంది గంభీరంగా చిత్ర.
**
ఢిల్లీ వచ్చినప్పుడల్లా, మామయ్యతో పాటు ‘సీనియర్ సెంటర్’ కి వెళుతుంటారు నాన్న..
ఈ సారి ‘ఆధ్యాత్మిక చింతన’ గురించి నాన్నగారి లెక్చర్ కూడా ఏర్పాటు చేయించారు … మామయ్య.
ఇకపోతే, అమ్మతో అత్తయ్యకి బాగా సఖ్యత. ఈ సారి కూడా పొద్దుటే పనులు ముగించుకుని, శాంతమ్మకి, జానకికి ఇంటిపని బాధ్యతలు అప్పగించి మధ్యాహ్నాలు చిన్మయ మిషన్ కి వెళుతున్నారు.
**
ఆదివారం పొద్దున్న పదయ్యింది. తోటలోకి వెళ్లి కొత్తగా తెప్పించిన పూలమొక్కల్ని భూమిలో నాటించి లోనికి వచ్చాను.
అమ్మ, అత్తయ్య, శ్యాంతో సహా పెద్దగా మాట్లాడుకుంటున్నారు. ఆనంద్, చిత్ర కూడా కాస్త పెందరాలే వచ్చినట్టున్నారు. నాలుగు రోజుల్లో రాబోయే సందీప్ పుట్టినరోజు గురించి మాట్లాడుకుంటున్నారని అర్ధమయ్యింది.
వాడికి ఎనిమిదేళ్ళు నిండుతాయి. ఘనంగా సెలెబ్రేట్ చేయాలనే ఉంది. అటుగా వెళ్ళి చిత్రవాళ్ళని కూడా పలకరించి వారి ఎదురుగా కూర్చున్నాను.
ఆనంద్ నాకు దగ్గరగా కుర్చీ లాక్కుంటూ, “నీలా, నీవు ప్రస్తుతం రెస్ట్ తీసుకోవాలి కదా! ఈ సారి సందీప్ పుట్టినరోజు వేడుక మా క్లబ్-హౌజ్ లో చేద్దాము. బాబు ఫ్రెండ్స్ లిస్టు, వారినందరిని పిలిచే పని కూడా చిత్రకి ఇప్పుడే ఇచ్చేయమ్మా. మా కాంప్లెక్స్ లో ‘కిడ్స్-వరల్డ్’ ఉందిగా! నేను, శ్యాం కలిసి పిల్లల్ని మానేజ్ చేస్తాము” అన్నారు.
అదంతా వింటున్న సందీప్ సంతోషానికి అవధులు లేవు.
“మమ్మీ, ఐ లవ్ యు. నువ్వు సరే అను. మమ్మీ ప్లీజ్, ఓకే అని చెప్పు” అంటూ బతిమాల సాగాడు.

