April 24, 2024

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 54

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య

 

ఈ కీర్తన అధ్యాత్మికమైన హరి కీర్తన. అన్నమయ్య సకల దేవతా మూర్తులలో శ్రీవేంకటేశుడినే దర్శిస్తాడు. ఆయన రాముడైనా, కృష్ణుడైనా, నరసింహుడైనా మరే అవతారమైనా సరే! ఈ కీర్తనలో ద్వాపరయుగ కృష్ణుని స్తుతిస్తూ, మంచి హాస్య చమత్కారంతో ఆయన లీలలు వర్ణిస్తూ తాను పులకరించి శ్రోతలను అలరింపజేస్తున్నాడు. మీరూ చూడండి. ఆ లీలామానుషధారి విశేషాలు వినండి.

 

కీర్తన:

పల్లవి: కోరుదు నామది ననిశము గుణాధరు నిర్గుణుఁ గృష్ణుని

నారాయణు విశ్వంభరు నవనీతాహారు                                ॥పల్లవి॥

చ.1. కుండలిమణిమయభూషణు కువలయదళవర్ణాంగుని-

నండజపతివాహనుని నగణితభవహరుని

మండనచోరకదమనుని మాలాలంకృతవక్షుని

నిండుకృపాంబుధిచంద్రుని నిత్యానందునిని                   ॥కోరుదు॥

చ.2. అగమపుంజపదార్థుని ఆపత్సఖసంభూతుని

నాగేంద్రాయతతల్పుని నానాకల్పునిని

సాగబ్రహ్మమయాఖ్యుని సంతతగానవిలోలుని

వాగీశ్వరసంస్తోత్రుని వైకుంఠోత్తముని                         ॥కోరుదు॥

చ.3. కుంకుమవసంతకాముని గోపాంగనకుచలిప్తుని

శంకరసతిమణినుతుని సర్వాత్ముని సముని

శంకనినాదమృదంగుని చక్రాయుధవేదీప్తుని

వేంకటగిరినిజవాసుని విభవసదాయినిని                     ॥కోరుదు॥

(రాగం  మలహరి;  సం:  1-141 – రాగిరేకు –23-5)

 

విశ్లేషణ:

పల్లవి: కోరుదు నామది ననిశము గుణాధరు నిర్గుణుఁ గృష్ణుని

నారాయణు విశ్వంభరు నవనీతాహారు

శ్రీమహావిష్ణువు ఈ సకల చరాచర జగత్తును రక్షించే దేవ దేవుడు. కలియుగంలో తిరుమలలో శ్రీవేంకటేశ్వరుడై వెలసిన స్వామి. అలాంటి స్వామిని  గాక అన్నమయ్య మది సదా ఎవరిని కోరుతుంది? నా మదిలో యెల్లవేళలా శ్రీకృష్ణుడినే  కోరుకుంటాను. ఆయన సకల సద్గుణములను ధరించినవాడు. మరియూ సకల గుణాతీతుడు. మానవరూపం తీసుకున్న సాక్షాత్ శ్రీమన్నారాయణుడు. విశ్వమంతా నిడియున్నవాడు ఆయనే! గుణగణుడైన పరమాత్ముడైనప్పటికి కూడా ఈయన ప్రత్యేక గుణం గమనించారా?  వెన్నదొంగ. అదే మనం అర్ధం చేసుకోవలసిన లీల అంటున్నాడు అన్నమయ్య.

 

చ.1 కుండలిమణిమయభూషణు కువలయదళవర్ణాంగుని-

నండజపతివాహనుని నగణితభవహరుని

మండనచోరకదమనుని మాలాలంకృతవక్షుని

నిండుకృపాంబుధిచంద్రుని నిత్యానందునిని

ఆ స్వామి వర్ణించడానికి మనకు సాధ్యం కాని వాడు. ఆయన ఎలాంటివాడంటే,  మణులతో నిండిన చెవి కుండలములు ధరించినవాడు. నల్ల కలువ దళముల వంటి రంగుకల శరీరము కలవాడు. నీలమేఘ శ్యాముడు. ఈయన పక్షులకు రాజైన గరుత్మంతుని వాహనముగా కలవాడు. మానవుల అసంఖ్యాకమైన పాపములను కేవలము స్మరించినంత మాత్రమున హరించేవాడు. అయినా చోరకళ అలంకారముగ కలవాడు. తులసిదళ మాలలచే అలంకరింపబడిన వక్షస్ధలము గలవాడు. నిండు దయాసాగరమున        ఉద్భవించిన పూర్ణచంద్రుడు నిత్యము బ్రహ్మానందములో వుండేవాడంటూ నిందాస్తుతి చేస్తున్నాడు అన్నమయ్య.

 

చ.2. అగమపుంజపదార్థుని ఆపత్సఖసంభూతుని

నాగేంద్రాయతతల్పుని నానాకల్పునిని

సాగబ్రహ్మమయాఖ్యుని సంతతగానవిలోలుని

వాగీశ్వరసంస్తోత్రుని వైకుంఠోత్తముని

ఈ పరంధాముడు వేదరాశికి నిత్యము అర్ధమై భాసిల్లెడివాడు. వేద పురాణాలలో విహరించే దేవుడు. ఆపదలలో వున్నవారికి ప్రియస్నేహితుడు. నాగేంద్రుడైన ఆదిశేషుని శయ్యగా చేసుకున్నవాడు.  అనేక కల్పముల నెఱిగినవాడు. పరబ్రహ్మ అని జగద్విఖ్యాతి చెందినవాడు. ఆ స్వామి సదా మధురమైన గానమృతమున వోలలాడువాడు. బ్రహ్మదేవుని చేత ఎల్లప్పుడూ కీర్తింపబడేవాడు. ఉత్తమమైన వైకుంఠమును మోక్షార్హులకు, పుణ్యాత్ములకు ప్రసాదించు దేవ దేవుడంటున్నాడు.

 

చ.3. కుంకుమవసంతకాముని గోపాంగనకుచలిప్తుని

శంకరసతిమణినుతుని సర్వాత్ముని సముని

శంకనినాదమృదంగుని చక్రాయుధవేదీప్తుని

వేంకటగిరినిజవాసుని విభవసదాయినిని

ఈ మహా దేవదేవుని యింకా కీర్తించాలంటే కుంకుమ, వసంతము, శ్రీగంధము అంటే ఎంతో ప్రీతిగల వాడు. గోపికారమణుల స్తనగిరులయందు సదా విరాజిల్లెడి వాడు. శంకరుని సతీమణియైన పార్వతీదేవి చేత కూడా నుతింపబడువాడు. సర్వేశ్వరునితో సమానమైన వానిని మృదంగము వలె భీకరమైన ధ్వనిని వెడలించు పాంచజన్యమను శంఖము హస్తమున కలివాడు. సుదర్శనము అను చక్రము ఆయుధముగా వెలుగొందువాడు. ఈయన శ్రీవేంకటాచలము నిజస్ధానము (వైకుంఠము) గాకల శ్రీవేంకటేశ్వరుడు. సమస్త వైభవములు విధాయకముగా కలవాడంటూ అన్నమయ్య శ్రీ వేంకటేశ్వరుని శ్రీ కృష్ణ పరమాత్మ రూపంలో దర్శిస్తూ పరవశించి పోతున్నాడు. మనలను కూడా విని తరింపజేస్తున్నాడు.

 

ముఖ్యమైన అర్ధములు:

అనిశము = ఎల్లప్పుడు, అనవరత్ము; గుణాధరు = అన్ని మంచిగుణములు కలవాడు; నిర్గుణ = గుణ రహితుడు; నవనీతాహారుడు = వెన్నదొంగ; కువలయదళ = నల్లకలువదళముల వంటి రంగుకల ; అండజపతి = పక్షులకు రాజైన గరుత్మంతుని (అండములోనుండి పుట్టినవాడు); అగణిత భవహరుని = అసంఖ్యాకమైన పాపములను హరించువాడు; మండనచోరక = దొంగ అలంకారము గల;  మాలాలంకృత వక్షుడు = తులసిదళముల మాలలచే అలంకరింపబడిన ఘనమైన వక్షస్ధలము గలవాడు; కృపాంబుధి = దయాసాగరుడు; నిత్యానందుని = నిత్యము బ్రహ్మానందములో మునిగి తేలేవానిని; ఆపత్సఖ సంభూతుడు = ఆపదలలో వున్నవారికి ప్రియస్నేహితుని వలే వున్న వాడు; నాగేంద్రాయత తల్పుని = నాగేంద్రుడైన ఆదిశేషుని శయ్యగా చేసుకుని పరుండినవాడు; సంతత గాన విలోలుని = ఎల్లప్పుడు మధురమైన గానామృతమున ఓలలాడే వాడు; వాగీశ్వర సంస్తోత్రుని = బ్రహ్మదేవుని చేత సదా కీర్తింపబడేవాడు.

 

******

1 thought on “అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 54

Leave a Reply to మాలిక పత్రిక డిసెంబర్ 2020 సంచికకు స్వాగతం – మాలిక పత్రిక Cancel reply

Your email address will not be published. Required fields are marked *