మునుపటి పుట్టినరోజు సంఘటనలు కళ్ళముందు గిర్రున తిరిగాయి. ముచ్చెమటలు పోశాయి. అందరి వంక ఓ సారి చూశాను. నాన్నా, వినోద్, కూడా నా దగ్గరగా కుర్చీలు తెచ్చుకొని కూర్చునారు.
“మేమంతా ఉంటాం అక్కా. క్లబ్-హౌజ్ కాబట్టి సరదాగా ఉంటుంది. నీవు హాయిగా ఓ పక్కన కూర్చుని చూడవచ్చు. సరేనా? సందీప్ బర్తడే పార్టీ అయ్యాకే నేను హైదరాబాద్ వెళతాను” అన్నాడు వినోద్.
ఆనంద్ వంక చూసాను, “సరే అన్నయ్యా, అలాగే చేద్దాం. కానీ పిల్లలకి అలివికాని ఆటలేవీ వద్దు. వాళ్ళు కూర్చుని ఎంజాయ్ చేసే మాజిక్ షో లాటివే ఏర్పాటు చేద్దాము. వీడి స్నేహితులు ఓ పది మంది పిల్లలుండవచ్చు. వాళ్ళని నేనే పిలుస్తా లెండి” అన్నాను సందీప్ ఉత్సాహాన్ని దృష్టిలో పెట్టుకొని.
“మా ఆఫీస్ నుండి పిల్లలున్న కొందరి కుటుంబాలని నేను ఆహ్వానిస్తాను. పోతే, ఆ సమయంలో మనం టెన్నిస్ కోర్ట్స్ వాడుకునేలా చూడు ఆనంద్” అంటూ శ్యాం కూడా మా వద్దకు వచ్చారు.
“ఈ పార్టీ సందడితో, నీలకి ఎటువంటి శ్రమ లేకుండా చూడాలి. నిన్ననే ఐదువ నెల వచ్చింది” అన్నారత్తయ్య.
“నేను కాసేపు పడుకుంటాను” అని అక్కడినుండి లేచి నా గదిలోకి వచ్చాను. నా వెనకే వచ్చిన చిత్ర, “ఇంతకీ నీకిప్పుడు వొంట్లో బాగున్నట్టేనా? మనసు తేలికయిందా?” అడిగింది పడక మీద కూర్చుంటూ.
“నేను బాగానే ఉన్నాను. నీ సంగతి చెప్పు. ఓ పాపనో బాబునో నీ వెప్పుడు కంటావు? చదువులు అయ్యాయి, ఉద్యోగాలు వచ్చాయి. ఆనంద్ కి పిల్లలంటే ఇష్టమని కనబడుతూనే ఉంది. ఇంక తమరిదా ఆలస్యం?” అంటూ వెనుతిరిగి చూస్తే, తల వంచుకొని ముభావంగా అయిపోయిన చిత్ర కనబడింది.
“ఎందుకలా ఉన్నావే” అని తరచితరచి అడిగాక, చెమర్చిన కళ్ళతో తలెత్తి నా వంక చూసింది. క్షణమాగి నోరు విప్పింది.
పెళ్ళైన నాలుగేళ్ళ వరకు ప్రెగ్నెన్సీ రాకపోతే, వైద్య పరీక్షలు చేయించారట. తనకి ‘ఎండోమీట్రియోసిస్’ అనే గర్భకోశ వ్యాధి ఉందని, అందుమూలంగా తను తల్లిని కాలేక పోతున్నానని చెప్పింది. కాకపోతే గత రెండేళ్లగా అంచెలంచెలగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నానని కూడా చెప్పుకొచ్చింది.
“సమయం పట్టినా, తప్పకుండా నేను తల్లినౌతానని నమ్మకం నాకుంది. ఆనంద్ ఎంతో ఓర్పుతో నన్ను ప్రేమగా చూసుకుంటారు. కూడా ఉంటూ ధైర్యం చెబుతారు. పిల్లలంటే ఆయనకీ ఎంతో ఇష్టం. సందీప్ ని సొంత బిడ్డలా ఇష్టపడతారు. చూశావుగా?” అంటూ మనసుని తేలిక చేసుకొంది చిత్ర.
“పద పద, నీ కోసం అత్తయ్య చేత మల్లెలు, జాజుల మాల కట్టిస్తాను. నీకు మున్ముందు జీవితంలో అన్నీ చక్కగానే అవుతాయి” అంటూ చిత్రని గార్డెన్ లోకి తీసుకొని వెళ్లాను.
**
లంచ్ కూడా చేసి చిత్ర,ఆనంద్ లు వెళ్ళాక, చిత్రకి పిల్లలు పుట్టక పోవడం గురించి ఆలోచిస్తున్నాను. అందుకేనేమో, నా ప్రెగ్నెన్సీ వద్దనుకుంటున్నానని అన్నప్పుడు చిత్ర చాలా నొచ్చుకుంది. నాకు నచ్చజెప్పేప్పుడు కూడా ఎక్కువ బాధ పడింది.
పాపం ఆనంద్ కి పిల్లలంటే ఉన్న ఇష్టం చూస్తుంటే, వాళ్లకి సంతానం కలగకపోవడం దురదృష్టకరమే అనిపిస్తుంది. ఒక్కోరి జీవితంలో ఒక్కో అశాంతేమో అనుకున్నాను. ఏమైనా చిత్రకి కూడా సంతానం కలగాలని ఆశిస్తాను.
**
సందీప్ పుట్టినరోజు రానే వచ్చింది. పోద్దున్నే పది గంటలకల్లా ముందుగా సాయిబాబా గుడికి వెళ్ళాము. అక్కడ దేవుడు దర్శనం చేసుకుని, దారిలోని అనాధాశ్రమంలో పది నిముషాలు ఆగాము. సందీప్ చేత అక్కడ అనాధ పిల్లలకి… బట్టలు, బొమ్మలు ఇప్పించి.. పన్నెండుకి ముందే అందరం చిత్ర వాళ్ళ కాంప్లెక్స్ చేరాము.
**
నిర్మాణం పూర్తయిన క్లబ్-హౌజ్ ఎంతో అధునాతంగా అందంగా కనబడుతుంది.
పిల్లల కోసం ప్రత్యేక క్రీడారంగం ‘కిడ్స్ వరల్డ్’ గా చక్కగా ముస్తాబయింది. అందులో క్రికెట్ ఫీల్డ్, టెన్నిస్ కోర్ట్స్, ఇంకా ఎన్నో ఆటలున్నాయిట..
దానికెదురుగా ఎదురుగా ‘రోజ్-విల్లా’ పేరుతో పార్టీ హాల్ కూడా.. అందుండి సన్నగా ఎం.ఎస్. సుబ్బలక్ష్మి సంగీతం వినబడుతుంది. అక్కడ హడావిడిగా పనివాళ్ళు సీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు.
“అటు కాదు, ఇటు రామ్మా నీలమ్మ, సందీప్ పార్టీ ఇక్కడ” అంటూ పిలిచింది చిత్ర. అందరం అటుగా మరో హాల్లోకి వెళ్ళాము.
**
పెద్ద పండుగలా జరిగింది సందీప్ పుట్టిన రోజు. ప్రతి చిన్న విషయం ఎంతో శ్రద్దగా నిర్వహించారు ఆనంద్, చిత్ర. కేక్ కట్ చేసి, లంచ్ అయ్యాక పిల్లలంతా ‘కిడ్స్-వరల్డ్’ కి బయలుదేరారు. మేనేజర్ గుప్తా గారితో పాటు ఇవాళ జీవ, రాము కూడా పిల్లల వెంటే ఉన్నారు…
సందీప్ చేయిపట్టుకుని వడివడిగా వెళుతున్న తమ్ముణ్ణి పిలిచి, సందీప్ వెంటే ఉండి, ఆడించమని చెప్పాను.
“చెప్పు, ఎందుకు నీకంత భయం? బాబుని కనీసం శ్యాంతో కూడా ఎక్కడికీ వెళ్ళనివ్వవు” అని అడిగింది నాతో పాటు వాళ్ళ వెనకే నడుస్తూన్న చిత్ర.

పిల్లలంతా ప్లే-గ్రౌండ్ లోకి వెళ్ళాక, అక్కడే బయట కుర్చీల్లో కూర్చున్నాము.
చిత్ర అడిగిన ప్రశ్నకు జవాబుగా ఆమె వైపు తిరిగాను. “మరేం లేదు చిత్రా. శ్యాంతో ఆడినప్పుడల్లా, బాబుకి తీవ్రంగా దెబ్బలు తగిలాయి. అందుకే బాబు తన వెంట ఉన్నా శ్యాం సరిగ్గా చూసుకోరని భయం నాకు” అంటుండగానే వెనుక నుంచి ఎవరో సుతారంగా చేతులతో నా కళ్ళు మూశారు.
“ఎవరో చెప్పుకోండి” అంటున్న గొంతు ఇట్టే గుర్తు పట్టాను. బాగా పరిచయమున్న గొంతేగా! ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను. చేతులు తడిమాను. గాజులు, ఉంగరాలు. ఇంకా మంచి గంధం సువాసనలతో పాటు సన్న జాజుల గుబాళింపు.
“ఇంకెవరూ? నా ప్రియనేస్తం రమణి కాదా?” అని అన్నాను ఉత్సాహంగా.
“అయితే నిన్ను సర్ప్రైజ్ చేయలేక పోయామా మేము?” అన్నారు రమణి, చిత్ర ఒకేసారి.
“అలా కాదే! నీ గాజులు, ఉంగరాలు, సెంట్ సువాసనలు వేరే చెప్పాలా?”, “చాలా సంతోషంగా ఉంది నిన్ను చూడ్డం. ఆశ్చర్యంగా కూడా ఉంది. ఇంతకీ మీ వారు కూడా వచ్చారా లేదా?” అనడిగాను.
“లేదమ్మా, నేను ఒక్కత్తినే వచ్చాను. ఆయన రాలేనంత బిజీ. నీకు ప్రత్యేక శుభాకాంక్షలు చెప్పమన్నారు విజయ్” అంటూ నా వంక నిశితంగా చూసింది…….”చిత్ర ఇదంతా ప్లాన్ చేస్తుందని తెలుసు. మరోసారి అమ్మవి కాబోతున్నావనీ తెలుసు” అంది సంతోషంగా. .
“సందీప్ పుట్టినరోజు ఏర్పాట్లు తన బాధ్యతగా తీసుకుంది…చిత్ర. అది కాక నాకు తెలీకుండా ఇంకా ఏమన్నా ఏర్పాట్లు జరుగుతున్నాయా?” అడిగాను అనుమానంగా ….
“ఈ రోజే ఎంతో ప్రత్యేకం…. జరిగే ప్రతీదీ ప్రత్యేకమే. మరి” అంది చిత్ర జవాబుగా…
“ముదురాకుపచ్చ జరీ చీరలో, నీ బొట్టు, నీ జుట్టు, అచ్చం పార్వతి దేవిలా ఉన్నావు, పైగా కాస్త వొళ్ళు చేసావేమో! అందాల అమ్మంటే నువ్వే” అంటూ ఆగకుండా పొగిడేస్తుంది నన్ను రమణి.
“ఏయ్, దానికి దిష్టి పెట్టకు” అంటూ చిత్ర అందుకొంది. ముగ్గురం నవ్వుకున్నాము.
“పిల్లలు కాసేపు ఆడతారు గాని, మనం లోనికి వెళదాం. రమణి కూడా అందర్నీ కలవాలిగా!” అంటూ అక్కడినుండి కదిలింది చిత్ర. ఆమె వెంటే క్లబ్-హౌజ్ వైపు నడిచాము.
**
‘రోజ్-విల్లా’ ఫంక్షన్ హాలు ఎదురికి రాగానే, లోపలి నుండి ఒక్కసారిగా కేరింతలు, చప్పట్లు వినబడ్డాయి…. అమ్మ, అత్తయ్య చేతుల్లో హారతలు పట్టుకొని మరీ తత్తిమా వారితో మాకు స్వాగతం పలుకుతూ ఎదురొచ్చారు.

సశేషం

1 thought on “రాజీపడిన బంధం – 9

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

December 2020
M T W T F S S
« Nov   Jan »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031